విజయవాడ, మే 1: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆరోగ్యశ్రీ పథకాన్ని అడ్డం పెట్టుకుని కొన్ని ప్రైవేటు కార్పొరేట్ ఆసుపత్రులు అటు రోగుల నుంచి, ఇటు ప్రభుత్వం నుంచి లక్షలాది రూపాయలు దండుకుంటున్న వైనం తాజాగా వెలుగులోకి వచ్చింది. విజయవాడ సమీపంలోని పెనమలూరు మండలం కానూరు పంచాయతీ పరిధిలోని టైమ్ ఆసుపత్రి యాజమాన్యం నరాలకు సంబంధించిన వ్యాధికి చికిత్స నిమిత్తం తమ వద్దకు వచ్చిన ఓ రోగి నుంచి రెండు లక్షల, 70 వేలు గుంజటమే గాక ఆ రోగి చనిపోయిన తర్వాత నకిలీ ఫోటోలు ఫోర్జరీ డాక్యుమెంట్లతో ప్రభుత్వం నుంచి రూ.52 వేలు పొందటానికి ప్రయత్నిస్తూ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడింది. దీంతో పెనమలూరు పోలీసులు బుధవారం ఆ ఆసుపత్రి మేనేజింగ్ డైరెక్టర్ ఎం.హేమంత్‌కుమార్‌ను అరెస్టుచేసి ఈ బాగోతంతో సంబంధం ఉన్న మరికొందరి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఆరోగ్యశ్రీ పథకం పేరుతో ఆసుపత్రులు పలు అక్రమాలకు పాల్పడినట్లు గతంలో అభియోగాలు వచ్చినప్పటికీ కృష్ణా జిల్లాలో ఓ ఆసుపత్రి యజమాని అరెస్టు కావటం ఇదే ప్రథమం. ఈ దారుణానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
పశ్చిమ గోదావరి జిల్లా భీమవరానికి చెందిన కె.సన్యాసిరావు, దుర్గ దంపతుల కుమారుడు దుర్గాప్రసాద్ (19) కొంతకాలంగా నరాలకు సంబంధించిన వ్యాధితో బాధపడుతున్నాడు. మెరుగైన చికిత్స కోసం అతడిని గత ఏడాది మే 3వ తేదీన టైమ్ ఆసుపత్రిలో చేర్పించారు. వీరికి ఆరోగ్యశ్రీ కార్డు ఉన్నప్పటికీ మొదటి వారం రోజులు సాధారణ వార్డులో చికిత్స చేసి 15 రోజుల తర్వాత ఆరోగ్యశ్రీ వార్డుకు తరలించారు. చికిత్స సమయంలో రెండు లక్షల 70 వేల రూపాయలు దశల వారీగా పిండేశారు. గత ఏడాది జూలై 4వ తేదీన ఆ రోగి ఆసుపత్రిలో మరణించగా మృతదేహాన్ని అప్పగించడానికి మరో రూ.20 వేలు డిమాండ్‌చేసి వసూలు చేసినట్టు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది.
ఇదిలావుండగా, ఈ ఆసుపత్రి యాజమాన్యం మోసపూరితంగా మరికొంత సొమ్ము రాబట్టుకోడానికి తప్పుడు డాక్యుమెంట్లను సృష్టించి హైదరాబాద్‌లోని ఆరోగ్యశ్రీ హెల్త్ ట్రస్ట్‌కు పంపింది. వీటి ఆధారంగా రూ.52 వేలు మంజూరైంది. ఇంతలో ఈ విషయమై ట్రస్టు నుంచి నేరుగా సన్యాసిరావుకు సమాచారం అందింది. నివ్వెరపోయిన ఆ కుటుంబ సభ్యులు తమకు ఆరోగ్యశ్రీని వర్తింపచేయలేదని, పైగా 2.7 లక్షల రూపాయల ఫీజు వసూలు చేశారని లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. దీంతో జిల్లా కో-ఆర్డినేటర్ కనపర్తి సుధాకర్ రంగంలోకి దిగి బాధిత కుటుంబం నుంచి వసూలు చేసిన సొమ్ము వాపసు చేయాలంటూ టైమ్ ఆసుపత్రి యాజమానికి నోటీసు జారీ చేశారు. దీనిపై యాజమాన్యం మొత్తం సొమ్ము రోగి కుటుంబ సభ్యులకు వాపసు చేశామంటూ ఓ నకిలీ ఫోటో, ఫోర్జరీ సంతకాలతో కూడిన డాక్యుమెంట్లను గత ఫిబ్రవరి 28వ తేదీ పంపించారు. దీనిపై అనుమానం రావటంతో సుధాకర్ నేరుగా విచారణ ప్రారంభించారు. మరణించిన రోగి ఫోటో స్థానంలో ఆసుపత్రి క్యాంటీన్‌లో పని చేసే ఒక కార్మికుని ఫోటోతో పాటు డబ్బు ముట్టినట్లుగా కుటుంబ సభ్యుల సంతకాలతో కూడిన ఫోర్జరీ లేఖలు దాఖలు చేసినట్టు తేలింది. దీనిపై సుధాకర్ చేసిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి హేమంత్‌కుమార్‌ను అరెస్టు చేశారు. ఫోటోలో ఉన్న క్యాంటీన్ కార్మికుడితో పాటు ఫోర్జరీ సంతకాలు చేసిన ఇతర ఉద్యోగుల కోసం గాలిస్తున్నారు.
జిల్లాలో ఆరు కార్పొరేట్ ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ రద్దు
టైమ్ ఆసుపత్రిలో జరిగిన అక్రమాలు బట్టబయలు కావటంతో ఆ ఆసుపత్రికి ఆరోగ్యశ్రీ పథకాన్ని రద్దు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో జిల్లాలో మరో ఐదు ఆసుపత్రులకు కూడా ఈ పథకాన్ని రద్దు చేసింది. నియమ నిబంధనలకు విరుద్ధంగా ఆరోగ్యశ్రీ పథకం కింద గర్భసంచి శస్త్ర చికిత్సలు చేశారనే అభియోగంతో విజయవాడలోని ఆంధ్ర ఆసుపత్రి, చరితశ్రీ, ఉషా కార్డియాక్, ప్రవీణ్ కార్డియాక్, గుడివాడలోని అన్నపూర్ణ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులకు ఈ పథకాన్ని రద్దు చేశారు.
ఫోర్జరీ లేఖలతో పట్టుబడ్డ ‘టైమ్’ యాజమాన్యం ఎండి హేమంతకుమార్ అరెస్టు
english title:
a
Date:
Thursday, May 2, 2013