ప్రస్తుతం ఏ.టి.ఎమ్‌లలో కేవలం 100 నోట్లు, ఐదు వందల, వెయ్యి నోట్లు వస్తున్నాయి. అన్ని వస్తువులు, సేవలు కేవలం వంద నోట్ల సహాయంతో పూర్తికావు. ప్రయాణాల్లో, రైల్వే టిక్కెట్ తీసుకొనే సమయాల్లో వంద రూపాయలకు చిల్లర వెనక్కి ఇవ్వడం చాలా ఇబ్బందులతో కూడి ఉన్నది. కారణం యాభై రూపాయల నోట్లు సరిగా చలామణిలో లేకపోవడమే. కావున స్వయంచోదిత ధనయంత్రాల్లో (ఏ.టి.ఎమ్) యాభై రూపాయల నోట్లు వచ్చేటట్లు మార్పుచేయవలెనని సంబందిత బ్యాంకు అధికారులకు విన్నపము.
- మిద్దెపల్లి భానుప్రకాశరెడ్డి, కర్నూలు
సంయమనం కోల్పోవద్దు
రాజ్యాంగం ప్రసాదించిన హక్కులేమిటో జర్నలిస్టులకు బాగా తెలిసి ఉండాలి. కాని ‘‘రుజువులు లేని ఉద్యమం’’ పుస్తకావిష్కరణ సందర్భంగా ఒక వర్గం జర్నలిస్టులు సంయమనం కోల్పోయి విరుచుకుపడడం, విధ్వంసం సృష్టించడం, ఒకాయన పని కట్టుకొని రాడ్‌తో భవనం అద్దాల్ని వరసగా బద్దలు గొడుతూ వెళ్లడం టీవీలో చూసి వీళ్లు రౌడీలా? జర్నలిస్టులా అని ఆశ్చర్యపోయాం. మనకు నచ్చని అంశాలు ఒక పుస్తకంలో ఉంటే వాటిని ఖండిస్తూ మరో పుస్తకం రాసి ఆవిష్కరించడం సభ్యత తెలిసిన వారు చేసేపని. విధ్వంసం సృష్టిస్తే పామరులకు జర్నలిస్టులకు తేడా ఏమిటి?
- శాండీ, కాకినాడ
స్థానిక ఎన్నికలు ప్రత్యక్ష పద్ధతిలో జరగాలి
మన రాష్ట్ర అసెంబ్లీలో మొన్నటికి మొన్న రాజకీయ కారణాలతో ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. మున్సిపాలిటీ, జిల్లా పరిషత్‌ల కాల పరిమితి ముగియక ముందు చాలాచోట్ల అవిశ్వాస తీర్మానాల పర్వం కొనసాగింది. చిల్లర, మల్లర పార్టీల ప్రజాప్రతినిధులు స్వార్థంతో పార్టీ ఫిరాయింపులకు పాల్పడుతున్నారు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలు అవిశ్వాస తీర్మానాలు పెట్టడం సహజమే అయినా, అవి పరాకాష్ఠకు చేరుకుంటున్నాయి. కొన్ని ఇతర పార్టీల సభ్యులను డబ్బులతో కొంటున్నారన్న విమర్శలో వాస్తవం లేకపోలేదు. దీనికంతటికీ కారణం స్థానిక సంస్థల ఛైర్మన్‌లను పరోక్ష పద్ధతిలో ఎన్నుకోవటమే. ఇలాంటి అవాంఛనీయ కార్యాలు జరగకుండా ఉండాలంటే నగర పంచాయతీ, జిల్లా, మండల పరిషత్ ఛైర్మన్‌లను సాధారణ ఎన్నికల్లో ప్రత్యక్షంగా ఎన్నుకుంటేనే మేలు. మే, జూన్ మాసాలలో మన రాష్ట్రం లో స్థానిక సంస్థలకు ఎన్నికలు జరగనున్నాయని ప్రభుత్వ పెద్దలు చెప్పుకొస్తున్నారు. కనుక ప్రస్తుతం సర్పంచ్‌ను సాధారణ పౌరులు ఓటు వేసి ఎన్నుకుంటున్నట్టు నగర పంచాయతీ, పరిషత్ అధ్యక్షులను ప్రత్యక్ష పద్ధతిలో ఎన్నుకునేట్లు ప్రభుత్వం మార్పులు చేపట్టాలి. అవసరమైన ఉత్తర్వులు జారీచేయాలి.
- గూరుడు అశోక్, గోధూర్
సాహితీ పిపాసికి జ్ఞానపీఠ్
సాహిత్యం తన ఊపిరిగా.. సాహిత్య నిత్యకృషీవలుడు శ్రీ రావూరి భరద్వాజ వ్రాసిన ‘పాకుడురాళ్లు’ నవలకు సాహిత్యంలోనే ప్రతిష్ఠాత్మక పురస్కారం ‘జ్ఞానపీఠ్’ రావడం తెలుగును తెలుగు జాతిని గౌరవించినట్లే. వినూత్న పదప్రయోగాలు విభిన్న కథనాలు ఆయన సొంతం. చదివింది తక్కువే అయినా ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని హోటల్లో పనిచేసి, పేపర్ బోయ్‌గా పనిచేస్తూ అక్షర యజ్ఞం చేస్తూ.. మనిషి తలచుకుంటే ఏదైనా సాధించగలడని నిరూపించిన అక్షర శిల్పి. నేటి కవులకు, రచయితలకు మార్గదర్శి భరద్వాజగారు. వారికి ఇవే నా అక్షర అభినందనలు.
- ఈ.వేమన, శ్రీకాకుళం
పాలన తెలుగులోనే జరగాలి
ఈ సంవత్సరం మన రాష్ట్ర ప్రభుత్వం తెలుగు భాషా వికాస సంవత్సరంగా ప్రకటించడం ముదావహం. తెలుగు భాషా వికాసం కోసం సాహితీవేత్తలు, సంఘ సంస్కర్తలు, మేధావులు, పత్రికా సంపాదకులతో ఒక కమిటీ ఏర్పాటుచేసి ఒక సమగ్ర ప్రణాళికను అమలుచేయాలి. నిర్బంధంగా ప్రాథమిక స్థాయిలో మాతృభాషలో విద్యాబోధనపై ప్రత్యేక చట్టం రూపకల్పన జరగాలి. గ్రామస్థాయి నుండి సచివాలయం వరకూ తెలుగులోనే పరిపాలన సాగాలి. అంతర్జాలంలో తెలుగు వాడకాన్ని ప్రోత్సహించేలా ప్రత్యేక చర్యలు గైకొనాలి. బాల్యంనుండి మాతృభాష పట్ల అభిమానం, మమకారం పెంపొందించేందుకు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు విశేష కృషి సల్పాలి. తెలుగులో డిగ్రీ, పి.జి. కోర్సులు అభ్యసించేవారికి ఉద్యోగాలలో ప్రత్యేకంగా మార్కులు, వెయిటేజి యిచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. తెలుగు భాష వికాసం కోసం చిత్తశుద్ధితో కృషిచేయాల్సిన ఆవశ్యకత ప్రతీ తెలుగువారిపై వుంది.
- సి.ప్రతాప్, విశాఖపట్నం
ఉత్తరాయణం
english title:
letters to the editor
Date:
Tuesday, April 30, 2013