పార్లమెంటును ప్రతిపక్షం స్తంభింపజేసినందుకు ప్రపంచమంతా నవ్వుతోందని ప్రధాన మంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ చెప్పారు. నిజమే ప్రపంచమంతా మనని చూసి నవ్వుతోంది అయితే ప్రతిపక్షం పార్లమెంటును స్తంభింపజేసినందుకు నవ్వుతోందో లేక చైనా సైనికులు లడక్‌లోని మన భూభాగంలోకి దాదాపు పంతొమ్మిది కిలోమీటర్ల మేర చొచ్చుకు వచ్చి క్యాంపు వేసుకుని తమ జెంతా పాతినందుకా? అనేది ఆలోచించవలసి ఉన్నది. దాదాపు యాభై మంది చైనా సైనికులు లడక్‌లోని మన భూభాగంలోకి చొచ్చుకు వచ్చి క్యాంపు వేసుకుని ఇది మా దేశం అంటున్నా మన పాలకులు మాత్రం ఇదేమాత్రం పెద్ద సమస్య కాదు. ఇది స్థానిక సమస్య మాత్రమే త్వరలోనే పరిష్కరిస్తామంటూ ప్రగల్భాలు పలుకుతున్నారు. మన సైనికులు మన భూభాగంలోనే చైనా సైనికులకు ఎదురుగా క్యాంపు వేసుకోవలసి రావటం మన పాలకుల అసమర్థత, బలహీనత కాదా? చైనా సైనికులు మన భూభాగంలోకి చొచ్చుకు వచ్చి క్యాంపు వేసుకుని పదిహేను రోజులు కావస్తోంది. ఇరు దేశాలకు చెందిన సైనికాధికారుల మధ్య రెండు ఫ్లాక్ సమావేశాలు జరిగాయి, మన విదేశాంగ శాఖ అధికారులు చైనా రాయబారిని పిలిపించుకుని సైనిక క్యాంపు ఎత్తివేయాలని చెప్పటం కూడా పూర్తి అయ్యింది. అయితే చైనా పాలకులు మాత్రం ఇదేది పట్టించుకోవటం లేదు. తమ సైనికుల భారత భూభాగంలోకి చొచ్చుకు వెళ్లలేదు, వాస్తవాధీన రేఖను దాటి ముందుకు పోనేపోలేదని ఘంటా పథంకా చెబుతున్నారు. భారత భూభాగంలోకి వెళితే కదా తమ సైనికులను ఉపసంహరించుకోవలసిన అవసరం వస్తుందంటున్నారు. దేశానికి ఏమిటీ దురవస్థ? ఏమిటీ తలవంపులు? ఇప్పుడు కూడా లడక్‌లో 1962 పరిస్థితే కనిపిస్తోంది. దాదాపు యాభై మంది చైనా సైనికులు హెలికాప్టర్లో పంతొమ్మిది కిలోమీటర్ల మేర మన భూభాగంలోకి చొచ్చుకు వచ్చి క్యాంపు వేసుకుని ఇది మా భూభాగం అంటున్నా మనం వారిని తరిమికొట్టే పరిస్థితిలో లేకపోవటం అత్యంత దురదృష్టకరమైన పరిస్థితి. 1962లోచైనా ఆక్సాయిచిన్ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్నప్పుడు అప్పటి ప్రధాన మంత్రి జవాహర్ లాల్ నెహ్రు మాట్లాడుతూ అక్కడ గడ్డి కూడా మొలకెత్తదంటూ ఆ ప్రాంతం పోయినా పరవాలేదనే విధంగా మాట్లాడారు. ఇప్పుడు మన పాలకుల మాటలు కూడా అదే విధంగా ఉండటం శోచనీయం. చైనా క్యాంపు విషయంలో తొందరపడవద్దు, సైనిక మొహరింపును పెంచవద్దు అంటూ మన సైన్యానికి పాలకులు ఆదేశాలు జారీ చేయటం విచిత్రంగా ఉన్నది. మన పాలకుల చైనా క్యాంపు వ్యవహారాన్ని లడక్‌లోని ఒక చిన్న ప్రాంతానికి పరిమితమైన స్థానిక సమస్యగా మాత్రమే పరిగణించటం అర్థం కావట లేదు. చైనా స్థానిక సైనికాధికారుల తీసుకున్న నిర్ణయం మేరకే వారి సైనికులు మన భూభాగంలోకి చొచ్చుకు వచ్చారు తప్ప చైనా పాలకుల వ్యూహం ప్రకారం ఇది జరగలేదని మన పాలకులు విశ్వసించటం బాధ్యతారాహిత్యం కాదా? చైనా పాలకులు ఒక పథకం ప్రకారం మన భూభాగాన్ని అంగుళం చొప్పున కబళిస్తున్నారనేది అక్షర సత్యం. చైనాను సైనికంగా ఎదురించలేకపోతున్నాము కాబట్టే మన భూభాగాన్ని తిరిగి స్వాధీనం చేసుకోవటం సాధ్యం కాకపోవచ్చు. ఈ పరిస్థితిని మన పాలకులు ఎంత కాలం కొనసాగిస్తారు? చైనా పాలకులు ఒక పథకం ప్రకారం భారత దేశం చుట్టున్న దేశాలను తమ అదుపు,ఆజ్ఞల్లోకి తెచ్చుకుంటున్నారు. ఈ లక్ష్య సాధన కోసం చైనా పాలకులు సామ,దాన,్భద,దండోపాయాలను ఉపయోగిస్తున్నారు. మన సరిహద్దుల్లో అంగుళం చొప్పున ఆక్రమణకు ఒడిగడుతున్న చైనా భారత దేశం చుట్టూవున్న నేపాల్,బంగ్లాదేశ్, బర్మా, శ్రీలంక,పాకిస్తాన్ తదితర దేశాలను దాదాపుగా తన చెప్పుచేతుల్లోకి తెచ్చుకున్నదనేది పచ్చి నిజం. చైనా, పాకిస్తాన్ కలిసికట్టుగా బాంగ్లాదేశ్‌ను మన పైకి ఉసిగొల్పుతున్నారు. శ్రీలంక కూడా చైనా చెప్పినట్లు చేస్తోంది. ఇక పాకిస్తాన్ సంగతి సరేసరి. పాకిస్తాన్ ఏకంగా ఒక ఓడరేవును చైనా పరం చేసి మనకు పక్కలో బల్లెం చేసిపెట్టింది. చైనా మన భూభాగంలోకి చొచ్చుకు రావటం ఇది మొదటిసారి కాదని అధికారులు చెబుతున్నారు. గతంలో ఇలాటి పలు సంఘటనలు జరిగాయి, కొన్న సంఘటనలు ఇంతకంటే పెద్దవే. అయినా వాటిన్నింటిని చర్చల ద్వారా పరిష్కరించుకున్నామని అధికారులు చెబుతున్నారు. చైనా పలుమార్లు మన భూభాగంలోకి చొచ్చుకు వచ్చి మళ్లీ వెనక్కి తగ్గి ఉండవచ్చు. ఇలా చొచ్చుకు రావటం ఇరు పక్షాల చర్చల అనంతరం వెనక్కి తగ్గటం అనేది చైనాకు ఒక ఆటగా మారింది. చైనా ఏదోఒక రోజు ఇలా చొచ్చుకు వచ్చి వెనకకు తగ్గేందుకు అంగీకరించని నాడు ఏమవుతుంది? చైనాకు మన దేశంతోపాటు జపాన్, వియత్నాం లాంటి దేశాలతో కూడా సరిహద్దు గొడవలు ఉన్నాయి. చైనా పాలకులు తమది అనుకునే భూభాగం కోసం జపాన్, వియత్నాంతోపాటు భారత దేశంతో కూడా యుద్ధం చేసేందుకు వెనుకాడరు. చైనా గత పది సంవత్సరాల కాలంలో తమ సైన్యాన్ని ఆధునీకీకరించుకోవటంతోపాటు వాటిని అతి తక్కువ కాలంలో మోహరించేందుకు సరిహద్దుల వెంట అత్యంత పటిష్టమైన రోడ్డు,రవాణా వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నది. చైనా మాటిమాటికి మన భూభాగంలోకి చొచ్చుకు రావటం ద్వారా మన శక్తి సామర్థ్యాలను పరిశీలిస్తోంది. పిల్లి ఎలకతో చెలగాటం అడినట్లు చైనా మనతో అడుకుంటోంది. మన పాలకులు మాత్రం దీనికి స్థానిక సమస్యగా ముద్ర వేసి చర్చల ద్వారా పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇది ఎంత మాత్రం మంచి విధానం కాదు. బలవంతుడితే రాజ్యం కాబట్టి మనం కూడా స్వంత బలంతో చైనా సైనికులను తరిమి కొట్టాలి తప్ప అయ్యా అప్పా అంటూ వేడుకోవటం జాతికే కళంకం అవుతుంది.
ఢిల్లీ కబుర్లు
english title:
world is laughing
Date:
Tuesday, April 30, 2013