బెంగళూరు, ఏప్రిల్ 28: గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీపై ఆదివారం పదే పదే విమర్శలు గుప్పించారు. ఒక్క వ్యక్తి వల్ల అన్నీ సాధ్యం కావంటూ రాహుల్ చేసిన వాదనను తప్పుబట్టడమే కాకుండా ఇటీవల జైపూర్‌లో జరిగిన కాంగ్రెస్ మహాసభలో పార్టీ చేసిన వాగ్దానాలపై వెనక్కి తగ్గుతున్నారని దుయ్యబట్టారు. కర్నాటకలో వచ్చే నెల 5న జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి అభ్యర్థుల తరఫున ప్రచారం కోసం నగరంలో ఏర్పాటు చేసిన ర్యాలీలో మోడీ మాట్లాడుతూ రాహుల్ గాంధీని ‘బంగారు స్పూన్‌తో పుట్టిన నాయకుడి’గా అభివర్ణించడమే కాకుండా ఒక వ్యక్తి ఎన్ని పనులైనా చేయగలడని కూడా అన్నారు. అందుకు ఉదాహరణగా సంస్థానాల విలీనం ద్వారా భారత దేశాన్ని ఒక్కటి చేయడంలో సర్దార్ పటేల్ పోషించిన పాత్రను, దేశం ఆహార ధాన్యాల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించడానికి కారణమైన హరిత విప్లవానికి దారితీసిన లాల్ బహదూర్ శాస్ర్తీ ‘జై జవాన్, జై కిసాన్’ నినాదం గురించి చెప్పుకొచ్చారు.
భారీ తేడాతో ఓడిపోయిన వారికి, కాంగ్రెస్ నాయకుల బంధువులకు, నేరగాళ్లకు టికెట్లు ఇవ్వరాదని కాంగ్రెస్ పార్టీ జైపూర్ మహాసభలో తీర్మానం చేసిందని మోడీ అంటూ, ఆ పార్టీ ఈ తీర్మానాలన్నిటినీ గాలికి వదిలేసిందని, కర్నాటకలో ఆ పార్టీ ఇలాంటి వారందరికీ టికెట్లు ఇచ్చిందని అన్నారు. తల్లి చెప్పిన ప్రతిమాటను పిల్లలు శిరసావహించడం భారతీయ సంస్కృతి అని ఆయన అంటూ, అధికారం విషంతో సమానమంటూ సోనియా గాంధీ చేసిన ప్రకటనను ప్రస్తావించారు. ‘అధికారం విషంతో సమానమని తల్లి అంటున్నారు. అయితే కుమారుడు (రాహుల్) కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇవ్వమని కర్నాటక ఓటర్లను అడగడానికి వస్తున్నారు’ అని మోడీ దుయ్యబట్టారు. కర్నాటక ముఖ్యమంత్రి జగదీశ్ షెట్టార్ పేరును కూడా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు సక్రమంగా పలకలేకపోయారంటూ రాహుల్ పేరును నేరుగా ప్రస్తావించకుండా మోడీ యద్దేవా చేసారు. ఎన్నికల ప్రచారంలో రాహుల్ గాంధీ కర్నాటక ప్రతిష్ఠను దిగజార్చారని మోడీ అంటూ అందుకు ఆయన రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసారు. ‘అవినీతి గురించి మాట్లాడడానికి వాళ్లకున్న ధైర్యాన్ని చూడండి’ అని 2జి స్పెక్ట్రమ్ కుంభకోణాన్ని ప్రస్తావిస్తూ మోడీ అన్నారు. కేంద్రంలో ఇంత బలహీన ప్రభుత్వాన్ని దేశం ఇప్పటివరకు చూడలేదని సరబ్‌జిత్ సింగ్ ఉదంతాన్ని, చైనా చొరబాటును ప్రస్తావిస్తూ యుపిఏ ప్రభుత్వాన్ని విమర్శించారు. అధికార కేంద్రాలన్నీ దేశ రాజధానిలో ఉన్నప్పటికీ ఢిల్లీ సురక్షితం కాదని ఆయన అంటూ, ‘మీరు ఢిల్లీనే రక్షించలేకపోయారు, కర్నాటకను ఎలా రక్షిస్తారు?’ అని ప్రశ్నించారు. బిజెపి పాలనలో రాష్ట్ర పార్టీలోని అంతర్గత విభేదాలను మోడీ ప్రస్తావిస్తూ 1995, 2000 మధ్య కాలంలో గుజరాత్ కూడా ఇలాంటి సమస్యలనే ఎదుర్కొందని, అయితే 2000లో పార్టీ అధికారంలోకి వచ్చిందని అన్నారు. కర్నాటకలో కూడా బిజెపి మళ్లీ అధికారంలోకి వస్తుందన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేసారు.
...............................
బెంగళూరులో ఆదివారం జరిగిన ఎన్నికల ప్రచార సభలో ప్రసంగిస్తున్న మోడీ
.....................
రాహుల్‌గాంధీపై నరేంద్ర మోడీ ధ్వజం
english title:
j
Date:
Monday, April 29, 2013