న్యూఢిల్లీ, మే 1: కేంద్ర మంత్రివర్గం బుధవారం ఆమోదించిన ఒక బిల్లు కింద ఇకపై అవినీతిపరుడైన ప్రభుత్వ అధికారి అక్రమంగా సంపాదించిన ఆస్తులను జప్తు చేయవచ్చు. అలాగే , సర్వీసులో ఉన్న, రిటైరయిన అధికారులను ప్రాసిక్యూట్ చేయడానికి అనుమతి పొందేందుకు నిర్ణీత కాలపరిమితిని సైతం నిర్ణయించారు. 1998 నాటి అవినీతి నిరోధక చట్టంలో ఈ మేరకు తీవ్రమైన మార్పులు తీసుకు వస్తూ రూపొందించిన సవరణ బిల్లుకు ప్రధాని మన్మోహన్ సింగ్ అధ్యక్షతన బుధవారం సమావేశమైన కేంద్రమంత్రివర్గం ఆమోదం తెలియజేసింది, ఆర్థిక మంత్రి పి చిదంబరం మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాల గురించి విలేఖరులకు తెలియజేసారు. అవినీతిపరుడైన ప్రభుత్వ అధికారి అక్రమంగా సంపాదించిన ఆస్తులను జప్తు చేసుకోవడానికి అవసరమైన నిబంధనలను బిల్లులో చేర్చినట్లు ఆయన చెప్పారు. అంతేకాకుండా సర్వీసులో ఉన్న, రిటైరయిన ప్రభుత్వ అధికారులను ప్రాసిక్యూట్ చేయడానికి సంబంధిత అధికారినుంచి అనుమతి పొందడానికి నిర్ణీత గడువును కూడా నిర్ణయించినట్లు, అనుమతి ఇవ్వడానికి, లేదా తిరస్కరించడానికి కారణాలను కూడా పేర్కొనాలని బిల్లులో స్పష్టంచేసినట్లు ఆయన అన్నారు. అలాగే ప్రభుత్వ అధికారి లంచం తీసుకోకుండా నిరోధించడంలో విఫలమైనందుకు వాణిజ్య సంస్థను కూడా జవాబుదారీగా చేసేందుకు వీలుగా ఒక నిబంధనను మొట్టమొదటిసారిగా ఈ బిల్లులో చేర్చారు. అంతేకాకుండా అంతర్జాతీయ నిబంధనలకు అనుగుణంగా వివిధ రకాల లంచాలకు సంబంధించి స్పష్టమైన నిర్వచనాన్ని కూడా బిల్లులో చేర్చినట్లు చిదంబరం చెప్పారు. రిటైరయిన ఉద్యోగులకు ఈ సవరణ బిల్లు ఊరట కల్పించేదేనని పదవిలో ఉండగా తెలిసో, తెలియకో తీసుకునే నిర్ణయాలకు సంబంధించి సంబంధిత అధికారినుంచి ముందస్తు అనుమతి తీసుకోకుండా వారిని ప్రాసిక్యూట్ చేయడానికి దీనివల్ల వీలు ఉండదు. ప్రస్తుతం రిటైరయిన అధికారులకు ప్రాసిక్యూషన్‌కు అనుమతి రూపంలో ప్రభుత్వ రక్షణ లేదు. అయితే రిటైరయిన ఉద్యోగులకు కూడా ఇలాంటి రక్షణను వర్తింపజేయాల్సిన అవసరముందని భావించడంతో ఇప్పుడు ఈ మార్పు చేసారు.
నిర్ణీత కాల వ్యవధిలో ప్రస్తుత, మాజీల ప్రాసిక్యూషన్‌కు అనుమతి కొత్త బిల్లుకు కేబినెట్ ఆమోదం
english title:
a
Date:
Thursday, May 2, 2013