లేహ్/న్యూఢిల్లీ, మే 1: లడఖ్ ప్రాంతంలోని దౌలత్ బాగ్ ఓల్డి సెక్టార్‌లో భారత భూభాగంలో 19 కిలోమీటర్ల మేర చొచ్చుకు వచ్చిన చైనా సైన్యాలు అక్కడి నుంచి కదలడానికి ససేమిరా నిరాకరిస్తున్నాయి. అంతేకాక ఆ ప్రాంతంలో తిష్ఠ వేసిన సైనికులకు ట్రక్కుల ద్వారా క్రమం తప్పకుండా నిత్యావసర సరఫరాలు కూడా అందుతున్నాయి. ఈ సెక్టార్‌లో పెట్రోలింగ్ నిర్వహించే సమయంలో ఈ ప్రాంతంలో అయిదు టెంట్లు వేసుకున్న చైనా సైనికులు ప్రతిఘటించే ధోరణితోనే వ్యవహరించడమే కాకుండా అక్కడినుంచి కదలడానికి ససేమిరా అంటున్నాయని హోం శాఖకు సైన్యం పంపిన నివేదికలను బట్టి తెలుస్తోంది. దీంతో ఇరు దేశాల మధ్య ఈ సమస్యపై నెలకొన్న ప్రతిష్టంభన మూడు వారాలయినా పరిష్కారమయ్యే సూచనలు కనిపించడం లేదు. మంగళవారం చాషూల్‌లో మూడో దఫా బ్రిగేడియర్ స్థాయి సమావేశంలో సైతం ఈ సమస్యకు పరిష్కారం లభించక పోవడంతో భారత సైన్యం మానవ రహిత వాహనాలు (యుఏవిలు) ద్వారా ఈ ప్రాంతంలో గస్తీని ముమ్మరం చేసింది. ఇక్కడ తిష్ఠ వేసిన చైనా సైనికులకు పలు ట్రక్కుల్లో నిత్యావసర సరఫరాలు అందుతున్న విషయాన్ని కూడా మన సైనికులు గుర్తించారు. దౌలత్ బాగ్ ఓల్డి సెక్టార్‌లోని బుర్ట్సేకు దక్షిణంగా 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ప్రాంతంలో వేసుకున్న ఐదు టెంట్లలో సుమారు 40 మంది పీపుల్స్ లిబరేషన్ ఆర్మీకి చెందిన సైనికులు ఉన్నారు. ‘మీరు చైనా భూభాగంలో ఉన్నారు’ అనే ఒక బ్యానర్ కూడా అక్కడ కనిపిస్తోంది. దౌలత్ బాగ్ ఓల్డి ప్రాంతంలో తమ భూభాగంలోనిదేనని, దీనిపై హక్కును భారత్ వదులుకోవడం మంచిదని మంగళవారం జరిగిన ఇరు దేశాల బ్రిగేడియర్ స్థాయి సమావేశంలో చైనా వాదించింది.
అయితే ఇది రెండు దేశాల మధ్య కుదిరిన సరిహద్దు ఒప్పందాన్ని ఉల్లంఘించడమేనని, అందువల్ల ఈ ప్రాంతం నుంచి బేషరతుగా వైదొలగాల్సిందిగా పిఎల్‌ఏ అధికారులను భారత్ కోరింది.
పిఎల్‌ఏ సైనికులకు ట్రక్కుల్లో నిత్యావసర సరకులు సరఫరా
english title:
l
Date:
Thursday, May 2, 2013