హరారే, ఏప్రిల్ 29: జింబాబ్వేతో రెండు టెస్టుల క్రికెట్ సిరీస్‌లో భాగంగా ఇంతముందు జరిగిన తొలి మ్యాచ్‌లో ఎదురైన ఓటమికి బంగ్లాదేశ్ జట్టు ప్రతీకారం తీర్చుకుంది. జింబాబ్వే రాజధానిలోని హరారే స్పోర్ట్స్ క్లబ్ స్టేడియంలో సోమవారం ముగిసిన చివరి టెస్టులో బంగ్లాదేశ్ జట్టు 143 పరుగుల తేడాతో ఆతిథ్య జట్టును మట్టికరిపించింది. దీంతో ఈ సిరీస్ 1-1తో డ్రాగా ముగిసింది. హామిల్టన్ మసకద్జా అజేయ శతకంతో ఒంటరి పోరాటం చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. 4 వికెట్ల నష్టానికి 138 పరుగుల ఓవర్‌నైట్ స్కోరుతో సోమవారం చివరి రోజు రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన జింబాబ్వే జట్టుకు నైట్ వాచ్‌మన్లు హామిల్టన్ మసకద్జా, ఎస్.డబ్ల్యు.మసకద్జా 46 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు. అనంతరం ఎస్.డబ్ల్యు.మసకద్జా (24) మహ్మద్ అషఫ్రుల్ బౌలింగ్‌లో లెగ్ బిఫోర్ వికెట్‌గా నిష్క్రమించడంతో వీరి భాగస్వామ్యం ముగిసింది. ఆ తర్వాత హామిల్టన్ స్థిమితంగా ఆడుతూ జింబాబ్వేను గట్టెక్కించేందుకు ప్రయత్నించినప్పటికీ టెయిలెండర్ల నుంచి సరైన సహకారం లభించలేదు. వికెట్ కీపర్ ఆర్.ముతుంబమి (12) మినహా మిగిలిన వారెవరూ కనీసం రెండంకెల స్కోర్లు సాధించకుండానే వరుసగా పెవిలియన్‌కు చేరారు. దీంతో 257 పరుగుల స్కోరుకే ఆలౌటైన జింబాబ్వే జట్టు 143 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. అప్పటికి హామిల్టన్ 111 పరుగుల వ్యక్తిగత స్కోరుతో నాటౌట్‌గా నిలిచాడు. బంగ్లాదేశ్ బౌలర్లలో జియుర్ రెహ్మాన్ నాలుగు వికెట్లు కైవసం చేసుకోగా, షకీబ్ అల్‌హసన్‌కు మూడు వికెట్లు, మహ్మద్ అషఫ్రుల్, రొబియుల్ ఇస్లామ్, సొహాగ్ గాజీలకు ఒక్కో వికెట్ చొప్పున లభించాయి. తొలి ఇన్నింగ్స్‌లో బంగ్లాదేశ్ 391 పరుగులు, జింబాబ్వే జట్టు 282 పరుగులు సాధించగా, బంగ్లాదేశ్ జట్టు 9 వికెట్ల నష్టానికి 291 పరుగుల స్కోరు వద్ద రెండో ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసిన విషయం తెలిసిందే. (చిత్రం) హామిల్టన్ 111 (నాటౌట్) శ్రమ వృథా
143 పరుగుల తేడాతో జింబాబ్వే చిత్తు.. సిరీస్ డ్రా
english title:
series draw
Date:
Tuesday, April 30, 2013