అజిత్‌సింగ్‌నగర్, మే 2: ఆర్థిక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న విజయవాడ నగర పాలక సంస్థకు త్వరలోనే నిధుల మంజూరయ్యే అవకాశాలు మెండుగా కనబడుతున్నాయి. నిధుల్లేమితో అర్ధాంతరంగా నిలచిపోయిన వివిధ అభివృద్ధి పనులు మరలా పునఃప్రారంభానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ విషయమై రాష్ట్ర ప్రభుత్వంతోపాటు గృహ నిర్మాణ సంస్థ హడ్కోలతో తగు సంప్రదింపులు సఫలీకృతమైనాయని, త్వరలోనే ఆయా నిధులు మంజూరు చేసే అవకాశం ఉన్నట్లు కార్పొరేషన్ కమిషనర్ జిఎస్ పండాదాస్ ఆశాభావం వ్యక్తం చేశారు. గురువారం కమిషనర్ చాంబర్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో పండాదాస్ మాట్లాడుతూ హడ్కో సంస్థ నుంచి 75 కోట్ల రూపాయలు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి 57.4 కోట్ల రూపాయలను మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. దీంతో జెఎన్‌ఎన్‌యుఆర్‌ఎం పథకంలో నిర్మిస్తున్న జి ప్లస్ త్రీ పక్కాగృహాల నిర్మాణ పనులు పునఃప్రారంభం కానున్నట్లు వివరించారు. నిధుల కొరతతో ఇప్పటికే అర్ధాంతరంగా ఈ నిర్మాణాలు నిలచిపోయిన విషయం అందరికీ విదితమే. కాగా ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధుల మంజూరుతోపాటు నగర పాలక సంస్థ ఆదాయవనరుల పెంపునకు తీసుకోవాల్సిన అన్ని చర్యలను తీసుకొంటున్నట్లు ఆయన తెలిపారు. జెఎన్‌ఎన్‌యుఆర్‌ఎం పథకంలో నిర్మించిన యుజిడి, వాటర్ సప్లై వలన సుమారు 15 కోట్ల రాబడి ఉండే అవకాశం ఉందన్నారు. అలాగే నగర పాలక సంస్థకు నగర ప్రజలు చెల్లించే ఆస్తి పన్ను చెల్లింపులు ఆశాజనకంగా ఉన్నాయని, మొత్తం సుమారు 73 కోట్ల రూపాయలు వసూలు లక్ష్యానికి గాను 70 కోట్ల వరకూ వసూలు చేసినట్లు తెలిపారు. మిగిలిన 3 కోట్ల రూపాయలను కూడా ఈనెల 15వ తేదీ లోగా వసూలు చేసేందుకు చర్యలు తీసుకొని పూర్తిస్థాయిలో ఆస్తిపన్ను వసూలుకు రంగం సిద్ధం చేసామన్నారు. అలాగే వ్యాపారులు చెల్లించాల్సిన డి అండ్ ఓ ట్రేడ్ లైసెన్స్ ఫీజల వసూలును కూడా ఖచ్చితంగా చేపడుతన్నట్లు తెలిపారు. ప్రస్తుతం నిర్వహిస్తున్న జియోగ్రాఫిక్ ఇన్ఫర్మేషన్ సిస్టం వలన ఆస్తిపన్ను లో వ్యత్యాసాల వసూలు తోపాటు ట్రేడ్ లైసెన్సుల ఫీజుల వసూలు కూడా పెరుగుతాయన్నారు. నగర ప్రజలు వృత్తి పన్ను వసూలు కూడా పెరిగే అవకాశాలున్నాయన్నారు. వీటన్నిటి మీద సుమారు 27 కోట్ల రూపాయలను టార్గెట్‌గా నిర్ణయించామన్నారు. అదే విధంగా నగరంలోని రైల్వే శాఖ నుంచి నగర పాలక సంస్థకు రావాల్సిన 4.5 కోట్ల రూపాయల వసూలుకు కూడా రంగం సిద్ధం చేస్తున్నామన్నారు. జియోగ్రాఫిక్ సర్వే వలన 25 నుంచి 30 శాతం ఆదాయం పెరిగే అవకాశం ఉన్నట్లు కమిషనర్ పండాదాస్ తెలిపారు. అంతేకాకుండా జి ప్లస్ త్రీ పక్కాగృహ లబ్ధిదారులు చెల్లించాల్సిన లబ్ధిదారుల వాటా నలభై వేల రూపాయల వసూలును కూడా వేగవంతం చేస్తున్నామన్నారు. సుమారు 67 కోట్ల రూపాయల నిధులు స్తంభించిపోయాయని, ప్రస్తుతం ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని భవిష్యత్తులో కేటాయించబోయే పక్కాగృహ కేటాయింపులలో లబ్ధిదారుని వాటా నలభై వేల రూపాయలను పూర్తిగా చెల్లించిన వారికే గృహాలను కేటాయించే చర్యలు చేపట్టబోతున్నట్లు తెలిపారు. నగరంలో ప్రముఖ వ్యాపార కేంద్రమైన వస్తల్రత వ్యాపారుల నుంచి సుమారు ఎనిమిది కోట్ల రూపాయలు రావాల్సి ఉందన్నారు. వీటి వసూలులో కూడా తగు చర్యలు తీసుకుని నగర పాలక సంస్థకు ఆదాయాన్ని సమకూర్చుతున్నట్లు తెలిపారు. ఇదిలావుండగా నగరంలో ఉన్న ఎన్‌టిఆర్ కాంప్లెక్సు అదనపు భవన సముదాయం నిర్మాణాన్ని త్వరలోనే చేపట్టనున్నట్లు తెలిపారు. వ్యాపారుల నుంచి గుడ్‌విల్ రూపంలో నిధులను సమకూర్చి ఆయా నిధులతో భవన నిర్మాణం చేపడితే కార్పొరేషన్ ఖజానాకు శాశ్వత ఆదాయ వనరుగా ఉంటుందన్నారు. నగరంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న అడ్వర్‌డైజ్‌మెంట్ల విషయంలో కూడా నూతన ఆలోచన చేస్తున్నట్లు, నగరాన్ని జోన్‌లుగా విభజించి జోన్ల వారిగా పన్నులు వసూలు చేసే యోచన చేస్తున్నామని వివరించారు. ఇప్పటి వరకూ అర్ధిక సమస్యలతో సతమతమయ్యే విజయవాడ నగర పాలక సంస్థ ఇకముందు ఆర్ధిక పరిపుష్టి గల నగరంగా తీర్చిదిద్ది నగరాభివృద్ధికి కృషిచేస్తున్నట్టు కమిషనర్ పండాదాస్ వివరించారు.
- కొనుగోలు కేంద్రం ఎత్తివేతపై కనె్నర్ర -
మినుము తగులబెట్టి రైతుల నిరసన
ఉయ్యూరు, మే2: వ్యవసాయ మార్కెట్ యార్డులో నెలకొల్పిన మినుము కొనుగోలు కేంద్రాన్ని తిరిగి ప్రారంభించాలని డిమాండు చేస్తూ గురువారం రైతులు రాస్తారోకో, ధర్నాతోపాటు పండించిన మినుము తగలబెట్టి నిరసన తెలిపారు. మార్కెఫెడ్ ఆధ్వర్యంలో వ్యవసాయ మార్కెట్ యార్డు ఆవరణలో సుమారు రెండు నెలల క్రితం మినుము కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ కేంద్రాన్ని రాష్ట్ర మాధ్యమిక విద్యాశాఖామాత్యులు కె.పి.సారథి ప్రారంభించారు. రూ..4,300లకు మినుము కొనుగోలు ధరను నిర్ణయించారు. రైతుల వద్దనుంచి రూ.3,500కు కొన్న బ్రోకర్లు కొనుగోలు కేంద్రంలో అధిక ధరకు అమ్ముకుంటున్నారనే విమర్శలు ఎదురయ్యాయి.
ఈనేపథ్యంలో గత నెల 18న కొనుగోలును నిలిపి వేసారు. ఆనాటి నుంచి రైతులు తిరిగి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించాలని అధికారులను నాయకులను వేడుకున్నారు. వారి స్పందన కరువవ్వడంతో గురువారం ఆందోళనకు దిగారు. మధ్యాహ్నం కొనుగోలు కేంద్రానికి వచ్చిన రైతులు కొందరు తాము అప్పటికే తీసుకువచ్చి యార్డులో ఆరబోసిన మినుమునైనా కొనుగోలు చేయమని కేంద్రం అధికారులను కోరారు. దానికి వారు నిరాకరించడంతో ఆగ్రహించిన వారు తాము తెచ్చిన మినుము పంటను కాల్చి బూడిద చేశారు. అనంతరం ఉయ్యూరు, కాటూరు రహదారిపై బైఠాయించి ధర్నా రాస్తారోకో చేశారు. సుమారు మూడు గంటల పాటు ధర్నా కొనసాగింది. వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కల్గింది. రైతుల ఆందోళనను తెలుసుకున్న జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు దేవినేని ఉమామహేశ్వరరావు, మాజీ శాసనమండలి సభ్యులు వై.వి.బి రాజేంద్రప్రసాదు, పామర్రు నియోజకవర్గపార్టీ ఇన్‌చార్జి వర్ల రామయ్య, వైయస్‌ఆర్‌సిపి నాయకులు పడమటి సురేష్‌బాబు తదితరులు రైతులకు మద్దతుగా నిలిచారు. మార్క్‌ఫెడ్ చైర్మన్ కంచి రామారావుతో ఫోన్‌లో సంప్రతించారు. వెంటనే కేంద్రాన్ని తిరిగి ప్రారంభించాలని డిమాండు చేశారు. లేకుంటే ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.సాయంత్రం మార్‌ఫెడ్ అధికారులు ఆందోళనకారులతో చర్చలు జరిపారు. సుమారు 600 టన్నుల మినుము మిగిలి వున్నదని, దానిని కొనుగోలు చేసేందకు నిధుల కొరత దృష్ట్యా చేయలేక పోయామని, త్వరలో వాటిని కొనుగోలు చేస్తామని హామీ ఇవ్వడంతో రైతుల ఆందోళన విరమించారు.
పాలిసెట్-13 ప్రశాంతం
మచిలీపట్నం (కల్చరల్), మే 2: పట్టణంలో గురువారం పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్ష ప్రశాంతంగా జరిగింది. 11 పరీక్ష కేంద్రాలలో నిర్వహించిన ఈ పరీక్షలకు 98.14 శాతం విద్యార్థులు హాజరయ్యారు. 4వేల 471 మందికి గాను 4,388 మంది పరీక్ష రాశారు. బాలురలో 3,243 మందికిగాను 3,179 మంది, బాలికల్లో 1,228 మందికి 1,209 మంది పరీక్షకు హాజరయ్యారు. ఎలాంటి మాల్‌ప్రాక్టీసు కేసు నమోదు కాలేదు. స్థానిక వరలక్ష్మి పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ సిహెచ్ కృష్ణమూర్తి, సెంటర్ లెవల్ అబ్జర్వర్, కాకినాడ ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ ఫణీంద్రకుమార్ పర్యవేక్షించారు.
సేవల్లోనే సంతృప్తి
మచిలీపట్నం , మే 2: సేవాతత్పరతలోనే ఆనందం ఉంటోందని త్రిపుర సుందరి ఫౌండేషన్ ఇండియా అధ్యక్షుడు డా. శాస్ర్తీ ఎల్ కోట అన్నారు. స్థానిక పరాసుపేటలో త్రిపుర సుందరి ఫౌండేషన్ ఇండియా 17వ వార్షికోత్సవం గురువారం ఘనంగా జరిగింది. ఈసందర్భంగా నిర్వహించిన సమావేశానికి అధ్యక్షత వహించిన డా. శాస్ర్తీ మాట్లాడుతూ విశ్వానికి అతీతమైన శక్తి మనలను నడిపిస్తుందన్నారు. తోటివారికి సాయం అందించాలనే ఆశయంతో ఆచార్య కోట సుందరరామశర్మ త్రిపుర సుందరి ఫౌండేషన్‌ను స్థాపించారన్నారు. విజయవాడ శంకర్ నేత్ర వైద్యశాల వైద్యనిపుణలు డా. కెఎన్ మూర్తి మాట్లాడుతూ మధుమేహ వ్యాధి పట్ల అవగాహన లేక సమర్థవంతంగా నియంత్రించక పోవడం వల్ల 25శాతం మంది అంధత్వానికి గురవుతున్నారన్నారు. డయబెటిక్ రెటీనాపతికి తొలిదశలో లేజర్ చికిత్స అనివార్యమన్నారు. కార్తికేయ పిల్లల ఆసుపత్రి వైద్యులు డా. కె వీరేశ్వరరావు మాట్లాడుతూ పిల్లలకు చక్కెర వ్యాధి రాదనేది అపోహ మాత్రమేనన్నారు. కన్ను, మూత్రపిండాలు, నరాలపై మధుమేహ వ్యాధి ప్రభావం చూపుతుందన్నారు. ప్రముఖ వైద్యులు డా. అశ్వనికుమార్ మాట్లాడుతూ ఉదయపు నడక, మితాహారం, మందులతో మధుమేహ వ్యాధిని నియంత్రించవచ్చన్నారు. ఈసందర్భంగా జిల్లా కేంద్ర ప్రభుత్వాసుపత్రి విశ్రాంత సూపరింటెండెంట్ డా. ఎన్ కృష్ణారావును ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో సంస్థ కార్యదర్శి వి శివరాం, డా. కె శివప్రసాద్, తదితరులు పాల్గొన్నారు. సభ అనంతరం సుమారు 200మంది మధుమేహ వ్యాధిగ్రస్తులకు మందులు పంపిణీ చేశారు.
14న అజ్మీర్‌కు ప్రత్యేక రైలు
మచిలీపట్నం (కోనేరుసెంటర్), మే 2: ముస్లింలకు ఎంతో పవిత్రమైన అజ్మీర్ షరీఫ్ ఉరుసు యాత్రకు బందరు ఎంపి కొనకళ్ళ నారాయణరావు ఈసంవత్సరం కూడా మచిలీపట్నం నుండి ప్రత్యేక రైలు వేయించారని జిల్లా తెలుగుదేశం పార్టీ మైనార్టీ సెల్ కార్యదర్శి షేక్ అమీర్ బాషా గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. 07131 నెంబరు రైలు మచిలీపట్నం నుండి 14న ఉదయం 9గంటలకు అజ్మీర్‌కు బయలు దేరుతుందన్నారు. అజ్మీర్ నుండి తిరిగి 19న సాయంత్రం 6.30కి 07828 నెంబరు రైలు మచిలీపట్నం బయలుదేరుతుందని తెలిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.
అన్నదమ్ముల ఆత్మహత్య
పెనుగంచిప్రోలు, మే 2: కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలు మండల పరిధిలో గురువారం ఇద్దరు సోదరులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. పోలీసుల కథనం ప్రకారం... విజయవాడ నగరానికి చెందిన ఎం వెంకటరమణ(50) షేర్‌మహమ్మద్‌పేటలో హోటల్ వ్యాపారం నిర్వహిస్తున్న తన సోదరుడు సత్యనారాయణ(45)ను చూసేందుకు వచ్చాడు. అక్కడి నుండి ఇద్దరూ తమ సోదరిని పలకరించేందుకు పెనుగంచిప్రోలు మండలం అనిగండ్లపాడు గ్రామానికి వెళ్లారు. తిరిగి వస్తూ మార్గంమధ్యలో మామిడి తోటల వద్ద పురుగుమందు తాగి అపస్మారక స్థితికి చేరారు. వీరిని గమనించిన స్థానికులు వెంటనే పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించారు. ఎస్‌ఐ ఉమామహేశ్వరరావు, తహశీల్దార్ అనిల్ జన్నిసన్ వెంటనే సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. వెంకటరమణ అప్పటికే మరణించగా కొనఊపిరితో ఉన్న సత్యనారాయణను 108 అంబులెన్స్‌లో జగ్గయ్యపేట తరలిస్తుండగా మార్గంమధ్యలో మృతి చెందాడు. పుట్టుకతోనే అంధుడైన వెంకటరమణ ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్యకు పాల్పడి వుంటాడని భావిస్తున్నారు. సత్యనారాయణ బలవన్మరణానికి కారణాలు తెలియాల్సి వుంది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ ఉమామహేశ్వరరావు వివరించారు.
‘ఇందిరమ్మ కలలు’పై అధికారుల అలక్ష్యం
కూచిపూడి, మే 2: ఇందిరమ్మ కలలు అవగాహన కార్యక్రమాన్ని మొక్కుబడిగా నిర్వహించేందుకు అధికారులు చేస్తున్న ప్రయత్నాలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళతానని పామర్రు శాసనసభ్యులు డివై దాస్ హెచ్చరించారు. డా. బిఆర్ అంబేద్కర్ దేశ ఆర్థిక వ్యవస్థలో ఎస్‌సి, ఎస్‌టిలకు 24శాతం మొత్తాన్ని కేటాయించినా గత పాలకులు అమలు చేయలేదన్నారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్ది దళితుల అభివృద్ధిని ఆకాంక్షిస్తూ ఎస్‌సి, ఎస్‌టి సబ్‌ప్లాన్ నిధుల వినియోగంపై చట్టం చేసి వారి ఉన్నతికి తొలివిడతగా రూ.12వేల 500కోట్లు మంజూరు చేశారన్నారు. ఇందిరమ్మ కలలు కార్యక్రమంలో భాగంగా గురువారం మొవ్వ మండలంలో భట్లపెనుమర్రు, మొవ్వ, కాజ, కోసూరు గ్రామాల్లోని దళితవాడల్లో నిర్వహించిన అవగాహన సదస్సుల్లో దాస్ ముఖ్యఅతిథిగా మాట్లాడారు. ఎస్‌సి, ఎస్‌టి సబ్‌ప్లాన్ నిధుల వినియోగంపై చేపట్టిన ఇందిరమ్మ కలలు కార్యక్రమంపై అధికారులకు పూర్తి అవగాహన కొరవడటంతో నామమాత్రంగా నిర్వహించి చేతులు దులుపుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారని ఆయన విమర్శించారు. భట్లపెనుమర్రులో వేలాది మంది దళితులు ఉన్నా కేవలం 100 మందిని కూడా సదస్సుకు అధికారులు రప్పించలేక పోయారని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తిరిగి 6న ఈ గ్రామంలో మరలా అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అనంతరం మొవ్వ, కాజ, కోసూరు గ్రామాల్లో మండల ప్రత్యేకాధికారి కెఎస్ నాగేశ్వరరావు అధ్యక్షతన జరిగిన అవగాహన సదస్సుల్లో ఎండివో వై పిచ్చిరెడ్డి, తహశీల్దార్ జి భద్రు, ఎంఇఓ పరసా సోమేశ్వరరావు, సిడిపివో బత్తుల మనోరంజని, విద్యుత్ ఎడిఇ పూర్ణ చంద్రరావు, వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్‌లు మండవ రత్నగిరి, మూడెడ్ల వెంకటేశ్వరరావు, ఎఇలు వివి భాస్కరరావు, కె శ్రీనివాస్, సిహెచ్ సుబ్బారావు, అనూరాధ, ఎపిఓ ఎన్ స్పూర్తి, బి రేణుక పాల్గొన్నారు.
ఓటర్ల జాబితాలు పక్కాగా రూపొందించాలి
* బిఎల్‌ఓల సమావేశంలో ఆర్డీవో
చల్లపల్లి, మే 2: అవనిగడ్డ శాసనసభ స్థానానికి ఉప ఎన్నిక జరిగే అవకాశం ఉన్నందున పకడ్బందీగా ఓటర్ల జాబితాలు రూపొందించాలని బందరు ఆర్డీవో పి సాయిబాబు అన్నారు. ఈ నెల 16నుండి ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమం జరగనున్న నేపథ్యంలో గురువారం స్థానిక తహశీల్దార్ కార్యాలయంలో మండలంలోని బూత్ లెవల్ అధికారులకు ఒకరోజు శిక్షణ కార్యక్రమం జరిగింది. పర్యవేక్షకులుగా హాజరైన ఆర్డీవో మాట్లాడుతూ స్థానిక శాసనసభ్యుని మృతితో ఖాళీ అయిన అవనిగడ్డ శాసనసభ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమయ్యే పరిస్థితి ఉందనే అభిప్రాయం వ్యక్తం చేశారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా అధికారులు సిద్ధంగా ఉండాలన్నారు. కొత్త ఓటర్ల నమోదు, మార్పులు, చేర్పులు, తొలగింపు తదితర విషయాలకు సంబంధించి ఫారం-6, 7, 8ఎలపై బిఎల్‌ఓలకు అవగాహన కల్పించారు. ఓటర్ల జాబితా రూపొందించటంలో బిఎల్‌ఓలు ప్రలోభాలకు లోనుకారాదన్నారు. ఇంటింటి పరిశీలనలో జాగ్రత్తగా విధులు నిర్వహించి అర్హులకు ఓటుహక్కు కల్పించాలన్నారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వ్యవహరిస్తే చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. కార్యక్రమంలో తహశీల్దార్ కె సుధారాణి, డెప్యూటీ తహశీల్దార్ హరనాథ్, ఎఎస్‌ఓ పి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.
శ్రీ సన్నిధేశ్వరస్వామి ఆలయ పునఃప్రతిష్ఠ కార్యక్రమాలకు శ్రీకారం
కూచిపూడి, మే 2: రెండు వేల సంవత్సరాల చరిత్ర కలిగిన శ్రీ గంగా పార్వతీ సమేత శ్రీ సన్నిధేశ్వరస్వామి ఆలయ పునఃనిర్మాణ, ప్రతిష్ఠా కార్యక్రమాలకు గురువారం అంకురార్పణ జరిగింది. ఆలయ అభివృద్ధి కమిటీ, ఇఓ సమ్మెట ఆంజనేయస్వామి పర్యవేక్షణలో ములగలేటి రఘురామశర్మ బ్రహ్మత్వంలో గణపతి పూజ, పుణ్యాహవచనం, పంచ గవ్యారాధన, వాస్తుపూజ, వాస్తుహోమం, దీక్షాధారణ, యాగశాల ప్రవేశం, నవగ్రహ పూజలు తదితర కార్యక్రమాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. అనంతరం యాగశాల ప్రవేశం జరిగింది.
డిగ్రీ విద్యార్థిని నాగలక్ష్మికి రెండు బంగారు పతకాలు
అవనిగడ్డ, మే 2: స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్వహిస్తున్న డా. బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం పరీక్షలకు హాజరైన కోలా నాగలక్ష్మి అనే అభ్యర్థిని బిఎస్సీ డిగ్రీ కోర్సులో విశ్వవిద్యాలయం స్థాయిలో టోటల్ ఫస్ట్ సాధించి బంగారు పతకాన్ని కైవసం చేసుకుంది. అలాగే తెలుగు మీడియం చదివిన నాగలక్ష్మి టోటల్ ఫస్ట్ సాధించినందుకు మరో బంగారు పతకాన్ని సాధించుకుంది. ఇటీవల యూనివర్శిటీలో జరిగిన ఓ కార్యక్రమంలో విశ్వవిద్యాలయం వైస్ చాన్స్‌లర్ ఈ పతకాలను బహూకరించారు. ఈమేరకు స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ ఆంజనేయులు, కో-ఆర్డినేటర్ జగన్మోహనరావు నాగలక్ష్మిని అభినందించారు.
తైక్వాండోలో దివిసీమ విద్యార్థుల రికార్డు
అవనిగడ్డ, మే 2: హైదరాబాద్‌లో ఇటీవల జరిగిన లార్జెస్టు తైక్వాండో డిస్‌ప్లే అంశంలో దివిసీమకు చెందిన ఈశ్వర్ డాన్స్ అండ్ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ నుండి మాస్టర్ ఈశ్వర్ డిగ్రీ బ్లాక్ బెల్టు, కోచ్ పి విశ్వ, పి సాయికిరణ్, ఎం చంద్రశేఖర్, ఎస్ పవన్‌కుమార్, పి గౌతమ్ హర్ష, ఎ సాయితేజ, ఎ కాళిదాసు పాల్గొని గిన్నిస్ బుక్ రికార్డును సొంతం చేసుకున్నారు. జిల్లాలో గత 13సంవత్సరాలుగా ఈ తరగతులను వివిధ మండలాల్లో నిర్వహిస్తూ ఇప్పటికి 25మంది బ్లాక్ బెల్టర్లను రూపుదిద్ది కొన్ని వేలమందికి శిక్షణ ఇవ్వటమేగాక రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మెడల్స్ సాధించి ఇప్పుడు ఈ రికార్డును సొంతం చేసుకున్నారు. రికార్డు సాధించిన అభ్యర్థులను సింహాద్రి రమేష్, తోట శ్యాంకిషోర్ నాయుడు అభినందించారు.
ఎటిఎంలో చిరిగిన వెయ్యి నోటు!
కలిదిండి, మే 2: కలిదిండి స్టేట్ బ్యాంక్ పక్కనే నూతనంగా ఏర్పాటు చేసిన ఎటిఎంలో చిరిగిన నోటు దర్శనమివ్వటంతో ఖాతాదారులు బిత్తరపోయారు. గురువారం మధ్యాహ్నం 2గంటల సమయంలో ఒక ఉపాధ్యాయుడు తన జీతం కోసం ఎటిఎంకు వెళ్ళి డ్రాచేయగా అందులో ఒక వెయ్యి నోటు చిరిగి ఉండటంతో కంగుతిన్నాడు. ఎటిఎంలో కూడా చిరిగిన నోటు రావడం విమర్శలకు తావిస్తోంది. ఈ నోటును మార్చుకోడానికి నానాపాట్లు పడుతున్నారు. సంబంధిత అధికారులు ఈవిషయమై ఇకముందైనా శ్రద్ధవహించాలని ఖాతాదారులు కోరుతున్నారు.
జిల్లాలో పోలీసుల విస్తృత దాడులు
మచిలీపట్నం (కోనేరుసెంటర్), మే 2: జిల్లా ఎస్పీ జె ప్రభాకరరావు ఆదేశం మేరకు జిల్లాలో పోలీసులు గురువారం విస్తృత దాడులు నిర్వహించారు. బందరు సబ్ డివిజన్ పరిధిలో 75మంది వాహనాలను తనిఖీ చేసి రూ.14,750 ఫైన్ విధించారు. గుడివాడ డివిజన్‌లో 52మంది వాహనాలను అదుపులోకి తీసుకుని రూ.12,800 జరిమానా విధించారు. నూజివీడు డివిజన్‌లో 24 వాహనాలను అదుపులోకి తీసుకుని రూ.3,300, నందిగామ డివిజన్‌లో 39 వాహనాలను తనిఖీ చేసి రూ.5,800, అవనిగడ్డ డివిజన్‌లో 13 మంది వాహనాలను అదుపులోకి తీసుకుని రూ.1600 జరిమానా విధించారు. జిల్లావ్యాప్తంగా మద్యం తాగి వాహనాలు నడుపుతున్న వారిని బ్రీత్ ఎన్‌లైజర్స్ ద్వారా గుర్తించి వారిపై కేసులు పెట్టగా కోర్టువారు రూ.11000 జరిమానా విధించారు. అలాగే గుడివాడ సబ్ డివిజన్ కైకలూరు పిఎస్ పరిధిలో పేకాట ఆడుతున్న నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని రూ.38వేలు స్వాధీనం చేసుకున్నారు. జిల్లావ్యాప్తంగా 203 వాహనాల పత్రాలను తనిఖీ చేసి రూ.38,250 జరిమానా వసూలు చేసినట్లు గురువారం ఒక ప్రకటనలో వివరించారు.
90శాతం సబ్సిడీపై పడవలు, వలలు
కలిదిండి, మే 2: షెడ్యూల్డు కులాలు, తెగలకు చెందిన నిరుద్యోగ యువతను ప్రోత్సహించేందుకు పడవలు, వలలు తదితర సామగ్రి 90శాతం రాయితీపై ప్రభుత్వం అందచేస్తోందని కైకలూరు మత్స్యశాఖ అసిస్టెంట్ ఇన్‌స్పెక్టర్ బి శ్రీనివాసరావు అన్నారు. మండలంలోని సంతోషపురం, అమరావతి గ్రామాల్లో రైతు చైతన్య యాత్రలు గురువారం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ మత్స్యకారులు సంఘంగా ఏర్పడటం వల్ల అనేక ఉపయోగాలు ఉన్నాయన్నారు. ఎస్‌సి, ఎస్‌టిలకు చెందినవారికి చేపలు, రొయ్యల పిల్లల ఉత్పత్తి కేంద్రాల ఏర్పాటుకు ఒక్కొక్కరికి 90శాతం రాయితీపై రూ.5లక్షల వరకు ఇస్తారని తెలిపారు. విక్రయదారులకు రూ.2వేలు మించకుండా 50శాతం రాయితీపై ఐస్‌బాక్సులు సరఫరా చేస్తామన్నారు. ఆత్మ డెప్యూటీ ప్రాజెక్టు డైరెక్టర్ ఎ శారద మాట్లాడుతూ ఆధునిక పద్ధతుల్లో వ్యవసాయం చేపడితే అధిక దిగుబడులు సాధించవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయాధికారి సురేష్‌బాబు నాయక్, వ్యవసాయ విస్తరణాధికారి కె మురళీకృష్ణ, పశువైద్యాధికారి ప్రతాప్, శ్రీనివాసరావు, విఆర్‌ఓలు కె చంద్రశేఖరరావు, రాజిబాబు, జి వెంకటేశ్వరరావు, పి సత్యనారాయణ, ఆదర్శ రైతులు పాల్గొన్నారు.
మానవ మృగాళ్లను
వెంటనే శిక్షించాలి
సబ్ కలెక్టరేట్, మే 2: దేశంలో వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న అత్యాచారాలు, హత్యలు, హింసాకాండలకు పాల్పడుతున్న మానవ మృగాళ్లకు కోర్టులో వెంటనే కఠిన శిక్షలు వేయాలని అప్పుడే ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా నిరోధించగలమని గాయకుడు, ఎస్‌పి బాలసుబ్రహ్మణ్యం అభిప్రాయపడ్డారు. ఒక ప్రైవేటు విద్యా సంస్థను ప్రారంభించడానికి గురువారం నగరానికి వచ్చిన ఆయన విలేఖరుల సమావేశంలో అడిగిన ప్రశ్నలకు ఆయన మనసులోని మాటలను బహిర్గతం చేశారు. మహిళలపై అత్యాచారాలు జరుగుతునే ఉన్నాయని, వీటికి పాల్పడిన వారిపై కోర్టులో తీర్పుకొస్తే వాయిదాలు జరిపి చాలా సంవత్సరాలు పట్టడం వల్ల ఇలాంటి సంఘటనలు చాలా జరుగుతున్నాయన్నారు. కఠినంగా కోర్టులో శిక్షలు విధిస్తే మరొకరు ఇలా చేయాలంటే ఆ శిక్షలకు భయపడేలా ఉండాలని చెప్పారు. డబ్బింగ్ సీరియల్స్‌ని నిలుపు చేయాలంటూ ఆందోళనలు చేయడాన్ని బాలు వ్యతిరేకించారు. తెలుగులో తీసిన మంచి సీరియల్స్ కూడా వివిధ భాషల్లో తర్జుమా చేస్తున్నారని చెప్పారు. కేవలం డబ్బింగ్ సీరియల్స్ వల్లనే ఉపాధి అవకాశాలు లేవనడం సరికాదని డబ్బింగ్ సీరియల్స్ వల్ల కూడా సాంకేతికపరమైన ఉద్యోగాలు చాలా అభిస్తున్నాయని తెలిపారు. తాను మంచి గాయకుడ్ని మాత్రమేనని గాన గంధర్వుడు వంటి పదాలతో పెద్దవాడ్ని చేయవద్దని కోరారు. సూపర్‌మ్యాన్‌ని కాదు సింపుల్ మ్యాన్‌ని మాత్రమేనని ఎస్‌పి బాలసుబ్రహ్మణ్యం చమత్కరించారు. రాత్రివేళ చాలా చక్కగా నిద్ర పడుతుందని, మంచి ప్రశాంత జీవనాన్ని గడుపుతున్నానని రాజకీయాల్లోకి వచ్చి వాటిని చెడగొట్టకోనని బాలు స్పష్టం చేశారు.
వేతన సవరణ కోసం కృషి
విజయవాడ, మే 2: బ్యాంక్ అధికారులు వేతన సవరణ, వారానికి ఐదు రోజుల పని దినాలు వంటి ప్రధాన సమస్యలను పరిష్కరించేందుకు తన వంతు కృషి చేస్తానని అఖిల భారత బ్యాంక్ అధికారుల సంఘాల సమాఖ్య అధ్యక్షులు పికె సర్కార్ తెలిపారు. స్థానిక గవర్నర్‌పేటలోని ఐవి ప్యాలెస్ నందు నిర్వహించిన ఇండియన్ బ్యాంక్ ఆఫీసర్స్ అసోసియేషన్ రాష్ట్ర స్థాయి త్రైవార్షిక సమావేశానికి పికె సర్కార్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బ్యాంక్ అధికారులు వేతన సవరణలో అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారన్నారు. నాబార్డ్, ఆర్‌బిఐ, ఇన్సూరెన్స్ సెక్టార్‌లో పని చేసే సిబ్బందికి కల్పిస్తున్న ఐదు రోజుల పని దినాలు రెగ్యులైజేషన్ ఆఫ్ వర్కింగ్ వంటి ప్రధాన సమస్యలను బ్యాంక్ అధికారులు సమిష్టి కృషి అవసరమన్నారు. తొలుత స్కోప్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో అనాథ బాలబాలికలకు అసోసియేషన్ తరపున దుస్తులను పంపిణీ చేశారు. సమావేశంలో లీడ్ బ్యాంక్ మేనేజర్ ఆర్‌వి నరసింహరావు, స్టేట్ బ్యాంక్ ఆఫీసర్స్ అసోసియేషన్ సెక్రటరీ ఎమ్ హర్షవర్దన్ తదితరులు పాల్గొన్నారు.
ఐరన్ వ్యాపారి ఇంట్లో దోపిడీ
విజయవాడ , మే 2: పటమట పోలీస్టేషన్ పరిథిలోని ఓ వ్యాపారి ఇంట్లో చోరీ జరిగింది. దుండగులు నగలు, నగదు దోచుకుని వెళ్లారు. పోలీసుల కథనం ప్రకారం... గురునానక్ కాలనీ రోడ్డు సిటిఓ కాలనీలో నివాసముంటున్న తుమ్మలచర్ల వెంకటేశ్వర్లు అనే వ్యక్తి ఆటోనగర్‌లో ఐరన్ వ్యాపారం నిర్వహిస్తున్నారు. కాగా ఈయన కుటుంబ సభ్యులతో కలిసి ఈ నెల 1వ తేదీన చెన్నై వెళ్ళారు. అయితే గురువారం ఉదయం ఇంటి తాళం పగులగొట్టి ఉండటాన్ని గమనించిన స్థానికులు ఆయనకు ఫోన్ చేసి సమాచారం తెలిపారు. దీంతో హుటాహుటినా తరలి వచ్చిన ఆయన ఇంట్లోకి వెళ్లి చూడగా బీరువాలో ఉన్న సొత్తు చోరీకి గురైనట్లు గుర్తించాడు. దుండగులు ఇంటి తాళం పగులగొట్టి లోనికి ప్రవేశించి 15కాసుల బంగారు నగలు, వెండి, 50వేల నగదు దోచుకెళ్లారు. సమాచారం అందుకున్న పటమట క్రైం పోలీసులు, క్లూస్, వేలిముద్రల నిపుణులు, పోలీసు జాగిలాలు సంఘటనాస్థలంలో ప్రాధమిక ఆధారాలు సేకరించారు. వెంకటేశ్వర్లు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మినుము కొనుగోలు కేంద్రం మూసివేత దారుణం
విజయవాడ, మే 2: ఉయ్యూరులోని ఏకైక మినుము కొనుగోలు కేంద్రాన్ని మూసివేయడాన్ని నిరసిస్తూ తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు, శాసనసభ్యుడు దేవినేని ఉమామహేశ్వరరావు నాయకత్వంలో పలువురు రైతు నాయకులు, రైతులు గురువారం గవర్నర్‌పేటలోని మార్క్‌ఫెడ్ కార్యాలయం ఎదుట పెద్దఎత్తున ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా ఉమ మాట్లాడుతూ జిల్లాలో రబీలో వరిసాగు లేనందున రైతులు 6 లక్షల 20వేల ఎకరాల్లో మినుము సాగుచేయగా 17 లక్షల క్వింటాళ్లు దిగుబడి వచ్చిందన్నారు. అయితే ప్రభుత్వం నిర్ణయించిన కనీస మద్దతు ధర రూ. 4300లకు కొనే నాధుడు లేకుండా పోయాడన్నారు. వ్యాపారులు 3వేల 200లకు మించి ధర ఇవ్వడం లేదన్నారు. రైతుల డిమాండ్‌పై ఉయ్యూరులో మార్క్‌ఫెడ్ ద్వారా కొనుగోలు కేంద్రాన్ని తెరపించినా మంత్రులు కన్నా లక్ష్మీనారాయణ, కె. పార్ధసారధి వ్యాపారుల నుంచి భారీగా ముడుపులు అందుకుని అర్ధంతరంగా మూసివేయించడం దారుణమన్నారు. దీనిపై కార్యాలయ మేనేజర్ శ్రీనివాసరావును ఉమ ప్రశ్నించారు. నిధులు లేకపోవటంతో కేంద్రాన్ని మూసివేసామని చెప్పటంతో నాయకులు ఆగ్రహోదగ్రులై మేనేజర్, సిబ్బందిని బైటకు పంపించి కార్యాలయానికి తాళాలు వేసారు. ఈ ఆందోళనకు తెలుగురైతు జిల్లా అధ్యక్షుడు చలసాని ఆంజనేయులు, ఎమ్మెల్యే దాసరి బాలవర్ధనరావు, మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి బచ్చుల అర్జునుడు, కార్యనిర్వాహక కార్యదర్శి గద్దే వెంకటేశ్వరప్రసాద్, రైతు నాయకులు బొబ్బా వీరరాఘవరావు, కామినేని శ్రీకృష్ణప్రసాద్, తదితరులు నాయకత్వం వహించారు. ఈ సందర్భంగా కొద్దిసేపు స్వల్ప ఉద్రిక్తత నెలకొంది.
కమిషనరేట్‌లో ఆరుగురు సిఐల బదిలీ
విజయవాడ , మే 2: కమిషనరేట్‌లో పని చేస్తున్న ఆరుగురు సిఐలకు స్థాన చలనం కలిగింది. వీరిలో కొందరు ఆయా స్థానాల్లో రెండేళ్ళకు పైగా పని చేయడంతో బదిలీ అనివార్యమైంది. అదేవిధంగా మరి కొందరు పలు ఆరోపణల నేపథ్యంలో పీఠం కదిలి అప్రాధాన్య స్థానాలకు వెళ్లాల్సి వచ్చింది. మొత్తం మీద ఏళ్ళ తరబడి కమిషనరేట్‌ను పట్టుకుని వేలాడుతున్న పలువురు సిఐలు ఇక్కడిక్కడే తిరుగుతున్నారు తప్ప నగరం దాటి వెళ్లడం లేదన్న ఆరోపణలు మాత్రం అలాగే ఉన్నాయి. ఇందుకు ఉన్నతాధికారుల వద్ద తమకున్న పలుకుబడిని ప్రయోగిస్తున్నారని పోలీసు వర్గాలే గుసగుసలాడుతున్నాయి. అయితే తొలి విడతలో జరిగిన బదిలీల్లో ఈ ఆరుగురు సిఐల్లో పలువురు బదిలీ కావాల్సిన వారేనంటూ ఆయా స్టేషన్ల సిబ్బంది ఆనందం వ్యక్తం చేయడం గమనార్హం. ఇక రెండో విడత బదిలీలు ఉండవచ్చనే ఊహాగానాలు లేకపోలేదు. రెండేళ్ళకు పైబడి ఒక్కచోటే విధులు నిర్వహిస్తున్న పలువురు సిఐలతోపాటు ఇప్పటికే అనేక ఆరోపణలు మోస్తున్న వారి స్థానచలనం తప్పదని కమిషనరేట్ నిఘా వర్గాలు చెప్పకనే చెబుతున్నాయి. అయితే తాజాగా జరిగిన ఆరుగురు సిఐల బదిలీ విషయానికొస్తే... ఎప్పటి నుంచో అసంతృప్తి, అసహనంతో ఉన్న సత్యనారాయణపురం స్టేషన్ పరిథిలోని ప్రజలు, స్టేషన్ సిబ్బందికి ఊరట కలిగిస్తూ సిఐ గుణ్ణం రామకృష్ణను బదిలీ చేస్తూ నగర పోలీసు కమిషనర్ ఎన్ మధుసూదనరెడ్డి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. గుడివాడ రూరల్ నుంచి కమిషనరేట్‌లో అడుగుపెట్టి సత్యనారాయణపురం బాధ్యతలు చేపట్టిన నాటి నుంచీ ఈయన తీరు ఎవరికీ నచ్చలేదు. పని రాక్షుసుడని పేరున్నప్పటికీ సిబ్బందికి మాత్రం ఈయన వైఖరి మింగుడుపడేది కాదని నానుడి. పైగా మద్యం సిండికేట్ల మాముళ్ళ కేసుకు సంబంధించి ఏసిబి రికార్డుల్లో ఈయన పేరు నిందితుల జాబితాలో ఉంది. మరోవైపు ఇప్పటికే ఈయన డిఎస్పీ పదోన్నతితో బదిలీ కావాల్సి ఉంది. కాని ఏసిబి కేసు ఉన్నందున ప్రమోషన్‌కు వెనక్కు వెళ్లింది. ఈయన బ్యాచ్‌కు చెందిన గన్నవరం సిఐ కృష్ణచైతన్య మాత్రం ఇప్పటికే డిఎస్పీ పదోన్నతిపై వెళ్లారు. కాగా రామకృష్ణను బదిలీ చేస్తూ ప్రాధాన్యత లేని స్పెషల్ బ్రాంచి సిఐసెల్‌కు పంపారు. ఇక సత్యనారాయణపురం సిఐగా కొత్తపేట సిఐ ఎస్ ప్రసాదరావును నియమించారు. ఈయన గతంలో ఎస్‌ఐగా సత్యనారాయణపురం క్రైం బాధ్యతలు నిర్వహించిన అనుభవం ఉంది. ఈయన కూడా కొత్తపేట సిఐగా రెండేళ్ళు పూర్తి చేయడంతో బదిలీ తప్పలేదు. కొత్తపేట సిఐగా ప్రస్తుతం పటమట క్రైం అదనపు సిఐగా విధులు నిర్వహిస్తున్న పి వెంకటేశ్వర్లును నియమించారు. ఇక మాచవరం సిఐ సత్యానందంను ఎట్టకేలకు బదిలీ చేస్తూ సీపి ఉత్తర్వులు జారీ చేశారు. ఈయన కూడా పలు ఆరోపణలు మోస్తూ వస్తున్నారు. ఈయన గతంలో మైలవరం సిఐగా పని చేసిన సమయంలో ఓ కేసుకు సంబంధించి సస్పెండ్ అయ్యారు. ఆ తర్వాత మరలా కమిషనరేట్‌లో అడుగుపెట్టి సూర్యారావుపేట సిఐగా పని చేసి కొద్దికాలం తర్వాత మాచవరం సిఐగా బదిలీ అయ్యారు. స్టేషన్‌కు వచ్చే బాధితులు, ఫిర్యాదుదారులతో మర్యాదగా ప్రవర్తించరనే ఆరోపణలున్నాయి. ఎట్టకేలకు ఈయన్ను మాచవరం నుంచి వన్‌ట్రాఫిక్‌కు బదిలీ చేశారు. వన్‌ట్రాఫిక్‌లో పని చేస్తున్న కె సాయిప్రసాద్‌ను అదనపుడిసిపి ట్రాఫిక్‌కు అటాచ్‌మెంట్ చేశారు. ఇక మాచవరం సిఐగా స్పెషల్ బ్రాంచి సిఐ సెల్‌లో విధులు నిర్వహిస్తున్న సిహెచ్ మురళీకృష్ణను నియమిస్తూ పోలీసు కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు.
దుర్గ గుడి పిఎ, క్లర్క్ సస్పెన్షన్
ఇంద్రకీలాద్రి, మే 2 : శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానం పిఎ ఎస్వీ ప్రసాద్, జూనియర్ క్లర్క్ భీమశంకరంను సస్పెండ్ చేస్తూ శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం రీజినల్ జాయింట్ కమిషనర్ కె ప్రభాకర శ్రీనివాస్ ఉత్తర్వులు జారీ చేసారు. శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల పుష్కర ఘాట్, కేశ ఖండన శాల తదితర చోట్ల ఆలయ సిబ్బంది భక్తుల పట్ల అమర్యాదగా ప్రవర్తిచడం, భక్తులను ఇబ్బంది పెట్టడం తదితర అంశాలపై పలు ఫిర్యాదులు అందడంతో ఆ సెక్షన్ పిఎ ఎస్‌వి ప్రసాద్ సంబంధిత జూనియర్ క్లర్క్ భీమశంకరాన్ని ఆర్‌జెసి సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేసారు. గతంలో ఎం రఘునాధ్ ఆర్‌జెసీగా ఉన్న సమయంలో కూడా మద్యం సేవించి అమ్మవారి సన్నిధికి వచ్చిన ఎస్‌వి ప్రసాద్‌ను సస్పెండ్ చేసారు. గత నెల 24న దుర్గాఘాట్, కేశఖండన శాల తదితర ప్రదేశాల్లో ఆలయ సిబ్బంది భక్తులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని వీరిపై విచారణ జరిపించి తక్షణమే తగు చర్యలు తీసుకోవాల్సిందిగా గతంలో నగరంలో పనిచేసిన సిఎ భాస్కరరావు దుర్గగుడి ఆర్‌జెసికి లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేసారు. సిఎ తోపాటు గతంలో వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు వీరిపై చేసిన ఫిర్యాదులను దృష్టిలో పెట్టుకుని వీరిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవడం జరిగింది. గత కొద్ది రోజుల నుంచి విధుల పట్ల నిర్లక్ష్యం వహించిన సిబ్బందిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని పలుమార్లు ప్రత్యక్షంగా పరోక్షంగా సిబ్బందిని హెచ్చరించారు. అయినా ఆర్‌జెసి హెచ్చరికలను ఖాతరు చేయని సిబ్బందిపై సస్పెన్షన్ వేటు తప్పలేదు.