పుణే, ఏప్రిల్ 30: ఇండియన్ ప్రీమియర్ లీగ్ ట్వంటీ-20 క్రికెట్ టోర్నమెంట్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతున్న మాజీ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ మంగళవారం మరో విజయంతో సత్తా చాటుకుంది. పుణేలోని సుబ్రతారాయ్ సహారా స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ 37 పరుగుల తేడాతో ఆతిథ్య పుణే వారియర్స్ జట్టును ఓడించి ఈ సీజన్‌లో ఎనిమిదో విజయాన్ని నమోదు చేసింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు దిగిన చెన్నై సూపర్ కింగ్స్ ఓపెనర్లు మైఖేల్ హస్సీ (5), వృద్ధిమాన్ సాహా (13) వికెట్లను స్వల్ప స్కోర్లకే చేజార్చుకుని ఆరంభంలోనే ఇబ్బందుల్లో పడింది. అయితే సురేష్ రైనా, సుబ్రమణ్యం బద్రీనాథ్ స్థిమితంగా ఆడి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. ‘వారియర్స్’ బౌలర్లను సమర్ధవంతంగా ప్రతిఘటించిన వీరు మూడో వికెట్‌కు 75 పరుగులు జోడించారు. అనంతరం వృద్ధిమాన్ సాహా (34) ల్యూక్ రైట్ బౌలింగ్‌లో స్టీవెన్ స్మిత్‌కు క్యాచ్ ఇవ్వడంతో వీరి భాగస్వామ్యం ముగిసింది. అయితే అతని స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన కెప్టెన్ ధోనీ దూకుడుగా ఆడి స్కోరు బోర్డును పరుగులు తీయించాడు. కేవలం 16 బంతుల్లోనే మూడు సిక్సర్లు, మరో నాలుగు ఫోర్ల సహాయంతో ధోనీ 45 పరుగులు సాధించి అజేయంగా నిలువగా, రైనా 63 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. దీంతో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 164 పరుగుల స్కోరు సాధించింది. ‘వారియర్స్’ బౌలర్లలో ల్యూక్ రైట్, రాహుల్ శర్మ, కాన్ రిచర్డ్‌సన్ ఒక్కో వికెట్ చొప్పున రాబట్టారు.
అనంతరం 165 పరుగుల లక్ష్యంతో ఇన్నింగ్స్ ప్రారంభించిన పుణే వారియర్స్ జట్టును చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్లు సమర్ధవంతంగా నిలువరించారు. ముఖ్యంగా మొహిత్ శర్మ చక్కటి ప్రదర్శనతో 21 పరుగులకే 3 వికెట్లు కైవసం చేసుకోగా, డ్వెన్ బ్రావో, క్రిస్ మోరిస్, రవీంద్ర జడేజా ఒక్కో వికెట్ రాబట్టారు. వీరి జోరును ప్రతిఘటించడంలో ఘోరంగా విఫలమైన పుణే వారియర్స్ జట్టులో మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ స్టీవెన్ స్మిత్ (35), కాన్ రిచర్డ్‌సన్ (26), భువనేశ్వర్ కుమార్ (24) మినహా ఎవరూ చెప్పుకోదగ్గ స్కోర్లు సాధించలేదు. దీంతో 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 127 పరుగులు మాత్రమే రాబట్టిన పుణే వారియర్స్ జట్టు 37 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. ఈ సీజన్‌లో ఇప్పటివరకూ 10 మ్యాచ్‌లు ఆడిన పుణే వారియర్స్‌కు ఇది ఎనిమిదో ఓటమి కాగా, చెన్నై సూపర్ కింగ్స్‌కు ఎనిమిదో విజయం.
ఐపిఎల్‌లో నేడు
సన్‌రైజర్స్ - ముంబయి
హైదరాబాద్‌లో సా. 4 గం.లకు
డేర్‌డెవిల్స్-నైట్ రైడర్స్
రాయ్‌పూర్‌లో రా. 8 గం.లకు