హైదరాబాద్, మే 1 : రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలకు మరో పర్యాయం రిజర్వేషన్ల ‘తకరారు’ పెద్ద సమస్యగా మారే అవకాశాలున్నాయి. రిజర్వేషన్ల కారణంగా ఏర్పడ్డ న్యాయపరమైన చిక్కుల వల్ల గత రెండేళ్ల నుండి ‘స్థానిక’ ఎన్నికలు జరగలేదు. స్థానిక సంస్థలకు ఎన్నికలు జరుగుతాయనుకుంటున్న నేపథ్యంలో మొత్తం జనాభాలో ఎస్‌సి, ఎస్‌టిల జనాభా నిష్పత్తికి అనుగుణంగా రిజర్వేషన్లు నిర్ణయించాలనుకుంటే 2006లో అమలు చేసిన రిజర్వేషన్ల సంఖ్యను తగ్గించాల్సిన పరిస్థితి తలెత్తింది. రిజర్వేషన్ల సీట్లను తగ్గిస్తే పరిస్థితి ఏ విధంగా ఉంటుందన్నది చర్చనీయాంశంగా మారింది. 2006 స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎస్‌సిలకు 18.3 శాతం స్థానాలను రిజర్వ్ చేయగా తాజా జనాభా లెక్కల ప్రకారం ఎస్‌సిల జనాభా శాతం 16.4గా నమోదైంది. అలాగే గత ఎన్నికల్లో ఎస్‌టిలకు 8.25 శాతం స్థానాలను రిజర్వ్ చేయగా ప్రస్తుతం ఎస్‌టిల జనాభా మొత్తం జనాభాలో 6.99 శాతంగా నమోదైంది. జనాభా ప్రాతిపదికన మాత్రమే రిజర్వేషన్లు చేయాల్సి వస్తే అప్పుడు రిజర్వ్ చేసిన సీట్ల కంటే ఈ వర్గాలకు తక్కువ సీట్లను రిజర్వ్ చేయాల్సి వస్తుంది. ఇక వెనుకబడిన వర్గాల (బిసి) విషయానికి వస్తే వాస్తవంగా బిసిల జనాభా ఎంత ఉందో ఇప్పటికీ సరైన లెక్కలు లేవు. రాష్ట్ర బిసి కమిషన్ సేకరించిన వివరాలు కూడా ‘అందాజా’ (దాదాపు) లెక్కలు మాత్రమే. అవి శాస్ర్తియంగా సేకరించిన లెక్కలు కావన్న ఆరోపణలున్నాయి. 2006లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో బిసిలకు 34 శాతం స్థానాలను రిజర్వ్ చేశారు. ఇప్పుడు ఎన్ని సీట్లను రిజర్వ్ చేస్తారన్నది ప్రశ్నార్థంగా మారింది. ఈ పరిస్థితిలో ఎస్‌సి, ఎస్‌టి, బిసిలకు కేటాయించే స్థానాల సంఖ్య తగ్గుతుందా, పెరుగుతుందా అన్నది చర్చనీయాంశంగా మారింది. తాజాగా ఖచ్చితమైన జనాభా వివరాలు వెల్లడి కావడంతో రాష్ట్రంలో పంచాయతీరాజ్ సంస్థలకు జరగాల్సిన ఎన్నికల రూపురేఖలు మారిపోతున్నాయి. 2013 జూన్‌లో పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తామని ఇటీవలే ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రకటించారు. ఇందుకు అనుగుణంగా ఎన్నికల ఏర్పాట్ల కోసం పంచాయతీరాజ్ శాఖ, రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. జనాభా వివరాలు వెల్లడైన నేపథ్యంలో స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించేందుకు ఏయే సీట్లను రిజర్వ్ చేస్తారో నిర్ణయించేందుకు రెండు, మూడు నెలల సమయం పడుతుందని భావిస్తున్నారు. అంటే రిజర్వేషన్ల ఖరారు కారణంగా ఎన్నికల నిర్వహణ మరో మూడు,నాలుగు నెలల పాటు వాయిదా పడే అవకాశం ఉందని తెలుస్తోంది.
2006లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో 2001 జనాభా లెక్కలకు అనుగుణంగా రిజర్వేషన్లను ఖరారు చేశారు. అవే లెక్కలను ఇప్పుడు కూడా పరిగణంలోకి తీసుకుని ఎన్నికలు నిర్వహించాలని ఒకవైపు ప్రభుత్వం, మరోవైపు రాష్ట్ర ఎన్నికల కమిషన్ భావించడంతో ఇందుకు అనుగుణంగా కసరత్తు మొదలైంది. ఈ కసరత్తు కొనసాగుతుండగానే 2011 జన గణన వివరాలను కేంద్రం మంగళవారం ప్రకటించింది. మన రాష్ట్రానికి సంబంధించి జిల్లాల వారీగా జనాభా లెక్కల వివరాలు అందుబాటులో ఉన్నాయి. అయితే గ్రామస్థాయి వివరాలు ఇప్పటివరకు వెల్లడించలేదు. ఇవి వెల్లడయితేనే గ్రామ పంచాయతీల్లో సభ్యులు, సర్పంచ్‌లతో పాటు, ఎంపిటిసిలకు రిజర్వేషన్లు నిర్ణయించేందుకు వీలుంటుంది. అలాగే మండలస్థాయి జనాభాను పరిగణనలోకి తీసుకుని జడ్‌పిటిసి స్థానాలను రిజర్వ్ చేసేందుకు వీలవుతుంది. ఈ వివరాలు మరో వారంలోగా రాష్ట్రంలోని సెన్సస్ శాఖ వెల్లడించే అవకాశం ఉందని సంబంధిత అధికారి ఒకరు ‘ఆంధ్రభూమి’ ప్రతినిధితో బుధవారం చెప్పారు. మళ్లీ న్యాయ పోరాటం తప్పదా?
మా రాజమండ్రి ప్రతినిధి ఇలా తెలియచేస్తున్నారు. పంచాయతీ సర్పంచ్ పదవుల నుండి వార్డు సభ్యుల పదవుల వరకు ఇప్పటికే పూర్తయిన రిజర్వేషన్లను మళ్లీ కొత్త జనాభా లెక్కల ప్రకారం మార్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎస్‌సి, ఎస్‌టిలకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు ఖరారు చేసి, బిసిలకు ఓటర్ల సంఖ్య ఆధారంగా రిజర్వేషన్లు చేస్తే మళ్లీ న్యాయపోరాటం మొదలయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే పంచాయతీల వారీగా ఓటర్ల జాబితాలు సిద్ధంగా ఉన్నాయి. అధికారుల నియామకం, పోలింగ్ బూత్‌ల ప్రణాళిక సిద్ధంగా ఉంది. బదిలీలపై ఆంక్షలను ప్రభుత్వం ఎత్తివేయడంతో ఇప్పటికే ఎన్నికల నిర్వహణకోసం నియామకం అయిన ఉద్యోగుల స్థానంలో కొత్త వారిని మళ్లీ నియమించాల్సి ఉంటుంది. వాస్తవ పరిస్థితి పరిశీలిస్తే జూన్‌లో ఎన్నికలు జరగడం కష్టమనిపిస్తోంది.
జనాభా లెక్కలతో కొత్త చిక్కులు ‘పంచాయతీ’లో రిజర్వేషన్ల ‘తకరారు’ జూన్‌లో ఎన్నికలు అనుమానమే! వారంలోగా గ్రామస్థాయి వివరాల విడుదల కసరత్తు చేస్తున్న సెన్సస్ డైరెక్టరేట్
english title:
k
Date:
Thursday, May 2, 2013