గ్రామస్వరాజ్యమే దేశ ఔన్నత్యానికి ప్రతీకని మహాత్మాగాంధీ ఏనాడో సెలవిచ్చారు. స్థానిక స్వపరిపాలనను ఆలంబనగా నిలిచే పంచాయతీరాజ్ వ్యవస్థను తొలిసారిగా అమల్లోకి తీసుకువచ్చిన రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఒకటి. మండల, జిల్లా పరిషత్‌లను స్థానిక ప్రభుత్వాలుగా వ్యవహరించాలనే ఉదాత్త ఆశయాన్ని రాజ్యాంగంలోని 73వ సవరణ చాటి చెబుతుంది. ఈ సవరణ ద్వారా పంచాయతీలకు రాజ్యాంగ ప్రతిపత్తి సంక్రమించి ఏప్రిల్ మాసాంతానికి రెండు దశాబ్దులు పూర్తవుతాయి. అయితే రాష్ట్ర ప్రభుత్వాల అధి నాయకత్వంతో, అధిగమించిన పెత్తనంతో ఇవి స్వయంపరిపాలనా వ్యవస్థలుగా రూపుదిద్దుకోలేకపోయాయి. రాష్ట్ర ప్రభుత్వాల పెత్తందారీ విధానాలతో పంచాయతీరాజ్ సంస్థలు కేవలం ఉత్సవ విగ్రహాలుగా మారిపోయాయి.
1987లో గ్రామ పంచాయతీ సర్పంచ్, మండల, జిల్లా పరిషత్తుల అధ్యక్ష పదవులకు ప్రత్యక్ష విధానంలో ఎన్నికలు నిర్వహించారు. ఈ విధానంతో సర్పంచులు మండల పరిషత్‌లలో, ఎంపీపీలు జిల్లా పరిషత్‌లలో సభ్యులుగా ప్రాతినిధ్యం వహించారు. ఆ తర్వాత 1995లో చేసిన రాజ్యాంగ సవరణ ప్రకారం, రెండు మూడో అంచెల్లోని సంస్థల అధ్యక్షులను ప్రజలచే ఎన్నికైన ప్రతినిధులే ఎన్నుకోవాలనే నిబంధన అమల్లోకి వచ్చింది. అందుకోసం గ్రామాలలోని ఓటర్లును ప్రాతిపదికగా తీసుకొని మండల ప్రాదేశిక నియోజకవర్గం (ఎంపీటీసీ) మండల ఓటర్ల ఆధారంగా జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గం (జడ్పీటీసీ) స్థానాలు పుట్టుకొచ్చాయి. ప్రత్యక్షంగా చూస్తే మూడంచెలుగానే ఉన్నా, ప్రాదేశిక నియోజకవర్గాలతో కలిపి అయిదంచెలయ్యాయి. సంఖ్య పెరిగినా పంచాయతీరాజ్ వ్యవస్థ మూలసూత్రం మాత్రం దెబ్బతినే స్థితికి చేరుకొంది. పంచాయితీరాజ్ చట్టం ప్రకారం ఎంపీపీలు, జడ్పీ అధ్యక్షులకే పరిపాలనపరంగా అధికారులు, విధులు నిధులతో కూడిన బాధ్యతలున్నాయి. ఎంపీటీసీ, జడ్పీటీసీ సభ్యులు కేవలం ఆయా సంస్థల అధ్యక్షుల్ని ఎన్నుకోవడానికే వారి పదవులు పరిమితమయ్యాయి.
రాజ్యాంగంలోని 11వ షెడ్యూల్‌లో పొందుపరచిన జాబితా ప్రకారం 29 అంశాలను పంచాయతీరాజ్ సంస్థలకు బదలాయించాలి. ఈ బదలాయింపు విషయంలో మన రాష్ట్రంతోపాటు, కర్ణాటక, కేరళ, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలు బాగా వెనుకపడ్డాయి. కేవలం 16 అంశాల్లో విధుల్ని, అయిదింటిలో నిధుల్ని, రెండింటిలో సిబ్బందిని బదలాయించి రాష్ట్ర ప్రభుత్వం చేతులు దులుపుకొంది. ఇకపోతే పంచాయతీరాజ్ సంస్థలకు కేంద్ర ప్రభుత్వం నుండి అందించే వనరులే ప్రాణాధారం. గత రెండు సంవత్సరాలుగా స్థానిక సంస్థలకు పాలక వర్గాలు లేకపోవడంవల్ల రాష్ట్రంలో స్థానిక సంస్థలకు అందాల్సిన సుమారు 2400 కోట్లు నిధులు నిలిచిపోయినట్లు కేంద్ర పంచాయితీరాజ్ శాఖ మంత్రి కిశోర్‌చంద్రదేవ్ పదే పదే రాష్ట్రానికి గుర్తుచేస్తున్నారు. రాష్ట్ర ఆర్థిక సంఘం కేటాయించిన బడ్జెట్‌లో గత సంవత్సరంలో చూపిన రూ.400 కోట్లు విడుదల చేసినా, అందులో వంద కోట్ల రూపాయలు త్రాగునీటికి మరో 300 కోట్లు విద్యుత్ బకాయిలకు జమచేసిన ఘనత మన ప్రభుత్వానిది. ఈసారి ఏకంగా నూరు కోట్ల రూపాయల్ని బడ్జెట్టులో కోత పెట్టారు. 2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్ర జనాభా 8,46,65,533 అందులో 66.51 శాతం గ్రామీణ ప్రాంతాల్లో, 33.49 శాతం పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్నారు. రాజ్యాంగ పరంగా వీరికి కనీస సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత పంచాయతీరాజ్ వ్యవస్థది. కానీ పాలకుల రాజకీయ చదరంగం లో స్థానిక సంస్థలు పావుల్లా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల్లో పట్టణాల్లో సైతం త్రాగునీటి ఎద్దడితో పారిశుద్ధ్యం, వౌలిక సదపాయాలు కొరవడి విలవిలలాడుతున్నాయి. ప్రతి చిన్న అవసరానికీ తమ వేపు చూసేలా పంచాయతీరాజ్ సంస్థలను పాలక పక్షాలు నీరుగారుస్తున్నాయి. గ్రామస్థాయి అవసరాల ప్రాతిపదికగా పంచాయతీ ప్రణాళిక,దాన్ని అనుసరించి మండల, జిల్లా పరిషత్తుల బడ్జెట్లు, వాటి క్రోడీకరణగా రాష్ట్ర ప్రణాళిక ఉన్నప్పుడే స్థానిక స్వపరిపాలన వ్యవస్థలు రూపుదిద్దుకుంటాయి.
సబ్ ఫీచర్
english title:
grama swarajyam
Date:
Tuesday, April 30, 2013