గుంటూరు, మే 2: బ్యాంకులో తన అకౌంటు నుండి 4.20 లక్షల రూపాయల నగదును డ్రాచేసి సంచిలో తీసుకువెళుతున్న ఒక వ్యాపారి నుండి ఇద్దరు దుండగులు బైకుపై వచ్చి దోచుకెళ్ళిన సంఘటన నగరంలో కలకలం రేపింది. పోలీసుల కథనం ప్రకారం గురువారం గుంటూరు పట్టణంలోని లక్ష్మీపురంలోని ఐసిఐసిఐ బ్యాంకులో ఫిరంగిపురం గ్రామానికి చెందిన జగన్నాథం శ్రీను అనే వ్యాపారి తన అకౌంటు నుండి 4.20 లక్షల రూపాయల నగదును డ్రాచేసి బ్యాంకు బయటకువచ్చి డివైడర్ దాటుతున్న సమయంలో అప్పటికే అక్కడ కాపుకాసివున్న ఇద్దరు యువకులు ఒక్క ఉదుటున బైకుపై వచ్చి శ్రీను చేతిలోని నగదుసంచిని లాక్కొని పారారయ్యారు. వెంటనే స్పందించిన శ్రీను బ్యాంకు లోపలకువెళ్ళి బ్రాంచ్‌మేనేజర్ రవికుమార్‌కు విషయం తెలుపగా ఆయన పోలీసులకు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న అర్బన్ ఎస్‌పి రవికృష్ణ, డిఎస్పీ వెంకటేశ్వరావు, సిఐ అళహరి సంఘటన స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. బాధితుడు జగన్నాధనం శ్రీనును ఎస్పీ వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈసందర్భంగా శ్రీను మాట్లాడుతూ గత నెల తణుకువెళ్లి వ్యాపార లావాదేవీలు నిర్వహించగా అక్కడి కంపెనీ 4.20లక్షల రూపాయల చెక్కును అందజేసిందని, చెక్కును తన అకౌంటులో వేసి గురువారం డ్రాచేసి బయటకు వస్తున్న సమయంలో ఈసంఘటన జరిగిందని తెలిపారు. దీనిపై ఎస్పీ రవికృష్ణ స్పందిస్తూ దుండగులను తప్పక పట్టుకుంటామని, నగదు అందించేలా చర్యలు చేపడతామని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. బ్యాంకు మేనేజర్‌ను కలిసి సిసి కెమేరాల పుటేజీని అందించాల్సిందిగా కోరారు. దుండగులును త్వరలో పట్టుకుంటామని ఎస్పీ తెలిపారు.
అవినీతిపరులకు
కొమ్ముకాస్తున్న ప్రధాని
* సిపిఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ ఆరోపణ
గుంటూరు, మే 2: దేశంలో అవినీతిపరులు, దొంగలు రాజ్యమేలుతున్నారని, వారికి సాక్షాత్తూ ప్రధాన మన్మోహన్‌సింగ్ నాయకత్వం వహిస్తున్నారని సిపిఐ రాష్టక్రార్యదర్శి కె నారాయణ ధ్వజమెత్తారు. చిలకలూరిపేట మండలంలోని వేలూరు గ్రామంలో నిర్మించిన 101అడుగుల అమరవీరుల స్థూపాన్ని గురువారం డాక్టర్ కె నారాయణ ఆవిష్కరించారు. ఈసందర్భంగా స్థానిక సిపిఐ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో నారాయణ మాట్లాడుతూ బొగ్గుగనుల కేటాయింపు కుంభకోణం కేసులో దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని తప్పుపట్టడాన్ని దేశ చరిత్రలోనే చీకటిరోజుగా నారాయణ అభివర్ణించారు. లక్షలాది కోట్ల రూపాయల కుంభకోణాలు వెలుగు చూస్తున్నా వాటినుంచి ఏమాత్రం బయటపడలేని స్థితిలో ప్రస్తుత యుపిఎ ప్రభుత్వం ఉందని, ప్రజాకోర్టులో తగిన మూల్యం చెల్లించుకోకతప్పదని ఆయన హెచ్చరించారు. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీతో తప్ప తాము ఏ పార్టీతో పొత్తు పెట్టుకోబోమని ఆయన స్పష్టంచేశారు. వచ్చే పార్లమెంటు ఎన్నికల దృష్ట్యా కేంద్రంలో కాంగ్రెస్, బిజెపిలకు ప్రత్యామ్నాయంగా తృతీయ ఫ్రంట్ ఏర్పాటుకు జూన్ మొదటివారంలో మిత్రపక్ష పార్టీలతో జూన్ మొదటివారంలో ఢిల్లీలో సమావేశం కానున్నట్లు నారాయణ తెలిపారు. ఈ సమావేశంలో కీలకనిర్ణయాలు తీసుకుంటామని చెప్పారు. అవినీతిలో పుట్టిన జగన్ పార్టీతో పొత్తుపెట్టుకుంటే తమ పార్టీ నాయకులు కూడా జైలుకు వెళ్లాల్సి వస్తుందని ఆయన ఎద్దేవా చేశారు. ప్రజలపక్షాన పోరాటాలు చేసి జైలుకెళ్లిన చరిత్ర తమదని, అంతేకాని అవినీతికి పాల్పడి జైలుకెళ్లిన వారితో పొత్తులు పెట్టుకోవాల్సిన అగత్యం సిపిఐకి లేదన్నారు. చట్టవ్యతిరేకంగా సంపాదించిన సొమ్మును చట్టబద్ధం చేసుకునేందుకు జగన్ పార్టీపెట్టారని, ఆ దిశగా తమతోపాటు తమ కుటుంబీకుల చేత కూడా పాదయాత్ర చేయిస్తున్నారని నారాయణ విమర్శించారు. మైనింగ్ మాఫియా డాన్ గాలి జనార్దనరెడ్డి, వైఎస్ జగన్మోహన్‌రెడ్డిలు అవినీతి కవల సోదరులని ఆయన చెప్పారు. జగన్ ఏవిషయంలో జైలుకెళ్లాడో ప్రజలు గమనించాలని ఆయన కోరారు. భూకంపాన్ని సృష్టిస్తానని ఇటీవల తీవ్ర వ్యాఖ్యలు చేసిన టిఆర్‌ఎస్ అధ్యక్షుడు కెసిఆర్‌పై సిఎం విరుచుకుపడటం సమంజసం కాదని, ముందు వారి పార్టీలో చెలరేగిన అసమ్మతి భూకంపాన్ని నిలువరించకుంటే కాంగ్రెస్‌పార్టీకి ఉనికి లేకుండా పోతుందని ఆయన హెచ్చరించారు. రాష్ట్రంలో విద్యుత్‌కోతలు లేకుండా ఉండాలంటే జెన్‌కోకే పూర్తిస్థాయి అనుమతులు, అధికారాలు ఇవ్వాలని కిరణ్ సర్కార్‌ను కోరారు. సిఎం ఉత్తరప్రగల్భాలు మానుకొని ప్రజలకు ఉపయోగపడేలా పనిచేయాలని నారాయణ సూచించారు. విద్యుత్ చార్జీల పెంపుపై తమ పార్టీ ఉద్యమించనున్నట్లు చెప్పారు. భూరిజిస్ట్రేషన్లకు సంబంధించి తమ ఇష్టానుసారం చార్జీలను పెంచడంతో మధ్యతరగతి ప్రజలపై పెనుభారం పడుతోందన్నారు. ప్రజాసమస్యలపై అప్పటికీ, ఇప్పటికీ పోరాడుతోంది ఒక్క కమ్యూనిస్టుపార్టీ మాత్రమేనని నారాయణ చెప్పారు. మారుతున్న ప్రజాభిప్రాయానికి అనుగుణంగా తమ పార్టీ నిర్ణయాలు తీసుకుంటుందని అన్నారు. ఈ సమావేశంలో సిపిఐ జిల్లా కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు, చిలకలూరిపేట ఏరియా కార్యదర్శి సిఆర్ మోహన్, గుంటూరు నగరపార్టీ కార్యదర్శి జంగాల అజయ్‌కుమార్, పార్టీ నాయకులు నరిశెట్టి గురవయ్య, మస్తాన్‌వలి, తాళ్లూరి బాబూరావు, పేలూరి రామారావు, తన్నీరు వెంకటేశ్వర్లు, చెరుకుపల్లి నిర్మల, ఆరాధ్యుల రామకృష్ణ, వరహాలరావు, కొండ్రగుంట్ల వెంకట్రావు, ఏఐఎస్‌ఎఫ్ జిల్లా నాయకులు అరుణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
అంతిమ సంస్కారం చేసి
తండ్రి రుణం తీర్చుకున్న తనయలు
అమృతలూరు, మే 2: తండ్రి మృతదేహానికి కుమారుడే అంత్యక్రియలు చేయాలనే వాదనకు కాలం చెల్లింది. కూతుళ్ళుగా తండ్రి రుణం తీర్చు కునేందుకు మేము సైతం.. అన్న ఉదంతం మండల గ్రామం పెదపూడిలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ , నీటి తీరువా అధ్యక్షుడు చదలవాడ సాంబశివరావు(72) అనారోగ్య కారణంగా బుధవారం తెల్లవారుఝామున మృతి చెందారు. ఆయనకు భార్య, కుమార్తెలు శ్రీదేవి , శైలజ, ఉష, మాధవిలత, లీలారాణిలున్నారు. కుమారులు లేరు. ఈ క్రమంలో కుమార్తెలు నడుంకట్టి అన్నీ తామేనంటూ సాంబశివరావు అంత్యక్రియలు స్వగ్రామమైన పేదపూడి శ్మశానవాటికలో గురువారం ఆధ్వర్యంలో నిర్వహించారు. వేద అధ్యయనం పురుషులే కాదు స్ర్తిలు కూడా చేయవచ్చని ఆర్యసమాజం పురోహితురాలు నాగభైరవ గంగాపార్వతి వేదపఠనం చేశారు. ఆర్యసమాజం ఆధ్వర్యంలో నిర్వహించిన అరుదైన సంఘటన గ్రామ సీమలో ప్రచారాంశమైంది. కాగా సాంబశివరావు బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేశారని, విశ్రాంత ఆర్టీసి ఉద్యోగి ఆర్‌సి శేఖర్, తదితరులు నివాళులర్పించారు.
నిప్పుల కొలిమిలా రెంటచింతల
రెంటచింతల, మే 2: రెంటచింతల మండలం నిప్పుల కొలిమిగా మారింది. ఏప్రిల్ మాసంలోనే ఎండతీవ్రంగా ఉండి, మే నెల ఆరంభంలో పెరిగిన పగటి ఉష్ణోగ్రతలు ప్రజలను ఠారెత్తిస్తున్నాయి. ఉదయం పదిగంటల సమయం తర్వాత గడప దాటి బయటకు వచ్చేందుకు ప్రజలు జంకుతున్నారు. ఈ సమయంలోపే పనులను చక్కబెట్టుకుని గృహాలకు చేరుకుంటున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు రోడ్లన్నీ నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. గత నాలుగు రోజులుగా ఎండల తీవ్రత మరింత పెరిగింది. ఈ వారంలో గరిష్ట ఉష్ణోగ్రత 44.5 డిగ్రీలుగా నమోదయ్యాయి. ఇటు ఎండల తీవ్రత, అటు విద్యుత్ కోతలతో వృద్ధులు, చిన్నారులు ఉక్కపోతకు గురై అల్లాడిపోతున్నారు. సాధారణంగా మే ఆరంభం నుండి ఎండలు అధికంగా ఉంటుంది. కానీ ఈ ఏడాది ఏప్రిల్ మాసంలో భానుడు మండిపడుతున్నాడు. సాయంత్రం ఆరుగంటల దాటినా ఎండతీవ్రత తగ్గడంలేదు. రాత్రిపూట గృహాల్లో ఫ్యాన్లు తిరుగుతున్నప్పటికీ వెచ్చటి ఆవిరులు వస్తున్నాయి. దీంతో పల్లె ప్రజలు భానుడి భగభగకు తల్లడిల్లిపోతున్నారు. ఉక్కపోతకు కరెంట్‌కోత తోడవడంతో ప్రజలు నరకయాతన పడుతున్నారు. ఎండ తీవ్రత అధికంగా ఉండటంతో శీతలపానీయాలకు గిరాకీ పెరిగింది. ఎండతీవ్రత నుండి ఉపశమనం పొందేందుకు ప్రజలు కొబ్బరిబొండాలు, చెరుకురసం, కూల్‌డ్రింక్స్‌లను సేవిస్తూ సేదతీరుతున్నారు.
ఆటోబోల్తా: ఒకరి మృతి
విజయపురిసౌత్, మే 2:వేగంగా వెళుతున్న ఆటో అదుపుతప్పి బోల్తాపడిన ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం చెందిన సంఘటన గురువారం నాగార్జున సాగర్ సమీపంలోని ఎస్ టర్నింగ్ వద్ద జరిగింది. మాచర్ల నుండి సుమారు 15 మంది ప్రయాణీకులతో ఆటో విజయపురిసౌత్‌కు బయలుదేరింది. సాగర్ సమీపంలోని ఎస్ టర్నింగ్ వద్ద ఆటో అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో వెల్దుర్తి మండలం కండ్లకుంట గ్రామానికి చెందిన బాలకృష్ణ (24) అక్కడికక్కడే మృతి చెందాడు. బాలకృష్ణ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం హిల్‌కాలనీలోని కమలానెహ్రూ వైద్యశాలకు తరలించారు. ఈమేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ సిహెచ్ శింగయ్య తెలిపారు. మృతుడు బాలకృష్ణకు భార్య, కుమారుడు ఉన్నారు.
వృద్ధుడి ఆత్మహత్య
దుగ్గిరాల, మే 2: గుళికలు తిని ఓ వృద్ధుడు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మండల గ్రామం కంఠంరాజు కొండూరులో గురువారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన తాడిబోయిన రామదాసు(80) ఉదయం గుళికలు తీసుకోగా వెంటనే 108వాహనం ద్వారా తెనాలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా చికిత్స పొందుతూ సాయంత్రం మృతి చెందాడు. రామదాసుకు 6గురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కుటుంబ కలహాల క్రమంలో ఒంటరి జీవనం సాగిస్తున్న రామదాసు మృతి పట్ల చిన్న కుమారుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై విజయ్ చరణ్ తెలిపారు.
పెదకాకానిలో భారీ అగ్ని ప్రమాదం
* 30లక్షల ఆస్తినష్టం
పెదకాకాని, మే 2: మండల కేంద్రమైన పెదకాకానిలోని అలిరఫత్‌నగర్‌లో గురువారం జరిగిన అగ్ని ప్రమాదంలో 22పూరి గుడిసెలు పూర్తిగా దగ్ధమైనాయి. స్థానికుల కధనం ప్రకారం ఓ మహిళ వంట చేస్తున్న సమయంలో అగ్ని కణాలు గాలికి రేగటంతో మంటలు వ్యాపించాయి. ఈసంఘటనలో 30లక్షల మేరకు ఆస్తి నష్టం సంభవించినట్లు బాధితులు తెలిపారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సకాలంలో స్పందించి మంటలను అదుపులోకి తీసుకురావటంతో పెను ప్రమాదం తప్పింది. సంఘటన స్థలాన్ని గుంటూరు జిల్లా అర్బన్ ఎస్పీ రవికృష్ణ పరిశీలించి బాధితులకు నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు. పొనూరు నియోజకవర్గం శాసనసభ్యుడు ధూళిపాళ్ళ నరేంద్రకుమార్, తహశీల్దార్ అనిల్‌కుమార్ సంఘటన స్థలాన్ని పరిశీలించి నెలలోపు అందిరికీ పట్టాలు ఇచ్చి పక్కా గృహాలు కట్టించి ఇస్తామని హామీ ఇచ్చారు.
బెట్టింగ్‌కు పాల్పడుతున్న నలుగురి అరెస్టు
బాపట్ల, మే 2: బెట్టింగ్‌కు పాల్పడుతున్న కూనపరెడ్డి అవినాష్‌నాయుడు, మరో ముగ్గురిపై పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు. పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు గురువారం వీరిని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. నిందితులను శుక్రవారం కోర్టులో హాజరుపరచనున్నట్లు సిఐ రామారావు తెలిపారు.
ప్రైవేటు గిడ్డంగిపై
విజిలెన్స్ దాడులు
భట్టిప్రోలు, మే 2: మండలకేంద్రం భట్టిప్రోలులోని కె.శ్రీనివాసరావుకు చెందిన గిడ్డంగిపై గురువారం సాయంత్రం విజిలెన్స్ అధికారుల తనిఖీలు నిర్వహించారు. ఈ గిడ్డంగిలో ఎలాంటి అనుమతులు లేకుండా సుమారు 75 లక్షల రూపాయల విలువచేసే ధాన్యం, మొక్కజొన్న నిల్వలున్నట్లు అధికారులు గుర్తించారు. విజిలెన్స్ అధికారి ఎం వంశీధర్ ఆధ్వర్యంలో నిర్వహించిన తనిఖీల అనంతరం గిడ్డంగిని సీజ్ చేసి, స్థానిక మండల రెవిన్యూ అధికారి పి.కృష్ణమోహన్‌కు అప్పగించారు. ఈ అంశంపై సమగ్ర విచారణ చేయాల్సి ఉందని విజిలెన్స్ అధికారులు తెలిపినట్లు తహశీల్దార్ వివరించారు.
రోడ్డు ప్రమాదంలో
తండ్రి, కొడుకుకు గాయాలు
అమరావతి, మే 2: అమరావతి- విజయవాడ రహదారిలో వైకుంఠపురం గ్రామ శివారులో గురువారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో తండ్రీకొడుకులు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసుల కధనం ప్రకారం విజయవాడ రామవరప్పాడుకు చెందిన నెల్లూరి సంగీతరావు ఆయన కుమారుడు సాల్మన్‌రాజు స్కూటర్‌పై అమరావతి మండలం అత్తలూరు గ్రామంలో వేడుకలకు వస్తున్నారు. మార్గమధ్యంలో వైకుంఠపురం సమీపానికి రాగానే రోడ్డు మలుపువద్ద ఎదురుగావస్తున్న వాహనాన్ని తప్పించబోయి ప్రమాదవశాత్తూ స్కూటర్ బోల్తా కొట్టింది. ఈప్రమాదంలో తండ్రీకొడుకులు ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. అమరావతి ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన చికిత్సకోసం గుంటూరుకు తరలించారు. ఈమేరకు పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.
బాల్య వివాహాన్ని
అడ్డుకున్న ఐసిడిఎస్ అధికారులు
అమరావతి, మే 2: బాలికకు వివాహం చేస్తున్నారన్న సమాచారం అందటంతో ఐసిడిఎస్, పోలీసు అధికారులు వెళ్లి ఇరువర్గాల పెద్దలకు నచ్చజెప్పి పెండ్లిని నిలిపివేసిన సంఘటన గురువారం మండలంలోని నరుకుళ్లపాడు గ్రామంలో జరిగింది. వివరాలు ఇలాఉన్నాయి.... అమరావతి మండ లం నరుకుళ్లపాడు గ్రామానికి చెందిన మేకల రాంబాబు కుమారుడు వినోద్‌కు మేడికొండూరు మండలం పేరేచర్ల గ్రామానికి చెందిన పెదపూడి జ్యోతి కుమార్తె (16)కు పెండ్లి చేయడానికి ప్రయత్నాలు చేస్తుండగా ఫిరంగిపురం సిడిపిఓ న్యూరాణి మేనర్ బాలిక వివాహం వల్ల జరిగే అనర్ధాల గురించి తల్లిదండ్రులకు నచ్జజెప్పి పెండ్లి జరుగకుండా ఇరువార్గాల మధ్య సంతకాలు సేకరించి అధికారులు వెళ్ళారు. రాత్రికి రాత్రే నరుకుళ్ళపాడు గ్రామంలో ఇరువర్గాలు తిరిగి పెండ్లికి ఏర్పాట్లు చేస్తుంటంతో ఆ సమాచారం తెలిసి తాడికొండ సిడిపిఓ బి సుజాత, అమరావతి సెక్టార్ సూపర్‌వైజర్ కేవి శేషమ్మ, ఎస్‌ఐ మల్లిఖార్జునరావు సిబ్బందితో వెళ్లి చర్చిలో జరుగుతున్న పెండ్లి తతంగాన్ని నిలిపివేయించారు.
ఆ బాలిక ఇటీవలే 10వ తరగతి రాసిందని, 18సంవత్సరాలు నిండేవరకు వివాహం చేయబోమని ఇరువర్గాల నుంచి హామీ తీసుకుని వివాహం నిలిపివేశారు. తాడికొండ ప్రాజెక్కు పరిధిలో ఎక్కడైనా మైనర్లకు వివాహాలు జరిగితే సంబంధిత వ్యక్తులపై ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకోవటం జరుగుతుందని సుజాత హెచ్చరించారు.
త్వరితగతిన దీపం పథకం గ్యాస్ కనెక్షన్లు
* మంత్రి మాణిక్యవరప్రసాద్
గుంటూరు, మే 2: దీపం పథకం కింద తాడికొండ నియోజకవర్గంలో మంజూరైన కనక్షన్లను త్వరితగతిన లబ్ధిదారులకు అందజేయాలని రాష్ట్ర గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్ పేర్కొన్నారు. గురువారం స్థానిక ఆర్‌అండ్‌బి అతిథి గృహంలో ఆయాశాఖల అధికారులతో నియోజకవర్గం అభివృద్ధిపై సమీక్షించారు. ఈసందర్భంగా మంత్రి వరప్రసాద్ మాట్లాడుతూ ఫిరంగిపురం మండలంలో 1200మందికి, తుళ్లూరుమండలంలో 600మందికి దీపం పథకం కింద గ్యాస్ కనక్షన్లు ఇవ్వవలసి ఉందన్నారు. ఈవిషయంపై సంబంధిత ఏజెన్సీ వారిని సంప్రదించి త్వరిత గతిన లబ్ధిదారులకు గ్యాస్ కనక్షన్లు అందేలా చూడాలన్నారు. పొనె్నకల్లులో నేలబావి ఉందని, సంబంధిత పొలం యజమానితో చర్చించి బావినీరును ప్రజలు వాడుకొనేందుకు తగినచర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ కింద తాడికొండ నియోజకవర్గం పరిధిలో ఏఏపథకాల కింద లబ్ధిదారులు అర్జీలు అందజేశారో తెలియజేయాలని ఆర్‌డబ్ల్యూఎస్ తదితర శాఖల అధికారులను ఆదేశించారు. దీనిపై అధికారులు మాట్లాడుతూ ఫిరంగిపురం మండలంలో 102లక్షల అంచనాలతో 74బోల్‌వెల్స్‌కు ప్రతిపాదనలు వచ్చాయన్నారు. మేడికొండూరు మండలంలో 38లక్షల వ్యయంతో 26బోర్‌వెల్స్‌కు, పైపులైన్ విస్తరణకు ప్రతిపాదనలు అందాయని చెప్పారు. తాడికొండ మండలంలో ఇటీవల ప్రమాదం సంభవించిన అంగన్‌వాడీ భవనం స్థానంలో కొత్త భవనం నిర్మించేందుకు ప్రతిపాదనలు అందజేయాలని తహశీల్దార్, ఎంపిడిఓలను మంత్రి ఆదేశించారు. ఈసమావేశంలో అదనపు జెసి ఎస్ వెంకటరావు, ద్వామా పిడి అనిక్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
కార్మిక ఉద్యమనేతకు ఘన సన్మానం
గుంటూరు(కొత్తపేట), మే 2: ఆరు దశాబ్దాలుగా కార్మిక ఉద్యమాలకు నాయకత్వం వహిస్తున్న ఏఐటియుసి రాష్ట్ర నాయకులు జివి కృష్ణారావును అవగాహన సంస్థ సభ్యులు ఘనంగా సత్కరించారు. గురువారం సంస్థ కార్యాలయంలో ఉపాధ్యాయనేత రాయన్న అధ్యక్షతన జివి కృష్ణారావును ఘనంగా సత్కరించారు. ఈసందర్భంగా ఏపి అభ్యుదయ రచయితల సంఘం అధ్యక్షుడు పెరుగొండ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ నగరస్థాయి నుండి జిల్లా, రాష్టస్థ్రాయినేతగా ఎన్నో కార్మిక సంఘాలను నిర్మించి ఉద్యమాలు నిర్వహించిన పోరాట యోధుడు జివి కృష్ణారావుఅని కొనియాడారు. ఏఐటియుసి జిల్లా అధ్యక్షుడు జివి రాధాకృష్ణమూర్తి మాట్లాడుతూ కార్మికుల పక్షాన అనేక పోరాటాలుచేసి విజయాలు సాధించారని పేర్కొన్నారు. ప్రజానాట్యమండలి గౌరవ అధ్యక్షుడు పులి సాంబశివరావు, అవగాహన సంస్థ కార్యదర్శి కొండా శివరామిరెడ్డి, యూనియన్ నాయకులు వి సాంబశివరావు, చల్లా చినఆంజనేయులు పాల్గొన్నారు.
‘అధార్’కోసం అగచాట్లు, రేషన్ ఇవ్వని డీలర్లు
రెంటచింతల, మే 2: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన అధార్‌కేంద్రాలు ఇటీవల మండల కేంద్రమైన రెంటచింతలలో అర్ధాంతరంగా మూతపడ్డాయి. దీంతో అధార్‌కార్డులు దిగని మండల ప్రజలు, విద్యార్థులు, వృద్ధులు ఆందోళనకు గురవుతున్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు వర్తించాలంటే ప్రతిఒక్కరూ అధార్‌కార్డులను కలిగి ఉండాలని అధికారులు చెబుతున్నారు. గత రెండు వారాల క్రితం మండలంలో ఏర్పాటుచేసిన అధార్ కేంద్రాల్లో కంప్యూటర్లు, వేలిముద్రల మిషన్లు సక్రమంగా పనిచేయకపోవడంతో అధార్ కేంద్రాలను అర్ధాంతరంగా మూసివేశారు. అధార్ ఫోటోలు దిగిన కొంతమందికి మాత్రమే ఎన్‌రోల్‌మెంట్ రశీదులను అందజేశారు. అధార్‌కార్డులు లేదా అధార్శ్రీదులు లేనివారు రేషన్ దుకాణాలకు వెళితే...అధార్‌కార్డులు ఉంటేనే నిత్యావసర వస్తువులను పంపిణీ చేస్తామని రేషన్‌డీలర్లు తేల్చి చెప్పడంతో రేషన్ వినియోగదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. అదేవిధంగా స్థానిక ఆనంద్‌పేటలోని పలువురు రేషన్‌వినియోగదారులకు అధార్‌కార్డులు లేకపోవడంతో ఆయా రేషన్ డీలర్‌వద్దకు వెళ్ళి నిరాశ నిస్పృహలతో వెనుదిరిగి రావడమైంది. రెవెన్యూ అధికారులు మాత్రం అధార్‌కార్డులు ఉన్నవారికి మాత్రమే రేషన్ సరుకులు ఇవ్వాలనే స్పష్టమైన సూచనలు డీలర్లకు ఇవ్వకపోయినప్పటికీ, రేషన్ డీలర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ నిత్యావసర వస్తువులను తమ స్వలాభానికి వాడుకుంటున్నారనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. ఇదిలా ఉండగా, వృద్ధులు, విద్యార్థులు సమీప గ్రామాల్లో ఏర్పాటుచేసిన అధార్ కేంద్రాల్లో అధార్ ఫోటోలు దిగేందుకు వెళ్ళిన వారి వేలిముద్రలను ఫింగర్‌ప్రింట్ మిషన్ తీసుకోకపోవడంతో ఆందోళనకు గురవుతున్నారు. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ పొందాలంటే అధార్ కార్డులు తప్పనిసరిగా ఉండాలని కళాశాల యాజమాన్యాలు తేల్చి చెప్పడంతో విద్యార్థులు తీవ్ర ఇక్కట్లకు గురవుతున్నారు. ఇప్పటికే ఒక్కొక్కరు రెండు, మూడు అధార్ కేంద్రాల వద్దకు వెళ్ళినప్పటికీ వారి వేలిముద్రలను తీసుకోకపోవడంతో దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. తమ వేలిముద్రలు కంప్యూటర్‌లో ఎందుకు తీసుకోవడంలేదని పలువురుప్రశ్నించగా, దీనికోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సాఫ్ట్‌వేర్‌ప్రొగ్రాం తమకు అందుబాటులోకి వచ్చిన వెంటనే అధార్‌కార్డులను తీస్తామని అధార్‌కేంద్రం నిర్వాహకులు తెలిపినట్లు పేర్కొన్నారు. ఇప్పటికైనా జిల్లా రెవెన్యూ అధికారులు అధార్‌కార్డుల విషయమై స్పష్టమైన ఆదేశాలను జారీచేసి, నిత్యావసర వస్తువులను పంపిణీ చేయని డీలర్లపై తగు చర్యలు తీసుకోవాలని మండల ప్రజలు కోరుతున్నారు.
భగ్గుమంటున్న ఎండలు... కొబ్బరి బోండాలకు పెరిగిన గిరాకీ
తెనాలి, మే 2: భరణి కార్తె ప్రవేశంతో వాతావరణంలో చోటు చేసుకుంటన్న మార్పుల క్రమంలో ఎండ తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. ఈ క్రమంలో ప్రజలు శీతల పానీయాల సేవనంతో వేసవి తీవ్రత నుండి సేద తీరుతున్నారు. 365 రోజులు అందుబాటులో వినియోగదారులకు అందుబాటులో ఉండె కొబ్బరి బోండాలకు వేసవి కారణంగా గిరాకి పెరుగుతోంది. డివిజన్‌లోని భట్టిప్రోలు మండలం వెల్లటూరు చుట్టూ ఉన్న లంక గ్రామాల నుండి ప్రస్తుతం కొబ్బరి బోండాలు ముమ్మరంగా వస్తున్నాయి. వీటితో పాటుగా తెనాలి పట్టణానికి చుట్టూ ఉన్న గ్రామాల నుండి వ్యాపారులు సైకిళ్ళ ద్వారా కొబ్బరి బోండాలను పట్టణవాసుల ముంగిటకే తెస్తున్నారు. బోండాం ధర 10 నుండి 15 వరకు కూడా పలుకుతోంది. ఎక్కువగా వెల్లటూరు సమీపంలోని పెసర్లంక, జువ్వలపాలెం, పెదలంక, చింతమోటు ప్రాంతాల నుండి వస్తున్నాయి. కొబ్బరి సాగుతో పాటు లంక గ్రామ రైతులు అవే తోటలలో అపరాలు కూడా పండిస్తున్న క్రమంలో నీటి ఎద్దడి సమస్య తక్కువగానే ఉంటుందని, అపరాల పంట చేతికి వచ్చాక, నీటి వసతి తగ్గుతుందని అందువల్ల కొబ్బరి బోండాం చూపులకు ఇంపుగా ఉండటం లేదనే భావన వ్యాపారులు వ్యక్తం చేస్తున్నారు. హోల్‌సేల్ మార్కెట్‌లో వెయ్యి బోండాలు (అన్ని సైజులు) 1500 వరకు ధర ఉందని చెబుతున్నారు. అనారోగ్య బాధితులకు దివ్యఔషధంలా పనిచేసే కొబ్బరి బోండాలు ఈ వేసవిలో వినియోగదారులకు వేడి తీవ్రత నుండి సేద తీర్చడంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. అన్ని వర్గాల వారు కొబ్బరి బోండాలను వేసవి తీవ్రతను తగ్గించుకునే మెడిసిన్ మాదిరిగానే వినియోగిస్తున్నందున, పట్టణంలో మొత్తం 50కిపైగా స్టాల్స్‌లోకొబ్బరి బోండాల వ్యాపారాలు జోరుగా సాగుతున్నాయి. కాగా వేసవి సీజన్‌లో వెల్లటూరు లంకల నుండి బోండాలు జిల్లాలోని అనేక ప్రాంతాలతో పాటు, ప్రకాశం జిల్లా నుండి కూడా వ్యాపారులు వస్తుండటంతో తోటల దగ్గరే రేట్లు బాగున్నాయని ఈ ప్రాంత వ్యాపారులు చెబుతున్నారు. మోత్తానికి ఎండ తీవ్రత వల్ల శరీరంలో చోటు చేసుకునే అసౌకర్యం నుండి తక్షణ ఉపశమనం ఇచ్చే కొబ్బరి బోండాలకు మున్ముందు మరింత గిరాకి. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు, కేరళ ప్రాంతాల నుండి కూడా తెనాలికి కొబ్బరి బోండాలు ఈ సమ్మర్‌లో వ్యాపారులు దిగుమతి చేసుకుంటారు. పసిపిల్లల నుండి వృద్ధుల వరకు వడ దెబ్బ సోకకుండే కాపుకాసే నిజమైన శీతల పానీయం కొబ్బరి బోండామే... ప్రస్తుతం మోత బరువు లేకుండా లీటర్ కోకోనట్ వాటర్ 60 రూపాయలకు విక్రయిస్తున్నారు. ఈ క్రమంలో చాలా మంది వాహన చోదకులు తమ సుదూర ప్రయాణాల్లో కొబ్బరి నీళ్ళను సమ్మర్ నేస్తాలుగా వెంట తీసుకు వెళుతున్నారు. ఈ వేసవిలో కోరి వచ్చిన అందరికి నిజమైన శీతలాన్ని కొబ్బరి బోండాలు పంచుతున్నాయి కాబట్టే...ఇంత గిరాకి.
ఘనంగా కోడెల జన్మదిన వేడుకలు
నరసరావుపేట, మే 2: తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ మంత్రి డాక్టర్ కోడెల శివప్రసాదరావు67వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం ఉదయం నుండి రాత్రి పొద్దుపోయేవరకు పట్టణంలో పలు కార్యక్రమాలను కోడెల అభిమానులు, కార్యకర్తలు, నాయకులు నిర్వహించారు. తొలుత కోటప్పకొండ త్రికోటేశ్వరస్వామి దేవాలయానికి వెళ్ళి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతర కొండ దిగువభాగంలోని సాయిబాబా దేవాలయంలోనూ, కోటప్పకొండ రోడ్డులోని కల్యాణ వెంకటేశ్వరస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలను కోడెల నిర్వహించారు. పట్టణంలోని గుంటూరు రోడ్డులో ఉన్న మసీదులోనూ, స్టేషన్‌రోడ్డులోని బాప్టిస్ట్ చర్చిలోనూ, శివాలయంలోనూ ప్రత్యేక పూజలను నిర్వహించారు. కోడెలకు వేదపండితులు ఆశీర్వచనాలను, ముస్లిం మతపెద్దలు ఆశీస్సులను, చర్చిలోని పాస్టర్లు ఆశీర్వాదాలను అందజేశారు. అనంతరం తెలుగుదేశంపార్టీ కార్యాలయంలో 67కిలోల భారీ కేక్‌ను కట్‌చేశారు. ఆ తదుపరి లిటిల్ హార్ట్స్ అనాధ శరణాలయంలో అన్నదానం, వకుళ మాధవి వృద్ధాశ్రమంలో పండ్ల పంపిణీ, కాకతీయనగర్‌లో పూనాటి శ్రీను ఆధ్వర్యంలో కేక్‌కట్ చేసే కార్యక్రమంలో కోడెల పాల్గొన్నారు. సాయంత్రం పట్టణంలో తెలుగుదేశంపార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున బాణాసంచాను పేలుస్తూ ర్యాలీ నిర్వహిచారు. అనంతరం జమీందార్ ఫంక్షన్‌హాల్లో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమాల్లో వేల్పుల సింహాద్రియాదవ్, రాజా కాశయ్య, యర్రంశెట్టి రాము, బాబ్జీ, వేములపల్లి నర్సయ్య, కొక్కిరాల శ్రీనివాసరావు, కొల్లి ఆంజనేయులు, పూనాటి శ్రీను, కడియంకోటి సుబ్బారావు, గంగుల పెద్దిరెడ్డి, షేక్ బాబు, కొట్టా కిరణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.