లాహోర్ జైలులో సర్వజిత్‌సింగ్‌పై జరిగిన దాడి పాకిస్తాన్ ప్రభుత్వ ప్రేరిత భారత వ్యతిరేక బీభత్సకాండలో భాగం. సర్వజిత్ సింగ్‌ను ఉరితీయాలని ‘జమాత్ ఉద్ దావా’ బీభత్స సంస్థ కోరుతోంది. జమాత్ ఉద్ దావా, లష్కర్ ఏ తయ్యబా ముఠాలకు చెందిన బీభత్సకారులు 2008 నవంబర్ 26,27 తేదీలలో ముంబయిలో భయంకర హత్యాకాండ జరిపించారు. నూట అరవై ఆరు మందిని పొట్టన పెట్టుకున్నారు. ఈ దుర్ఘటనకు ముందు, తరువాత కూడ లష్కర్లు, జమాత్‌లు మన దేశంలో అనేక బీభత్స ఘటనలు జరిపించడం చరిత్ర. జమాత్ ఉద్ దావాను నిషేధించాలని జమాత్ ముఠా నాయకుడు సయ్యద్ హఫీజ్‌ను నిర్బంధించి విచారించాలని పాకిస్తాన్ ప్రభుత్వాన్ని కోరుతూ ఐక్యరాజ్య సమితి 2008 డిసెంబర్‌లో తీర్మానాన్ని ఆమోదించింది. ఈ తీర్మానాన్ని పాకిస్తాన్ ప్రభుత్వం అమలు జరిపివుండి నట్టయితే ఈ నెల 26వ తేదీన సర్వజిత్‌ను హత్యచేయడానికి దుండగులు యత్నించి ఉండేవారు కాదు. తమ ముఠాకు చెందిన అజ్మల్ కసబ్‌ను మనదేశంలోని న్యాయస్థానాలు మరణశిక్షను విధించిన తరువాత, ఈ శిక్ష అమలు జరిగిన తరువాత మరింత విద్వేషంతో రగిలిపోతున్న ‘జమాత్ ఉద్ దావా’ అధినేత లాహోర్ జైలులోని ఇతర ఖైదీలను సర్వజిత్‌పైకి ఉసికొల్పడం ఈనెల 26వ తేదీ నాటి ఘటనకు కారణం. 2008 నవంబర్ నాటి ముంబయి హత్యాకాండను జరిపిన బీభత్సకారులలో ఒకడైన కసబ్‌ను న్యాయ ప్రక్రియ ద్వారా శిక్షించిన మన దేశంపై అన్యాయ ప్రక్రియ ద్వారా కసి తీర్చుకోవడం సర్వజిత్‌పై దాడికి కారణం. 2001 డిసెంబర్‌లో మన పార్లమెంటు భవనం ప్రాంగణంలో జరిగిన హంతకచర్యకు రూపకల్పన చేసిన అఫ్జల్‌గురును ఉరితీసినప్పటినుంచి జమాత్ ముఠా నాయకుడు హఫీజ్ సరుూద్ ప్రతీకార వాంఛ పైశాచిక రూపమెత్తి జైలులోని హంతకులను నిర్దోషి అయిన సర్వజిత్‌పైకి ఎగతోలింది. సర్వజిత్ నిర్దోషిత్వం గురించి పాకిస్తాన్ ప్రభుత్వాన్ని ఒప్పించడంలో విఫలమైన మన ప్రభుత్వ విధానం ఆయన 1990 నుంచి జైలులో మగ్గిపోవడానికి కారణం కావచ్చు. కానీ మనదేశంలోని జైళ్ళలో ఉన్న పాకిస్తానీ నేరస్థులను హత్య చేయించడానికి మన ప్రభుత్వం యత్నించడంలేదు. కానీ సర్వజిత్ హత్యాయత్నాన్ని పాకిస్తాన్ ప్రభుత్వం సమర్ధించిందనడానికి దాడి జరిగిన తీరు నిదర్శనం. సర్వజిత్‌ను తుదముట్టించడానికి హంతకులు యత్నించవచ్చునని ఇరవై రోజుల క్రితమే పశ్చిమ పంజాబ్ అధికారులకు తెలుసు. పాకిస్తాన్ ప్రభుత్వానికి తెలుసు. కానీ సర్వజిత్‌కు ప్రత్యేక భద్రతను కల్పించడంలో పాకిస్తాన్ అధికార వ్యవస్థ విఫలమైంది. సర్వజిత్ మరణశిక్ష పడిన ఖైదీకాబట్టి అతని వెంట ఎల్లవేళలా ఒక సాయుధుడైన జైలు ఉద్యోగి ఉండాలనేది నియమం. కానీ సర్వజిత్‌ను చంపడానికి యత్నించిన హంతక ఖైదీలను నిరోధించడానికి ఈ సాయుధ ఉద్యోగి యత్నించలేదు. దాడి జరిగిన సమయంలో అతగాడు అదృశ్యుడైపోయాడు. ఈదాడి పాకిస్తాన్ ప్రభుత్వ ప్రేరిత బీభత్సమన్న దానికి ఇలా సాయుధ రక్షకుడు అదృశ్యం కావడం కంటె మించిన సాక్ష్యం అక్కరలేదు. దాడి జరిగిన తరువాత అతని వైద్య చికిత్సకోసం తరలించడం వంటివి బీభత్స స్వభావాన్ని కప్పిపుచ్చుకొనడానికి పాకిస్తానీ ప్రభుత్వం చేస్తున్న యత్నంలో భాగం. పాకిస్తాన్‌లో సైన్యమే నిజమైన ప్రభుత్వం...
సర్వజిత్ సింగ్‌ను బీభత్సకారుడిగా బనాయించడంలో పాకిస్తాన్ ప్రభుత్వం కృతకృత్యం కావడం మన ప్రభుత్వ వైఫల్యానికి మచ్చుతునక మాత్రమే. సర్వజిత్ సింగ్ మన పంజాబ్ లోని సామాన్య పౌరుడు. బీభత్సకారుడు కాదన్న వాస్తవానికి తరువాత నడిచిన కథ నిదర్శనం. సర్వజిత్ సింగ్ మన ప్రభుత్వ గూఢచారి కూడ కాదు. కాశ్మీర్‌లో పాకిస్తానీ ప్రేరిత బీభత్సకాండ పరాకాష్ఠకు చేరిన సమయంలో లక్షలాది మంది హిందువులు లోయ ప్రాంతం నుంచి పారిపోయి, దేశంలోని ఇతర ప్రాంతాలకు వచ్చేశారు. ఈ వైపరీత్యం నుండి దృష్టిని మళ్ళించడానికి పాకిస్తాన్ ప్రభుత్వ జరిపిన వంచన క్రీడలో బలిపశువు సర్వజిత్ సింగ్. 1990లో కాశ్మీర్‌లో పాకిస్తానీ బీభత్సం పైశాచిక నృత్యం చేస్తుండిన సమయంలో సర్వజిత్‌సింగ్ పాకిస్తానీ సైనికులకు పట్టుబడ్డాడు. సరిహద్దు ప్రాంతంలో నడచిపోతుండిన సర్వజిత్‌ను పట్టుకోవడం, అతడిని బీభత్సకారుడని ముద్ర వేయడం, మరణశిక్ష విధించడం సంవత్సర కాలంలో జరిగిపోయిన పరిణామాలు. పాకిస్తాన్‌లో ‘న్యాయప్రక్రియ’ ఎంతవేగంగా పరిగెత్తుతూ ఉందో దీన్ని బట్టి అర్ధం చేసుకోవచ్చు. 1990లో ముల్తాన్‌లోను లాహోర్‌లోను జరిగిన బాంబు పేలుళ్ళలో సర్వజిత్‌ను ఇరికించేశారు. ఫలితంగా 1991లో మరణశిక్ష పడినప్పటి నుంచి సర్వజిత్ జీవనవ్యథ మొదలైంది. లాహోర్‌లోను, ముల్తాన్‌లోను సర్వజిత్ పేలుళ్ళను జరిపింది నిజమైతే అందుకు అతనొక్కడే దోషి కాజాలడు. మన దేశం నుండి ఒంటరిగా ముల్తాన్‌కు లాహోర్‌కు వెళ్ళడం, తిరిగి రావడం పేలుళ్ళను జరిపి పట్టుబడకుండా తప్పించుకొని సరిహద్దు ప్రాంతంలో నిర్భయంగా సంచరించడం అసంభవమైన పరిణామాలు. కానీ సర్వజిత్‌కు మరణశిక్ష విధింపజేసిన పాకిస్తాన్ ప్రభుత్వం ఆయనకు సహకరించిన వారెవరో తేల్చలేదు. వారు భారతీయులా, పాకిస్తానీ పౌరులా అన్న విషయమై పరిశోధన జరగలేదు. సర్వజిత్ నిజంగా టెర్రరిస్టు అయినట్టయితే అతని జట్టులోని వారెవరు? ఆయన ఏ ముఠాకు చెందినవాడు? ముల్తాన్‌లోను లాహోర్‌లోను బాంబులు పేల్చిన వారు పాకిస్తాన్‌లోని మరిన్ని చోట్ల బీభత్సకాండకు ఎందుకని పాల్పడలేదు? ‘సర్వజిత్ బీభత్స’ముఠా అతగాడితో పుట్టి ఆయన పట్టుపడగానే అంతరించి పోయిందా? ఇలాంటి మరెన్నో సందేహాలకు సమాధానాలను పాకిస్తాన్ నుండి రాబట్టడంలో మన ప్రభుత్వం విఫలం కావడం సర్వజిత్ కంఠంలోని విషాదానికి ప్రాతిపదిక! ఇలాంటి ప్రశ్నలకు సమాధానం సర్వజిత్ నిర్దోషిత్వం...
మనదేశంలో బీభత్సకాండను జరిపిన పాకిస్తానీ తొత్తులు ఒకరి తరువాత మరొకరు పట్టుబడుతూనే ఉన్నారు. 1990 నుండి ఇలా పట్టుబడిన వారి సంఖ్య వందలను దాటి వేలకు చేరింది. పట్టుబడకుండా ప్రచారంలో ఉన్న పాకిస్తానీ బీభత్సకారులు మన దేశంలోను, ఇతర దేశాలలోను వేల సంఖ్యలో ఉండడం, బహిరంగ రహస్యం. టెర్రరిస్టులు విడివిడిగా పుట్టుకు రావడం లేదు. పథకం ప్రకారం దశాబ్దులుగా పాకిస్తాన్, చైనా ప్రభుత్వాలు దేశానికి వ్యతిరేకంగా బీభత్సకారులను తీర్చిదిద్దుతున్నాయ. 1990 నుండి వందల బీభత్స ఘటనలను ఈ బీభత్సకారులు మనదేశంలో జరుపుతున్నారు. ఒకడిని కాదు, వందమందిని పట్టుకొన్నప్పటికీ మరిన్ని వందలమంది పాకిస్తానీ బీభత్సకారులు పేట్రేగుతున్నారు. ఒకటి తరువాత మరో బీభత్స ఘటన సాగిపోతూనే ఉంది. సర్వజిత్ సింగ్ పాకిస్తాన్ వ్యతిరేక బీభత్సకారుడన్న అబద్ధం నిజమైనట్టయితే అతడు పట్టుబడిన తరువాత మరికొంతమంది పాకిస్తానీ వ్యతిరేక హంతకులు బీభత్స చర్యలు జరిపి ఉండాలి. ముల్తాన్, లాహోర్ బాంబు పేలుళ్ళ తరువాత అనేక బీభత్స ఘటనలను భారత దేశానికి చెందిన సర్వజిత్ సహచరులు పాకిస్తాన్‌లో జరిపివుండాలి. వారిలో కొందరైనా పట్టుబడివుండాలి. ఏరీ? పాకిస్తాన్ ప్రభుత్వం సర్వజిత్‌పై మోపిన నేరం అసత్య అభియోగమన్న దానికి ఈ చరిత్ర సాక్ష్యం. సర్వజిత్‌ను శిక్షించిన తరువాత మరే భారతీయ బీభత్సకారుడినీ పాకిస్తాన్ పట్టుకోలేదు. ఉంటే కదా పట్టుబడడానికి.. చావుబతుకుల మధ్య ఉన్న సర్వజిత్‌ను నిర్దోషిగా ప్రకటింపజేసి స్వదేశానికి రప్పించాలన్న ధ్యాస మన ప్రభుత్వానికి ఇప్పుడైనా కలగాలి కదా...
సంపాదకీయం
english title:
editorial
Date:
Tuesday, April 30, 2013