న్యూఢిల్లీ, ఏప్రిల్ 28: కోల్‌గేట్ కుంభకోణంపై సిబిఐ ఇచ్చిన నివేదికను ముందే చూసిన న్యాయ శాఖ మంత్రి అశ్వినీకుమార్‌ను తొలగించేందుకు ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ నిరాకరించినందుకు నిరసనగా ప్రతిపక్షం సోమవారం కూడా పార్లమెంటు ఉభయసభలను స్తంభింపజేసేందుకు సిద్ధమవుతున్నాయి. బొగ్గు బ్లాకుల కేటాయింపుపై తాము మార్చి 8న తయారుచేసిన నివేదికను అశ్వినీకుమార్‌తోపాటు ప్రధాని కార్యాలయం అధికారులు, ఇంధన శాఖ అధికారులు ముందే చూశారని సిబిఐ డైరక్టర్ రంజీత్ సింహ సుప్రీంకోర్టుకు చెప్పటం తెలిసిందే. దీంతో అత్యున్నత న్యాయస్థానానికి అందజేయకముందే సిబిఐ నివేదికను చూసిన అశ్వినీకుమార్‌ను మంత్రి పదవి నుండి తొలగించాలని, మన్మోహన్ కూడా రాజీనామా చేయాలని ప్రతిపక్షం డిమాండ్ చేసింది. దీనికి మన్మోహన్ స్పందిస్తూ అశ్వినీకుమార్‌ను మంత్రి పదవి నుండి తొలగించే ప్రసక్తే లేదని ఖరాఖండీగా చెప్పటంతోపాటు తన రాజీనామా కోరటం బిజెపికి ఒక అలవాటుగా మారిందంటూ వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు. దీనికి మండిపడుతున్న ప్రతిపక్షం ముఖ్యంగా బిజెపి నాయకత్వంలోని ఎన్‌డిఎ సోమవారం పార్లమెంటు ఉభయసభలను స్తంభింపజేయాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. సుప్రీంకోర్టుకు సమర్పించవలసిన నివేదికను అశ్వినీకుమార్ ముందు పరిశీలించి మార్పులు, చేర్పులు చేయటం తప్పు కాదా? సుప్రీం కోర్టు నిర్ణయానికి విరుద్ధంగా వ్యవహరించిన అశ్వినీకుమార్‌ను తొలగించే ప్రసక్తే లేదని మన్మోహన్ సింగ్ ప్రకటించటం అనైతికం కాదా? అని ఎన్‌డిఎ నాయకులు ప్రశ్నిస్తున్నారు. సిబిఐ నివేదికను ప్రధాని కార్యాలయం సిబ్బంది ముందే పరిశీలించేందుకు మన్మోహన్ బాధ్యత వహించవలసిన అవసరం లేదా? అని వారు నిలదీస్తున్నారు. పార్లమెంటును స్తంభింపజేస్తున్నందుకు ప్రపంచం మనల్ని చూసి నవ్వుతోందంటూ మన్మోహన్ చేసిన వ్యాఖ్యల పట్ల కూడా బిజెపి నాయకులు తీవ్రంగా మండిపడుతున్నారు. పార్లమెంటును స్తంభింపజేస్తున్నందుకు ప్రపంచం నవ్వితే మరి సుప్రీంకోర్టుకు అందజేయవలసిన నివేదికను ప్రధాని కార్యాలయం అధికారులు ముందే పరిశీలించటం పట్ల ప్రపంచం నవ్వటం లేదా? అని వారు అడుగుతున్నారు. అశ్వినీకుమార్‌తోపాటు మన్మోహన్ కూడా తమ పదవులకు రాజీనామా చేయవలసిందేనని స్పష్టం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఎన్‌డిఎ మిత్రపక్షాల సభ్యులు సోమవారం పార్లమెంటు ఉభయసభల్లో అశ్వినీకుమార్ రాజీనామా డిమాండ్ చేస్తారని బిజెపి చెబుతోంది. ఇదిలావుంటే ప్రతిపక్షం ఇదే విధంగా పార్లమెంటు ఉభయసభలను స్తంభింపజేస్తే ఈ నెల 30న అన్ని శాఖలకు సంబంధించిన పద్దులు గిలెటిన్ చేయించుకోవాలని యుపిఎ సంకీర్ణ ప్రభుత్వాధినేతలు ఆలోచిస్తున్నారు. పార్లమెంట్‌లోని ఆయా పక్షాల బలాబలాల ప్రకారం ప్రతిపక్షాన్ని తిప్పికొట్టేందుకు అవసరమైన బలం తమకు లేదు కాబట్టి ఉభయసభలు వాయిదా పడినా ఏమీ చేయలేని స్థితిలో కాంగ్రెస్ అధినాయకులు కొట్టుమిట్టాడుతున్నారు. ఇదిలాఉంటే సుప్రీంకోర్టు మే 2న బొగ్గు బ్లాకుల కేటాయింపుపై సిబిఐ అందజేసిన నివేదికను పరిశీలించిన అనంతరం తీర్పు ఇచ్చేంతవరకు వేచి ఉండాలి తప్ప అశ్వినీకుమార్ రాజీనామా విషయంలో తొందరపడకూడదని సంకీర్ణ ప్రభుత్వాధినేతలు భావిస్తున్నారు. అశ్వినీకుమార్‌ను మంత్రివర్గం నుండి తొలగించవలసి వస్తే అది సుప్రీంకోర్టు అదేశం మేరకు జరిగినట్లుండాలి తప్ప ప్రతిపక్షం డిమాండ్‌కు కాకూడదని కాంగ్రెస్ నాయకులు భావిస్తున్నారు.
బిఎస్‌పి గొడవ
మరోవైపు బిఎస్‌పి అధ్యక్షురాలు, రాజ్యసభ సభ్యురాలు మాయావతి ప్రయాణం చేస్తున్న కారును, ఆమె బ్యాగ్‌ను కర్నాటకలో కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు తనిఖీ చేయటంపై ఆ పార్టీకి చెందిన సభ్యులు సోమవారం ఉభయసభల్లో గొడవ చేయనున్నట్లు తెలిసింది. దళిత నాయకురాలు కాబట్టే మాయావతిని కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు తనిఖీ చేశారని వారు ఆరోపిస్తున్నారు.
పార్లమెంటును స్తంభింపజేసేందుకే విపక్షాలు సిద్ధం
english title:
p
Date:
Monday, April 29, 2013