న్యూఢిల్లీ, ఏప్రిల్ 30: బయ్యారం గనుల లీజును రద్దుచేసే ప్రసక్తే లేదని తెగేసి చెప్పటంతో భూకంపం సృష్టిస్తే ఎదుర్కోగల సత్తా తమకుందని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి చేసిన సవాలును తిప్పికొట్టేందుకు సర్వ సిద్ధంగా ఉన్నామని తెలంగాణ రాష్ట్ర సమితి ప్రతిసవాలు చేసింది. బయ్యారం గనుల నుంచి ఇనుప ఖనిజాన్ని తరలిస్తే ఎదురయ్యే పరిణామాలకు ముఖ్యమంత్రే బాధ్యత వహించాల్సి ఉంటుందని టిఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులు ముక్త కంఠంతో హెచ్చరించారు. టిఆర్‌ఎస్ నాయకులు ఈటెల రాజేందర్, కల్వకుంట్ల తారక రామారావు, జూపల్లి కృష్ణారావు, స్వామిగౌడ్ మాజీ ఎంపి వినోద్‌కుమార్ తదితరులు మంగళవారం ఇక్కడ విలేఖరులతో మాట్లాడుతూ ముఖ్యమంత్రిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
విశాఖ స్టీల్ ప్లాంట్‌కు కేటాయించిన బయ్యారం గనుల లీజును రద్దుచేసి స్థానికంగా ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేయాలని వీరు డిమాండ్ చేశారు. రక్షణ స్టీల్‌కు కేటాయించిన లీజు రద్దు అయిపోయినప్పటికీ విశాఖ స్టీల్ ప్లాంట్‌కు కేటాయించటం తెలంగాణను దోచుకోవటమేనని వీరు ఆరోపించారు. తెలంగాణలోని సహజ సంపదను వీలున్న మేరకు దోచుకోవటంపైనే సీమాంధ్ర ముఖ్యమంత్రులు దృష్టి పెట్టారని టిఆర్‌ఎస్ నాయకులు ఆరోపించారు. గనులున్న చోటే ఉక్కు కర్మాగారాన్ని నిర్మించి స్థానికులకు ఉపాధి అవకాశాలను మెరుగుపరచాలని వీరు సూచించారు. గనుల నుంచి ఒక్క రవ్వ బయటకు తరలించినా భూమిని కంపింప చేస్తామని తమ పార్టీ అధ్యక్షుడు కేసిఆర్ చేసిన హెచ్చరికను అవసరమైతే నిజం చేసి చూపిస్తామని టిఆర్‌ఎస్ నాయకులు ప్రకటించారు. తన ప్రభుత్వం పడిపోయే స్థితిలో ఉండటంతో ముఖ్యమంత్రిలో నిరాశ, నిస్పృహ పెరిగిపోతున్నాయని టిఆర్‌ఎస్ నాయకులు అభిప్రాయపడ్డారు. బయ్యారం గనుల్లో లభించే ఉక్కు ఖనిజంతో స్థానికంగా స్టీలు కర్మాగారాన్ని నిర్మించి తీరాలని వీరు తెగేసి చెప్పారు.
ఖనిజం తరలిస్తే తీవ్ర పరిణామాలేనని హెచ్చరిక
english title:
m
Date:
Wednesday, May 1, 2013