కర్నూలు , మే 2: కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నగదు బదిలీ పథకాన్ని జూన్ 1వ తేదీ నుంచి జిల్లాలో పకడ్బందీగా అమలు చేయడానికి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సుదర్శన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లోని సునయన ఆడిటోరియంలో గురువారం నగదు బదిలీ పథకంపై వైద్య ఆరోగ్య, విద్య, బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన, వివిధ కళాశాలల ప్రిన్సిపాల్స్, సంక్షేమ శాఖల అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. సమావేశంలో జెసి కన్నబాబు, ట్రైనీ కలెక్టర్ ప్రశాంత్‌పాటిల్, ఎజెసి రామస్వామి, లీడ్ డిస్ట్రిక్ మేనేజర్ అండవర్, డిఆర్‌ఓ వేణుగోపాల్‌రెడ్డి, రాయలసీమ ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకు జిఎం దుర్గాప్రసాద్, జనరల్ మేనేజర్ రంగన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఏప్రిల్ 29న ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం చేపట్టి అమలుచేస్తున్న నగదు బదిలీ పథకంపై కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి, ఆర్థిక, ప్రణాళిక గ్రామీణాభివృద్ధి సెక్రటరీల పాలనాపరమైన ప్రధాన అంశాలపై చర్చించారన్నారు. ఆధార్ కార్డు ద్వారా ఉపకార వేతనాలు, పింఛన్లు, పోస్టుమెట్రిక్ ఉపకార వేతనాలు, గ్యాస్ వంటి అవసరమైన పథకాలు, అర్హులందరికీ జననీ సురక్ష యోజన పథకం, ఉపాధి కూలీలకు చెల్లించే కూలి నగదు బదిలీ పథకం కిందకు తీసుకురావాలనేదే కేంద్రం ప్రధాన ఉద్దేశ్యమన్నారు. జిల్లాలో ఇప్పటి వరకూ 65 లక్షల మంది ఆధార్ కార్డు కోసం నమోదు చేసుకోగా కేవలం 6 లక్షల మందికి ఆధార్ కార్డులు వచ్చాయని తెలిపారు. ఆధార్, ఎన్‌పిఆర్ నెంబర్ల నమోదు సంబంధిత అధికారులకు అందజేయాలని వైద్య, ఆరోగ్యశాఖ, విద్య, బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన అధికారులను కలెక్టర్ ఆదేశించారు. అక్టోబర్ 1వ తేదీ నుండి ఆధార్ ఆధారంగా గ్యాస్, పింఛన్లు నగదు బదిలీ పథకం కిందకు వస్తాయని తెలిపారు. భవిష్యత్తులో 25 రకాల ప్రభుత్వ సంక్షేమ పథకాలు వంద శాతం అమలు చేయడానికి కేంద్రం అన్ని చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ఆంధ్రలో నగదు బదిలీ పథకం 5 జిల్లాల్లో అమలవుతుందని, ఈ పథకాన్ని ఆధార్ ద్వారా అందరి లబ్ధిదారులకు అమలయ్యేలా చేసి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని కోరారు. సమావేశంలో విద్య, వైద్య ఆరోగ్యశాఖ, సంక్షేమ శాఖ, వివిధ కళాశాలల ప్రిన్సిపాళ్లు, ప్రధానోపాధ్యాయులు, ఎన్‌సిఎల్‌పి అధికారులు పాల్గొన్నారు.
నల్లమల అభయారణ్యంలో
పులుల లెక్కింపు..
* పెద్దపులులే కీలకం.. సంతతి పెరిగినట్లు అంచనా..
ఆత్మకూరురూరల్, మే 2: నాగార్జున, శ్రీశైలం పెద్దపులుల అభయారణ్యం పరిధిలో పలులు లెక్కింపునకు అటవీశాఖ శ్రీకారం చుట్టింది. గడచిన 48 గంటల పాటు చేపట్టిన లెక్కింపులో పెద్దపులులే కీలకంగా మారాయి. ప్రత్యేకించి ఆత్మకూరు అటవీ డివిజన్‌లో గత ఏడాది కంటే ఈసారి సంతతి పెరిగే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. పెద్దపులుల సంరక్షణ సహజ కేంద్రం పెచ్చెరువు పరిధిలో పెద్దపలులతో పాటు కూనల సంఖ్య క్రమంగా పెరిగిందని చెప్పవచ్చు. గత ఏడాది 28 పెద్ద పలులు ఉన్నట్లు అధికారుల అంచనా. తాజా గణాంకాల ప్రకారం సుమారు 35 పెద్దపలులు ఉండవచ్చని అధికారుల ప్రాథమిక అంచనా. వీటితో పాటు 10 పులి కూనలు కూడా ఉన్నాయి. ఆత్మకూరు అటవీ డివిజన్ పరిధిలోని శ్రీశైలం, ఆత్మకూరు, బైర్లూటి, నాగలూటి, వెలుగోడు అటవీ రైంజర్‌లోని 25 సెక్టార్లలో సుమారు వందకు పైగా బీట్లలో పెద్దపులి అడుగు జాడల లెక్కింపు ముమ్మరంగా సాగుతోంది. ఇప్పటికే రెండు రోజులు గడచిపోగా 8 రోజుల పాటు మాంసాహార, శాఖాహార జంతువుల గణాంక సేకరణ జరిపేందుకు ఎన్‌ఎస్‌టిఆర్ అధికారి రాహుల్‌పాండే, ఆత్మకూరు డిఎఫ్‌ఓ దివాన్ మోదిన్, రైంజర్లు సిబ్బందితో గణాంకాల సేకరణ చేస్తున్నారు. ప్రత్యేకించి పెచ్చెరువు, దామర్లకుంట, నరమామిడిచెరువు, బీమునికొలను, నాగలూటి, బైర్లూటి, పసురుట్ల, బివిఎం తిరుమల కొండ, వంటశాల ప్రాంతాల్లో పెద్దపులుల అడుగు జాడలను ప్లగ్ మార్క్ పద్ధతిలో సేకరిస్తున్నారు. అలాగే కెమెరా ట్రాప్ విధానంలో కూడా పరిశీలిస్తున్నారు. ఈ నేపథ్యంలో 10 రోజుల పాటు అడవిలోకి జనసంచారాన్ని నిషేధించారు. కాగా టైగర్ కన్వర్షన్ సంస్థకు చెందిన ఇద్దరు పరిశోధకులు ఆసిఫ్, భరత్ పెచ్చెరువు ప్రాంతంలో ఎఫ్‌ఎస్‌ఓ శివయ్యతో పాటు కలిసి గణాంక సేకరణలో పాల్గొంటున్నారు.
ఎంసెట్ నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి
* ఇంజినీరింగ్‌కు 8,889, మెడిసిన్‌కు 4,696..
* నిమిషం ఆలస్యమైనా అనుమతి లేదు..
* రీజినల్ కో-ఆర్డినేటర్ శ్రీనివాసరెడ్డి
కర్నూలుస్పోర్ట్స్, మే 2: ఇంజినీరింగ్, అగ్రికల్చర్, మెడిసిన్ కోర్సుల్లో ప్రవేశం కోసం నిర్వహించే ఉమ్మడి పరీక్ష ఎంసెట్-2013 నిర్వహణకు దాదాపు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు రీజినల్ కో-ఆర్డినేటర్ శ్రీనివాసరెడ్డి తెలిపారు. గురువారం ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఇంజినీరింగ్‌కు 8,889 మంది దరఖాస్తు చేసుకున్నారని, ఇందులో 5,775 బాలురు, 3,138 బాలికలు, మెడిసిన్‌కు 4,696 మందిలో 2,314 బాలురు, 2,406 బాలికలు ఉన్నారని తెలిపారు. ఈ నెల 10వ తేదీ ఇంజినీరింగ్ పరీక్ష 16 కేంద్రాల్లో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకూ, మెడిసిన్ పరీక్ష 7 కేంద్రాల్లో మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకూ జరుగుతుందన్నారు. పరీక్ష కేంద్రానికి విద్యార్థులు అర గంట ముందే చేరుకోవాలని, నిమిషం ఆలస్యమైనా పరీక్ష కేంద్రంలోకి అనుమతించమని స్పష్టం చేశారు. విద్యార్థులు హాల్ టికెట్లను డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు.ఎపిఎంసెట్.ఓఆర్‌జి వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలన్నారు. పాస్‌వర్డ్ మరిచిపోయిన వారు ఫర్గాట్ పాస్‌వర్డ్ అని క్లిక్ చేసి డౌన్‌లోడ్ చేసుకోవచ్చన్నారు. పరీక్ష కేంద్రానికి విద్యార్థులు హాల్ టికెట్, ఆన్‌లైన్ అప్లికేషన్‌తో పాటు రెండు బ్లూ/బ్లాక్ బాల్ పాయింట్ పెన్నులు తీసుకురావాలన్నారు. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు తమ కుల ధ్రువీకరణ పత్రాలు తీసుకురావాలన్నారు. పరీక్ష కేంద్రంలో మొబైల్స్, క్యాలికులేటర్లు, ఎలక్ట్రానిక్స్ గ్యాడ్జెట్లను అనుమతించబోమన్నారు. పరీక్ష కేంద్రాల్లో మొబైల్ జామర్లను కూడా ఉపయోగించనున్నట్లు శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. విద్యార్థులు ఓఎంఆర్ షీట్‌లో తమ పేరు, ఫొటో, రోల్ నెంబర్‌ను సరి చూసుకోవాలని, బుక్‌లెట్ కోడ్‌ను బ్లూ/బ్లాక్ పెన్‌తో పూర్తి చేయాలని పెన్సిల్‌ను వినియోగించకూడదన్నారు. సమాధానాలను మార్చేందుకు రబ్బరు, వైట్‌నర్ వాడితే సంబంధిత సమాధాన పత్రాలను మూల్యాంకనానికి యంత్రం స్వీకరించదన్నారు. పరీక్ష రాసిన తరువాత విద్యార్థులు తమ ఓఎంఆర్ షీట్‌తో పాటు ఆన్‌లైన్ అప్లికేషన్ ఫారంను ఇన్విజిలేటర్‌కు సమర్పించాలన్నారు. అప్లికేషన్ ఫారంను సమర్పించని వారు కన్వీనర్‌కు పోస్టు ద్వారా పంపవచ్చన్నారు. అప్లికేషన్ ఫారం ఇవ్వని వారి ఫలితాలను విత్‌హెల్డ్ చేసే ఆస్కారం వుందన్నారు. హాల్ టికెట్ డౌన్‌లోడ్‌లో ఇబ్బంది ఎదురైతే కన్వీనర్ లేదా రీజినల్ కో-ఆర్డినేటర్ ఫోన్ నెంబర్లను సంప్రదించగలరని కో-ఆర్డినేటర్ తెలిపారు. పరీక్ష కేంద్రాలను ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు, ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు, రీజినల్ అబ్జర్వర్లు తనిఖీ చేస్తారన్నారు.
మల్లన్న సేవలో హరిద్వార్ మఠం పీఠాధిపతి
సత్యమిత్రానంద మహాస్వామి
శ్రీశైలం, మే 2: శ్రీశైల మహాక్షేత్రంలో కొలువుదీరిన మల్లికార్జున స్వా మి, భ్రమరాంబిక అమ్మవార్లను గురువారం హరిద్వార్‌లోని మహామండలేశ్వర మఠం పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ సత్యామిత్రానంద మహాస్వామి దర్శించుకున్నారు. ఉదయం ఆలయం వద్దకు చేరుకున్న పీఠాధిపతికి ఆలయ అర్చకులు, అధికారులు సంప్రదాయం ప్రకారం రాజగోపురం వద్ద వేదమంత్రాలతో పూర్ణకుంభ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పీఠాధిపతి అమ్మవారిని దర్శించుకుని, అభిషేకం చేశారు. అనంతరం అమ్మవారి ఆలయంలో ఆశీర్వాద మండపం వద్ద పీఠాధిపతుల గౌరవార్థం దేవస్థానం వేదగోష్టి నిర్వహించి సత్కరించింది. ఈ సందర్భంగా పీఠాధిపతి మహాస్వామి మాట్లాడుతూ యాత్రలో భాగంగా శ్రీశైల క్షేత్రాన్ని దర్శించానన్నారు. భారతదేశం మహోన్నతమైనదని సాక్షాత్తు భగవంతుడే వివిధ అవతారాల్లో భూమిపై సంచరించాడన్నారు. పుణ్యభూమిలో ఎన్నో పుణ్యక్షేత్రాలు వున్నాయని, భక్తులు తప్పకుండా పుణ్యక్షేత్రాల్లో స్నానమాచరించి శాంతి సౌభాగ్యాలు పొందాలని సూచించారు. క్షేత్ర సందర్శణం వల్ల ఆధ్యాత్మిక భావాలు పెంపొందడమే కాకుండా ప్రశాంతత లభిస్తుందన్నారు. శ్రీశైల క్షేత్రం ఎంతో మహిమాన్విత క్షేత్రమని జ్యోతిర్లింగం, మహాశక్తి స్వరూపిణి ఒకే ఆలయ ప్రాంగణంలో వెలసి వుండటం ఎంతో విశేషమని పురాణాలు పేర్కొన్నాయన్నారు. భారతదేశ ఔన్నాత్యాన్ని ప్రజలకు తెలియజెప్పాలనే భావనతో దేశంలోనే మెట్టమెదటిసారిగా భరతమాత ఆలయాన్ని నిర్మించామని తెలిపారు.
10న దేశ వ్యాప్త మెడికల్ షాపుల బంద్
కర్నూలు, మే 2: దేశ వ్యాప్తంగా ఈ నెల 10వ తేదీ మెడికల్ షాపులు మూసివేసి నిరసన తెలపాలని మెడికల్ షాపుల అసోసియేషన్ నిర్ణయించింది. దీర్ఘకాలికంగా ఉన్న తమ డిమాండ్లను పరిష్కరించడంలో ప్రభుత్వం అనుసరిస్తున్న నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు కర్నూలు జిల్లా మెడికల్ షాపుల సంఘం నాయకులు రామకృష్ణ, పుల్లయ్య, పువ్వాడి భాస్కర్ గురువారం తెలిపారు. గతంలో షెడ్యూల్ హెచ్ కింద ఉన్న మందులను షెడ్యూల్ హెచ్1 కిందకు తీసుకురావాలన్న ప్రభుత్వ ఆలోచనను విరమించుకోవాలని వారు డిమాండ్ చేశారు. అలాగే ఐదేళ్ల అనుభవం ఉన్న దుకాణదారులకు ఫార్మసీ సర్ట్ఫికెట్ మంజూరు చేసి మందుల దుకాణాలు నిర్వహించుకునేందుకు అనుమతించాలని కోరారు. ఫార్మసీ రంగంలో ఉన్న వారి సంక్షేమం కోసం ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి విన్నవించారు. మెడికల్ షాపుల బంద్‌ను విజయవంతం చేసేందుకు అన్ని ప్రాంతాల్లో సమావేశాలు నిర్వహించనున్నట్లు వారు స్పష్టం చేశారు.
హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి
నేడు కర్నూలు రాక
* కోర్టు ఆవరణలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన
ఆంధ్రభూమి బ్యూరో
కర్నూలు, మే 2: నగరంలోని కోర్టు భవనాల సముదాయంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం తా త్కాలిక ప్రధాన న్యాయమూర్తి ఎన్‌వి రమణ శుక్రవారం వస్తున్నట్లు జిల్లా న్యాయవాదుల సంఘం నాయకులు జయరాజు తెలిపారు. కర్నూలులోని జూనియర్ సివిల్ జడ్జి కోర్టు భవనాల సముదాయంలో నూతన భవన నిర్మాణానికి శుక్రవారం ఆయన శంకుస్థాపన చేస్తారని తెలిపారు. ఆ తరువాత న్యాయవాదుల కోసం నిర్మించిన రిక్రియేషన్ గది, టిజివి మినరల్ వాటర్ ప్లాంట్‌ను ప్రారంభిస్తారన్నారు. అలాగే న్యాయవాదుల సంక్షేమ నిధి సభ్యత్వ సర్ట్ఫికెట్లను పంపిణీ చేస్తారని వివరించారు. ఇక సాయంత్రం జరిగే జిల్లా న్యాయవాదుల సంఘం 3వ వార్షికోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా హైకోర్టు న్యాయమూర్తి సివి నాగార్జునరెడ్డి హాజరవుతారని తెలిపారు. ఈ కార్యక్రమాల్లో జిల్లా ప్రధాన న్యాయమూర్తి బసవయ్య, మంత్రులు ఏరాసు ప్రతాపరెడ్డి, టిజి వెంకటేష్, న్యాయవాదుల సంఘం నాయకులు, తదితరు లు పాల్గొంటారని ఆయన తెలిపారు.
నాయకుల నిర్లక్ష్యం.. సీమకు శాపం
* బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి
హొళగుంద, మే 2: నాయకుల నిర్లక్ష్యం వలన రాయలసీమకు శాపంగా మారిందని రాయలసీమ పరిరక్షణ సమితి వ్యవస్థాపకుడు బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి ఆరోపించారు. గురువారం ట్రాక్టర్ యాత్ర సందర్భంగా రాయలసీమ పరీరక్షణ సమితి వ్యవస్థాపకుడు బైరెడ్డి ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ ప్రజలు మేల్కొనకపోతే రాయలసీమ కాలగర్భంలో కలిసిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. రాయలసీమ వారు ముఖ్యమంత్రులైన రాయలసీమ గురించి ఏం చేయలేదని విమర్శించారు. పరిశ్రమలు మూతపడ్డాయని, డిగ్రీలు చదివిన ఉద్యోగాలు రావడం లేదని, ఉపాధి లేక ప్రజలు వలసవెళ్తున్నారని పేర్కొన్నారు. నాడు రతనాల సీమగా ఉంటే నేడు నాయకుల నిర్లక్ష్యం, మోసం వలన రాళ్లసీమగా మారిందని విమర్శించారు. టిబి డ్యాంపై నాలుగుప్రాజెక్టులు నిర్మిస్తున్నారని, భవిష్యత్తులో చుక్కనీరు రాకుండాపోతుందని ఎల్లెల్సీ నీరు పంటలకు వదిలితే జలచౌర్యం అవుతున్న పట్టించుకొనే నాథుడే కరువైయ్యారని ఆరోపించారు. నాయకులు పదవులకోసమే పాకులాడుతున్నారేతప్పా రాయలసీమకు సాగుచేసిందంటూ ఏం లేదన్నారు. తెలంగాణ వారు విద్యుత్ బిల్లులు చెల్లించడం లేదని, రాయలసీమకు చెందిన లాయర్లు, విద్యార్థులు, ఉద్యోగస్తులపై తెలంగాణవాదులు దాడి చేసిన సంఘటనలున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటిసి రామలింగారెడ్డి, బిజెపి నాయకులు చిదానంద, రవీంద్ర, బాబుల్‌రెడ్డి, మాజీ ఉపాధ్యక్షుడు హనుమంతరాయుడు, మాజీ సర్పంచ్ మద్దిలేటి, పంపారెడ్డి, బాసుమీయ్య, సిద్దప్పలు పాల్గొన్నారు.
స్కాలర్‌షిప్‌కు ఆధార్,
ఎన్‌పిఆర్ తప్పనిసరి
కల్లూరు, మే 2: రాయలసీమ యూనివర్శిటీలో పిజి చదువుతున్న బిసి, ఎస్సీ, ఎస్టీ, పిహెచ్, మైనార్టీ, ఇబిసి విద్యార్థులు స్కాలర్‌షిప్ పొందడానికి ఆధార్ కార్డు, ఎన్‌పిఆర్ నెంబర్ తప్పనిసరిగా సమర్పించాలని వర్శిటీ ప్రిన్సిపాల్ గురువారం ఒక ప్రకటలో తెలిపారు. జిల్లా సంక్షేమ శాఖ అధికారులు విద్యార్థుల నుంచి ఆధార్, ఎన్‌పిఆర్ నెంబర్లు అడుగుతున్నందున్న ఈ నెల 8వ తేదీలోగా యూనివర్శిటీ కార్యాలయానికి వచ్చి విద్యార్థుల ఎన్రోల్‌మెంట్ నెంబర్‌తో పాటు ఆధార్, ఎన్‌పిఆర్ జిరాక్స్ కాపీలను అందజేయాలన్నారు. లేనిపక్షంలో విద్యార్థుల స్కాలర్‌షిప్ మంజూరుకాదని, ఇందుకు యూనివర్శిటీ అధికారులు బాధ్యులు కారని ప్రిన్సిపాల్ తెలిపారు.
పాకిస్తాన్, భారత్ ప్రభుత్వాల
దిష్టిబొమ్మలు దగ్ధం
ఆదోని, మే 2: పాకిస్తాన్‌లో సరబ్‌జిత్‌సింగ్ హత్యకు నిరసనగా ప్రభుత్వ చర్యలను నిరసిస్తూ బిజెవైఎం కార్యకర్తలు విభిఎస్ సెంటర్‌లో పాకిస్తాన్, భారత్ ప్రభుత్వాల దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు. బిజెపి అధ్యక్షులు శ్రీనివాస్, నాయకులు సోమన్న, బిజెవైఎం నాయకులు మునిస్వామి, శ్రీరామసేన అధ్యక్షులు పవన్‌కుమార్, యువరాజ్, రా ము, శ్రీకాంత్, తదితరుల ఆధ్వర్యంలో నిర్వహించారు. జిల్లా బిజెవైఎం ప్రధాన కార్యదర్శి దేవరాజ్ మా ట్లాడుతూ సరబ్‌జిత్ మృతికి భారత ప్రభుత్వమే కారణమన్నారు. గత 5 సంవత్సరాల నుంచి సరబ్‌జిత్ కుటుంబసభ్యులు పాకిస్తాన్‌లో ఉన్న తమ కుమారుని విడుదల చేయమని భారత ప్రభుత్వానికి ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసిన ఫలితం లేకుండాపోయిందని చెప్పారు. తోటి ఖైదీలచేత సరబ్‌జిత్ సింగ్‌ను పాకిస్తాన్ ప్ర భుత్వమే నిర్ధాక్షిణ్యంగా హత్య చేయించిందని ఆరోపించారు. సరబ్‌జిత్‌సింగ్‌ను హత్య చే సిన వారిని భారత్‌కు అ ప్పగించాలని భజరంగదళ్ నాయకులు డిమాండ్ చేశారు. భారత ప్రభుత్వం తగు చర్యలు తీసుకొని సరబ్‌జిత్‌సింగ్ విడుదలకు కృషి చేసి ఉంటే ఆయన బతికి ఉండేవాడని భజరంగదళ్ నాయకులు పేర్కొన్నారు. విశ్వహిందూపరిష త్ కార్యాలయంలో భజరంగదళ్ ఆధ్వర్యంలో సరబ్‌జిత్ సింగ్ సంతాపసభ నిర్వహించారు. సంతాపసభలో భజరంగదళ్ నాయకులు నాగరాజుగౌడు, విజయకృష్ణ, సాయిప్రసాద్, వినోద్, రవికుమార్, జనార్ధన్, శ్రీనివాస్, చక్రి, అరుణ్‌లు పాల్గొన్నారు. నాయకులు మాట్లాడుతూ 1990లో పాకిస్తాన్‌లోని పంజాబ్ ప్రావినెన్స్‌లో జరిగిన బాం బుదాడిలో సరబ్‌జిత్‌సింగ్‌ను మొదటి ముద్దాయిగా పాకిస్తాన్ కోర్టు తీర్పు ఇవ్వడం దారుణమన్నారు. మన ప్రభు త్వం ఆరోజు పట్టించుకొని ఉంటే సరబ్‌జిత్‌సింగ్ బతికి ఉండేవాడని చెప్పా రు. సరబ్‌జిత్‌సింగ్ హత్యకు నిరసనగా పాకిస్తాన్‌తో భారతప్రభుత్వం లావాదేవీలు, శాంతి ఒప్పందాలను నిలిపేయాలని డిమాండ్ చేశారు. పాకిస్తాన్ విదేశాంగ శాఖ కార్యదర్శి జలాల్ అబ్బాస్ జిలాని భారత్‌కు తగిన సమాచారం ఇవ్వనందున మనదేశంలోకి ఆయనను అనుమతించొద్ద ని డిమాండ్ చేశారు. పాకిస్తాన్ జె ళ్లలో మగ్గుతున్న భారతీయ ఖైదీలను విడుదలకు పాకిస్తాన్‌పై ఒత్తిడి తేవాలన్నారు.
పాకిస్తాన్ దిష్టిబొమ్మ దగ్ధం
కర్నూలు రూరల్, మే 2: భారతీయులపై పాకిస్థాన్ ప్రభుత్వ ఆగడాలు, ఉగ్రవాద దాడులకు నిరసనగా భజరంగ్‌దళ ఆధ్వర్యంలో గురువారం కలెక్టరేట్ ఎదుట పాకిస్తాన్ దేశ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా భజరంగ్‌దళ్ నగర ప్రముఖ్ రామాంజినేయులు మాట్లాడుతూ పాకిస్తాన్ సరిహద్దులో సర్‌బ్‌జిత్‌సింగ్‌ను అరెస్టు చేసి ఉగ్రవాదిగా ముద్రవేసి జీవిత ఖైదీగా శిక్ష విధించి ఆయన మృతికి కారణమైందన్నారు. అలాగే దేశంలో అనేక విధ్వంసాలు, పేలుళ్లకు నిరసనగా తాము దిష్టిబొమ్మ దగ్ధం చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో శ్రీకాంత్, పవన్, ఉపేంద్ర పాల్గొన్నారు.
వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చాలి
* విఆర్‌పిఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు రామకృష్ణ
నంద్యాల రూరల్, మే 2: వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చేంత వరకు విఆర్‌పిఎస్ ఆధ్వర్యంలో ఉద్యమాలు బలోపేతం చేస్తామని వాల్మీకి రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు బోయ రామకృష్ణ అన్నారు. గురువారం నంద్యాల విఆర్‌పిఎస్ కార్యాలయంలో పివి రమణ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాల్మీకుల సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. ఈనెల 10 నుండి రిలేనిరాహార దీక్షలు, 20న జీపుజాత, 25న గోడపత్రిక విడుదల, జూన్ 6న ఛలో హైదరాబాద్ రాష్టస్థ్రాయి చైతన్య సదస్సు విజయవంతం చేయాలని ఆయన కోరారు. బలమైన సామాజిక వర్గాన్ని పార్టీలు విస్మరించాయని ఆయన అరోపించారు. ప్రాంతీయ వ్యత్యాసాలు తొలగించి వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చాలని డిమాండ్ చేశారు. ఎన్నికల మ్యానిఫెస్టులో వాల్మీకులను ఎస్టీలుగా పునరుద్దరిస్తున్నట్లు ప్రకటించాలని లేనిపక్షంలో జరగబోయ్యే పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి వస్తుందని వారు హెచ్చరించారు. కార్యక్రమంలో విఆర్‌పిఎస్ గౌరవాధ్యక్షులు బోయ పులికొండన్న, చాబోలి శంకర్, పరమటూరి శేఖర్, ప్రభాకర్, తిమ్మయ్య, నాగేంద్ర, బంగా రు వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
కోడుమూరులో
మారుతున్న రాజకీయ సమీకరణలు!
* వైకాపా గూటికి మణిగాంధీ.. * అంతర్మథనంలో రేణుకమ్మ, సుదర్శనం, రాజు
కోడుమూరు, మే 2 : అసెంబ్లీ ఎన్నికల సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో కోడుమూరు నియోజకవర్గంలో రాజకీయ సమీకరణలు మారుతున్నాయి. తెలుగుదేశం పార్టీకి మంచి క్యాడర్ ఉన్న ఎం.మణిగాంధీ పార్టీని వీడి వైకాపాలో చేరుతున్నట్లు సమాచారం. బుధవారం మణిగాంధీ హైదరాబాద్‌లో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మను కలవడంతో ఇక ఆయన వైకాపాలో చేరడం లాంఛనప్రాయమే అని తెలుస్తోంది. దీంతో ఇంతకాలం కోడుమూరు అసెంబ్లీ స్థానాన్ని ఆశిస్తున్న వైకాపా నాయకురాలు మాదారపు రేణుకమ్మ, నాయకంటి సుదర్శనం, జిఎన్ రాజు అంతర్మథనంలో పడ్డారు. రాబోయే అసెంబ్లీ ఎన్నిటల్లో మణిగాంధీని వైకాపా తరపున బరిలోకి దింపి విజయం సాధించాలని వైకాపా నేతలు పావులు కదుపుతున్నారు. కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉన్న కోడుమూరులో విజయకేతనం ఎగురవేయాలని ఆది నుంచి ప్రత్యర్థి పార్టీలు రాజకీయ పోరాటం సాగిస్తున్న విషయం తెలిసిందే. గతంలో కాంగ్రెస్ పార్టీకి బలమైన ప్రత్యర్థిగా టిడిపి ఉండేది. అయితే రాష్ట్రంలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావంతో మూడు పార్టీలు శ్రమించాలన్సిన పరిస్థితులు ఏర్పాడ్డాయి. ఇప్పటికే వైకాపా జనాకర్షణ కోసం ఊరురా సుడిగాలి పర్యటనలు చేస్తున్న విషయం తెలిసిందే. స్పీడ్ రాజకీయాల వల్ల అన్నీ చోట్ల అసెంబ్లీ స్థానాలను కైవసం చేసుకోవాలనే ప్రధాన లక్ష్యంతో వైకాపా ముఖ్యనేతలు ప్రజాకర్షణ ఉన్న నేతల కోసం గాలం వేస్తు న్న విషయం తెలిసిందే. ఇందులో భాగమే ఈసారి ఎలాగైనా కోడుమూరులో కాంగ్రెస్‌ను దెబ్బ కొట్టాలని వైకా పా వ్యూహం పన్నుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. కోడుమూరు నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే, దివంగత ఎం.శిఖామణి తనయు డు ఎం.మణిగాంధీకి జనాదరణ ఉంది. మణిగాంధీ గత అసెంబ్లీ ఎన్నికల్లో టిడిపి తరుపున పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థిపై స్పల్ప మెజార్టీతో ఓటమిపాలయ్యారు. అప్పటి నుంచి మణిగాంధీ కోడుమూరు నియోజకవర్గ టిడిపి ఇన్‌చార్జిగా ఉంటూ పార్టీ కార్యక్రమాలు చేపడుతూ వస్తున్నారు. ఇది ఇలా ఉండగా మణిగాంధీకి రాజకీయ అభివృద్ధికి సహాయపడుతున్న కొత్తకోట ప్రకాష్‌రెడ్డి, నిడ్జూరు రాంభూపాల్‌రెడ్డి, పులకుర్తి రాజారెడ్డి, ప్యాలకుర్తి రంగారెడ్డి, డా. గిడ్డయ్య ప్రస్తుతం వైకాపాలో ఉన్నారు. దీంతో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కోడుమూరు అసెంబ్లీ స్థానాన్ని కైవసం చేసుకోవాలంటే ఆ నేతల ప్రోద్భలం ఎంతో అవసరం. అందుకే మణిగాంధీ టిడిపిని వీడి వైకాపాలో చేరేందుకు సర్వం సిద్ధం చేసుకుంటున్నట్లు సమాచారం.
తాగునీటి ఎద్దడిపై నిర్లక్ష్యాన్ని ఉపేక్షించను..
* కలెక్టర్ సుదర్శన్‌రెడ్డి
ప్యాపిలి, మే 2: గ్రామాల్లో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా పంచాయతీ కార్యదర్శులు ప్రత్యేక దృష్టి సారించాలని, నిర్లక్ష్యం వహిస్తే ఉపేక్షించేది లేదని కలెక్టర్ సుదర్శన్‌రెడ్డి హెచ్చరించారు. స్థానిక ఎంపిడిఓ కార్యాలయంలో గురువారం కలెక్టర్ వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తాగునీటి సమస్య తీవ్రంగా వున్న 11 గ్రామాల్లో ట్యాంకర్లతో నీరు సరఫరా చేయాలన్నారు. ఇన్‌పుట్ సబ్సిడీ రైతుల ఖాతాకు జమ అయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఉపాధి హామీ పనుల్లో కూలీల శాతం పెంచి వలసలను నివారించాలన్నారు. వ్యక్తిగత మరుగుదొడ్లను నిర్మించేలా కృషిచేయాలన్నారు. అధికారులు స్థానికంగా అందుబాటులో ఉండి ప్రజల సమస్యలను పరిష్కరించాలన్నారు. కార్యక్రమంలో జెసి కన్నబాబు, జడ్పీ సిఇఓ సూర్యప్రకాష్, రమాణారెడ్డి, ఓబుల్‌నాయక్, పాల్గొన్నారు.
* కలెక్టర్ సుదర్శన్‌రెడ్డి
english title:
direct
Date:
Friday, May 3, 2013