ఇస్లామాబాద్, మే 1: పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ పట్ల అధికారులు అనుసరిస్తున్న వైఖరి పట్ల సైన్యం అసంతృప్తితో ఉందని పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ అష్ఫాక్ కయాని పేర్కొన్నారు. ముషారఫ్ సుమారు నాలుగేళ్ల తన స్వీయ ప్రవాస జీవితాన్ని ముగించుకొని ఈ నెల 11న జరుగనున్న ఎన్నికల్లో పోటీ చేయడానికి మార్చిలో స్వదేశానికి తిరిగి వచ్చారు. అయితే ఆయనపై కోర్టుల్లో కేసులు పెండింగ్‌లో ఉండటంతో ఎన్నికల అధికారులు ఆయనను ఎన్నికల్లో పోటీకి అనర్హునిగా ప్రకటించారు. దీంతో ముషారఫ్ న్యాయపరమైన చిక్కుల్లో చిక్కుకున్నాడని వార్తా పత్రికలు వ్యాఖ్యానించాయి.
ముషారఫ్‌కు ఎదురవుతున్న పరిస్థితులు ఆయన చేసిన తప్పిదాలకు అద్దం పట్టేవే అయినప్పటికీ ప్రజాస్వామ్యానికి, నియంతృత్వానికి మధ్య జరుగుతున్న దోబూచులాటకు తెరపడాలనే చైతన్యం ప్రజల్లో వచ్చిందని జనరల్ కయానీ పేర్కొన్నారు. ఆర్మీ ప్రధాన కార్యాలయంలో జరిగిన అమరవీరుల దినోత్సవంలో ప్రసంగిస్తూ జనరల్ కయానీ చేసిన ఈ వ్యాఖ్యలను పాకిస్తాన్ వార్తా పత్రికలు మొదటి పేజీల్లో ప్రచురించాయి.
66 ఏళ్ల పాకిస్తాన్ చరిత్రలో సగానికన్నా ఎక్కువ కాలం కుట్రల ద్వారా కాని తెరవెనుక నుంచి కాని దేశాన్ని సైన్యమే పాలించింది. పౌర ప్రభుత్వాలు అధికారంలో ఉన్న రోజుల్లో కూడా దేశ భద్రత, విదేశాంగ విధానాలను సైన్యమే నిర్ణయించింది. ప్రస్తుత ఆర్మీ చీఫ్ జనరల్ కయానీకి పౌర ప్రభుత్వాధినేతలతో సత్సంబంధాలు లేవు. మిలిటరీ మానవ హక్కుల రికార్డును ప్రశ్నించిన సుప్రీంకోర్టు జోక్యం పెరగడాన్ని కూడా ఆయన ఇష్టపడటం లేదు.
ముషారఫ్‌కు అవమానం పట్ల కయానీ ఆగ్రహం
english title:
s
Date:
Thursday, May 2, 2013