న్యూఢిల్లీ, ఏప్రిల్ 28: బొగ్గు బ్లాకుల కేటాయింపు కుంభకోణంపై మరోసారి ప్రధాని మన్మోహన్ సింగ్‌పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన బిజెపి ఓ భారీ అవినీతిని కప్పి పుచ్చుకోవడానికి ప్రభుత్వం చేస్తున్న హేయమైన ప్రయత్నాలకు వ్యతిరేకంగా వచ్చే నెల 4నుంచి రెండు రోజుల పాటు రాష్ట్రాల రాజధానుల్లో ఆందోళన జరపనున్నట్లు ప్రకటించింది. ‘బొగ్గు కుంభకోణంలో చోటు చేసుకున్న భారీ అవినీతిని కప్పి పుచ్చుకోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వం హేయమైన ప్రయత్నం చేస్తోంది. అవినీతికి వ్యతిరేకంగా జరుపుతున్న ఈ పోరాటాన్ని, ఈ అవినీతిని కప్పి పుచ్చుకోవడానికి భారీ ఎత్తున జరుగుతున్న ప్రయత్నాలను పార్లమెంటు నుంచి ఈ దేశ ప్రజల ముందుకు తీసుకెళ్లాలని బిజెపి నిర్ణయించింది’ అని పార్టీ అధికార ప్రతినిధి ప్రకాశ్ జావ్‌డేకర్ ఆదివారం ఇక్కడ విలేఖరులకు చెప్పారు. ఈ అంశంపై వచ్చే నెల 4, 5 తేదీల్లో రాష్ట్రాల రాజధానుల్లో భారీ ఎత్తున నిరసన ప్రదర్శనలు నిర్వహించి గవర్నర్లకు వినతిపత్రాలను సమర్పిస్తామని ఆయన చెప్పారు.
న్యాయశాఖ మంత్రి అశ్వినీ కుమార్‌ను ప్రధాని మన్మోహన్ సింగ్ గట్టిగా వెనకేసుకు రావడాన్ని ఆయన తీవ్రంగా ఖండిస్తూ, వాస్తవానికి ప్రధాని తనను రక్షించుకోవడానికి మంత్రిని రక్షణ కవచంగా వాడుకుంటున్నారని మరోసారి ఆరోపించారు. ‘ప్రధానమంత్రి ఆమోదం, ఆదేశంతోనే న్యాయ శాఖ మంత్రి ఈ పని చేసారు. అందువల్ల ఈ వ్యవహారంలో ప్రధాని పాత్ర, నేరం రెండూ తేటతెల్లమయినాయి. ప్రధాని కోరడం వల్లనే అశ్వినీ కుమార్ సిబిఐ నివేదికను చూడడం జరిగింది’ అని జావ్‌డేకర్ అన్నారు. ‘న్యాయశాఖ మంత్రి రాజీనామా చేయరని ప్రధాని చెప్తున్నారు. నిజానికి ఆయన మంత్రిని తనకు రక్షణ కవచంగా వాడుకుంటున్నారు. అందుకే ఆయన మంత్రిని కాపాడుతున్నారు. న్యాయ శాఖ మంత్రి రాజీనామా చేస్తే తర్వాతి వంతు తనదేనని ప్రధాని భయపడుతున్నారు’ అని అన్నారు. ఈ మొత్తం వ్యవహారాన్ని కప్పి పుచ్చుకోవడానికి ప్రభుత్వం ఎంత నిస్సిగ్గుగా ప్రయత్నిస్తోందో తెలియజెప్పే విధంగా రెండు రోజులూ రాష్ట్ర రాజధానుల్లో తమ పార్టీ భారీ నిరసన ర్యాలీలు నిర్వహిస్తుందని జావ్‌డేకర్ చెప్పారు. పార్లమెంటును నడవకుండా చేయడం ద్వారా మేము ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నామని, ప్రపంచమంతా మమ్మల్ని చూసి నవ్వుతోందని ప్రధాని అంటున్నారు. అయితే నిజానికి వాళ్లు మమ్మల్ని చూసి నవ్వుతున్నది దేశంలోని అవినీతిని, దాన్ని కప్పి పుచ్చుకోవడానికి ప్రయత్నాలు ఎలా జరుగుతున్నాయో చూసే’నని అన్నారు. బొగ్గు బ్లాక్‌ల కేటాయింపులకు సంబంధించిన ఫైళ్లపై మీరు సంతకం చేసింది నిజం కాదా? అని ప్రధానిని ప్రశ్నిస్తున్నాం. న్యాయశాఖ మంత్రి రాజీనామా చేయరంటూ ప్రధాని ప్రకటనను తిరస్కరిస్తున్నామని జావ్‌డేకర్ అన్నారు.
4, 5 తేదీల్లో రాష్ట్ర రాజధానుల్లో భారీ ర్యాలీలు
english title:
b
Date:
Monday, April 29, 2013