న్యూఢిల్లీ, మే 3: కామనె్వల్త్ టేబుల్ టెన్నిస్ (టీటీ) చాంపియన్‌షిప్ పోటీలు ఆదివారం నుంచి ప్రారంభం కానుండగా, పాకిస్తాన్ బృందానికి నిరాశ తప్పలేదు. ఈ పోటీల్లో పాల్గొనడానికి ఉత్సాహం చూపినప్పటికీ, పాక్ ఆటగాళ్లకు కేంద్రం వీసా మంజూరు చేయలేదు. దీనితో పాక్ క్రీడాకారులు లేకుండానే కామనె్వల్త్ టీటీ చాంపియన్‌షిప్ జరుగుతుంది. గత నెల ఆసియా సైక్లింగ్ చాంపియన్‌షిప్ పోటీలు జరిగినప్పుడు పాక్ సైక్లిస్టులు వీసాల కోసం నానా తంటాలు పడాల్సి వచ్చింది. చివరి క్షణం వరకూ భారత అధికారులు వారికి వీసాలను మంజూరు చేయలేదు. కాగా, తోటి ఖైదీలు దాడి చేయడంతో తీవ్రంగా గాయపడిన సరబ్‌జిత్ సింగ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన సంఘటన భారత్, పాక్ మధ్య తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఈ పరిస్థితుల్లో పాకిస్తాన్ ఆటగాళ్లకు కేంద్రం వీసాలు మంజూరు చేసే ప్రసక్తే లేదని తెలుస్తోంది.
‘కామనె్వల్త్’లో పతకాలు సాధిస్తారు..
రానున్న కామనె్వల్త్ టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్‌లో మన క్రీడాకారిణులు పతకాలు సాధిస్తారని జాతీయ కోచ్ భవానీ ముఖర్జీ ఆశాభావం వ్యక్తం చేసింది. న్యూఢిల్లీలో ప్రారంభమయ్యే కామనె్వల్త్ టీటీ పోటీల కోసం భారత మహిళా జట్టు చైనాలో శిక్షణ పొంది ఇటీవలే స్వదేశానికి చేరింది. ఈ సందర్భంగా కోచ్ భవానీ మాట్లాడుతూ అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన వసతులు, శిక్షణ సౌకర్యాలు చైనాలో ఉన్నాయని తెలిపింది. అక్కడ శిక్షణ పొందడం ఖచ్చితంగా భారత మహిళలకు మేలు చేసే అంశమని పేర్కొంది. కామనె్వల్త్ టీటీ చాంపియన్‌షిప్ సహా రానున్న అన్ని మేజర్ టోర్నీల్లోనూ భారత క్రీడాకారిణులు అద్భుతంగా రాణిస్తారన్న నమ్మకం తనకు ఉంతదని తెలిపింది. స్వదేశంలో కామనె్వల్త్ టీటీ పోటీలు ముగిసిన వెంటనే, పారిస్‌లో ప్రపంచ చాపంయన్‌షిప్ జరుగుతుందని భవానీ వివరించింది. అక్కడ కూడా పతకాలపై మన దేశం గురిపెడుతుందని తెలిపింది.
జింబాబ్వేపై బంగ్లాదేశ్ విజయం
బులవయో, మే 3: జింబాబ్వేతో శుక్రవారం జరిగిన మొదటి వనే్డ ఇంట ర్నేషనల్ మ్యాచ్‌ని బంగ్లాదేశ్ 121 పరుగుల భారీ తేడాతో గెల్చుకుంది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఈ జట్టు 50 ఓవర్లలో 8 వికెట్లకు 269 పరుగులు సాధించింది. నాసిర్ హొస్సేన్ 68 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. మొమినుల్ హక్ 38, మహమ్మదుల్లా 36 పరుగులతో రాణించా రు. జింబాబ్వే బౌలర్లలో విన్‌స్టన్ మసకజా 51 పరుగులిచ్చి నాలుగు వికెట్లు పడగొ ట్టాడు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన జింబాబ్వే 32.1 ఓవర్లలో 148 పరుగులకే కుప్పకూలింది. హామిల్టన్ మసకజా 38, కెప్టెన్ బ్రెండన్ టేలర్ 33, విన్‌స్టన్ మసకజా 33 పరుగులు చేసినా, జట్టు ఓటమి తప్పలేదు.
నైట్ రైడర్స్ సునాయాస విజయం
కోల్‌కతా, మే 3: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) టి-20 క్రికెట్ టోర్నమెంట్‌లో భాగంగా శుక్రవారం ఈడెన్ గార్డెన్స్ మైదానంలో రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌ని కోల్‌కతా నైట్ రైడర్స్ అతి సునాయాసంగా, ఎనిమిది వికెట్ల తేడాతో గెల్చుకుంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 132 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఓపెనర్ షేన్ వాట్సన్ 35 బంతుల్లో 35, సంజూ శాంసన్ 36 బంతుల్లో 40 పరుగులు చేసినప్పటికీ, మిగతా బ్యాట్స్‌మెన్ అదే స్థాయిలో రాణించలేకపోయారు. నైట్ రైడర్స్ బౌలర్లు క్రమశిక్షణతో బంతులు వేసి, రాజస్థాన్ భారీ స్కోరు చేయకుండా అడ్డుకున్నారు. అనంతరం బ్యాటింగ్ చేపట్టిన నైట్ రైడర్స్‌కు కెప్టెన్ గౌతం గంభీర్, మాన్వీందర్ బిస్లా శుభారంభాన్నిచ్చారు. తొలి వికెట్‌కు వీరిద్దరూ 41 పరుగులు జోడించారు. వాట్సన్ బౌలింగ్‌లో వికెట్‌కీపర్ దిశాంత్ యాగ్నిక్ క్యాచ్ అందుకోగా గంభీర్ (12) అవుటయ్యాడు. ఆతర్వాత కొద్ది సేపటికే బిస్లా వికెట్ కూడా కూలింది. అతను 25 బంతుల్లో 29 పరుగులు చేసి, అంకిత్ చవాన్ బౌలింగ్‌లో ఆజింక్య రహానేకు చిక్కాడు. ఈ దశలో వెటరన్ ఆల్‌రౌండర్ జాక్వెస్ కాలిస్, హార్డ్ హిట్టర్ యూసుఫ్ పఠాన్ రాజస్థాన్ బౌలర్లపై విరుచుకుపడ్డారు. మరో వికెట్ కూలకుండా జాగ్రత్త పడుతూ వీరిద్దరూ 17.2 ఓవర్లలోనే లక్ష్యాన్ని సాధించారు. మరో 16 బంతులు మిగిలి ఉండగానే రాజస్థాన్‌పై నైట్ రైడర్స్ ఎనిమిది వికెట్ల తేడాతో విజయం సాధించగా, కాలిస్ 30 బంతుల్లో, రెండు ఫోర్లు, ఒక సిక్సర్‌తో 33, యూసుఫ్ పఠాన్ 35 బంతుల్లో, మూడు ఫోర్లు, మరో మూడు సిక్సర్లతో 49 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచారు.
ఇలావుంటే, ఈ మ్యాచ్ ముగిసిన తర్వాత పాయంట్ల పట్టికలో చెన్నై సూపర్ కింగ్స్ అగ్రస్థానంలో ఉంది. ఆ జట్టు 11 మ్యాచ్‌లు ఆడి, తొమ్మిది విజయాలతో 18 పా యంట్లు సంపాదించింది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 11 మ్యాచ్‌లు ఆడి, ఏడు విజయాలతో 14 పాయంట్లు సాధించి ద్వితీయ స్థానాన్ని ఆక్రమించింది. రాజస్థాన్ రాయల్స్, ముంబయ ఇండియన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ తలా 12 పాయంట్లతో సంయుక్తంగా మూడో స్థానంలో నిలిచాయ. డిఫెండింగ్ చాంపియన్ కోల్‌కతా నైట్ రైడర్స్, కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ చెరి ఎనిమిది పాయంట్లు సాధించగా, ఢిల్లీ డేర్ డెవిల్స్‌కు ఆరు, పుణే వారియర్స్‌కు నాలుగు పాయంట్లు ఉన్నాయ. ప్రస్తుత పరిస్థితుల్లో పుణే, ఢిల్లీ జట్ల నిష్క్రమ ణ దాదాపు ఖాయమైంది.
జోరుగా బెట్టింగ్
ఐదుగురు బుకీల అరెస్టు
ఆంధ్రభూమి బ్యూరో
కడప, మే 3: కడప వైఎస్సార్ జిల్లాలో క్రికెట్ బెట్టింగ్ జోరుగా సాగుతోంది. ఐపిఎల్ మ్యాచ్‌లపై యువకులు లక్షలకు లక్షలు బెట్టింగ్‌కు వెచ్చిస్తున్నారు. పోలీసులు విస్తృతంగా దాడులు జరిపినా ఫలితం కనిపించడం లేదు. ప్రొద్దుటూరు, రాజంపేట, కడప కేంద్రాలుగా బెట్టింగ్ జరుగుతోంది. పోలీసుల నుండి తప్పించుకోవడానికి బెట్టింగ్ రాయుళ్ళు ప్రత్యేకంగా స్థావరాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. ఖరీదైన ల్యాప్‌టాప్‌లు, ఎల్‌సిడి టివిలు, సెల్ ఫోన్లు సమకూర్చుకుంటున్నారు. లక్షలు బెట్టింగ్ కాస్తున్నారు. పోలీసుల దాడిలో ఇవన్నీ స్వాధీనం చేసుకుంటున్నా బెట్టింగ్ యధాతథంగా జరగడం గమనార్హం. హైదరాబాద్ నుండి బుకీలు ఈ వ్యవహరాలను నడిపిస్తున్నారు. ప్రధాన బుకీలు లెక్కలు తేల్చుకోవడానికి హైదరాబాద్ నుండి లావాదేవీలను బట్టి జిల్లాకు వస్తున్నారు. బెట్టింగ్ రాయుళ్లు ఏర్పాటు చేసుకున్న స్థావరాలకు వెళ్లి వారిచ్చే విందు వినోదాల్లో మునిగి బెట్టింగ్ సొమ్ముతో వెళుతున్నారు. ఈ తరహాలోనే ఇద్దరు ప్రధాన బుకీలు శుక్రవారం ప్రొద్దుటూరుకు రావడంతో పోలీసులు వల వేసి పట్టుకున్నారు. పట్టుబడిన వారిలో లారా, నిస్సార్ ఉన్నారు.
ఐఒసితో సమావేశానికి
ఐఒఎ బృందం ఖరారు
న్యూఢిల్లీ, మే 3: అంతర్జాతీయ ఒలింపిక్ మండలి (ఐఒసి)తో లాసనె్నలో ఈనెల 15న జరిగే సమావేశానికి హాజరయ్యే నలుగురు ప్రతినిధులను భారత ఒలింపిక్ సంఘం (ఐఒఎ) ఖరారు చేసింది. ఐఒఎ గుర్తింపును ఐఒసి రద్దు చేసే సమయానికి తాత్కాలిక అధ్యక్షుడిగా ఉన్న విజయ్ కుమార్ మల్హోత్రా, భారత స్క్వాష్ ర్యాకెట్స్ సమాఖ్య పాట్రాన్ రామచంద్రన్, భారత ఆర్చరీ సంఘం ఉపాధ్యక్షుడు తార్లోచన్ సింగ్, భారత కయాకింగ్ కనోయింగ్ సంఘం అధ్యక్షుడు రఘునాథ్ భారత ప్రతినిధులుగా ఐఒసితో జరిగే సమావేశానికి హాజరవుతారు. వాస్తవానికి ఐఒసి గతంలో రెండు పర్యాయాలు సమావేశం గురించి ప్రకటన చేసినప్పటికీ, కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ, ఐఒసి మధ్య విభేదాలు ఒక కొలిక్కి రాకపోవడంతో వాయిదా అనివార్యమైంది. ఐఒసి నిషేధం విధించిన తర్వాత ఐఒఎ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకుంది. అభయ్ సింగ్ చౌతాలా కొత్త అధ్యక్షుడిగా ఎన్నికైనప్పటికీ, ఈ కార్యవర్గాన్ని ఐఒసి గుర్తించలేదు. ఎన్నికలకు ముందు, వికె మల్హోత్రా తాత్కాలిక అధ్యక్షుడిగా వ్యవహరించినప్పటి కమిటీ సభ్యులతోనే చర్చిస్తామని, ప్రభుత్వంతో సంప్రదించి, సమావేశం తేదీని నిర్ధారించాలని ఐఒఎకు ఐఒసి సూచించింది. దీనితో వికె మల్హోత్రాతో కలిపి మొత్తం నలుగురు సభ్యులతో కూడిన ప్రతినిధి బృందాన్ని ఐఒఎ ఎంపిక చేసింది.