Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

అడ్డు అదుపులేని ‘వాయిదాల’ దోపిడి

$
0
0

బహుళ జాతి సంస్థలకు భారతదేశం అతి పెద్ద వినిమయ మార్కెట్‌గా కనిపిస్తుందని, అందుకే అవి మన దేశంలో కాలు పెట్టి, ఇక్కడి సంపదను కొల్లగొట్టాలని చూస్తున్నాయని తరచు కమ్యూనిస్టు భావజాల మేథావులు చెబుతూనే వుంటారు. అందుకే చిల్లర వర్తకం లాంటి విపరీత ప్రభావం కనబర్చే రంగాల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు అనుమతించవద్దని విపక్షాలు గగ్గోలు పెడుతూనే వున్నాయి. అయితే, విదేశీ సంస్థలు ఇక్కడకు వచ్చి, ఏ మేరకు కొల్లగొడతాయో, కొల్ల గొట్టాయో తెలియదు కానీ, ఫక్తు స్వదేశీ సంస్థలు మాత్రం మన దేశంలో తరచు తమ చేతివాటం ప్రదర్శించి జనం డబ్బులు దోచుకుపోతూనే వున్నాయి. నిజానికి విదేశీ సంస్థలు ఇక్కడి వచ్చి, మన వినియోగదారులకు లేని అలవాట్లు మప్పి, అనవసరపు కొనుగోళ్లు జరిపించి, ఆపై తాము లాభాలు చేసుకుంటాయి. అంతే కానీ ఏ బహుళజాతి సంస్థా బోర్డు తిప్పి, మన జనాల పెట్టుబడిని ఎగరేసుకుపోయిన దాఖలాలు లేవు. ఎందుకంటే విదేశీ కంపెనీలకు ఇంతో అంతో చట్టాలంటే భయం వుంటుంది. కానీ మన సంస్థలకు ఆ భయం ఉండదు. సంస్థల అధిపతులు నిత్యం రాజకీయాలతో చెట్టాపట్టాలేసుకుని వుంటారు. కార్పొరేట్ సంస్థలు, రియాల్టీ సంస్థలు, ఫైనాన్స్ సంస్థలు, చిట్‌ఫండ్ సంస్థలు, ఆఖరికి ప్రయివేటు బ్యాంకులు, ఎన్నో జనాల సొమ్ము నొల్లుకుపోయాయి.
ఇది ఇవ్వాల్టి నిన్నటి కథ కాదు. దేశంలో పేద, మధ్య తరగతి జనాల ఆశలు, అవసరాలు ఆలంబనగా చేసుకుని, చిట్‌ఫండ్, ఫైనాన్స్ సంస్థలు జనాల్ని ముంచిన సంఘటనలు కోకొల్లలు. ముఫై, నలభై ఏళ్ల క్రితం దక్షిణాది రాష్ట్రాలను కుదిపేసింది సుదర్శన్ చిట్‌ఫండ్ వ్యవహారం. పాతికేళ్ల క్రితం దేశాన్ని కుదిపేసింది ఆదిత్య ఫైనాన్స్ వ్యవహారం. వందలాది కోట్లు గల్లంతయిపోయాయి. మన రాష్ట్రంలో నాగార్జున ఫైనాన్స్ బోర్డు తిప్పిన వైనం, రాజధానిలో కృషి బ్యాంకు వ్యవహారం జనాలకు ఇంకా గుర్తు వుండనే వున్నాయి. మొన్నటికి మొన్న మన రాష్ట్రంలోని విశాఖ జిల్లాలో స్విమ్స్ సంస్థ బోర్డు తిప్పి, జనాలకు కోట్ల రూపాయిలకు టోపీ వేసింది.
కలెక్టివ్ ఇన్‌వెస్ట్‌మెంట్ స్కీమ్ నిబంధనల్లో వున్న వెసులబాట్లే ఇప్పడు దేశంలోని వివిధ వ్యాపార సంస్థల టర్నోవర్‌కు ఆలంబనగా మారింది. ఒకరు వంద రూపాయిలు కడితే, కోటి మందికి వందకోట్లు. నెలకు మూడువేల కోట్లు. ఒక్క ఏడాది తరువాత బోర్డు తిప్పితే ముఫైఆరువేల కోట్ల కుంభకోణం. ఇప్పుడు బెంగాల్‌ను ఇలాంటి వ్యవహారమే ఒకటి కుదిపేస్తోంది. శారదాగ్రూప్ కుంభకోణం. ఒక్క గ్రూప్‌లో సుమారు వంద వరకు కంపెనీలు రిజిస్టర్ అయి వున్నాయ. అన్ని కంపెనీల పేర్ల ముందు శారద అన్న పదం కామన్‌గా కనిపిస్తుంది. ఎక్కువ కంపెనీలు నిర్వహించేది రియల్ ఎస్టేట్ వ్యాపారమే. అయితే వేలాది కోట్ల మేరకు అస్సాం, బెంగాల్ ప్రాంత జనానికి టోపీ వేసిన ఈ సంస్థ వేళ్లు అటు ప్రింట్, ఇటు విజువల్ మీడియాలో, ఆ పైన రాజకీయాల్లో కూడా వుండడం విశేషం. తెలుగునాట కూడా జలగం వెంగళరావు కేంద్రంలో మంత్రిగా వుండగా, చిట్‌ఫండ్ వ్యవహారాలను నియంత్రించే ప్రయత్నం చేసినపుడు, దాని వెనుక స్థానిక మీడియా, రాజకీయాలున్నాయన్న వార్తలు వినవచ్చాయి. రిజర్వ్‌బ్యాంకు అనుమతి లేకుండా మార్గదర్శి సంస్థ వేల కోట్లు డిపాజిట్లు తీసుకుందన్న వ్యవహారం, రాజకీయం-మీడియా-వ్యాపారం చెట్టపట్టాలను బట్టబయలు చేసింది. మరోపక్క సహారా సంస్థ డిపాజిట్ల వ్యవహారం సుప్రీం కోర్టు, సెబి చొరవతో బయటకు వచ్చింది.
ఇప్పుడు బెంగాల్‌లో బయటపడిన శారద గ్రూపు సంస్థల కుంభకోణం విలువ 20వేల కోట్ల పైచిలుకే. నిజానికి ఈ సంస్థకు చిట్‌ఫండ్ వ్యాపారం కాదు కీలకం. పలురకాలైన వ్యాపారాలు ఈ సంస్థ సాగిస్తోంది. అందులో ప్రధానమైనది రియల్‌ఎస్టేట్. భూములను సాకుగా చూపి, జనాల వద్ద వాయిదాలు వసూలు చేయడం అన్నది కీలకం. ఇలా వచ్చిన డబ్బును ఆ సంస్థ ఇంకా వివిధ వ్యాపారాల్లో మదుపు చేస్తూ వచ్చింది. అనేక పత్రికలు, చానెళ్లు కూడా శారదా గ్రూపులో వున్నాయి. ఇక్కడ ఇంకో సంగతేమిటంటే, ఈ మీడియా వ్యాపారానికి నేతృత్వం వహిస్తున్నది అధికార తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ. అదే పార్టీకి చెందిన మరో ఎంపీ కూడా శారదా గ్రూప్ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనడం విశేషం. సాక్షాత్తూ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి శారదా గ్రూప్‌నకు సంబంధించిన ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఇవన్నీ బాగానే వున్నాయి. కానీ ఇప్పుడు అంతా తల్లక్రిందులయ్యాక, శారదాగ్రూప్ అధిపతి సుదీప్తసేన్ రాజకీయనాయకులపై అభాండాలు వేస్తున్నారు. తను ఎవరెవరికి ఎలా డబ్బులిచ్చిందీ, వివరిస్తూ, సుదీర్ఘ లేఖను సిబిఐకు రాశారు. ఓ మధ్యవర్తి ద్వారా కేంద్రమంత్రి చిదంబరం భార్యకు కోటి ముట్టినట్లు ఆరోపణలు చేసారు. సుదీప్త్‌సేన్ సిబిఐకి రాసిన లేఖలోని విషయాలన్నీ వాస్తవాలా కాదా అన్న సంగతి పక్కన పెడితే, కంపెనీలు తాము ప్రజల నుంచి సేకరించిన సొమ్ములను వివిధ మార్గాల్లో ఎలా మళ్లిస్తున్నాయో అన్నది స్పష్టమవుతుంది.
ఇటీవలే రియల్ ఎస్టేట్ సంస్థల ఆటలు కట్టించి, వాటికి ముకుతాడు వేసేందుకు, తగిన చట్టం తీసుకువస్తామని సంబంధిత కేంద్రమంత్రి ప్రకటించారు కూడా. ఒక్క మన రాష్ట్రంలోనే గడచిన రెండు దశాబ్దాలలో ఎన్నో చోటా మోటా రియల్ ఎస్టేట్‌సంస్థలు జనం డబ్బులు దండుకున్న మేరా దండుకుని, జెండాలెత్తేసిన వైనాలెన్నో వున్నాయి. కానీ ఈ కేసులన్నీ మహా అయితే జిల్లా స్థాయి దాటి రాలేదు. రిజర్వ్‌బ్యాంకు నాన్ బ్యాంకింగ్ సంస్థలు ఏవీ ప్రజల నుంచి డిపాజిట్లు సేకరించరాదని స్పష్టంగా చెబుతోంది. అయితే ఆయా చట్టాల్లోని వీలు,వెసులుబాట్లు ఆధారంగా చేసుకుని దేశవ్యాప్తంగా లక్షలాది సంస్థలు వాయిదాల పద్దతిన జనం నుంచి నిత్యం వసూళ్లు సాగిస్తూనే వున్నాయి. వీటన్నింటికీ ఆయా సంస్థలకు వున్న నేపథ్యం, స్థానికంగా వున్న పలుకుబడి మాత్రమే పెట్టుబడి. దుస్తులు, బంగారం,స్థలాలు, ఆఖరికి విహారయాత్రలు అన్నింటికీ ఇదే సూత్రం. మధ్యతరగతి కలలను తమకు అనుకూలంగా మలుచుకునే సూత్రం. జనం ఈ తరహా డిపాజిట్ పథకాలను ఆదరిస్తున్నారని చూసి కూడా, బ్యాంకింగ్ సంస్థలు తమ రికరింగ్ డిపాజిట్లకు కొత్త మెరుగులు అద్దడం, వాటికి వడ్డీ రేట్లు పెంచడం వంటివి చేయవు. ఒక వస్త్ర దుకాణమో, నగల దుకాణమో తన వ్యాపారానికి నిర్వహణ ధనం కోసం బ్యాంకులను ఆశ్రయించి రుణం తెస్తే, కనీసం 12 నుంచి 16శాతం వడ్డీ చెల్లించాలి. అదే కనక ఏదో విధమైన పథకం ప్రవేశపెట్టి జనాల దగ్గర నుంచి డబ్బులు దండితే ఇచ్చే వడ్డీ ఆరు నుంచి ఏడు శాతం. అంటే సగానికి సగం వడ్డీకి రుణం సంపాదించవచ్చు. పైగా ఈ తరహా రుణానికి ఎటువంటి హామీ వుండదు. అలా జనాల దగ్గర నుంచి స్కీముల పేరుతో వసూళ్లు సాగించిన డబ్బులు వేరే పెట్టుబడులకు మళ్లించడం, అక్కడ నష్టాలు వస్తే, బోర్డు తిప్పేయడం. మన రాష్ట్రంలో ఒక ప్రాంతంలోని రియల్ ఎస్టేట్, తదితర వ్యాపారాలు నిర్వహిస్తున్న సంస్థ తన వసూళ్లను సినిమాలు, మీడియాలోకి కూడా మళ్లించింది. అక్కడితో ఆగుకుండా రాజకీయాలను అండగా చేసుకుంది. భవిష్యత్‌లో ఇటువంటి సంస్థ బోర్డు తిప్పితే జరిగేదేమిటి? ప్రజల నుంచి వచ్చిన నిధులను వివిధ చోట్ల స్థలాలకు అడ్వాన్స్‌లుగా ఇస్తాయి రియల్ ఎస్టేట్ సంస్థలు. తీరాచేసి ఇలా సంపాదించిన స్థలాలు సరియైన సమయంలో లేఔట్‌లు కాకపోయినా, ఆ స్థలాల ధరలు పడిపోయినా, సంస్థపై తీవ్ర ప్రభావం కనబరుస్తాయి. చాలా రియల్ ఎస్టేట్ సంస్థలు టర్నోవర్‌గా వచ్చిన డబ్బులను, స్వల్పకాలంలో అధికలాభాలు ఇచ్చే రంగాలను ఎంచుకుని పెట్టుబడులు పెడతాయి. ఉదాహరణకి సినిమా రంగం లాంటివి. ఇదంతా లాటరీ వ్యవహారం. సినిమాలు బకెట్ తనే్నస్తే, ఈ కోట్లన్నీ గల్లంతే. 1986 ప్రాంతంలో బోర్డు తిప్పిన ఆదిత్య హవుసింగ్ ఫైనాన్స్ సంస్థది ఇలాంటి సంగతే.
వీలయినంత టర్నోవర్ సాధించేందుకు రియల్ ఎస్టేట్ సంస్థలు భారీ కమిషన్‌తో ఏజెంట్లను నియమిస్తున్నాయి. శారదాగ్రూప్ ఈ విధంగా లక్షలాది మందిని ఏజెంట్లుగా నియమించుకుంది. ఇప్పుడు బెంగాల్‌లో శారద సంస్థ ఏజెంట్ల అగచాట్లు, ఆగ్రహావేశాలు ఇంతా అంతా కాదు. చాలా మంది ఏజెంట్లు మాయమయ్యారు. ఇళ్లకు వెళ్లడం లేదు. వారి కుటుంబాలు ఎక్కడెక్కడో తలదాచుకుంటున్నాయి. తృణమూల్ కాంగ్రెస్ నాయకులకు, మమతా బెనర్జీకి శారదాగ్రూప్ అధిపతితో సంబంధాలున్న వైనాలన్నీ ఇప్పు డు బయటకు వస్తున్నాయి. సుదీప్తసేన్ సమక్షంలో మమత పాల్గొన్న కార్యక్రమాల చిత్రాలు ఎక్కడపడితే అక్కడ దర్శనమిస్తున్నాయి. చిత్రమేమిటంటే నిన్నమొన్నటి వరకు సుదీప్త్‌సేన్ చాలా లోప్రొఫైల్‌లో వుంటూ వచ్చారు. వీలయినంత వరకు తన ఫొటోలు ప్రచురించవద్దని ఆయన తన సంస్థ పత్రికలకు చెబుతూ వచ్చారు. ఎడిటోరియల్ సమావేశాలకు కూడా ఆయన హాజరయింది చాలా తక్కువ. నిజానికి సుదీప్త సేన్ ఒక చిన్న కార్యాలయంతో రియల్ ఎస్టేట్ ఏజెంట్‌గా తన ప్రయాణం ప్రారంభించారు. అదీ 1990ల్లో... ఫ్లాట్‌లు అమ్మచూపడం, కొనడం వంటి వ్యాపారాలు సాగించి 2006నాటికి శారదాగ్రూప్‌ను ప్రారంభించారు. ఈ ఏడేళ్ల స్వల్పకాలంలో ప్రజల నుంచి వివిధ పథకాల ద్వారా సుమారు 22వేల కోట్ల మేరకు వసూళ్లు సాగించారు. ఇప్పుడు అంతా జరిగిపోయింది. మామూలుగా అయితే ఈ పెట్టుబడి వ్యూహ చక్రం అలా తిరుగుతూ వుంటుంది. ఒక్కసారిగా ఎవరికి వెనక్కు ఇవ్వక్కరలేదు అన్నదే ధీమా. కానీ ఎక్కడో ఒక్కసారి చక్రం ఇరుసు తొలిగితే, అప్పుడు బండి బోల్తా కొడుతుంది. ప్రభుత్వం మాత్రం పత్రికల్లో, టీవీలో ప్రకటనలు వస్తున్నా పట్టించుకోదు. చట్టంలో వున్న లొసుగుల పూడ్చే ప్రయత్నం చేయదు. ఒక చిట్ స్కీము నడపాలంటే, కనీసం ఇంత మొత్తం ప్రభుత్వం దగ్గర డిపాజిట్ చేయాలని నిబంధనలు వున్నాయి. వాటిని మరింత కఠినతరం చేయాలి. కేవలం ఒక నెల చిట్ మొత్తం అని కాకుండా, స్కీమ్ టర్నోవర్‌కు సరిపడా గ్యారంటీలు వ్యాపార సంస్థల దగ్గర నుంచి తీసుకోవాలి. అసలు ఈ వాయిదా వసూళ్ల స్కీముల వ్యవహారాలకు సంబంధించి వున్న లొసుగులను తెలుసుకునేందుకు ఆర్థిక నిపుణులతో నివేదిక తయారుచేయించి, ఆ మేరకు ఉన్న చట్టాలను సవరించడం, లేదా కొత్త చట్టాలకు రూపకల్పన చేయడం తదితర కట్టుదిట్టమైన చర్యలు తీసుకునే వరకు ఇలాంటి వ్యవహారాలు ఎక్కడో ఒక దగ్గర పొడచూపుతూనే వుంటాయి.

మెయిన్ ఫీచర్
english title: 
main feature
author: 
- విఎస్‌ఎన్ మూర్తి

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>