ముంబయ/న్యూఢిల్లీ, ఏప్రిల్ 30: ప్రతిష్టాత్మకమైన జాతీయ క్రీడా పురస్కారం అర్జున అవార్డుకు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బిసిసిఐ) ఈ ఏడాది టీమిండియా యువ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లీని నామినేట్ చేసింది. ‘మిస్టర్ డిపెండబుల్’ రాహుల్ ద్రవిడ్, హైదరాబాద్ స్టైలిష్ బ్యాట్స్‌మన్ వి.వి.ఎస్.లక్ష్మణ్ వంటి మేటి ఆటగాళ్లు అంతర్జాతీయ క్రికెట్ నుంచి వైదొలిగిన తర్వాత మిడిలార్డర్‌లో వారి స్థానాన్ని కోహ్లీ చక్కగా భర్తీచేస్తూ టీమిండియాలో స్థానాన్ని పదిలం చేసుకున్న విషయం విదితమే. దీంతో బిసిసిఐ ఈ ఏడాది అర్జున అవార్డుకు కేవలం కోహ్లీ పేరును మాత్రమే సూచించడంతో పాటు మేజర్ ధ్యాన్‌చంద్ జీవనసాఫల్య పురస్కారానికి టీమిండియా మాజీ కెప్టెన్ ‘లిటిల్ మాస్టర్’ సునీల్ గవాస్కర్‌ను నామినేట్ చేసింది. గత ఏడాది జాతీయ క్రీడా పురస్కారాలకు సంబంధించిన నామినేషన్ పత్రాలు సకాలంలో అందలేదన్న ఆరోపణలతో బిసిసిఐకి, కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖకు మధ్య మాటల యుద్ధం తలెత్తిన విషయం విదితమే. దీంతో మరోసారి ఇటువంటి పరిస్థితి తలెత్తకుండా నివారించేందుకు బిసిసిఐ ఈ ఏడాది తమ నామినేషన్లను సకాలంలో న్యూఢిల్లీలోని కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖకు పంపిందని అధికార వర్గాలు తెలిపాయి. అర్జున, ధ్యాన్‌చంద్ అవార్డులతో పాటు ద్రోణాచార్య, రాజీవ్ ఖేల్ రత్న అవార్డులకు ఈ ఏడాది నామినేషన్లు అందజేయాల్సిన గడువు మంగళవారంతో మగిసింది.
ఉత్తమ వనే్డ క్రికెటర్‌గా గత ఏడాది సెప్టెంబర్‌లో ఐసిసి (అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్) నుంచి అవార్డు అందుకున్న కోహ్లీని బిసిసిఐ అర్జున అవార్డుకు నామినేట్ చేయడం ఎవరినీ ఆశ్చర్యపర్చలేదు. కోహ్లీ కేవలం వనే్డ ఫార్మాట్‌లో మాత్రమే స్పెషలిస్టు బ్యాట్స్‌మన్‌గా ముద్రపడినప్పటికీ గత ఏడాది జనవరిలో అడిలైడ్‌లో జరిగిన టెస్టు క్రికెట్ మ్యాచ్‌లో అద్భుత సెంచరీతో సత్తా చాటుకున్నాడు. ఆ తర్వాత న్యూజిలాండ్‌తో జరిగిన సిరీస్‌లోనూ కోహ్లీ చక్కగా రాణించడంతో 2011-12 సీజన్‌లో జరిగిన ఆసియా కప్ క్రికెట్ టోర్నమెంట్‌లో అతనికి టీమిండియా వైస్-కెప్టెన్‌గా పదోన్నతి లభించిన విషయం తెలిసిందే. ఈ ఏడాది అర్జున అవార్డుకు కోహ్లీని నామినేట్ చేసేందుకు ఇవన్నీ ఎంతగానో దోహపడ్డాయని నిస్సందేహంగా చెప్పవచ్చు.
‘రాజీవ్ ఖేల్ రత్న’ అవార్డుకు
గిరీశ-సందీప్ మధ్య పోటీ
అలాగే దేశ అత్యున్నత క్రీడా పురస్కారం ‘రాజీవ్ ఖేల్ రత్న’ అవార్డుకు పారాలింపియన్ హెచ్.ఎన్.గిరీశ, భారత హాకీ జట్టు డిఫెండర్ సందీప్ సింగ్‌ల నుంచి సోమవారం రెండు నామినేషన్లు అందాయి. అయితే లండన్‌లో జరిగిన పారాలింపిక్ క్రీడల్లో రజత పతకం సాధించి ఈ ఏడాది ఆరంభంలో పద్మశ్రీ అవార్డును అందుకున్న హైజంపర్ గిరీశనే రాజీవ్ ఖేల్ రత్న అవార్డు కూడా వరించే అవకాశాలు అధికంగా ఉన్నాయి. ఇదిలావుంటే, దేశంలోని అన్ని జాతీయ క్రీడా సమాఖ్యల నుంచి ఈ ఏడాది అర్జున అవార్డు కోసం దాదాపు 60 నామినేషన్లు, ద్రోణాచార్య అవార్డుకు 30 నుంచి 40 నామినేషన్లు అందినట్టు కేంద్ర క్రీడా శాఖ మంగళవారం వెల్లడించింది.
..................
గత ఏడాది ఉత్తమ వనే్డ క్రికెటర్‌గా ఐసిసి అవార్డు అందుకున్న
విరాట్ కోహ్లీ (ఫైల్ ఫొటో)