హైదరాబాద్, మే 3: ఆరో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్)లో సెమీస్ చేరతామని సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు మెంటర్, భారత మాజీ కెప్టెన్ కృష్ణమాచారి శ్రీకాంత్ ధీమా వ్యక్తం చేశాడు. శుక్రవారం అతను విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ, బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ విభాగాల్లో తమ జట్టు రోజురోజుకూ బలాన్ని పెంచుకుంటున్నదని అన్నాడు. అభిమానుల ప్రార్థనలు కూడా సన్‌రైజర్స్‌ను ముందుకు నడిపిస్తున్నాయని పేర్కొన్నాడు. కొన్ని మ్యాచ్‌లలో పొరపాట్లు చేసినప్పటికీ, వాటిని సరిదిద్దుకొని వరుసగా రెండు మ్యాచ్‌లను గెలిచిందని శ్రీకాంత్ గుర్తు చేశాడు. శిఖర్ ధావన్ రాకతో జట్టులో ఆత్మవిశ్వాసం మరింత పెరిగిందని అన్నాడు. బ్యాటింగ్ విభాగం బలోపేతమైందని చెప్పాడు. ఆటగాళ్లు, మెంటర్లు, కోచ్‌లు, ఇతర సిబ్బంది కలసికట్టుగా విజయాల కోసం కృషి చేస్తున్నారని శ్రీకాంత్ అన్నాడు. అందరి సమష్టి కృషితోనే అద్భుత విజయాలను సన్‌రైజర్స్ నమోదు చేయగలిగిందని చెప్పాడు. ముంబయి ఇండియన్స్‌పై సాధించిన విజయం సన్‌రైజర్స్ క్రమశిక్షణకు, పోరాట పటిమకు నిదర్శనమని వ్యాఖ్యానించాడు.
సన్‌రైజర్స్ కోచ్ టామ్ మూడీ మాట్లాడుతూ జట్టు సాధించిన విజయాలను ఏ ఒక్కరికో పరిమితం చేయలేమని అన్నాడు. సన్‌రైజర్స్ అందుకున్న ప్రతి విజయంలోనూ, జట్టులోని ఆటగాళ్లందరి శ్రమ ఉందనిఅన్నాడు. ఈ సమావేశంలో శ్రీకాంత్, మూడీతోపాటు సన్‌రైజర్స్ మరో మెంటర్, భారత మాజీ టెస్టు క్రికెటర్ వివిఎస్ లక్ష్మణ్ తదితరులు కూడా పాల్గొన్నారు.
సన్‌రైజర్స్ మెంటర్ శ్రీకాంత్ ధీమా విలేఖరుల సమావేశంలో మాట్లాడుతున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ మెంటర్ శ్రీకాంత్
english title:
s
Date:
Saturday, May 4, 2013