తిరుపతి/నాగలాపురం, మే 2: నాగలాపురం మండలం చిన్నపట్టు గ్రామంలో ఇటుకబట్టీ యజమాని సుధాకర్ యాదవ్ వద్ద గత నాలుగు నెలలుగా వెట్టిచారికి చేస్తున్న ఒరిస్సా రాష్ట్రం జహంగీరు జిల్లా దొండమూడు అనే గ్రామానికి చెందిన 42 మంది కూలీలకు గురువారం విముక్తి లభించింది. ఈ కూలీల సమస్యను తెలుసుకున్న ఐజెఎం అనే స్వచ్ఛంద సేవాసంస్థ రాష్ట్ర ప్రిన్సిపల్ సెక్రటరీకి సమాచారం అందించింది. ఈ మేరకు ఆయన జిల్లా కలెక్టర్ సాల్మన్ ఆరోగ్యరాజ్‌ను అప్రమత్తం చేశారు. పోలీసుల సహకారంతో గురువారం రెవెన్యూ అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు ఇసుకబట్టీపై దాడి చేశారు. కూలీలకు విముక్తి కల్గిస్తూ 15 మంది మగవాళ్లు, 13 మంది ఆడవాళ్లు, 14 చిన్నపిల్లలతో కలిపి సుమారు 42 మంది కూలీలను తిరుపతి ఆర్‌డిఓ కార్యాలయానికి తరలించారు. పిల్లల్లో 8 ఏళ్ల నుండి 14 ఏళ్ల వయస్సున్నవారు ఉన్నారు. ఈ సందర్భంగా ఇటుకబట్టీ యజమాని యాదవ్ మాట్లాడుతూ తాను కూలీలకు పెద్ద మొత్తంలో నగదు ఇస్తున్నానని, ఆ నగదు మధ్యవర్తి తినేశాడని చెప్పారు. ఇందుకు కూలీలు కూడా ఈ విషయాన్ని అంగీకరించారు. మధ్యవర్తిపై చర్యలు తీసుకోవాలని, తమకు వెట్టి నుండి విముక్తి కల్గించాలని కోరారు. వారానికి 150 రూపాయలు తమలో ఒక్కొక్కరికి చెల్లించడందారుణమన్నారు. తమకు ఎటువంటి రక్షణ లేక యాదవ్ వద్ద వెట్టిచారికి చేస్తున్నామన్నారు. ఈ సందర్భంగా తిరుపతి ఆర్‌డిఓ రామచంద్రారెడ్డి కూలీలను వారి స్వగ్రామానికి చేర్చేందుకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.
దోపిడీ దొంగల స్వైర విహారం
లక్షా 50వేల నగదు, బంగారం చోరీ
వి.కోట, మే 2: గ్రామ సమీపంలోని పొలాల వద్ద ఉన్న ఇంటిపై దోపిడీ దొంగలు బుధవారం రాత్రి స్వైర విహారం చేసి పెద్ద ఎత్తున బంగారం, నగదు దోచుకున్న సంఘటన సంచలనం సృష్టించింది. బాధితుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. అన్నవరం సమీపంలో వ్యవసాయ పొలాల వద్ద వెంకట్రామిరెడ్డి కుటుంబం ఇల్లు కట్టుకొని నివసిస్తున్నారు. బుధవారం రాత్రి 9.30ప్రాంతంలో ఐదుగురు దొంగలు ముఖాలకు ముసుగులు ధరించి కత్తులతో బెదిరించి దోపిడీకి పాల్పడ్డారు. నలుగురు యువకులు ఇంటిలోకి హఠాత్తుగా ప్రవేశించారు. వెంకట్రామిరెడ్డి, అతని భార్య రాధమ్మ, కుమారుడు జయప్రకాష్, కోడలు హేమావతి, కుమార్తె బిందు, మనవరాలు జాహ్నవిల కాళ్లు చేతులను తాళ్లతో కట్టి వేర్వేరు గదుల్లో నిర్బంధించారు. అనంతరం ఇంటిలోని బీరువాలను, ఇతర వస్తువులను ధ్వంసం చేశారు. మహిళల మెడలోని బంగారు గొలుసులతో పాటు తాళిబొట్టులను కూడా దోచుకున్నారు. సుమారు లక్షా 50వేల రూపాయల నగదు, 250గ్రాముల బంగారం, కేజీ వెండి చోరీకి గురైనట్లు బాధితులు వాపోయారు. ఇంటిలో ఎక్కడ నగదు దాచారో చెప్పకపోతే చిన్నారి పాపను చంపుతామని బెదిరించి దారుణంగా ప్రవర్తించారని బాధితులు రోదించారు. ఇంటిముందు ద్విచక్రవాహనంలో పెట్రోలు, గాలి తీసివేశారు. ఇంటిలోకి చొరబడగానే సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకొనికుటుంబ సభ్యుల ముఖాలకు ముసుగులువేసి ముందు జాగ్రత్త చర్యలుపాటించారు. సుమారు రెండు గంటల పాటు ఇంటిలోనే గడిపిన దొంగలు తెలుగుభాష మాట్లాడినట్లు బాధితులు తెలిపారు. సంఘటనా స్థలాన్ని మదనపల్లె డిఎస్పీ రాఘవరెడ్డి, గంగవరం సిఐ చంద్రశేఖర్, ఎస్సై శివప్రసాద్‌రెడ్డి పరిశీలించారు. అదేవిధంగా క్లూస్‌టీమ్, డాగ్‌స్క్వాడ్‌లు ఇంటిని క్షుణ్ణంగా పరిశీలించాయి. నిందితుల ఊహా చిత్రాల ద్వారా త్వరలో వారిని పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.
ఖరీఫ్ సాగుకు సమాయత్తం
ఎరువులు, విత్తనాల కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు
మదనపల్లె, మే 2: ఖరీఫ్ సాగుకు రైతులకు అవసరమయ్యే ఎరువులు, విత్తనాల కోసం జిల్లా వ్యవసాయ అధికారులు సన్నాహాలు ప్రారంభించారు. జిల్లాలో ఈ ఏడాది ఖరీఫ్‌లో పంటల సాగు వివరాలతో అంచనాలు రూపొందించి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపేందుకు జిల్లాలోని 66 మండలాల వ్యవసాయాధికారులు అంచనాలు తయారుచేసి ఇవ్వాలని ఆదేశాలు అందాయి. అయితే జిల్లా వ్యవసాయ శాఖ అంచనా కంటే మరింత సాగు విస్తీర్ణం పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. జిల్లాలోని చిత్తూరు, మదనపల్లె డివిజన్‌లో పూర్తిగా, తిరుపతి డివిజన్‌లో కొన్ని మండలాల్లో మాత్రమే వర్షాధారిత వేరుశనగ పంట సాగవుతుంది. గత ఏడాదికంటే ఈ ఏడాది ఋతుపవనాలు అనుకూలించే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ ఇప్పటికే జిల్లా అధికారులకు సంకేతాలు ఇచ్చింది. సకాలంలో వర్షాలు జిల్లాను తాకితే ఖరీఫ్ సాగు వేగవంతమవుతుంది. లేకుంటే ఖరీఫ్ ప్రణాళికలో అధికారులు రూపొందించిన అంచనాలు తారుమారయ్యే అవకాశం ఉంది. జిల్లాలో పశ్చిమ కరవుప్రాంతాల రైతులు ప్రభుత్వం అందించే వేరుశనగ విత్తనాల కోసం ఎదురుచూస్తుండగా, రబీలో సాగుచేసి అధిక దిగుబడులు చేసుకున్న తూర్పు మండలాల్లో ఆ పరిస్థితి కన్పించలేదు. అయితే ఇటీవల అరకొరగా కురుస్తున్న తొలకరి జల్లులకు ఖరీఫ్‌కు సన్నద్ధమవుతున్నారు. ఇప్పటికే చేలలో దుక్కులు చేసుకుంటున్నారు. ఇందుకు భిన్నంగా పశ్చిమ రైతాంగం వర్షం కోసం, విత్తనాల కోసం ఎదురుచూస్తోంది. ఇప్పటికే చిత్తూరు, మదనపల్లె డివిజన్‌లోని ఖరీఫ్ రైతులు విత్తనాల కోసం అనే్వషణ ప్రారంభించారు. కాగా, జిల్లాలో రానున్న ఖరీఫ్‌లో వరి, వేరుశనగ తదితర పంటలు 2.32లక్షల హెక్టార్లలో సాగు అవుతాయని జిల్లా వ్యవసాయశాఖ అంచనాలు వేసింది. గత ఏడాదిని బేరీజు చేసుకుని ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల ఆధారంగా 2.32లక్షల హెక్టార్లలో సాగు అవుతుందని అంచనాలు వేస్తున్నారు. గత ఏడాది 2.05లక్షల హెక్టార్లలో ఖరీఫ్‌లో వివిధ పంటల సాగు అయింది. గత ఏడాది ఖరీఫ్‌లో వేరుశనగ పంటకంటే ఈ ఏడాది అదనంగా పదిశాతం దిగుబడి పెరుగుతుందని వ్యవసాయశాఖ అంచనా. అయితే సబ్సిడీ విత్తనాలు జిల్లాకు 1.05లక్షల క్వింటాళ్ళు అవసరం అవుతాయని కూడా అంచనాలు వేస్తోంది. ఇదిలావుండగా 2.32లక్షల హెక్టార్లలో అన్నిరకాల పంటల సాగుకు తగిన మోతాదులో ఎరువులు అందించేందుకు కూడా అంచనాలు వేస్తున్నారు. ఈ ఏడాది 83,450మెట్రిక్ టన్నులు అవసరమన్న అంచనాలు వేస్తున్నారు. అయితే గత ఏడాది సకాలంలో జిల్లాకు ఎరువులు వచ్చినా రైతులకు అందించడంలో వ్యవసాయశాఖ విఫలమైంది.
ఇద్దరు మోటార్ సైకిళ్ల దొంగలు అరెస్టు
* 35 ద్విచక్ర వాహనాలు స్వాధీనం
* నకిలీ పోలీసు అరెస్టు
తిరుపతి, మే 2: తిరుపతి నగరంతో పాటు పరిసర ప్రాంతాల్లో ద్విచక్ర వాహనాలను చోరీ చేస్తూ పోలీసుల కన్నుగప్పి తప్పించుకుని తిరుగుతున్న ఇద్దరు నేరస్తులను అరెస్టు చేసి వారి వద్ద నుండి 18 లక్షల రూపాయలు విలువ చేసే 35 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు తిరుపతి ఎఎస్‌పి ఉమామహేశ్వర్‌శర్మ వెల్లడించారు. గురువారం ఆయన స్థానిక విలేఖర్లతో మాట్లాడుతూ ఈ ముఠాకు చెందిన రూరేష్ అనే వ్యక్తి పరారీలో ఉన్నాడని తెలిపారు. పట్టుపడిన నేరస్తుల్లో పుత్తూరు మండలం నందిమండలం గ్రామానికి చెంది ప్రస్తుతం తిరుపతి అశోక్‌నగర్‌లో నివాసం వుంటున్న కృష్ణయ్య తన మోటార్ సైకిళ్లపై పోలీసు అనే అక్షరాలు రాసుకుని విద్యార్థుల ముందు కానిస్టేబుల్‌గా బెదిరించి డబ్బులు వసూలు చేసేవాడన్నారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా వున్నాయి. తిరుపతి అశోక్‌నగర్‌కు చెందిన వేణుగోపాల్ (36), అరవ కృష్ణయ్య అలియాస్ బీమారావు (38)లు గత రెండేళ్లుగా తిరుపతి, కడప జిల్లాల్లో 35 ద్విచక్ర వాహనాలు చోరీ చేశారని ఎఎస్‌పి ఉమామహేశ్వర్‌శర్మ తెలిపారు. బుధవారం సాయంత్రం 5 గంటలకు ఎల్‌ఐసి రోడ్డులోని ఎమరాల్డ్ కాలేజి ఎదుట అనుమానాస్పద స్థితిలో తచ్చాడుతున్న వీరిని తమ సిబ్బందిని పట్టుకున్నారన్నారు. వీరిని విచారించడంతో 35 మోటార్ సైకిళ్లను చోరీ చేసినట్లు అంగీకరించారన్నారు. కృష్ణయ్య తాను నడిపే మోటార్ సైకిల్‌పై పోలీసు అని రాసుకుని విద్యార్థులను బెదిరించేవాడన్నారు. తాను కానిస్టేబుల్‌నని సీజ్ చేసిన మోటార్ సైకిళ్లను మీకు అమ్ముతానని రికార్డులు కూడా తరువాత ఇస్తానని నమ్మించి వాహనాలను వారికి విక్రయించేవాడన్నారు. వీరి మాటలు నమ్మి అనేక మంది విద్యార్థులు మోటార్ సైకిళ్లను కొన్నట్లు కూడా విద్యార్థులు తెలిపారన్నారు. మరో గమనించదగ్గ విషయం ఏమిటంటే పుత్తూరు పోలీసులపై తిరగబడి గతంలో అసాల్ట్ కేసులో కూడా ముద్దాయిగా ఉన్నాడన్నారు. తాగుడు, వ్యభిచారం, జల్సాలకు అలవాటు పడి ఇటువంటి నేరాలు చేసినట్లు విచారణలో తేలిందన్నారు. వీరిని అరెస్టు చేయడంలోనూ, వాహనాలను తిరిగి స్వాధీనం చేసుకునే విషయాలు ఎస్‌పి రాజశేఖర్‌బాబు నేతృత్వంలో తన పర్యవేణలో క్రైమ్ డిఎస్‌పి ఎంవిఎస్ స్వామి, సిఐ రామచంద్రారెడ్డి, ఎస్‌ఐ ప్రభాకర్‌రెడ్డి, చంద్రశేఖర్‌ఫిళ్లై, వెస్టు ఎస్‌ఐ ధర్మేంద్రరాజు, ఎఎస్‌ఐ శ్రీనివాసుల రాజు, కె రాధాకృష్ణలు ఎంతో పకడ్బందీ ప్రణాళికలు రూపొందించారన్నారు. ఇక సిబ్బంది మురళి, మునిరాజా, శ్రీనివాసులు, మున్వర్‌బాషా, హుస్సెన్, రామయ్య, ప్రకాష్, ప్రసాద్, వేణుగోపాల్‌రెడ్డి, శేఖర్, చిరంజీవిలు, లవకుమార్, గంగాధరం, పిఆర్‌ఓ నాగరాజులు సహకరించారన్నారు. వీరికి శాఖాపరమైన రివార్డులు అందజేయాలని డిఎస్‌పి ఎంవిఎస్ స్వామి సిఫార్సు చేశారన్నారు.
మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్‌కు ఘన స్వాగతం
రేణిగుంట, మే 2: రేణిగుంట విమానాశ్రయంలో భారత మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్‌కు గురువారం ఘనస్వాగతం లభించింది. జెట్ ఎయిర్‌వేస్ విమానంలో మధ్యాహ్నం 1 గంటకు విమానాశ్రయం చేరుకున్న ఆయన విలేఖరులతో మాట్లాడుతూ చాలా రోజుల తరువాత శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వచ్చానని చెప్పారు. మొదటిసారి తన కుమారుడు రోహన్ గవాస్కర్‌తో కలసి శ్రీవారిని దర్శించుకోవడానికి రావడం చాలా ఆనందంగా వుందన్నారు. ఐపిఎల్ గురించి విలేఖరులు ప్రస్తావించగా నోకామెంట్ అంటూ సమాధానం దాటవేశారు. అనంతరం తన కుమారుడితో కలసి తిరుమలకు బయలుదేరి వెళ్లారు. వీరికి స్వాగతం పలికిన వారిలో వైఎస్‌ఆర్‌సిపి నాయకులు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, అభిమానులు, క్రీడాకారులు ఉన్నారు.
గజ వాహనంపై ఊరేగిన పద్మావతి అమ్మవారు
తిరుచానూరు, మే 2: తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారు గజవాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారి జన్మనక్షత్రమైన ఉత్తరాషాడ నక్షత్రం సందర్భంగా ఆలయ అర్చకులు గురువారం ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఇందులో భాగంగా అమ్మవారిని ఉదయం సుప్రభాత సేవతో మేల్కోలుపు చేసి నిత్యార్చన, సహస్రనామార్చన తదితర పూజాది కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం అమ్మవారి మూలమూర్తికి వేడుకగా అభిషేకం చేశారు. ఉదయం 10 గంటల సమయంలో అమ్మవారిని శ్రీకృష్ణస్వామి అమ్మవారి ఆలయానికి తీసుకువచ్చి లక్ష్మిపూజను కన్నుల పండుగా నిర్వహించారు. మధ్యాహ్నం 3 గంటల సమయంలో అమ్మవారి ఆలయ సమీపంలోని గుడితోటకు తీసుకువచ్చి పాలు, పెరుగు, వెన్న, తేనె, నెయ్యి తదితర సుగంధద్రవ్యాలతో స్నపన తిరుమంజనం చేశారు. అనంతరం అలంకార భూషితురాలైన అమ్మవారు తనకు ఎంతో ప్రీతిపాత్రమైన గజవాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. ఈ కార్యక్రమంలో జెఇఓ వెంకట్రామిరెడ్డి, డిప్యూటీ ఇఓ భాస్కర్‌రెడ్డి, ఏఇఓ నాగరత్నం, సూపరింటెండెంట్ శేషాద్రిగిరి, ఇతర ఆలయ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
మదనపల్లెలో హత్య
మదనపల్లె, మే 2: మదనపల్లె పట్టణంలోని ఓ ప్రింటింగ్‌ప్రెస్‌లో వర్కర్‌గా పనిచేస్తున్న కేశవమూర్తి(40) గురువారం హత్యకు గురయ్యాడు. స్థానిక ఆర్‌అండ్‌బి అతిధిగృహం ఆవరణలో శరీరమంతా గాయాలు, బట్టలకు రక్తపుమరకలు ఉండి శవమై కన్పించాడు. స్థానికులు గుర్తించి వన్‌టౌన్ పోలీసులకు సమాచారం అందించడంతో హత్యా ఉదంతం వెలుగులోకి వచ్చింది. పట్టణంలోని మోతినగర్‌లో నివాసముంటున్న బెడదూరి కేశవమూర్తి అప్పారావువీధిలోని ఓ ప్రింటింగ్‌ప్రెస్‌లో వర్కర్‌గా పనిచేస్తున్నాడు. ఇతను బుధవారం ఉదయం ప్రెస్ యజమాని రావడంతో వెళ్ళాడు. గురువారం సాయంత్రం హత్యకు గురైనట్లు కుటుంబసభ్యులకు తెలియడంతో పరుగున సంఘటన స్థలానికి చేరుకున్నారు. కేశవమూర్తికి మద్యం సేవించే అలవాటు ఉన్నప్పటికీ ఎవరిజోలికి వెళ్ళేవాడు కాదని, డబ్బులు దుబారాచేసే వ్యక్తికాదని మృతుని సోదరి రేణుక పోలీసులకు వివరించింది. తన అన్నను ఎవరో కావాలనే హత్యచేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేసింది. హెడ్ కానిస్టేబుల్ రమణ మృతుని వివరాలు, సంఘటనకు గల కారణాలపై ఆరాతీశారు. ప్రస్తుతం హత్యకేసుగా నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కేశవమూర్తి మృతదేహాన్ని మదనపల్లె ప్రభుత్వాసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
వకుళామాతా భవనంలో గ్యాస్ లీక్
ఆంధ్రభూమి బ్యూరో
తిరుపతి, మే 2: తిరుమలలో పోటు వర్కర్లు బస చేసే వకుళామాతా విశ్రాంతి భవనంలో గురువారం సాయంత్రం గ్యాస్ లీకైంది. ఆ భవనానికి సమీపంలోనే అగ్నిమాపక సిబ్బంది ఉండటంతో వెంటనే అక్కడకు చేరుకుని గ్యాస్ లీకేజిని నియంత్రించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
మూగ యువతిపై అత్యాచార యత్నం
* కేసు నమోదు
కుప్పం, మే 2: కుప్పం నియోజకవర్గ పరిధిలోని రామకుప్పం మండలం రాజుపేటలో ఒక మూగ యువతిపై ఆత్యాచార యత్నం జరిగిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ విషయమై బాధితురాలికి సహాయంగా వైఎస్‌ఆర్‌సిపి జిల్లా మహిళా అధ్యక్షురాలు గాయత్రిదేవి ఎస్పీని సంప్రదించడంతో అత్యాచార యత్నం కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. వివరాల్లోకి వెళ్తే రామకుప్పం మండలం రాజుపేటకు చెందిన ఓ మూగ యువతి (22) తన ఇంటిపక్కన వెళ్తుండగా అదే గ్రామ మాజీ సర్పంచ్ వెంకటేష్ పీకల వరకు మద్యం సేవించి ఆ యువతిని పక్కనే ఉన్న పాడుబడ్డ ఇంటిలోకి తీసుకెళ్లి అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. అయితే అతని బారి నుండి తప్పించుకొని మూగయువతి బయటకు వస్తున్న తరుణంలో చుట్టుపక్కల వారు గమనించి వెంకటేష్‌ను అడ్డుకొన్నట్లు స్థానికులు చెప్పారు. ఈ మేరకు మూగయువతిపై అత్యాచారయత్నానికి పాల్పడినట్లు ఎస్పీ ఆదేశాలమేరకు వి.కోట ఎస్సై శివప్రసాద్‌రెడ్డి కేసు నమోదుచేసినట్లు విలేఖర్లకు తెలిపారు.
భయం విడనాడితేనే విజయం
* పరిశుద్దానందగిరి ఉద్బోధ
శ్రీకాళహస్తి, మే 2: భయం విడనాడితేనే విజయాలు సాధించుకోవచ్చునని, అలా జరగాలంటే నిజాయితీగా వ్యవహరించడం ఒక్కటే మార్గమని హైదరాబాద్ ఆర్‌ఆర్ నగర్‌లోని మఠానికి చెందిన పరిశుద్దానందగిరి ఉద్బోధించారు. శ్రీకాళహస్తిలోని శ్రీ శుకబ్రహ్మానందశ్రమంలో జరుగుతున్న జాతీయ సాధుసమ్మేళనంలో భాగంగా చివరిరోజైన గురువారం జరిగిన సదస్సుకు ఆయన ముఖ్యఅతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి మనిషికి బాధలు, కష్టాలు, నష్టాలు అన్న అంశాలపై భయాలు ఉండటం సహజమన్నారు. ఆ భయం అనే అపోహలోనే జీవితాన్ని సాగిస్తే దుర్భర పరిస్థితులను ఎదుర్కోవలసిన పరిస్థితి ఉంటుందన్నారు. భయం ఒక పులిలాంటిదన్నారు. ఆ భయం నుండి బయటపడినప్పుడు తన ఎదుట వున్న ఎన్ని కష్టాలనైనా అధిగమించవచ్చునన్నారు. తాను కూరుకుపోయిన సమస్యలకు కూడా ఒక పరిష్కారమార్గం కనిపిస్తోందన్నారు. తాము తప్పులు చేస్తూ ఎదుటి వారు తప్పులు చేస్తున్న భావనతో కొనసాగితే జీవితం అంతా భయంతోనే కొనసాగించాల్సిన పరిస్థితి ఏర్పడుతోందన్నారు. అందుకే ప్రతి మనిషి తాను చేస్తున్న తప్పులు ఏమిటో సమస్యల పరిష్కారానికి తీసుకోవాల్సిన నిర్ణయాలు ఏమిటో తెలుసుకుంటే భయం దరిచేరదన్నారు. దేశంలోని ప్రముఖులు భద్రతా సిబ్బందిని ఏర్పాటు చేసుకుంటారని వారు వున్నది భద్రతావలయంలో అయినా వారు అనుక్షణం భయం వలయంలో కొట్టుమిట్టాడుతూ వుంటారన్నారు. నిర్భయత్వం రావాలి అంటే నిజాయితీగా వ్యవహరించడం ఒక్కటే మార్గమన్నారు. ఈ కార్యక్రమంలో ఢిల్లీకి చెందిన పుణ్యానందగిరి మహారాజ్, శుకబ్రహ్మాశ్రమమం పీఠాధిపతి స్వరూపానందగిరి, ఉత్తరాధికారి సంపూర్ణనందగిరి, నంబూరు చంద్రకాళీ వరప్రసాదమాత తదితరులు పాల్గొన్నారు.
ఉబ్బలమడుగులో ఇంజినీరింగ్ విద్యార్థి మృతి
బిఎన్ కండ్రిగ, మే 2: తమిళనాడు రాష్ట్రం చెన్నైకి చెందిన ఇంజినీరింగ్ విద్యార్థి ధర్మేష్ మురగన్ ఉబ్బలమడుగులో ప్రమాదవశాత్తుపడి మృతి చెందిన విషయం ఆలస్యంగా గురువారం వెలుగులోకి వచ్చింది. బుధవారం ఉబ్బలమడుగుకు విహార యాత్రలో భాగంగా చెన్నైలోని ఒక ఇంజినీరింగ్ కళాశాల నుండి ఏడుగురు విద్యార్థులు వచ్చారు. మడుగులోని ఎగువ సీతాలం ప్రాంతంలో ప్రమాదవశాత్తు పడి మృతి చెందాడు. ఈ విషయాన్ని గుర్తించని స్నేహితులు ఎక్కడో తప్పిపోయినట్లు భావించి ఆ ప్రాంతాల్లో గాలించారు. గురువారం సాయంత్రం 6 గంటల ప్రాంతంలో మృతదేహం నీటిపై తేలింది. దీంతో అతను నీటిలో పడి మృతిచెందినట్లు తెలిసింది. బాగా ఈత వచ్చిన ధర్మేష్ మురగన్ మృతి చెందడంపై పలు అనుమానాలున్నట్లు పోలీసులు అంటున్నారు. మృతదేహంపై ఎటువంటి గాయాలు లేకపోవడంతో ఫిట్స్‌వచ్చి మరణించాడా? అన్నకోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బిఎన్ కండ్రిగ ఎస్‌ఐ వెంకటరమణ కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం శ్రీకాళహస్తి ప్రభుత్వాసుపత్రికి తరలించారు.