న్యూఢిల్లీ, ఏప్రిల్ 29: కౌలాలంపూర్‌లో మంగళవారం నుంచి ప్రారంభం కానున్న మలేషియా గ్రాండ్ ప్రీ గోల్డ్-2013 బాడ్మింటన్ టోర్నమెంట్‌లో భారత క్రీడా బృందానికి ‘తెలుగు తేజం’ పి.వి.సింధు సారథ్యం వహించనుంది. ఈ టోర్నమెంట్ మహిళల సింగిల్స్ విభాగంలో సింధు టాప్ సీడ్ క్రీడాకారిణిగా బరిలోకి దిగుతోంది. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో ప్రస్తుతం 15వ స్థానంలో కొనసాగుతున్న సింధు తొలి రౌండ్‌లో సింగపూర్ క్రీడాకారిణి చెన్ జియాయువాన్‌తో తలపడనుంది. మే 4వ తేదీ వరకూ జరిగే ఈ టోర్నమెంట్‌లో సింధుతో పాటు భారత క్రీడాకారిణులు పి.సి.తులసీ, అరుంధతి పంటావనే, తన్వీ లాడ్ మెయిన్ డ్రాలో చోటు దక్కించుకోగా, రీతూపర్ణా దాస్, జి.రుత్వికా శివానీ క్వాలిఫైయింగ్ రౌండ్‌లో అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఈ టోర్నమెంట్ పురుషుల సింగిల్స్ విభాగంలో హెచ్.ఎస్.ప్రణయ్, ఆర్.ఎం.వి.గురుసాయిదత్, సమీర్ వర్మ, అభిమన్యు సింగ్, ఆస్కార్ బన్సాల్, కె.శ్రీకాంత్ భారత్‌కు ప్రాతినిథ్యం వహించనున్నారు. ఆదివారం ముగిసిన ఇండియా ఓపెన్ టోర్నమెంట్ రెండో రౌండ్‌లో ప్రపంచ మాజీ నెంబర్ వన్ ఆటగాడు తౌఫిక్ హిదయత్‌ను ఓడించిన ప్రణయ్ ఆ తర్వాత క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో ప్రపంచ నెంబర్ వన్ ఆటగాడు లీ చోంగ్ వెయ్ చేతిలో అపజయాన్ని ఎదుర్కొన్న విషయం విదితమే. అయితే మలేషియా గ్రాండ్ ప్రీ తొలి రౌండ్‌లో ప్రణయ్‌కు వాకోవర్ లభించింది.
కాగా, ఇండియా ఓపెన్ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో పరాజయాన్ని ఎదుర్కొన్న గురుసాయిదత్ మలేషియా గ్రాండ్ ప్రీ పురుషుల సింగిల్స్ విభాగంలో 11వ సీడ్ ఆటగాడిగా బరిలోకి దిగుతున్నాడు. తొలి రౌండ్‌లో అతను సింగపూర్‌కు చెందిన చావో హువాంగ్‌తో తలపడనున్నాడు. అలాగే తొలి రౌండ్‌లో జరిగే ఇతర మ్యాచ్‌లలో సమీర్ మలేషియాకు చెందిన వెయ్ జియాన్ అయితోనూ, అభిమన్యు హాంకాంగ్‌కు చెందిన యాన్ కిట్ చాన్‌తోనూ తలపడనున్నారు.
భారత బృందానికి సింధు సారథ్యం
english title:
sindhu
Date:
Tuesday, April 30, 2013