Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

చెరువుల అభివృద్ధిలో అధికారుల నిర్లక్ష్యం

$
0
0

నెల్లూరు, మే 2: ప్రపంచ బ్యాంక్ నిధుల చేయూతతో నిర్వహిస్తున్న ఆంధ్రప్రదేశ్ చెరువుల భాగస్వామ్య అభివృద్ధి పథకం అమలుతీరు ఆద్యంతం రాజకీయ పోకడలు, అధికార్ల, కాంట్రాక్టర్ల అవినీతి, అక్రమాలతో నిండిపోతోంది. నత్తకు మేనత్తలా నింపాదిగా, అంతకంతకూ అస్తవ్యస్తంగా మారుతున్న ఈ పథకాన్ని రాష్టవ్య్రాప్తంగా ఇంకా పనులు పూర్తికాని నేపథ్యంతో మరో రెండేళ్లపాటు గడువుపొడిగించారు. సరిగ్గా ఆరు వారాల క్రితం జిల్లాలో 38 చెరువులకు సంబంధించిన 15కోట్ల రూపాయల నిధుల అభివృద్ధికి సంబంధించి టెండర్ల ప్రక్రియ నిర్వహించారు. అంతలోనే ఆరోపణలు వెల్లువెత్తి పలు పనులను నిలుపుదల చేస్తున్నట్లు కూడా ప్రకటనలు వచ్చాయి. సాగునీటి సంఘాల్ని భాగస్వామ్యం చేసే అంశం తోడవ్వడంతో దాదాపుగా గ్రామస్థాయి రాజకీయాలు తోడై ఈ పథకం అమలుతీరుపై తీవ్ర ప్రభావం చూపిందనే చెప్పాలి. సాగునీటి సంఘాలు, రైతుల్ని చైతన్యపరుస్తూ ఈ పథకాన్ని సమర్ధవంతంగా నడిపించేందుకుగాను స్వచ్ఛంద సేవా సంస్థల నేతృత్వంలో ఆయా చెరువుల ఆయకట్టుదార్లయిన రైతులకు పూర్తిస్థాయి అవగాహన అంశం కీలకంగా ఉంది. అయితే స్వచ్ఛందసేవా సంస్థలు రైతుల్ని చైతన్యపరచడంలో కంటే సాగునీటి సంఘాల నేతలకు అవినీతి పాఠాలు చెప్పడంలోనే ఆరితేరాయి. అలాంటి స్వచ్ఛంద సేవా సంస్థలకే ఈ పథకం కింద ప్రత్యేకంగా ఏర్పాటైన ఇరిగేషన్ ఇన్విస్టిగేషన్ విభాగం అధికారులు సైతం ఊతమిచ్చారు. ఎంతోకొంత నిజాయతీ, నిబద్ధతలతో కొనసాగిన స్వచ్ఛంద సేవా సంస్థలను మాత్రం తమకు గిట్టుబాటు కారనే నెపంతో క్రమేపి ఉద్వాసన పలికారు. ఇందులో జిల్లాలోని వివిధ స్వచ్ఛంద సేవా సంస్థలకు 52 కోట్ల రూపాయల వరకు ముట్టచెప్పినట్లు రికార్డులుంటే అందులో అంతూదరి లేని పర్సంటేజిల వ్యవహారం నచ్చక కొన్ని స్వచ్ఛందసేవా సంస్థలు తప్పుకున్నట్లు కూడా తెలుస్తోంది. రైతులకు అక్కరకొచ్చేలా ప్రాధాన్యత లేని పనులకు, అధిక ఆదాయం కలిగే అంశాలకు మాత్రమే నిధులు కేంద్రీకృతమయ్యాయి. ఇటీవల జరిగిన టెండర్ల ప్రకారం పనులు చేపట్టే కాంట్రాక్టర్లయినా పనులను అంకితభావంతో నిర్వహించేలా ఉన్నతాధికారులు చెరువుల భాగస్వామ్య పథకాన్ని పర్యవేక్షించాలి. అంతేగాక సమర్ధవంతమైన సాగునీటి సంఘాలు ఆవిర్భవించేలా ఎన్నికలు నిర్వహించడంలో ఆవహిస్తున్న మీనమేషాలు తొలగాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది. చెరువుల్లో నీటి నిల్వ పెరగడం తద్వారా ఆయకట్టు వృద్ధి చెందే ప్రాధాన్యతాక్రమం దిశగా బాటలు వేయాలి. ఈ పథకానికి కార్యనిర్వాహక ఇంజనీర్‌ను ప్రాజెక్ట్ అధికారిగా నియమించారు. అయితే బినామీ పేర్లతో శాఖాపరమైన పనులకు వాహనాల్ని కేటాయించి లాగ్‌బుక్‌లో అన్నీ ఎంట్రీ చేసుకుంటూ క్షేత్రస్థాయిలో పర్యటించకుండానే బిల్లులు డ్రా చేసుకున్నట్టుగా విశ్వసనీయంగా తెలిసింది. లాగ్‌బుక్‌లో నమోదైన నెంబర్ల తాలుకు వాహనాలే జిల్లాలోని ఐదవ నెంబర్ జాతీయ రహదారిపై ఉన్న టోల్‌ప్లాజాలను దాటుకుని వివిధ చెరువుల వద్దకు వెళ్లాయా లేదా అనే దిశగా క్రాస్ చెక్ చేస్తే అధికార్ల అవినీతి తేటతెల్లం అవుతుంది. ఇదిలాఉంటే జిల్లాలోని చెరువుల్లో చాలా వరకు ఆక్రమణల చెరలో చిక్కుకున్నాయి. ప్రస్తుత సంవత్సరం సగటుకంటే తక్కువగా నమోదైన వర్షపాతం నేపథ్యంతో జిల్లా రైతాంగానికి అవసరమైన స్థాయిలో సాగునీరు సమకూరలేదు. వర్షం పడ్డ సందర్భంలో నిల్వ చేసుకునేందుకు తటాకాల్లో సరిపడా సామర్ధ్యం లేక రైతన్నల వెతలు వర్ణనాతీతం. ఏదేమైనా ఇలాంటి అవస్థలన్నీ అధిగమించేలా చెరువుల అభివృద్ధి పథకం సమర్ధంగా అమలైతేనే కర్షక ప్రయోజనానికి బాటలు వేసినట్లవుతుంది.

వారా దళితుల అభివృద్ధి గురించి మాట్లాడేది
నెల్లూరు, మే 2: దళితుల అభివృద్ధి గురించి మాట్లాడే హక్కు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డికి, జగన్ పార్టీకి లేదని తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు బీద రవిచంద్ర ఎద్దేవా చేశారు. గురువారం స్థానిక టిడిపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ దళితుల కోసం ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్‌ను తీసుకొచ్చామని కాంగ్రెస్ ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటోందని, ఇంత కన్నా దిగజారుడుతనం ఏదీ లేదని విమర్శించారు. లక్షల కోట్ల రూపాయల దళితుల నిధులను హుస్సేన్‌సాగర్ అభివృద్ధికి, పులివెందుల రోడ్లకు, తాగునీటికి మళ్లించారన్నారు. దళితుల గురించి మాట్లాడే హక్కు కాంగ్రెస్, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీల నేతలకు లేదని దుయ్యబట్టారు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో ఎస్టీ, ఎస్సీ కార్పొరేషన్లను నిర్వీర్యం చేశారన్నారు. దళితులకు తమ పార్టీ పెద్ద పీట వేస్తామని చెప్పిన జగన్‌మోహన్‌రెడ్డి దళిత కులానికి చెందిన జిల్లా కన్వీనర్ నెల్లూరుకు వస్తే కార్యాలయాన్ని మూసివేసి అవమానించారన్నారు. ఇంత కన్నా దుర్మార్గం ఏముందని అన్నారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ నేతల విధానం తేటతెల్లమైయిందన్నారు. ఈ సంఘటనను దళితులంతా గమనించాలని పిలుపునిచ్చారు. బంగారు తల్లి, అమ్మహస్తం, ఎస్టీ నిధుల వెల్లువ అన్నీ ఉత్తుత్తివేనన్నారు. ఇవన్నీ గతంలో చంద్రబాబు పెట్టిన పథకాలేనన్నారు. ప్రజల కష్టాలను స్వయంగా తెలుసుకునేందుకు తమ పార్టీ అధినేత చేపట్టిన వస్తున్నా మీ కోసం పాదయాత్రను అందరూ ఆదరించారని, బస్సు యాత్రను కూడా ప్రజలందరూ ఆదరించాలని కోరారు. ఈ సమావేశంలో బిసిసెల్ జిల్లా అధ్యక్షుడు అన్నం దయాకర్‌గౌడ్, తెలుగుయువత జిల్లా అధ్యక్షుడు పమిడి రవికుమార్‌చౌదరి, ఎస్సీసెల్ జిల్లా అధ్యక్షుడు బద్దెపూడి రవీంద్ర, నాయకులు జలదంకి సుధాకర్ పాల్గొన్నారు.

జెన్‌కో బూడిద గుంటల పనుల్ని
పరిశీలించిన విజిలెన్స్ బృందం
ముత్తుకూరు, మే 2: జెన్‌కో థర్మల్ విద్యుత్ కేంద్రానికి సంబంధించిన బూడిదగుంటల నిర్మాణ పనుల్ని విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికార్ల బృందం గురువారం మధ్యాహ్నం స్వయంగా పరిశీలన చేశారు. ఈ నిర్మాణ పనుల్లో నాణ్యతా ప్రమాణాలు ఏవిధంగా పాటిస్తున్నారో విజిలెన్స్ బృందం ఆరా తీశారు. రీజనల్ విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారి శశిధరరావు, డిఎస్‌పి రమేష్‌ల ఆధ్వర్యంలో జరిగిన ఈ పరిశీలన కార్యక్రమంలో బూడిదగుంటల నిర్మాణాలకు తొలుత అంచనా వ్యయం 30 కోట్ల రూపాయల నుంచి అరవై కోట్ల రూపాయలకు పెంచడంలో ఉన్న ఆంతర్యంపై విలేఖర్లు ప్రశ్నించారు. పరిశీలన అనంతరం ఒక నిర్ణయానికి వస్తామని అధికారులు తెలిపారు. నిర్మాణాలకు వాడుతున్న గల్లు ఇసుక కూడా నాణ్యతగా లేని అంశాన్ని విలేఖర్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఇంకా ఈ బృందంలో విజిలెన్స్ డిఇఇ డి ఆనందకుమార్, ఏఇ సురేష్, తదితరులు పాల్గొన్నారు.
5 లక్షల విలువైన
ఎర్రచందనం పట్టివేత
పొదలకూరు, మే 2: పొదలకూరు మీదుగా అక్రమంగా తరలిస్తున్న ఐదు లక్షల రూపాయల విలువైన ఎర్రచందనం దుంగలను గురువారం ఫారెస్ట్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఎర్రచందనం దుంగలను లారీలో కోడిగుడ్ల ట్రేల కింద రహస్యంగా దాచిపెట్టి తరలిస్తుండగా రత్నగిరి గ్రామం వద్ద ఫారెస్ట్ అధికారులు అడ్డగించి పట్టుకున్నారు. ఫారెస్ట్ అధికారుల రాక గమనించిన లారీ డ్రైవర్, క్లీనర్‌లారీని రోడ్డు పక్కన వదిలేసి పరారయ్యారు. పట్టుబడిన దుంగలను ఆదూరుపల్లిలోని ఫారెస్ట్ గోడవున్‌కు తరలించారు. దాచూరు ఆర్డీవో భాస్కర్‌రెడ్డి, బీట్ ఆఫీసర్లు శ్రీనివాసులు, ఖాన్, ఖాసిం, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్లు వెంకటేశ్వర్లు, అనిల్‌కుమార్‌లు ఈదాడిలో పాల్గొన్నారు.

భూములు పరిశీలించిన
జిల్లా జాయింట్ కలెక్టర్
ముత్తుకూరు, మే 2: ముత్తుకూరులో ఆర్టీసి గ్యారేజి నిర్మాణం కోసం భూసేకరణకు సంబంధించి జాయింట్ కలెక్టర్ లక్ష్మీకాంతం, నెల్లూరు ఆర్డీఓ మాధవీలత స్థానికంగా పర్యటించారు. గురువారం వీరిద్దరూ ముత్తుకూరు చిన్నచెరువుసమీపంలో సుమారు పది ఎకరాల స్థలాన్ని ఆయన పరిశీలన జరిపారు. మత్స్యకార్లకు అవసరమైన మార్కెట్ నిర్మాణాల కోసం ముత్తుకూరు విద్యుత్ సబ్ స్టేషన్ ఎదురుగా ఉన్న స్థలాన్ని పరిశీలన చేశారు. మినీ స్టేడియం నిర్మాణం కోసం స్థలాన్ని పరిశీలించారు. అనంతరం వారిద్దరూ ముత్తుకూరు ఆర్‌అండ్‌ఆర్ కాలనీలోని చౌకధర దుకాణాన్ని సందర్శించారు. అక్కడి డీలర్ బాబు షాప్ రెండవ తేదీ కూడా ప్రారంభించకుండా మూసివేసి ఉండటం పట్ల ఆగ్రహించారు. ఈ షాప్ నిర్వాహకుడ్ని సస్పెండ్ చేయాలంటూ తహశీల్దార్ సుశీలకు ఆదేశించారు. ఆయన వెంట రెవెన్యూ సిబ్బంది కూడా ఉన్నారు.

నాది జగన్ వర్గం: ప్రసన్న
బుచ్చిరెడ్డిపాళెం, మే 2: తాను జగన్ వర్గానికి చెందిన వాడినని, మరే వర్గానికి చెందిన వాడిని కానని కోవూరు నియోజకవర్గ శాసనసభ్యుల నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి పేర్కొన్నారు. బుచ్చిరెడ్డిపాళెం మండలంలోని జొన్నవాడ గ్రామంలో ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ తాను ఏ వర్గానికి చెందిన వాడిని కానని చెప్పారు. బుధవారం వైఎస్‌ఆర్ పార్టీ కన్వీనర్ మేరుగ మురళి నెల్లూరు వచ్చిన సందర్భంలో ఆ కార్యక్రమానికి తాను గైరుహాజరుకావటంపై పలుపత్రికలు విభిన్న కథనాలు రాయటంపై ఆయన స్పందించారు. 2009లో తాను టిడిపి పార్టీ టిక్కెట్టుపై కోవూరు నియోజకవర్గానికి శాసనసభ్యునిగా ఎన్నికయ్యానని, ఆ సమయంలో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి చేస్తున్న అభివృద్ధి పనుల పట్ల ఆకర్షితుడనయ్యానన్నారు. కేవలం నియోజకవర్గ అభివృద్ధి నిధుల కోసమే తాను వైఎస్ రాజశేఖర్‌రెడ్డిని కలిశానన్నారు. ఆయన మరణానంతరం జగన్‌ను కలవటం, ఆ పార్టీలో సభ్యునిగా చేరానన్నారు. అప్పటి నుండి జగన్ వర్గానికే చెందిన వాడిని కాని మరే వర్గానికి చెందిన వాడిని కానన్నారు.
పార్టీలో చిన్న చిన్న సమస్యలు ఉండటం సర్వసాధారణమన్నారు. వాటిని జిల్లా నేతలంతా కూర్చొని చర్చించుకొని పార్టీ అభివృద్ధికి అందరూ కలిసి పనిచేస్తారన్నారు. కోవూరు నియోజకవర్గంలో ఆరు సబ్‌స్టేషన్లు మంజూరయ్యాయని ఎమ్మెల్యే ప్రసన్నకుమార్‌రెడ్డి చెప్పారు. వాటిలో బుచ్చి మండలంలోని చెల్లాయపాళెం గ్రామంలో కూడా కోటి రూపాయలతో సబ్‌స్టేషన్‌ను నిర్మించనున్నట్టు ఆయన చెప్పారు. జగన్‌ను దృష్టిలో పెట్టుకొని నాయకులంతా కలిసికట్టుగా పనిచేయాలని అన్నారు. పార్టీలో ప్రతికార్యకర్తా జగన్ వర్గానికి చెందిన వారమేనని అన్నారు. ఈకార్యక్రమంలో వైకాపా నాయకులు సూరా శ్రీనివాసులురెడ్డి, బాలశంకర్‌రెడ్డి తదితరులు ఉన్నారు.

అన్ని శాఖల్లో బదిలీలపై చర్చ!
నెల్లూరు, మే 2:ఉద్యోగుల సంతతి విద్యాభ్యాసాన్ని ప్రాతిపదికగా భావిస్తూ ప్రతి ఏటా వేసవికాలంలో బదిలీల పర్వానికి ప్రభుత్వం పూనుకోవడం తెలిసిందే. వేసవిలో బదిలీల ద్వారా బిడ్డల చదువుకు ఆటంకం కలగకుండా చూస్తున్నా ఉద్యోగవర్గాల్లో స్థానచలనానికి ఇష్టపడుతున్న శాతం బహుస్వల్పం. ఇప్పటి వరకు కొనసాగిన చోటే ఇంకా ఉండాలని, అలాకాకుంటే ఇంకా మెరుగైన స్థానానికి వెళ్లాలనేదే ప్రభుత్వ సిబ్బంది అభిమతంగా కనిపిస్తుంది. ఒకే ప్రాంతంలో ఐదేళ్లపాటు పనిచేస్తే బదిలీలు తప్పనిసరి చేస్తున్నా రాజకీయ పలుకుబడితో తప్పించుకుంటున్న ప్రబుద్ధులు అనేకం. ఇప్పటికే ఉపాధ్యాయ బదిలీలకు సంబంధించి దరఖాస్తుల పర్వం ముగియడం తెలిసిందే. ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్‌లో హెడ్ కానిస్టేబుళ్ల, కానిస్టేబుళ్ల బదిలీలకు సంబంధించి ఆ శాఖ కమిషనరేట్ నుంచి విడుదలైన ఆదేశాలపై కలకలం రేగింది. ఐదేళ్లు దాటిన సిబ్బందికి స్థానచలనం తప్పనిసరి అంటూ, సొంత ప్రాంతం ఉన్న స్టేషన్లకు బదిలీ వర్తించదని చేసిన ఉత్తర్వులపై ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ కానిస్టేబుళ్ల సంఘం దుయ్యబట్టడం గమనార్హం. కమిషనర్‌ను ఏకంగా దూషించేలా పత్రికాముఖంగా ధ్వజమెత్తారు. అంతేగాక పోలీస్ కానిస్టేబుళ్లలో కూడా రేపోమాపో బదిలీల వ్యవహారంపై శాఖాపరంగా చర్చకు రానుంది. ఇతర వివిధ శాఖల్లో కూడా బదిలీలపై అంతటా ప్రస్తావించుకుంటున్నారు. ఉన్నత చదువుల్లో ఉన్న సంతతి స్థానికంగా చదువుతుంటే వారిని వీడి తాము దూర ప్రాంతాలకు వెళ్లాలంటే తల్లిదండ్రులకు మనస్కరించని పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అయితే కౌనె్సలింగ్‌ను అనుసరించే బదిలీలు జరుగుతున్నా మార్గదర్శకాల్లో చోటుచేసుకుంటున్న లోపభూయిష్ట విధానాలపై సర్వత్రా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఉన్నతాధికారులు సాధారణంగా మూడేళ్లకు మించి ఉండరాదనే ఆదేశాలుంటాయి. సిబ్బంది అంతకుమించి ఉండే అవకాశం ఉన్నా వివిధ శాఖల్లో ఐదేళ్ల గరిష్టపరిమితి విధించడాన్ని ప్రత్యేకంగా చర్చించుకోవాలి. కాగా, సాక్షాత్తు నెల్లూరుజిల్లా కలెక్టర్ కార్యాలయంలో పలువురు సిబ్బంది ఒకటిన్నర దశాబ్దం పదవీకాలం ఏకప్రదేశంలో కొనసాగుతున్నా పట్టించుకునే నాధుడే కరవు. తమకున్న పలుకుబడితో కలెక్టర్ చుట్టూ రౌండ్‌ది క్లాక్, ఏడాది పొడవునా కొనసాగుతున్న యంత్రాంగాన్ని ఉద్దేశించి అందరూ ఆక్షేపణలు గుప్పిస్తున్నారు. ఇదిలాఉంటే ఇప్పుడు బదిలీల నుంచి తప్పించుకున్నా వచ్చే ఏడాది ఇదే సమయంలోగానే సార్వత్రిక ఎన్నికలు రానున్నాయి. అప్పుడు ఎన్నికల కమిషన్ హుకుంతో తప్పనిసరిగా చాలామంది బదిలీ కావాల్సిందే...
మతిస్థిమితంలేని వ్యక్తి బంధువులకు అప్పగింత
నాయుడుపేట, మే 2: తిరుమలకు వచ్చిన యాత్రికుల బృందంలో తప్పిపోయిన ఆదిలాబాద్‌కు చెందిన మతిస్థిమితం లేని పి సుధాకర్(18)ని వారి బంధువులకు గురువారం నాయుడుపేట సి ఐ ఎన్ రామారావుఅప్పగించారు. అదిలాబాద్ పట్టణ పరిధిలోని కోలీపూర్ కు చెందిన 30 మంది యాత్రికులు గత నెల 26న బయలుదేరి 30న తిరుమలకు వచ్చారు. వీరి నుండి మతి స్థిమితంలేని పి సుధాకర్ తప్పిపోయాడు. ఇతను పెళ్ళకూరు మండలం సిరసనంబేడు వద్ద అనుమానాస్పద రీతిలో సంచరిస్తుండగా పోలీసులు ఇతనిని నాయుడుపేట సి ఐకి అప్పగించారు. ఇతని వద్ద ఉన్న సెల్ ఫోను సహాయంతో ఇతని తల్లికి సమాచారం అందించారు. అనంతరం సుధాకర్‌ను వారి బంధువులకు అప్పగించారు. సుధాకర్ తల్లి నాయుడుపేట పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ విషయమై ఇతని తల్లి కృష్ణమ్మ తిరుమల 1టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు సి ఐ తెలిపారు. మే 1న మేడేతో పాటు వీధిపిల్లల పరిరక్షణ దినోత్సవం కావడం, రెండవ తేది దాదాపు ఇదేరకమైన సంఘటన ద్వారా సుధాకర్‌ను వారి తల్లికి అప్పగించచడం యాదృచ్ఛికం . ఈ కార్యక్రమంలో ఎస్సై జి.వేణుగోపాల్ రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.

పోలేరమ్మ హుండీ లెక్కింపు..
నాయుడుపేట, మే 2: నాయుడుపేట గ్రామ దేవత శ్రీ పోలేరమ్మ హుండీని గురువారం అధికారులు, గ్రామ పెద్దలు, పోలీసుల ఆధ్వర్యంలో లెక్కింపు నిర్వహించారు. బుధవారం జాతర ముగియడంతో హుండీ లెక్కింపులు చేపట్టగా లక్షా,14వేల, 500 రూపాయలు ఉన్నట్లు గ్రామ పెద్దలు తెలిపారు. 2012 నుండి పోలేరమ్మ దేవాలయ నిర్వాహణ దేవాదాయ శాఖ ఆధీనంలో జరుగుతోంది. ఈ మొత్తాన్ని బాంకులో జమ చేయనునట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు నాగరత్నం, గుంటూరు లక్ష్మయ్య, చిరువెళ్ళ మునిరాజ, దేవాదాయ శాఖ సిబ్బంది రామచంద్రయ్య, సుధాకర్, ఏ ఎస్ ఐ శ్యాంసన్, కానిస్టేబుళ్ళు నరసయ్య, రఫి తదితరులు పాల్గోన్నారు.

గ్రామీణ ప్రాంతాలలో తాగునీటి ఎద్దడిపై దృష్టి సారించండి..
నాయుడుపేట, మే 2: నాయుడుపేట మండల పరిధిలోని గ్రామీణ ప్రాంతాలలో నీటి ఎద్దడిపై దృష్టి సారించాలని డిఆర్‌డిఎ పిడి, మండల ప్రత్యేకాధికారి వెంకటసుబ్బయ్య అధికారులను ఆదేశించారు. గురువారం ఆయన స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో మండల స్థాయి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలలో మరమ్మతులకు గురైన బోర్లను గుర్తించి వాటిని రిపేర్లు చేయించాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాలలో వాటర్ ట్యాంక్‌లకు నీరు సరఫరా అవుతుందో లేదో గమనిస్తూ ఉండాలని ఒక వేళ లేని పక్షంలో తన దృష్టికి తీసుకురావలన్నారు. అరవపెరిమిడి, పూడేరు గ్రామాలలో వాటర్ ట్యాంక్‌లకు నీరు సరఫరా కావడం లేదని గ్రామ కార్యదర్శి సుధాకర్‌రెడ్డి ఆయన దృష్టికి తీసుకురాగా వెంటనే గ్రామీణ నీటి పారుదల శాఖ అధికారులను సమస్యను పరిష్కరించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో ఇన్‌చార్జీ ఎంపిడిఓ సరళ, ఇన్‌చార్జీ విస్తరణ అధికారి చంద్రశేఖర్, ఎం ఇ ఓ ఎ ఎం అజయ్‌కుమార్, ఇరిగేషన్ ఎ ఇ ఫిర్జోస్‌భాష, గృహనిర్మాణ శాఖ ఎ ఇ రాజారావు, అన్ని పంచాయతీల కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.
వెంకటగిరి వైఎస్సార్‌సిపిలో బైటపడిన వర్గపోరు
నువ్వానేనా అంటున్న కొమ్మి-మేకపాటి వర్గీయులు
వెంకటగిరి, మే 2 : వెంకటగిరి పట్టణంలోని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న రెండు వర్గాల్లో వర్గపోరు తాజాగా గురువారం నింగికెగశాయి. దీంతో అటు కొమ్మి, మేకపాటి వర్గీయుల్లో నువ్వానేనా అన్ని విధంగా ఇక్కడ నాయకులు తయారయ్యారు. ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయో, ఎవరు అభ్యర్థులుగా నిలబడతారో తెలియదుకాని ఏ ఎండకాగొడుగు అన్న చందాన వైఎస్‌ఆర్‌సిపిలో ప్రస్తుత పరిస్థితిలో నెలక్కొంది. అయితా జిల్లా కన్వీనర్‌గా బాధ్యతలు స్వీకరించి మొట్టమెదటి సారిగ జిల్లాకు విచ్చేన దళిత నాయకుడికి మేరిగ మురళికి నెల్లూరు వై ఎస్ ఆర్ సిపిలో కార్యాలయానికి తాళాలు వేయడంతో అక్కడ ఆయనకు చుక్కెదురైంది. అయినా ఆయిన పార్టీ కార్యాయంలోని పార్కింగ్ స్థలం వద్ద విలేఖర్ల సమావేశం జరగుతుండగా ఓ పత్రికా ప్రతినిధి జిల్లాలో సమన్వయ కర్తలు సక్రమంగా పనిచేయడంలేదని ఆరోపణలు ఉన్నాయని ప్రశ్నించగా కోటంరెడ్డి శ్రీ్ధర్‌రెడ్డి కలగజేసుకొని అందురు ఎలాంటి సమస్యలు లేకుండా పనిచేస్తున్నారని సమాధానం చెప్టడంతో వెంకటగిరి చెందిన మేకపాటి వర్గీయులైన సురేష్‌రెడ్డి మరి కొంత మంది కొమ్మిని గురించి ప్రస్తావించారు. దీంతో అక్కడ గందరగోళ వాతావరణం ఏర్పడిన విషయం తెలిసిందే. దీనికి స్పందించిన వెంకటగిరి పట్టణంలోని కొమ్మి వర్గీయులు గురువారం పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద నున్న వైఎస్ ఆర్‌సిపి కార్యాయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో స్ధానిక వై ఎస్ ఆర్ పార్టీ నాయకులు నెమళ్ళపూడి సురేష్‌రెడ్డి నిప్పులు చెరిగారు. వారం రోజుల్లో కొమ్మి వెంకటగిరి తీసుకొచ్చి ర్యాలీ, బహిరంగ సభ నిర్వహిస్తామని దొమ్ముంటో ర్యాలీ, బహిరంగ సభను అడ్డుకోవాలంటూ వెంకటగిరి మండల కన్వీనర్ బత్తినపట్ట వీరారెడ్డి సవాల్ విసిరారు. గత కొంత కాలంగా సురేష్‌రెడ్డి అతని అనుచరులు కొమ్మి స్థానికుడు కాదని, స్థానికేతరులకు వెంకటగిరిలో తావులేదంటా ప్రకటనలు చేయడం మంచి పద్ధతి కాదన్నారు. అధిష్ఠానం వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్తగా కొమ్మిని నియమించారు. అందరు ఆయనతో కలిసి పనిచేయాలని, నచ్చకపోతే తప్పుకోవాలే తప్ప ఇష్టమెచ్చినట్లు మాట్లాడితే దేనికైన తమవర్గం సిద్ధంగా ఉన్నామన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు కలిమిలి రామ్‌ప్రసాద్‌రెడ్డి, పోలిరెడ్డి, మంగలపూరి వెంకటేశ్వర్లు, శివ, అంజి, రాఘవరెడ్డి, రాజారెడ్డి, సాయినాయుడు. శ్రీనివాసులురెడ్డి తదితరులు పాల్గొన్నారు.

సిండికేట్ బ్యాంకు వ్యాపార లక్ష్యం 3.34లక్షల కోట్లు
నెల్లూరుసిటీ, మే 2: సిండికేట్ బ్యాంకు వ్యాపార లక్ష్యం 3.34లక్షల కోట్లను అధిగమించినట్లు ఆ బ్యాంక్ ఎజిఎం గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. 2012-13 ఆర్థిక సంవత్సరం నందు సాధించిన ప్రగతి, వ్యాపార లక్ష్యం, నికరలాభం గతం కంటే బాగా అభివృద్ధి చెందినట్లు పేర్కొన్నారు. ఈ ఏడాది నికర లాభం 2004కోట్లు పొంది వృద్ధి రేటును 52.63 శాతం వరకు చేరిందన్నారు. ఖాతాదారుల సంఖ్య 32 మిలియన్లకు దాటిందన్నారు. నూతనంగా 215 శాఖలను ప్రారంభించినట్లు తెలిపారు. మొత్తం 2934 శాఖలగా తమ బ్యాంకు విస్తరించినట్లు సూచించారు. ఈ సంవత్సరానికి ఈక్విటీ డివిడెండును 67శాతానికి పెంచాలని ప్రతిపాదించినట్లు తెలిపారు. నెల్లూరు ప్రాంతీయ కార్యాలయానికి సంబంధించి ఈ ఆర్థిక సంవత్సరంలో తమ వ్యాపార లక్ష్యం 5064కోట్లు అధిగమించినట్లు పేర్కొన్నారు. ప్రాంతీయ కార్యాలయ పరిధిలో 118శాఖలు, 24ఎటిఎం కేంద్రాలను ఉన్నట్లు తెలిపారు. వ్యవసాయరంగానికి 2231కోట్ల రూపాయలను కేటాయించామన్నారు. మొత్తం ప్రాధాన్యత రంగాలకు 2816కోట్లను కేటాయించినట్లు పేర్కొన్నారు.

పేద ప్రజల కోసమే సంక్షేమ పథకాలు
ఎమ్మెల్యే ముంగమూరు వెల్లడి
నెల్లూరుసిటీ, మే 2: పేద ప్రజల కోసమే ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి కిరణ్‌కుమార్‌రెడ్డి బంగారుతల్లి, మన బియ్యం, అమ్మహస్తం వంటి ఎన్నో నూతన పథకాలను ప్రారంభిస్తున్నట్టు నెల్లూరుసిటీ ఎమ్మెల్యే ముంగమూరు శ్రీ్ధర్‌కృష్ణారెడ్డి వెల్లడించారు. గురువారం 23వ డివిజన్‌లోని సంఘమిత్ర స్కూల్ దగ్గర 15లక్షల రూపాయలో సిసి రోడ్డు, 25వ డివిజన్‌లోని వెంకటరెడ్డి నగర్‌లో 10లక్షల రూపాయలతో సిసి రోడ్డుపనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల అభివృద్ధి సంక్షేమంలో ముందజ ఉందన్నారు. ప్రజల మనోభావలను దృష్టిలో ఉంచుకున్ని సిఎం నూతన పథకాలను ప్రవేశపెడుతున్నట్లు తెలిపారు. రాబోయే రోజులలోపేద ప్రజలకు మరిన్ని సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నానట్లు పేర్కొన్నారు. గతంలో ఎప్పుడు లేని విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమే ధ్యేయంగా పనిచేస్తుందన్నారు. ఈకార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు ఆనం రంగమయూర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ట్రాఫిక్‌ను సమస్యకు పరిష్కారం
నెల్లూరుసిటీ, మే 2: నగరంలోని పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యను పరిష్కరించేందుకు నెల్లూరుసిటీ ఎమ్మెల్యే ముంగమూరు శ్రీ్ధర్‌కృష్ణారెడ్డి నుడుమ బిగించారు. అందులో భాగంగా గురువారం బృందావనంలో ట్రాఫిక్‌ను రద్దిని పరిశీలించారు. ఈ ప్రాంతంలో పెట్రోల్ బంకు రోడ్డులో బ్యాంకులు, ఎల్‌ఐసి, షాపింగ్ కాంప్లెక్స్‌లు, అడ్వకేట్ ఆఫీసులు, హాస్పిటల్స్, చిన్న మెకానిక్ షాపులు ఉన్నందున వాహదారులకు చాలా ఇబ్బంది కరంగా మారిపోయిందన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకున్ని ఈ రోడ్డును వన్‌వే చేయాలని ట్రాఫిక్ పోలీసులకు సూచించారు. వాహదారులు, ఆటోలు ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా ఎడమవైపు వెళ్ళి వాహనాలను నిలుపుదల చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంటన నగర డిఎస్పీ వెంకటనాధ్‌రెడ్డి, ఇన్‌చార్జ్ కమిషనర్ సంపత్‌కుమార్, ట్రాఫిక్ సిఐ ఆనం రంగమయూర్‌రెడ్డి, కొండారెడ్డి, సుధీర్, కొట్టే వెంకటేశ్వర్లు, కృష్ణారెడ్డి, ననే్నసాహెబ్ తదితరులు పాల్గొన్నారు.

కన్నుల పండుగగా శ్రీనివాస కల్యాణం

నెల్లూరు సిటీ , మే 2: కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కల్యాణ మహోత్సవ వేడుకను అత్యంత వైభవంగా నిర్వహించారు. ప్రతి నెల వచ్చే శ్రవణ నక్షత్రాన్ని పురస్కారించుకుని స్థానిక తిరుమల తిరుపతి దేవస్థాన కల్యాణ మండపంలో ఈ కల్యాణోత్సవ వేడుక జరుగుతుంది. అర్చకులు వేద మంత్రోచ్చారణలతో శ్రీవారి కల్యాణాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలను చేపట్టారు. ఈవేడుకలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

స్విమ్మింగ్ పోటీలకు అభ్యర్థుల ఎంపిక
నెల్లూరు సిటీ, మే 2: అంతర్‌జిల్లా స్థాయి స్విమ్మింగ్ పోటీలకు అభ్యర్థులను గురువారం ఎంపిక చేశారు. జూనియర్, సబ్ జూనియర్ స్థాయి క్రీడాకారులను ఎంపిక చేశారు. ఎన్నికైనా క్రీడాకారులు ఈనెల 5న వరంగల్ నగరంలో జరిగే సబ్ జూనియర్ స్విమింగ్ పోటీలకు, 16న కర్నూలు నగరంలో నిర్వహించునున్న జూనియర్స్ పోటీలకు హాజరుకానున్నారు. ఈ కార్యక్రమంలో డిఎస్‌డిఓ యతిరాజ్, రామలింగం, స్విమ్మింగ్ అసోసియేషన్ ప్రతినిధులు భారత్‌కుమార్, శ్రీనివాసులు, వేణు, గురుప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

5వ తేదీ నుంచి సమ్మర్ బ్యాడ్మింటన్ రెసిడెన్షియల్ క్యాంపు
నెల్లూరుసిటీ, మే 2: సమ్మర్ బ్యాడ్మింటన్ రెసిడెన్షియల్ క్యాంపును ఈ నెల 5వ తేదీ నుండి జూన్ 15వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు జిల్లా బ్యాడ్మింటన్ అధ్యక్ష, కార్యదర్శలు రాకేష్‌చౌదరి, ముక్కాల ద్వారకానాధ్ తెలిపారు. గురువారం స్థానికంగా జరిగిన విలేఖర్ల సమావేశంలో వారు మాట్లాడుతూ బ్యాడ్మింటన్ సమ్మర్ క్యాంపులో పాల్గొనే క్రీడాకారులు 14 ఏళ్ళ లోపు వారు మాత్రమే అర్హులని తెలిపారు. బాలికలకు మాత్రమే క్యాంపు మాత్రమే ఉంటుందని రెసిడెన్షియల్ ఉండదన్నారు. సమ్మర్ క్యాంపులో పాల్గొనే క్రీడాకారులకు ఉచితంగా భోజనం, వసతి ఏర్పాటు చేస్తామన్నారు. బాలికలకు మాత్రమే కోచింగ్ మాత్రమే ఇస్తామన్నారు. ఈ క్యాంపులో పాల్గొనే వారు కిట్‌ను వారే స్వయంగా తీసుకుని రావాలని సూచించారు. ఈ నెల 4వ తేదీ సాయంత్రం లోపు దరఖాస్తులను తమకు చేర్చాలని కోరారు. ఈసమావేశంలో ప్రసాద్‌రావు, శ్రీనివాసులు, ఎస్ సుబ్రమణ్యం, సంయుక్త కార్యదర్శి వెంకట్ తదితరులు పాల్గొన్నారు.

ప్రపంచ బ్యాంక్ నిధుల చేయూతతో నిర్వహిస్తున్న ఆంధ్రప్రదేశ్
english title: 
tanks

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>