విశాఖపట్నం, మే 2: భవన నిర్మాణాల్లో అతిక్రమణలను నిరోధించడమే లక్ష్యంగా తాకట్టు (మార్ట్‌గేజ్) నిబంధనలను కఠినతరం చేయాలని ప్రభుత్వం నిర్ణయించడం అటు అధికార వర్గాల్లోను, ఇటు నిర్మాణ దారుల్లోను గుబులు రేపుతోంది. నగరపాలక సంస్థల పరిధిలో ప్రస్తుతానికి అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించగా, భవిష్యత్‌లో మున్సిపల్ పట్టణాలకు కూడా ఇవే నిబంధనలు వర్తించే అవకాశం ఉందన్న ప్రచారం సాగుతోంది. ఇప్పటి వరకూ 200 చదరపు మీటర్ల విస్తీర్ణంలో చేపట్టే నిర్మాణాల్లో మాత్రమే 10 శాతం మార్ట్‌గేజ్ నిబంధన వర్తిస్తోంది. మహానగరాల్లో సామాన్యుడు 100 చదరపుమీటర్లలో ఇల్లు నిర్మించుకోవడం సాధారణంగా చోటుచేసుకోదు. అయితే శివారు ప్రాంతాలను కలిపేసుకున్న విశాఖ మహానగరంగా అవతరించడంతో విలీన ప్రాంతాల్లో సామన్యులు సైతం ఇప్పుడు 100 చదరపు మీటర్లకు మించే గృహ నిర్మాణం చేపడుతున్నాడు. కొత్త నిబంధనల కారణంగా వీరు జివిఎంసి నుంచి భవన నిర్మాణ అనుమతులు పొందే సందర్భంలో మార్ట్‌గేజ్ వర్తిస్తుంది. భవన నిర్మాణ విస్తీర్ణంలో 10 శాతం మార్ట్‌గేజ్‌గా జివిఎంసికి దఖలు పడుతుంది. నిబంధనల ప్రకారం నిర్మాణం పూర్తి చేసి ఆక్యుపెన్సీ సర్ట్ఫికెట్ తీసుకున్న తర్వాతే మార్ట్‌గేజ్ నుంచి విముక్తి లభిస్తుంది. ఇప్పటి వరకూ ఉన్న నిబంధనల ప్రకారం బహుళ అంతస్తుల సముదాయంలో మార్ట్‌గేజ్ ఉన్నప్పటికీ రిజిస్ట్రేషన్లు పూర్తయి, వినియోగంలోకి తెచ్చుకునేవారు. దీన్న జివిఎంసి చూసీచూడనట్టు పోయేది. కొత్త నిబంధనల మేరకు ఆక్యుపెన్సీ సర్ట్ఫికెట్ వచ్చిన తర్వాతే వినియోగంలోకి తెచ్చుకోవాల్సి ఉంటుంది. భవన నిర్మాణ సమయంలో తాత్కాలిక విద్యుత్ కనెక్షన్ తీసుకుని, ఆక్యుపెన్సీ సర్ట్ఫికెట్ దఖలు పరచిన తర్వాతే పూర్తిస్థాయి విద్యుత్ కనెక్షన్‌ను పొందాల్సి ఉంటుంది. అంటే నిర్మాణం మొత్తం నిబంధనల ప్రకారమే జరిగినట్టు జివిఎంసి యంత్రాంగం అంగీకరించి సర్ట్ఫికెట్‌ను ఇవ్వాల్సి ఉంటుంది. అప్పుడే భవన నిర్మాణ దారుకు మార్ట్‌గేజ్ నుంచి మినహాయింపు లభిస్తుంది. నిబంధనలు కఠినతరం చేసినప్పటికీ
పథకాల అమలుపై సమీక్ష అవసరం
* అధికారులతో మంత్రి బాలరాజు
విశాఖపట్నం, మే 2: ప్రభుత్వ పథకాల అమలు, అవి ప్రజలకు చేరుతున్న తీరుపై అధికార యంత్రాంగం సమీక్షించుకుంటూ పనితీరును మెరుగుపరచుకోవాలని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పి బాలరాజు సూచించారు. ప్రభుత్వ కార్యక్రమాల అమలుతీరుపై జిల్లా యంత్రాంగం, ప్రత్యేకాధికారులతో కలెక్టర్ కార్యాలయంలో గురువారం సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ మహిళలకు వడ్డీలేని రుణాలు, స్ర్తినిధి వంటి పథకాలపై మహిళల్లో విస్తృత ప్రచార కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ పథకాలపై అవగాహన కోసం ఇందిర క్రాంతి పథం సిబ్బంది స్వయం సహాయక సంఘాలతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని సూచించారు. ప్రభుత్వ పథకాలపై కళాజాతలతో నిర్వహిస్తున్న ప్రచార కార్యక్రమాలను మరింత విస్తృత పరచాలని సూచించారు. అలాగే విశాఖ నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా జివిఎంసి కమిషనర్ సత్యనారాయణను మంత్రి ఆదేశించారు. తొలుత జిల్లా కలెక్టర్ వి శేషాద్రి మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా గత నెల 5 నుంచి ఇందిరమ్మ కలలు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, రైతు చైతన్యయాత్రలు జరుపుతున్నామని, అలాగే అమ్మహస్తం కార్యక్రమం చేపట్టినట్టు వెల్లడించారు. సాంఘిక సంక్షేల శాఖ ఉపసంచాలకులు, పాడేరు ఐటిడిఎ ప్రాజెక్టు ఇన్‌ఛార్జ్ అధికారి నరసింహారావు ఇందిరమ్మ కలలు కార్యక్రమం ప్రగతిని మంత్రికి వివరించారు. వేసవి నీటి ఎద్దడి నివారణకు తీసుకున్న చర్యలను గ్రామీణ నీటి సరఫరా విభాగం అధికారి కాంతానాథ్ సమగ్రంగా వివరించారు. సమావేశంలో సంయుక్త కలెక్టర్ ప్రవీణ్‌కుమార్, శాసనసభ్యులు మళ్ళ విజయప్రసాద్, ఎమ్మెల్సీ సత్యనారాయణ రాజు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
టిడిపికి దాడి షాక్
* విజయమ్మను కలిసిన వీరభద్రరావు?
* నాలుగున జగన్‌తో ములాకత్?
* నేడు పార్టీ కార్యకర్తలతో సమావేశం
విశాఖపట్నం, మే 2: తెలుగుదేశం పార్టీలో గత కొంత కాలంగా కొనసాగుతున్న ఉత్కంఠతకు దాడి వీరభద్రరావు తెరదించారు. పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు గురువారం రాత్రి ప్రకటించారు. చంద్రబాబు నాయుడు తనకు పార్టీలో గౌరవం ఇవ్వనందువలనే, పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు దాడి ప్రకటించారు. తన భవిష్యత్ కార్యాచరణను నిర్ణయించేందుకు శుక్రవారం అనకాపల్లిలో తన అనుచురులతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అయితే దాడి వీరభద్రరావుకు మద్దతుగా, టిడిపి నుంచి ఎంత మంది బయటకు వెళతారన్నది వేచి చూడాలి. ఈ పరిణామం విశాఖ టిడిపిలో సంక్షోభాన్ని సృష్టించింది.
బాబుకు ముందే తెలుసు!
దాడి వీరభద్రరావు పార్టీని విడిచి వెళ్లిపోతారన్న సమాచారం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ముందే పసికట్టారు. విధాన మండలికి దాడిని కాదని, యనమలను పంపించినప్పుడే, ఆయన అలగడం, చంద్రబాబు బుజ్జగించడం జరిగింది. అప్పటికే, దాడి వీరభద్రరావు కుమారుడు రత్నాకర్‌కు పార్టీ అధ్యక్ష పదవి ఇచ్చారు. 2014 ఎన్నికల్లో అనకాపల్లి నియోజకవర్గం నుంచి రత్నాకర్‌ను బరిలోకి దించుతామన్న హామీ కూడా ఇచ్చారు. అయినప్పటికి వీరభద్రరావు వ్యవహార శైలిలో మార్పు రాలేదు. బాబు అతి ప్రతిష్టాత్మంగా నిర్వహిస్తున్న వస్తున్న మీకోసం యాత్రకు కూడా దాడి దూరంగా ఉన్నారు. దీంతో వీరభద్రరావు పార్టీకి దూరం కావచ్చని చంద్రబాబు భావించారు. అయినప్పటికీ, జిల్లా పార్టీ అధ్యక్షునిగా రత్నాకర్‌ను తన వెంటే తిప్పుకున్నారు. చివరి రోజు జరిగిన బహిరంగ సభకు కూడా దాడి హాజరు కాకపోవడం పార్టీలోని చాలా మంది ఆయన వ్యవహారంపై అనుమానాలు వ్యక్తం చేశారు. చివరకు దాడి పార్టీకి రాజీనామా చేశారు.
కంచుకోటకు బీటలు!
అనకాపల్లి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి కంచుకోట. పార్టీ ఆవిర్భావం నుంచి ఈ నియోజకవర్గంలో టిడిపి విజయం సాధిస్తూ వస్తోంది. దాడి వీరభద్రరావు ఈ నియోజకవర్గం నుంచి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2004, 2009 ఎన్నికల్లో మాత్రమే టిడిపి ఓటమిని చవిచూసింది. అంటే నియోజకవర్గంలో పార్టీకి ఎంత బలమైన క్యాడర్ ఉందో అర్థం చేసుకోవచ్చు. పార్టీ అధిష్టానం, జిల్లా పార్టీ తీసుకున్న నిర్ణయాల కారణంగా ఇటీవల కాలంలో టిడిపి క్యాడర్ బలహీనపడింది. ఇప్పటికే, ఈ నియోజకవర్గంలో టిడిపి క్యాడర్ కూడా ప్రత్యర్థి పార్టీలకు వలస పోతున్నారు. ఈనేపథ్యంలో దాడి వీరభద్రరావు రాజీనామా పార్టీకి మరింత చేటు తెచ్చే విధంగా తయారైంది. వీరభద్రరావు అనకాపల్లిలో శుక్రవారం కార్యకర్తల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. దాడిపై అభిమానంతో, లేదా ఆయన చేరుతారన్న ప్రచారం జరుగుతున్న వేరే పార్టీపై ఉన్న మమకారంతోనైనా కొంత క్యాడర్ దాడి వెంట వెళ్లే అవకాశం ఉంది. అయితే పార్టీలో అనేక పదవులు అనుభవించిన ఆయన ఒక్కసారిగా ఈ నిర్ణయం తీసుకోవడం పట్ల టిడిపి క్యాడర్ నుంచి వ్యతిరేకత కూడా వ్యక్తం అవుతోంది. దాడి కుటుంబం మొత్తం పార్టీకి రాజీనామా చేయడం వలన ఉన్నపళంగా టిడిపికి ఆ నియోజకవర్గంలో కొత్త నాయకుడిని వెతుక్కోవలసిన అగత్యం ఏర్పడింది.
టిడిపిలో అయోమయం
జిల్లాలో తెలుగుదేశం పార్టీ రెండు ముక్కలైంది. అయ్యన్నపాత్రుడు నాయకత్వంలో ఒక వర్గం పనిచేస్తుండగా, దాడి వీరభద్రరావు మరో వర్గానికి కొమ్ము కాస్తూ వచ్చారు. అయ్యన్న చర్యలను దాడి విమర్శిస్తూ వచ్చారు. దాడిని నమ్ముకుని ఓ వర్గం కార్యాచరణను రూపొందించుకుంది. అకస్మాతుగా దాడి రాజీనామా చేయడంతో ఈ వర్గం పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.
అయ్యన్నతో మాట్లాడిన బాబు
ఇదిలా ఉండగా పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పొలిట్‌బ్యూరో సభ్యుడు అయ్యన్నపాత్రునితో గురువారం రాత్రి ఫోన్‌లో మాట్లాడారు. శుక్రవారం అనకాపల్లిలో దాడి వీరభద్రరావు ఏర్పాటు చేసిన సభలో ఆయన ఏం మాట్లాడతారో తెలుసుకుని, ఆ తరువాత వెంటనే పార్టీ నాయకులను సమావేశపరచి బాబు ఆదేశించినట్టు తెలిసింది. వెంటనే అనకాపల్లి నియోజకవర్గ బాధ్యతలను కొత్త వ్యక్తికి అప్పగించాలని కూడా బాబు సూచించినట్టు తెలిసింది.
దాడి రాజకీయ ప్రస్థానం
1982 మార్చి 29న ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీలో దాడి వీరభద్రరావు చేరారు. అదే ఏడాది అక్టోబర్ 27న అనకాపల్లిలో తొలిసారిగా జరిగిన ఎన్టీఆర్ బహిరంగ సభను విజయవంతం చేశారు. 1984లో సినీ నటుడు రావుగోపాలరావు ప్రోత్సాహంతో తెలుగుదేశం పార్టీ తరపున అనకాపల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారు. 1987 జులై 11న రాష్ట్ర సమాచార శాఖ ఉప మంత్రిగా ఎన్టీఆర్ మంత్రివర్గంలో చేరారు. 1989 జనవరిలో ఆర్టీసీ రాజరాజనరేంద్ర రీజియన్ చైర్మన్‌గా నియమితులయ్యారు. 1989లో రెండోసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1994లో మూడోసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 1999లో నాలుగోసారి అనకాపల్లి నియోజకవర్గం నుంచే ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2000లో శాసనసభా సబార్డినేట్ లెజిస్లేటివ్ కమిటీ చైర్మన్‌గా దాడి నియమితులయ్యారు. 2007లో ఎమ్మెల్సీగా గెలుపొంది, విధాన మండలి ప్రతిపక్ష నాయకునిగా పనిచేశారు. అప్పటి నుంచి టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యునిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
ఘనంగా ముగిసిన సత్యభామ యువజనోత్సవం
పూలరథంపై ఊరేగింపు, పల్లకి సేవ
ఆరిలోవ, మే 2: సంప్రదాయ కూచిపూడి నృత్య కళకు అంతర్జాతీయ గుర్తింపు తెచ్చిన ప్రఖ్యాత నర్తకి పద్మశ్రీ డాక్టర్ కె. శోభానాయుడును రాష్ట్ర వౌలిక వసతులు, ఓడరేవుల అభివృద్ధి శాఖమంత్రి గంటా శ్రీనివాసరావు ‘ విశ్వవిఖ్యాత నాట్య కళా తపస్వి’ బిరుదుతో ఘనంగా సత్కరించారు. నటరాజ్ మ్యూజిక్ అండ్ డాన్స్ అకాడమి వ్యవస్థాపక అధ్యక్షుడు బత్తిన విక్రంగౌడ్ నేతృత్వంలో రెండురోజుల పాటు కళాభారతి ఆడిటోరియంలో ‘సత్యభామ యువ నృత్యోత్సవంలో భాగంగా రెండవరోజు గురువారం సాయంత్రం దేశంలోని వివిధ రాష్ట్రాలు, నగరాలకు చెందిన యువ కళాకారిణుల భరతనాట్యం, కూచిపూడి, మోహినీ అట్టం, సత్రియా, ఒడిస్సీ నృత్యాలు, శోభానాయుడుకు బిరుదు ప్రధాన కార్యక్రమాలు జరిగాయి. ఈ సందర్భంగా మంత్రి గంటా శ్రీనివాసరావు నృత్య కళాకారిణిని శాలువ, పూలమాల, జ్ఞాపిక, విశ్వవిఖ్యాత నాట్య కళా తపస్వి బిరుదుతో సత్కరించారు. కార్యక్రమంలో అకాడమి వ్యవస్థాపక అధ్యక్షుడు బత్తిన విక్రంగౌడ్, డాక్టర్ సోమనాధ్, డాక్టర్ లలిత్‌కుమార్ గుప్తా, ప్రొఫెసర్ బి. సుదీప్తా పాల్గొన్నారు. ముందుగా మద్దిలపాలెం జాతీయ రహదారి కూడలి నుండి తప్పెటగుళ్లు, కోలాటం, జానపద నృత్యాలతో, వివధ కళాసంస్థల ప్రతినిధులు, కళాకారులు, సంస్థ నిర్వాహకులు కళాభారతి ఆడిటోరియం వరకు పద్మశ్రీ శోభానాయుడును పుష్పరథంపై, రాజవంశీకుల పల్లకిపై ఊరేగింపుగా తెచ్చారు. వేదిక బిరుదు ప్రదానం అనంతరం శోభానాయుడుకు పుష్పాభిషేకం, తొమ్మిది రకాల పుష్పాలతో పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి గంటా మాట్లాడుతూ మనదైన కూచిపూడి కళకు అంతర్జాతీయ ఖ్యాతిని తెచ్చిన శోభానాయుడుకు ఈ బిరుదు ప్రదానం సముచితమన్నారు. సత్యభామ యువ నృతోత్సవం రెండవరోజు కార్యక్రమాన్ని మస్కట్ దేశానికి చెందిన ఒడిస్సా నాట్యాచార్యుడు దీపక్‌రాయ్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. మస్కట్ నృత్య కళారూపాలు ఉపాసనా సన్యాల్, స్థితి పరారీ, శ్రీయ కె. బంగేరా, దీవానా అనిల్ ఒడిస్సీ బృందం నృత్యంతో రెండవరోజు ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. నటరాజ్ మ్యూజిక్ అకాడమి ప్రిన్సిపాల్ కె.వి. లక్ష్మి శిష్యురాలు అరుణా పరమేష్ కూచిపూడి నాట్య ప్రదర్శనతో ప్రేక్షకులను మైమరపించారు. మైసూర్‌కు చెందిన నిధి, చంద్రిక, భరతనాట్యంతో, ఢిల్లీకి చెందిన శరద్వుతి, ప్రహర్షిణి, వరంగల్‌కు చెందిన హిమాన్ శ్రీచౌదరి, హిమజ, పద్మిని కూచిపూడి నృత్యంతో ఆహుతులకు కనువిందు చేశారు. ప్రదర్శనానంతరం మైసూర్‌కు చెందిన కళాకారులకు ఉత్సవ సంచాలకులు బత్తిన విక్రంగౌడ్, సెలక్షన్ కమిటీ సభ్యుడు డాక్టర్ ఎస్. మురళీబాబు బహుమతులు అందజేశారు. ఉత్సవంలో పాల్గొన్న కళాకారులకు నాట్యకృత్తిక, నాట్యమంజరి, సత్యభామ బిరుదులను శోభానాయుడు అందజేశారు. ఉషశ్రీ కార్యక్రమ వ్యాఖ్యాతగా వ్యవహరించారు.
సమస్యల పరిష్కారానికి జివిఎంసి టోల్‌ఫ్రీ నెంబర్
విశాఖపట్నం, మే 2: గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పౌరసేవలు సక్రమంగా అందించడంతో పాటు సేవల నిర్వాహణలో ఎదురైన ఇబ్బందులను పరిష్కరించేందుకు టోల్‌ఫ్రీ నెంబర్ విధానాన్ని అమల్లోకి తెచ్చారు. టోల్‌ఫ్రీ నెంబర్ 1800-4250-0009కి ఫోన్ చేసి తమ ఫిర్యాదును నమోదు చేసుకోవచ్చని కమిషనర్ ఎంవి సత్యనారాయణ గురువారం తెలిపారు. కాల్‌సెంటర్‌లో నమోదైన ఫిర్యాదులను స్వయంగా పరిశీలించి నేరుగా లబ్దిదారునితోనే సమస్య పరిష్కారం గురించి తెలియజెప్పే విధానాన్ని అమలు చేస్తున్నట్టు తెలిపారు. ఒక్క ఫోన్‌కాల్‌తో మీసమస్యను మీఇంటి నుంచే పరిష్కరించుకోవచ్చని ఆయన తెలిపారు. అలాగే ప్రతి బుధవారం డయల్‌యువర్ కమిషనర్ కార్యక్రమంలో సమస్యను నేరుగా వివరించవచ్చని తెలిపారు. ముఖ్యంగా తాగునీరు, పారిశుద్ధ్యం, వీధిలైట్లు, యుజిడి వంటి సమస్యలకు సంబంధించి ఈ సేవలను ఉపయోగించుకోవచ్చని తెలిపారు.
‘అమ్మహస్తం’ పథకంలోకి మరో 18 వస్తువులు
విశాఖపట్నం, మే 2: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న 3అమ్మహస్తం2 పథకంలో భాగంగా మరో 18 వస్తువులను వీటి పరిధిలో తీసుకువస్తున్నట్టు రాష్ట్ర ఓడరేవుపులు, పెట్టుబడులశాఖామంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. దక్షిణనియోజకవర్గం ఇందిరాప్రియదర్శిని స్టేడియంలో గురువారం సాయంత్రం నిర్వహించిన అమ్మహస్తం కార్యక్రమాన్ని మంత్రి జ్యోతిప్రజ్వలన చేసిన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత నెలలో ఉగాది పర్వదినం సందర్భంగా ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి దీనిని ప్రారంభించారు. ఆ తరువాత రాష్టవ్య్రాప్తంగా అన్ని జిల్లాల్లో అమలు చేస్తున్నట్టు చెప్పారు. నిత్యావసర సరకుల ధరలు విపరీతంగా పెరిగిన పరిస్థితులను దృష్టిపెట్టుకున్న ముఖ్యమంత్రి తొమ్మిది సరకుల ప్యాకేజీని రూ.185లకే అందివ్వాలని నిర్ణయించారన్నారు. తొమ్మిది సరకులతోపాటు మరో 18 రకాల వస్తువులను ఈ పథకంలోకి తీసుకురానున్నట్టు చెప్పారు. ఈ పథకం నూరు శాతం విజయవంతానికి అంతా భాగస్వాములు కావాల్సిందిగా పిలుపునిచ్చారు. వస్తువుల తూకంలో తక్కువ వచ్చినా, సరకులు ఇవ్వకపోయినా డీలర్లపై తీవ్రమైన చర్యలుంటాయన్నారు. ఈ పథకం అమలతో ప్రభుత్వానికి రూ.660కోట్ల మేర సబ్సిడీ భారం మోయాల్సి వస్తుందని, ఎంతె్తైనా పటిష్టంగా అమలు చేయాలనే ముఖ్యమంత్రి సంకల్పంతో పేదలకు అందుతున్నాయన్నారు. నగర పరిధిలో 3.36లక్షల మంది, జిల్లా పరిధిలో మరో 7.44లక్షల మంది కుటుంబాలకు ఈ పథకం వర్తిస్తుందన్నారు. ఇందిరమ్మ కలలు, బంగాతల్లి వంటి పథకాలు పేదల కోసం ప్రవేశపెట్టి అమలు చేస్తున్నామన్నారు. జివిఎంసి పరిధిలో 62వేల మందికి పించన్లు అందుతున్నాయన్నారు. అర్హులు దరఖాస్తులు చేసుకుంటే త్వరలో పించన్ల అందుతాయన్నారు. ప్రతిఒక్క సంక్షేమ కార్యక్రమం ప్రతి ఇంటికి చేరాలనే లక్ష్యంతో ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామన్నారు. జయపూర్ సభలో యుపిఏ అధినేత్రి సోనియాగాంధీ మాట్లాడుతూ ఆంధ్రాలో సిఎం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలపై ప్రశంసలు కురిపించారన్నారు.
విశాఖ నగరం ఒకటవ నియోజకవర్గం పరిధిలో రూ. 37 కోట్లతో భూగర్భ డ్రైనేజీ, మరో రూ. 49 కోట్లతో పైపులైన్ల ఆధునీకరణ పనులు పూర్తయ్యాయని, అలాగే పురాతన భవనాల ఆధునీకరణకు మరో పది కోట్ల మేర ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. పోర్టు ద్వారా వెదజల్లే కాలుష్య నివారణ కోసం వందల కోట్లు వెచ్చిస్తున్నారని, వన్‌టౌన్ ప్రాంతాన్ని కాలుష్యబారి నుంచి కాపాడేందుకు అనేక రకాలైన చర్యలు మొదలయ్యాయన్నారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ద్రోణంరాజు శ్రీనివాసరావు మాట్లాడుతూ ఒకే వేదికగా చేసుకుని దీపం పథకం, అమ్మహస్తం, పొదుపు సంఘాల మహిళలకు వడ్డీలేని రుణాలకు చెందిన చెక్‌ల పంపిణీ కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నామన్నారు. వీటిని ప్రతిఒక్కరూ సద్వినియోగపర్చుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. రూ.292ల విలువైన సరుకులను కేవలం రూ.185లకే అందిస్తూ రూ.107ల లబ్ధి పొందే విధంగా ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి దూరదృష్టితో ఈ పథకాన్ని ప్రవేశపెట్టారన్నారు. డబ్బులేని కుటుంబం ఏమీ చేయలేదని, ఇటువంటిదే ప్రభుత్వం అని ఇది ఖజానా, ఆర్థిక పరిపుష్టి కలిగి ఉంటటేనేప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు నిర్వహించగలదన్నారు. ఇవి ఎన్నికల పథకాలు మాత్రం కావదన్నారు. మహిళలకు వడ్డీలేని రుణాల ద్వారా మహిళలకు ఆర్థిక స్వాతంత్రం కల్పించినట్టు అయ్యిందన్నార. 10,500 మందికి రూ. 28 లక్షలు పించన్లను పంపణీ చేయగలుగుతున్నామన్నారు. పురాతన కట్టడాల ఆధునీకరణ, సామాజిక భవనాలు, రోడ్లు నిర్మాణాలు పూర్తవుతున్నాయన్నారు. దేశానికి తలమానికమైన విశాఖ పోర్టుట్రస్టు ద్వారా వన్‌టౌను ప్రాంతం కాలుష్యంతో నిండిందని, దీని నివారణకు తాను అసెంబ్లీలో మాట్లాడి, ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్ళడంతో బొగ్గు, ఇనుపఖనిజం, ఎరువుల వంటి వాటిని క్లోజుడ్ కనె్వయర్ బెల్ట్ ద్వారా తరలించడానకి కోట్లాది రూపాయ లు వెచ్చిస్తున్నారన్నారు. కోటవీధిని తరలించేకుండా తాను కృషి చేస్తున్నానన్నారు. కలెక్టర్ వి.శేషాద్రి మాట్లాడుతూ ఈ నెల 20న ముఖ్యమంత్రి పెందుర్తిలో దీనిని ప్రవేశపెట్టారన్నారు. ప్రతి కుటుంబానికి రూ.107ల మేర లబ్ధి పొందే విధంగా రూ.185లకే తొమ్మిది సరకులను ఇస్తున్నామన్నారు. డీలర్లు అక్రమాలకు పాల్పడకుండా దీనిని అమలు చేయాలని, పిర్యాదులొస్తే తీవ్రమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. జాయింట్ కలెక్టర్ ప్రవీణ్‌కుమార్, పౌరసరఫరాల అధికారి (పట్టణ) నాదేండ్ల జ్వాలాప్రకాష్, శ్రీ కనకమహాలక్ష్మీ దేవాలయం చైర్మన్ శ్రీనివాసులరెడ్డి, మాజీ కార్పొరేటర్లు, పార్టీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు. తొమ్మిది సరుకల ప్యాకేజీకి సంబంధించి నాలుగు వేల బ్యాగ్‌లు, దీపం పథకం కింద 1200మందికి గ్యాస్ కనెక్షన్లను మంత్రి గంటా, ఎమ్మెల్యే ద్రోణంరాజు శ్రీనివాస్ చేతులమీదుగా పంపిణీ చేశారు. అలాగే మహిళలకు రుణాలకు చెందిన చెక్‌లను అందజేశారు. తొలుత మంత్రి గంటా ఆయా పథకాలకు చెందిన స్టాల్స్‌ను సందర్శించి, వాటి పనితీరు గురించి సంబంధితాధికారులను అడిగి తెలుసుకున్నారు.
మాస్టర్‌ప్లాన్‌పై స్పష్టత లేని దేవాదాయ ఇంజనీర్లు
జూన్ నెలాఖరు నాటికి పూర్తి చేస్తామన్న ఎస్‌ఇ
చందనయాత్ర ఏర్పాట్ల పరిశీలన
సింహాచలం, మే 2 : శ్రీవరాహలక్ష్మీ నృసింహస్వామి దేవస్థానంలో జరుగుతున్న దివ్యక్షేత్రం అభివృద్ధి పనులకు సంబంధించి మాస్టర్ ప్లాన్ రూపొందించడంలో దేవాదాయశాఖ ఇంజనీరింగ్ అధికారుల్లో స్పష్టత కనిపించడంలేదు. సింహగిరిపై దివ్యక్షేత్రం అభివృద్ధి కోసం దాదాపు పదమూడేళ్ల క్రితం అప్పటి ప్రభుత్వం ప్రత్యేకంగా జీవోను విడుదల చేసినా నేటికీ దేవాదాయశాఖ మాస్టర్‌ప్లాన్ రూపొందించలేకపోయింది. సింహాచలం దేవస్థానం అధికారవర్గాలు సైతం మాస్టర్‌ప్లాన్‌పై చిత్తశుద్ధిని కనబరకలేదు. ఈ నేపథ్యంలో గడచిన అయిదేళ్లుగా దేవస్థానంలో దశల వారీగా జరుగుతున్న అభివృద్ధి పనులకు దిశా నిర్దేశం లేకుండాపోయింది. కోట్లాది రూపాయలతో పనులు జరుగుతున్నా నేటికీ సింహగిరిపై ఒక రూపురేఖ కానరాకుండా పోయింది. భక్తుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రాధాన్యతాక్రమంలో పనులు చేపట్టాల్సిన ఉండగా ఇక్కడ అందుకు భిన్నంగా పరిస్థితులు తయారయ్యాయిచ. చేసిన పనులే చేస్తూ, నిర్మించినవి కూల్చేస్తూ ఇష్టారాజ్యంగా కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నారు. దేవాదాయశాఖ ఉన్నతాధికారులు మారినప్పుడల్లా దేవస్థానం మాస్టర్‌ప్లాన్ (అనధికారికంగా) మారిపోతుంది. ఒక అధికారి ఓ నిర్మాణం చేపట్టమంటే మరో అధికారి వచ్చి ‘ ఎవరయ్యా! ఇక్కడ ఇది కట్టింది? తొలగించండి’ అంటూ ఆదేశించడం పరిపాటిగా మారిపోయింది. దీంతో దివ్యక్షేత్రం మాస్టర్‌ప్లాన్‌పై గందరగోళం నెలకొంది. నిర్దుష్టమైన మాస్టర్‌ప్లాన్ లేకపోవడంతో కోట్లాది రూపాయలతో చేపట్టిన పనులు నిరుపయోగంగా మారిపోయాయి. కళ్లెదుటే వృథాగా ఖర్చయిపోతున్న కోట్లాది రూపాయల నిధులపై అన్ని వర్గాల వారిలో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో మాస్టర్‌ప్లాన్ తయారు చేసి ప్రభుత్వ అధికార ముద్ర పడేలా చేయండి మహాప్రభో అంటూ మీడియా గగ్గోలు పెట్టిన నేపథ్యంలో అధికారులు అదిగో ఇదిగో అంటూ కాలయాపన చేస్తున్నారు. దేవస్థానానికి వచ్చిన దేవాదాయ శాఖ చీఫ్ ఇంజనీర్ వద్ద మాస్టర్‌ప్లాన్ అంశాన్ని ప్రస్తావిస్తే 15 రోజుల్లో సిద్ధమవుతుందని ప్రకటించారు. నెలలు గడుస్తున్నా ఇంత వరకు ఆ ఊసే లేదు. తాజాగా దేవాదాయ శాఖ సూపరింటెండెంట్ ఇంజనీర్ గురువారం సింహాచలం వచ్చారు. జూన్ నెలాఖరు నాటికి మాస్టర్ ప్లాన్ సిద్ధం చేస్తామని తెలిపారు. మార్పులు చేర్పులు చేయాల్సి ఉందని ఈవో ఇంజనీర్లతో చర్చించి తుది మెరుగుల దిద్దుతారని ఆయన అన్నారు. ఎస్‌ఇ సుబ్బారావు ప్రకటించిన ప్రకారం జూన్ నెలాఖరు నాటికి దివ్యక్షేత్రం మాస్టర్ ప్లాన్ అధికారికంగా సిద్ధమవుతుందో లేదో కాలమే చెప్పాలి.
క్యూలైన్ల పరిశీలన
దేవాలయంలో 13వ తేదీన జరగనున్న చందనయాత్ర నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లను దేవాదాయ శాఖ సూపరింటెండింగ్ ఇంజనీరు ఎస్. సుబ్బారావు గురువారం పరిశీలించారు. ప్రధానంగా భక్తుల దర్శనాల క్యూలైన్ల ఏర్పాట్లపై ఇంజనీర్లతో చర్చించారు. చందన యాత్ర కోసం ప్రత్యేకంగా తయారు చేసిన ప్రణాళికలను పరిశీలించి అందుకు అనుగుణంగా సన్నాహాలు చేస్తున్నట్లు ఇంజనీర్లు ఎస్‌ఇకి చెప్పారు.
దేశం పార్టీ బలం తేలేది నేడే
దాడి వెంట పార్టీశ్రేణులు వెళ్తారా?
పార్టీలోనే కొనసాగుతారా?
అనుచరులతో నేడు దాడి ప్రత్యేక సమావేశం
అనకాపల్లి, మే 2: తెలుగుదేశం పార్టీకి, పదవులకు దేశం పార్టీ సీనియర్ నేత దాడి వీరభద్రరావు, ఆయన తనయుడు రత్నాకర్‌లు రాజీనామాలు చేసినట్లు ఎలక్ట్రానిక్ మీడియాద్వారానే ప్రజలు, పార్టీశ్రేణులు తెలుసుకున్నారు. ఈ నేపధ్యంలో శుక్రవారం అనకాపల్లి అసెంబ్లీ నియోజకవర్గస్థాయి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తల విస్క్రత సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు పట్టణ దేశం పార్టీ అధ్యక్షులు బుద్ద నాగజగదీష్ ప్రకటన విడుదల చేసారు. ఈ సమావేశానికి ఎమ్మెల్సీ దాడి హాజరవుతున్నట్లు ప్రకటించారు. పార్టీశ్రేణులతో ముందుగా ఎటువంటి అభిప్రాయం తీసుకోకుండానే పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు దాడి వీరభద్రరావుప్రకటించడం ఆయన సొంత అనకాపల్లి అసెంబ్లీ పరిధిలోని పార్టీనాయకులకు, కార్యకర్తలకు మింగుడుపడటం లేదు. తన రాజకీయ భవితవ్యంపై పార్టీశ్రేణుల అభిప్రాయాలను తెలుసుకునేందుకు శుక్రవారం ఉదయం ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశం రాజకీయంగా అత్యంత ప్రాముఖ్యత సంతరించుకుంది. తెలుగుదేశం పార్టీకి ఎందుకు రాజీనామా చేయాల్సివచ్చింది. పార్టీ అధినేత చంద్రబాబు తనను ఏ విధంగా మోసగించారు, ఇందుకు దారితీసిన పరిస్థితులను ఈ సమావేశంలో ఎమ్మెల్సీ దాడి వీవరించనున్నారు. భవిష్యత్‌లో తాను ఏ పార్టీలో చేరనున్నది కూడా ఈ సమావేశంలో ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలో పాల్గొననున్న పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పార్టీ సీనియర్ నేత దాడి రాజీనామా నిర్ణయంపై బాహాటంగానే తమ వ్యతిరేకతను వ్యక్తం చేసేందుకు సన్నద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. అటువంటి పరిస్థితి తలెత్తితే దాడి ఏ విధంగా స్పందిస్తారోనని పార్టీశ్రేణులు ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. పార్టీ అధికారంలో లేకపోయినా ప్రతిష్ఠాత్మకమైన ఎమ్మెల్సీ పదవి వీరభద్రరావుకు పార్టీ అధినేత చంద్రబాబు కట్టబెట్టారని, ఆయన తనయుడ రత్నాకర్‌కు సైతం జిల్లా పార్టీ పగ్గాలను పార్టీ అధినేత అప్పగించారని ఆ విధంగా మేలుచేసిన పార్టీకి వీరభద్రరావు, ఆయన తనయుడు రత్నాకర్‌లు రాజీనామాలు చేయడాన్ని బాహాటంగానే వ్యతిరేకించేందుకు కొందరు సన్నద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
అనకాపల్లిలో టిడిపి పగ్గాలు దక్కేదెవరికో?
అనకాపల్లి, మే 2: పార్టీ సీనియర్ నేత దాడి వీరభద్రరావు, ఆయన తనయుడు రత్నాకర్‌లు పదవులకు, పార్టీలకు రాజీనామా చేయడంతో అనకాపల్లి అసెంబ్లీలో దేశం పార్టీ పగ్గాలు ఎవరికి దక్కనున్నాయనే విషయంపై రాజకీయ వర్గాల్లో అప్పుడే చర్చ ప్రారంభమయింది. దాడివెంట వేరే పార్టీకి వెళ్లకుండా దేశంపార్టీలోనే కొనసాగే సీనియర్ నేతలెవరు అనే విషయమై ఇప్పటికే మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ఆరాతీస్తున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. కాంగ్రెస్ పార్టీ నేతలపై తీవ్ర అసంతృప్తితో ఉన్న మాజీ మున్సిపల్ చైర్మన్ కొణతాల జగన్‌తోపాటు దాడితో వ్యక్తిగతంగా బద్ద శత్రుత్వం కలిగిన మాజీ ఎంపిపి కొణతాల బాబూరావు తదితర నేతల పేర్లు తెరపైకి వచ్చాయి. తెలుగుదేశం పార్టీనుండి బహిష్కరణకు గురై స్తబ్ధతగా ఉన్న నూకాంభిక దేవస్థాన మాజీ చైర్మన్ కొణతాల వెంకట్రావు, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ దంతులూరి రాజాబాబుతోపాటు దాడిని విభేదించి అధికార కాంగ్రెస్‌లో చేరిన మాజీ ఎంపిపి మలసాల ధనమ్మ, ఆమె భర్త మలసాల రమణారావు తదితరులను తిరిగి దేశం పార్టీలోకి తీసుకువచ్చే ప్రయత్నాలు ప్రారంభమైనట్లు ప్రచారం సాగుతోంది. ఎమ్మెల్యే టిక్కెట్‌ను ఆశిస్తున్న తెలుగుదేశం పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు డాక్టర్ కెకెవిఎ నారాయణరావు పార్టీకి రాజీనామా చేసి దాడి వెంటే వెళ్తారా లేదా దేశం పార్టీలోనే కొనసాగుతారా అనే విషయంపై పార్టీశ్రేణుల్లో చర్చనీయాంశంగా మారింది. తెలుగుదేశం పార్టీకి ప్రతికూల పరిస్థితుల్లో సైతం అనకాపల్లి ప్రాంతంలో మంచి వీరాభిమానులున్నారు. వారు దేశం పార్టీలోనే కొనసాగే పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
ఫిర్యాదులను స్వయంగా పరిశీలించిన కమిషనర్
విశాఖపట్నం, మే 2: ప్రజానీకం నుంచి అందిన ఫిర్యాదులపై జివిఎంసి కమిషనర్ ఎంవి సత్యనారాయణ స్వయంగా స్పందించిన సంఘటన గురువారం నాడిక్కడ చోటుచేసుకుంది. 10వ వార్డు పరిధిలోని కాలువల్లో పూడిక పేరుకుపోవడంపై స్థానికుల నుంచి ఫిర్యాదులు అందాయి. రెండో జోన్ ఎఎంఓహెచ్ డాక్టర్ శ్రీనివాసరావు, శానిటరీ సిబ్బందితో పూడికతీత పనులను పర్యవేక్షిస్తున్నారు. ఈసందర్భంగా కమిషనర్ కాలనీవాసులతో మాట్లాడుతూ మురుగు కాలువల్లో చెత్త వేయడం వల్ల నీరు ప్రవహించేందుకు వీలుకాక మురుగు రోడ్లపై ప్రవహిస్తోందని, స్థానికులు కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకుంటే ఇటువంటి సమస్యలు తలెత్తవన్నారు. పరిసరాల పరిశుభ్రతకు ప్రజలు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. అనంతరం కమిషనర్ సీతంపేటలో కొత్తగా వేసిన బిటి రోడ్ల పనులను పరిశీలించి సంతృప్తిని వ్యక్తం చేశారు.
కేంద్రమంత్రి పర్యటన ఏర్పాట్ల పరిశీలన
కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కె చిరంజీవి ఈనెల 4న భీమిలిలో పర్యటించనున్న దృష్ట్యా ఏర్పాట్లను కమిషనర్ సత్యనారాయణ పరిశీలించారు. విశాఖ భీమిలి బీచ్ రోడ్డు పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ఈసందర్భంగా ఏర్పాట్లలో ఎటువంటి లోపాలు లేకుండా చర్యలు తీసుకోవాలని వుడా ఛీఫ్ ఇంజనీర్ విశ్వనాథ్‌ను ఆదేశించారు.
బదిలీల జాతరకు సన్నద్ధం
నేటి నుంచి పిఆర్, విద్యాశాఖలో దరఖాస్తులు ఆహ్వానం
విశాఖపట్నం, మే 2: ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగుల బదిలీలకు ప్రభుత్వం పచ్చజెండా ఊపడంతో ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాల్లో సందడి మొదలైంది. జిల్లా వ్యాప్తంగా ఉపాధ్యాయ వర్గాలు ఈనెల 3నుంచి 7 వరకూ బదిలీ కోరుతూ దరఖాస్తు చేసుకోవచ్చని జిల్లా విద్యాశాఖ అధికారి కె కృష్ణవేణి తెలిపారు. రెండేళ్లు పనిచేసిన వారు బదిలీ కోరుతూ దరఖాస్తు చేసుకోవచ్చని, ఎనిమిదేళ్లు ఒకే ప్రాంతంలో పనిచేసిన వారిని తప్పనిసరిగా బదిలీ చేయనున్నట్టు ఆమె తెలిపారు. అలాగే స్పౌజ్, ఆరోగ్య కేటగిరీలో బదిలీ కోసం దరఖాస్తు చేసుకున్న వారికి తొలిప్రాధాన్యంలో ఖాళీల్లో భర్తీ చేయడం జరుగుతుందన్నారు. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా 60కి పైగా పోస్టులు ఖాళీగా ఉన్నాయని, ఎనిమిదేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న వారి పోస్టులను కలిపి 300 పోస్టులు కౌన్సిలింగ్ ద్వారా భర్తీ చేయనున్నట్టు ఆమె వెల్లడించారు. సుమారు 1000 మంది ఉపాధ్యాయులు బదిలీ కోరతూ దరఖాస్తు చేసుకునే అవకాశాలు ఉన్నాయి.
పంచాయతీరాజ్ ఉద్యోగుల బదిలీ ప్రక్రియ
పంచాయతీరాజ్ శాఖలో బదిలీల ప్రక్రియకు ప్రభుత్వం అంగీకరించిందని ఎపిపిఆర్ మినిస్టీరియల్ ఎంప్లారుూస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు యు కూర్మారావు, ఎస్ సత్తిబాబు ఒక ప్రకటనలో తెలిపారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఈనెల 13 కౌన్సిలింగ్ ద్వార బదిలీలు నిర్వహించనున్నట్టు తెవిపారు.
బెహరాకు ఘన స్వాగతం
గోపాలపట్నం, మే 2: నగర కాంగ్రెస్ అధ్యక్షునిగా నియమితులైన బెహరా భాస్కరరావుకు విశాఖ విమానాశ్రయంలో గురువారం ఘనస్వాగతం లభించింది. అధ్యక్షునిగా నియమితులైన తర్వాత తొలిసారిగా నగరానికి వచ్చిన బెహరా విమానాశ్రం నుంచి నేరుగా నగరంలోని సంపత్ వినాయకుని దర్శించుకున్నారు. అనంతరం ఆయన మంత్రి గంటా శ్రీనివాసరావును కలుసుకున్నారు. నగర కాంగ్రెస్ అధ్యక్షుడు భాస్కరరావును మంత్రి గంటాతో పాటు ఎమ్మెల్యేలు పంచకర్ల రమేష్‌బాబు, మళ్ళ విజయప్రసాద్ అభినందించారు. అనంతరం భాస్కరరావు మంత్రి బాలరాజును స్వయంగా కలుసుకున్నారు. ఈసందర్భంగా మంత్రి బాలరాజు నగర పార్టీ అధ్యక్షుని పూలమాలతో సత్కరించారు. అక్కడ్నుంచి నేరుగా గోపాలపట్నం చేరుకున్న భాస్కరరావుకు కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. ఈసందర్భంగా భాస్కరరావు మాట్లాడుతూ నగర పార్టీ అధ్యక్షనిగా నియమించి పార్టీ తనపై గురుతర భాధ్యతను ఉంచిందన్నారు. తనను నగర పార్టీ అధ్యక్షునిగా నియమించేందుకు కృషి చేసిన మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ అధినాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. తన బాధ్యతలను సక్రమంగా నిర్వహించడంతో పాటు పార్టీ పురోభివృద్ధికి కృషి చేస్తానని ప్రకటించారు. అలాగే కార్యకర్తలకు నిరంతరం అందుబాటులో ఉంటూ తన బాధ్యతలు నిర్వహిస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.