హైదరాబాద్, మే 1: మంత్రి ధర్మాన ప్రసాదరావుకు ప్రాసిక్యూషన్ అనుమతిపై హైకోర్టులో లభించిన ఊరట ఇతర మంత్రులకు కూడా వర్తిస్తుందా! అన్న అంశంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ధర్మాన కేసుకూ, అభియోగాలు ఎదుర్కొంటున్న ఇతర కేసులకూ మధ్య పొంతనపై న్యాయ నిపుణులు చర్చకు తెరతీస్తున్నారు. జగన్ అక్రమాస్తుల కేసు, ఓబుళాపురం గనుల తవ్వకాలు, వాన్‌పిక్ వంటి కేసుల్లో అభియోగాలు ఎదుర్కొంటున్న వారిలో ఆరుగురు మంత్రులు ఉన్నారు. వారిలో ఇప్పటికే మోపిదేవి వెంకటరమణను సిబిఐ అరెస్టు చేయగా, ధర్మాన ప్రసాదరావు, సబితా ఇంద్రారెడ్డిపై కూడా చార్జిషీటు నమోదైంది. వారిలో ధర్మాన ప్రసాదరావును ప్రాసిక్యూట్ చేసేందుకు సిబిఐ ప్రభుత్వ అనుమతి కోరగా, మంత్రివర్గం అనుమతి నిరాకరించడం, తరువాత ప్రభుత్వ అనుమతి అవసరం లేదంటూ సిబిఐ కోర్టు తీర్పు ఇవ్వడంతో ప్రభుత్వం డోలాయమానంలో పడింది. అయితే ఈ తీర్పుపై ధర్మాన హైకోర్టును ఆశ్రయించగా అప్పుడూ.. ఇప్పుడూ ఆయన మంత్రిగానే ఉన్నందున ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వ అనుమతి తప్పనిసరి అని హైకోర్టు చెప్పడంతో ముందుగా ధర్మాన ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఇప్పుడు ఆ తీర్పు ప్రభావం అభియోగాలు ఎదుర్కొంటున్న ఇతర మంత్రులు, అధికారులపై ఎలా ఉంటుందన్నది ప్రశ్నార్ధకంగా మారుతోంది. గతంలో మోపిదేవి అరెస్టు సమయంలో సిబిఐ ప్రాసిక్యూషన్‌కు అనుమతి కోరలేదు. అరెస్టు చేసిన వెంటనే మోపిదేవి రాజీనామా చేయడం, దానిని ముఖ్యమంత్రి ఆమోదించడంతో ప్రాసిక్యూషన్‌కు అనుమతి అవసరం లేకుండా పోయింది. ఇప్పుడు మాత్రం ధర్మాన ప్రసాదరావు, సబితా ఇంద్రారెడ్డి మంత్రులుగానే కొనసాగుతున్నారు. అందుకే వారిని విచారించేందుకు ప్రభుత్వ అనుమతి చర్చకు తావిస్తోంది. అనుమతి అక్కరలేదన్న కిందికోర్టు తీర్పును హైకోర్టు కొట్టివేయడంతో ధర్మానతోపాటు సబితకు కూడా ఊరట లభిస్తున్నట్లు తెలుస్తోంది.
అయితే ఇక్కడ కేసుల వివరాలు కూడా దృష్టిలో పెట్టుకోవాల్సి ఉంటుందన్న అభిప్రాయాలను న్యాయ నిపుణులు తెరపైకి తీసుకువస్తున్నారు. భూములకు సంబంధించిన నిర్ణయాలకు, గనులపై తీసుకున్న నిర్ణయాలకు మధ్య తేడా ఉంటుందని, అదే ప్రాసిక్యూషన్‌కు అనుమతి ఇచ్చే అంశంపై ఆధారపడి ఉంటుందని అంటున్నారు. భూములపై మంత్రివర్గంలో మాత్రమే నిర్ణయం తీసుకోవాల్సి ఉన్నందున దాని ప్రభావం ప్రాసిక్యూషన్‌కు అనుమతిపై ఉంటుందని, గనుల విషయంలో అది వర్తించే అవకాశాలు తక్కువగా ఉంటాయని వారు అభిప్రాయపడుతున్నారు.
ఇలా ఉండగా, మంత్రులకు ప్రాసిక్యూషన్‌పై అనుమతి తిరస్కరించిన నేపథ్యంలో అభియోగాలు ఎదుర్కొంటున్న అధికారులు కూడా చర్చకు దిగుతున్నారు. ఒక శాఖలో పనిచేసే మంత్రులకు ప్రాసిక్యూషన్‌పై అనుమతి నిరాకరిస్తున్న సమయంలో అదే శాఖలో అధికారులుగా పనిచేసిన తమను ప్రాసిక్యూట్ చేసేందుకు అనుమతి ఇవ్వడం సరికాదన్న భావాన్ని వారు వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయాన్ని ముఖ్యమంత్రి వివరించాలని కూడా వారు భావిస్తున్నట్లు సమాచారం.
ధర్మాన కేసులో హైకోర్టు తీర్పుపై న్యాయ నిపుణుల భిన్నాభిప్రాయాలు మోపిదేవి, సబిత కేసులు భిన్నమైనవంటూ వాదన అధికారులకూ ప్రాసిక్యూషన్ అనుమతి తప్పనిసరి
english title:
i
Date:
Thursday, May 2, 2013