ఇస్లామాబాద్, ఏప్రిల్ 30: పాకిస్తాన్‌లో మళ్లీ అధికారంలోకి రావాలన్న మాజీ అధ్యక్షుడు ముషారఫ్ ప్రయత్నాలకు శాశ్వతంగా బ్రేక్ పడింది. ముషారఫ్ ఏ ఎన్నికల్లోనూ పోటీ చేయడానికి వీలులేకుండా పెషావర్ హైకోర్టు శాశ్వత నిషేధాన్ని విధించింది. ప్రధాన న్యాయమూర్తి దోస్త్ మహ్మద్‌ఖాన్ సారధ్యంలోని నలుగురు సభ్యుల హైకోర్టు ధర్మాసనం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. మే 11న జరుగుతున్న జాతీయ ఎన్నికల్లో పోటీ చేయడానికి వీల్లేకుండా తన నామినేషన్లను తిరస్కరించడాన్ని సవాల్ చేస్తూ ముషారఫ్ దాఖలు చేసిన పిటిషన్‌ను బెంచ్ కొట్టివేసింది. రెండుసార్లు దేశ రాజ్యాంగాన్ని ఆయన వక్రీకరించారని, 2007 ఎమర్జెన్సీ సమయంలో న్యాయమూర్తులనే నిర్బంధించారని కోర్టు ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది. జాతీయ, ప్రాంతీయ అసెంబ్లీ ఎన్నికలు అలాగే సెనెట్‌కు ఎంతమాత్రం ముషారఫ్ పోటీ చేయడానికి వీలులేదని ధర్మాసనం పేర్కొంది.
14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్
మాజీ ప్రధాని బేనజీర్ భుట్టో హత్య కేసులో అరెస్టయిన పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు ముషారఫ్‌ను 14 రోజుల జ్యుడీషియల్ కస్టడి విధిస్తూ తీవ్రవాద వ్యతిరేక కోర్టు ఆదేశించింది. ముషారఫ్‌ను మంగళవారం రావల్పిండి కోర్టులో హాజరుపర్చాల్సి ఉంది. అయితే భద్రతాకారణాల రీత్యా ఆయన్ని హాజరుపర్చలేదని పాక్ ఫెడరల్ ఇన్విస్టిగేషన్ ఏజన్సీ చీఫ్ ప్రాసిక్యూటర్ చౌదరీ జుల్ఫీఖర్ ఆలీ స్పష్టం చేశారు. ఇస్లామాబాద్ శివారులోని ఛక్ షాజాద్‌లోని ఫామ్‌హౌస్‌లో మాజీ సైనికాధిపతి ముషారఫ్ (69)ను పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. ఆయనను కస్టడిలోకి తీసుకున్న ఎఫ్‌ఐఏ దివంగత బేనజీర్ భుట్టో కేసులో విచారించాలని భావించింది. అయితే ఆయన కోర్టుకు హాజరుకానందున మే 14 వరకూ జ్యుడీషియల్ కస్టడికి న్యాయస్థానం ఆదేశించిందని ఆలీ తెలిపారు. ముషారఫ్‌కు ప్రాణానికి హాని ఉందని అంతరంగిక మంత్రిత్వశాఖ హెచ్చరించిన నేపథ్యంలో ఆయన్ని కోర్టుకు హాజరుపరచలేదని చీఫ్ ప్రాసిక్యూటర్ మీడియాకు వెల్లడించారు. ఎఫ్‌ఐఏ సంయుక్త విచారణ కమిషన్ బేనజీర్ హత్యకు సంబంధించి దర్యాప్తు జరిపి ముషారఫ్‌కు వ్యతిరేకంగా తిరుగులేని ఆధారాలు సంపాదించింది. సంఘటనతో ఆయనకు ప్రత్యక్ష సంబంధాలున్నట్టు స్పష్టమైందని ఆలీ తెలిపారు. విదేశాల్లో నాలుగేళ్లపాటు అజ్ఞాతవాసం గడిపి మార్చి 24న పాకిస్తాన్‌లో అడుగుపెట్టిన మాజీ సైనికాధిపతి మే 11న జరిగే సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేస్తానని ప్రకటించారు. ఆయన నాలుగుచోట్ల నామినేషన్లు దాఖలు చేసినా ఎన్నికల అధికారులు తిరస్కరించారు.
ఎన్నికల పోటీకి అవకాశం లేదు పెషావర్ హైకోర్టు సంచలన తీర్పు
english title:
m
Date:
Wednesday, May 1, 2013