న్యూఢిల్లీ, ఏప్రిల్ 30: కౌలాలంపూర్‌లో ప్రారంభమైన మలేషియా గ్రాండ్ ప్రీ గోల్డ్-2013 బాడ్మింటన్ టోర్నమెంట్‌లో మంగళవారం తొలి రోజు భారత్‌కు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. పురుషుల సింగిల్స్ విభాగంలో ఆర్.ఎం.వి.గురుసాయిదత్, కె.శ్రీకాంత్, సమీర్ వర్మ తమతమ ప్రత్యర్థులపై విజయాలు సాధించి రెండో రౌండ్‌కు దూసుకెళ్లగా, ఆస్కార్ బన్సాల్, అభిమన్యు సింగ్ ఆరంభంలోనే తొలి రౌండ్‌ను అధిగమించడంలో విఫలమయ్యారు. అలాగే మహిళల సింగిల్స్‌తో పాటు పురుషుల డబుల్స్ క్వాలిఫికేషన్ రౌండ్‌లో బరిలోకి దిగిన భారత క్రీడాకారులెవరూ మెయిన్ డ్రాకు అర్హత సాధించలేకపోయారు. ఈ టోర్నీలో భారత బృందానికి సారథ్యం వహిస్తున్న టాప్ సీడ్ ‘తెలుగు తేజం’ పి.వి.సింధు బుధవారం జరిగే మహిళల సింగిల్స్ తొలి రౌండ్‌లో సింగపూర్ క్రీడాకారిణి చెన్ జియాయువాన్‌తో తలపడనుంది.
.......
సైనా నెహ్వాల్‌కు యుధ్‌వీర్ అవార్డు
హైదరాబాద్, ఏప్రిల్ 30: క్రీడా రంగంలో విశేష ప్రతిభ కనబరుస్తున్న భారత బాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్‌ను 22వ యుధ్‌వీర్ స్మారక అవార్డు వరించింది. హైదరాబాద్‌లో మంగళవారం జరిగిన ఒక కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ లోకాయుక్త జస్టిస్ బి.సుభాషణ్ రెడ్డి చేతుల మీదుగా ఆమెకు ఈ అవార్డును ప్రదానం చేశారు. ‘హిందీ మిలాప్’ దినపత్రిక వ్యవస్థాపకుడు, ప్రముఖ పాత్రికేయుడు, స్వాతంత్య్ర సమరయొధుడు స్వర్గీయ యుధ్‌వీర్ స్మారకార్థం 1991లో ఈ అవార్డును ఏర్పాటు చేశారు. ఈ అవార్డు కింద సైనాకు 50 వేల రూపాయల నగదు పురస్కారంతో పాటు ప్రశంసా పత్రాన్ని అందజేశారు.