న్యూఢిల్లీ, ఏప్రిల్ 30: ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ నాయకత్వంలోని యుపిఎ సంకీర్ణ ప్రభుత్వం అత్యంత అవినీతి ప్రభుత్వమని, దేశానికి స్వాతంత్రం వచ్చాక ఏర్పడిన ప్రభుత్వాల్లో దీనంత అవినీతి ప్రభుత్వం మరొకటి లేదని లోక్‌సభలో ప్రతిపక్ష నాయకురాలు సుష్మా స్వరాజ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మంగళవారం లోక్‌సభ నుంచి వాకౌట్ చేయడానికి ముందు ఆమె మన్మోహన్ సర్కారుపై ఆరోపణల వర్షం కురిపించారు. 2013-14 రైల్వే పద్దులు, సాధారణ పద్దులు, ద్రవ్య వినిమయ బిల్లు, ఆర్థిక బిల్లులకు సంకీర్ణ ప్రభుత్వం ఆమోదముద్ర వేసుకునేందుకే తాము సభ నుండి వాకౌట్ చేస్తున్నామని తెలిపారు. ‘ప్రతిపక్షం పార్లమెంటును స్తంభింపజేస్తున్నందుకు ప్రపంచమంతా నవ్వుతోందని మన్మోహన్ సింగ్ ఆరోపిస్తున్నారు, అయితే సంకీర్ణ ప్రభుత్వం అవినీతికి పాల్పడుతుంటే ఎదిరించాలా? వద్దా? అవినీతికి కేంద్రంగా మారిన సంకీర్ణ ప్రభుత్వాన్ని నిలదీయాలా? వద్దా?’ అని ఆమె ప్రశ్నించారు. సంకీర్ణ ప్రభుత్వం అవినీతిని ఎండగడితే సభను స్తంభింపచేసినట్లా? అని ఆమె నిలదీశారు. యుపిఎ సంకీర్ణ ప్రభుత్వం హయాంలో ఒక అవినీతిని మించిన మరో అవినీతి బయటపడుతోందని, కామన్‌వెల్త్ క్రీడల అవినీతి దాదాపు అరవై వేల కోట్లదైతే ఆ తరువాత వెలుగులోకి వచ్చిన 2జి స్పెక్ట్రం కుంభకోణం లక్షా 76వేల కోట్లని, ఇది ఓ కొలిక్కి రాకముందే బొగ్గు బ్లాకుల కుంభకోణం వెలుగు చూసిందని, ఇది దాదాపు లక్షా 85వేల కోట్లని ఆమె ధ్వజమెత్తారు. ప్రజాస్వామ్యంలో అధికారంలో ఉన్న పార్టీ ప్రజల అభివృద్ధి కోసం పని చేయాలన్న ఆమె, ఆ ప్రభుత్వంపై ఒక కనే్నసి ఉంచడం ప్రతిపక్షం బాధ్యత అని గుర్తుచేశారు. ‘ప్రజల ప్రయోజనాలు కాపాడవలసిన బాధ్యత ప్రతిపక్షంపై ఉన్నది కాబట్టే ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాం, దీనికి ప్రపంచం మనల్ని చూసి నవ్వుతోందని ప్రధాని విమర్శించటం తప్పు కాదా?’ అని ప్రశ్నించారు. ఇంతటి అవినీతి ప్రభుత్వాన్ని గతంలో ఎప్పుడు చూడలేదన్నారు. ‘ఆర్థిక బిల్లులను ఆమోదించే కార్యక్రమానికి తాము అడ్డుపడటం జరగదు, కానీ ఇక మీదట సంకీర్ణ ప్రభుత్వంతో సహకరించే ప్రసక్తే లేదు’ అని సుష్మాస్వరాజ్ స్పష్టం చేశారు. పార్లమెంటులో ప్రతిష్టంభన నెలకొనటానికి పూర్తి బాధ్యత సంకీర్ణ ప్రభుత్వాధినేతలదే తప్ప తమది కాదని ఆమె ప్రకటించారు. పార్లమెంటును సక్రమంగా నడిపించుకోవాలనే చిత్తశుద్ధి అధికార పక్షానికి, సంకీర్ణ ప్రభుత్వానికి లేనప్పుడు తామేమి చేయగలమని నిలదీశారు. అధికారంలో ఉన్నవారు అవినీతికి పాల్పడుతూ ప్రతిపక్షాన్ని విమర్శించటం అర్థరహితమని అన్నారు.
ఆర్థిక బిల్లులకు ఆమోదం
మంగళవారం లోక్‌సభ 2013-14 సంవత్సరానికి సంబంధించిన రైల్వేల డిమాండ్స్ ఫర్ గ్రాంట్స్, జనరల్ డిమాండ్స్ ఫర్ గ్రాంట్స్, ద్రవ్య వినిమయ బిల్లు, ఆర్థిక బిల్లుకు ఆమోదముద్ర వేసింది. అయితే ఈ బిల్లును ఆమోదానికి చేపట్టే ముందే బిజెపి, శివసేన, తెలుగుదేశం, అన్నా డిఎంకె, డిఎంకె, బిజెడి, జనతాదల్ యు తదితర పార్టీల సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు. ‘ఆర్థిక బిల్లుల ఆమోదాన్ని వ్యతిరేకించటం తమ విధానం కాదు, అయితే సంకీర్ణ ప్రభుత్వం అనుసరిస్తున్న ఏకపక్ష విధానాలు, కుంభకోణాలకు నిరసనగా తాము సభ నుండి వాకౌట్ చేస్తున్నాము’ అని ప్రతిపక్షం సభ్యులు బయటకి వెళ్లిపోయే ముందు చెప్పారు.
మంగళవారం లోక్‌సభలో సుష్మా స్వరాజ్ వాదనను శ్రద్ధగా వింటున్న సోనియా