ఆదిలాబాద్, ఏప్రిల్ 30: ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ది, సంక్షేమ పథకాల గురించి ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించడమే గాక, చైతన్యం తీసుకురావాల్సిన బాధ్యత కూడా సమాచార పౌర సంబంధాల అధికారులపై వుందని ఆ శాఖ కమిషనర్ దాన కిశోర్ అన్నారు. మంగళవారం రాష్ట్ర సచివాలయం నుండి వీడియోకాన్ఫరెన్స్ ద్వారా జిల్లా పౌర సంబంధాల అధికారులతో సమాచార శాఖ ద్వారా చేపడుతున్న కార్యక్రమాల గురించి ఆరాతీశారు. సమాచార పౌర సంబంధాల శాఖ ప్రభుత్వ పథకాలపై విస్తృతంగా ప్రచారం చేసినప్పుడే ఆ పథకాలకు సార్థకత ఏర్పడుతుందన్నారు. రాష్ట్రంలో పేద ప్రజలు, మహిళలు, ఎస్సీ, ఎస్టీలు, మైనార్టీలు, వృద్ధులు, వికలాంగుల సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతుందన్నారు. ప్రచారం ప్రభుత్వ శాఖల సమన్యంతో నిర్వహించాలన్నారు. ప్రచార రథాల ద్వారా కళాజాత కార్యక్రమాలు జిల్లా వ్యాప్తంగా నిర్వహించేందుకు ప్రతి జిల్లాకు రెండు వాహనాలను పంపించామని, మరో రెండు వాహనాలు సిద్దం అవుతున్నాయన్నారు. ఈ వాహనాల ద్వారా ప్రధాన ప్రాంతాల్లో ప్రచారం నిర్వహించాలని ఇందుకు గాను జిల్లా కలెక్టర్లు తగు ప్రణాళికలు సిద్దం చేసుకోవాలన్నారు. డిపిఆర్‌ఓ పూర్ణచంద్రం మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటికే రెండు వాహనాల ద్వారా కళా ప్రదర్శనలు రోజుకు రెండు చొప్పున ప్రదర్శించబడుతున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో సమాచార ఇంజనీర్ సారయ్య, సహాయ సమాచార ఇంజనీర్లు ఎం ఉమేష్, చంద్రరావు, ఉషారాణి, అధికారులు రవికుమార్, భీంకుమార్, ఎం అల్వార్‌చారి, ఇ విష్ణువర్థన్, సిబ్బంది పాల్గొన్నారు.
* వీడియో కాన్ఫరెన్స్‌లో కమిషనర్ దాన కిశోర్
english title:
dana kishore
Date:
Wednesday, May 1, 2013