ముంబయి, మే 3: ఇంగ్లాండ్‌లో జూన్ ఆరు నుంచి 23వ తేదీ వరకు జరిగే ప్రతిష్టాత్మక చాంపియన్స్ ట్రోఫీ క్రికెట్ టోర్నమెంట్‌లో పాల్గొనే జట్టును భారత జాతీయ సెలక్షన్ కమిటీ శనివారం ఎంపిక చేయనుంది. సందీప్ పాటిల్ అధ్యక్షతన సెలక్టర్లు సమావేశమై, 15 మంది ఆటగాళ్ల పేర్లను ఖరారు చేస్తారు. ఇప్పటికే ప్రకటించిన 30 మంది సభ్యులతో కూడిన ప్రాబబుల్స్ జాబితా నుంచి ఎవరికి చోటు దక్కుతుందో? ఎవరిపై వేటు పడుతుందో చూడాలి. అయితే, ఈ జాబితాలో పేర్లు లేనప్పటికీ, అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఇతర ఆటగాళ్లను కూడా ఎంపిక చేసే అవకాశం ఉందని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి. జాబితాలో స్థానం దక్కించుకోలేకపోయిన సీనియర్ ఓపెనర్ వీరేందర్ సెవాగ్, స్పిన్నర్ హర్భజన్ సింగ్ పేర్లను చాంపియన్స్ ట్రోఫీకి సెలక్టర్లు పరిశీలించినా ఆశ్చర్యం లేదు. కాగా, జట్టులో రెండుమూడు స్థానాలను మినహాయిస్తే, మిగతా స్థానాలకు ఆటగాళ్లు ఇప్పటికే ఖరారయ్యారన్నది వాస్తవం. మహేంద్ర సింగ్ ధోనీకే మరోసారి కెప్టెన్సీ బాధ్యతలు కట్టబెట్టడం ఖాయం. విరాట్ కోహ్లీ, అశ్విన్, రవీంద్ర జడేజా, ఇశాంత్ శర్మ, భువనేశ్వర్ కుమార్ స్థానాలు పదిలమని తెలుస్తోంది. ప్రాబబుల్స్ జాబితాలోనే నలుగురు ఓపెనర్లు, మురళీ విజయ్, శిఖర్ ధావన్, గౌతం గంభీర్, ఉన్ముక్త్ చాంద్ ఉన్నారు. సెవాగ్ పేరును పరిశీలించరాదన్న నిబంధన ఏదీ లేదు. సెలక్టర్లు ఒకవేళ సెవాగ్‌ను పట్టించుకోకపోయినా, మిగతా నలుగురి మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది. ఆస్ట్రేలియాపై టెస్టు కెరీర్‌ను ప్రారంభించిన ధావన్ రికార్డు సెంచరీ సాధించి సత్తా చాటాడు. కెరీర్‌లో తొలి టెస్టు ఆడుతూ అత్యంత వేగంగా సెంచరీ చేసిన బ్యాట్స్‌మన్‌గా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. అదే టెస్టులో ఫీల్డింగ్ చేస్తూ చేతికి గాయంకావడంతో కొంతకాలం విశ్రాంతి తీసుకున్నాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్)లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున ఆడాల్సిన అతను కొన్ని మ్యాచ్‌లకు దూరమయ్యాడు. గాయం నుంచి కోలుకొని, జట్టును చేరిన వెంటనే తనదైన ముద్ర వేశాడు. అద్భుతమైన ఫామ్‌ను కొనసాగిస్తున్న ధావన్‌కు చాంపియన్స్ ట్రోఫీలో స్థానం దక్కే అవకాశాలే ఎక్కువ. ఐపిఎల్‌లో ఉన్ముక్త్ చాంద్ ఆశించిన స్థాయిలో రాణించడం లేదు. ఫలితంగా ధావన్ భాగస్వామిగా మురళీ విజయ్‌కి అవకాశం దక్కవచ్చు. గంభీర్‌కు సెలక్టర్లు మరోసారి షాకిచ్చినా ఆశ్చర్యం లేదు. కాగా, స్పిన్నర్ల కోటాకు అశ్విన్, అమిత్ మిశ్రా, రవీంద్ర జడేజా, జలజ్ సక్సేనా, పర్వీజ్ రసూల్ మధ్య పోటీ నెలకొంది. ప్రాబబుల్స్ జాబితాలో స్థానం దక్కకపోయినా, ఐసిసి కల్పించిన వెసులుబాటును ఉపయోగించుకొని హర్భజన్ సింగ్‌కు మరో అవకాశం ఇస్తారా అన్నది అనుమానమే. అశ్విన్, జడేజా పేర్లు దాదాపు ఖరారుకాగా, మిగిలిన ఒక స్థానం కోసం పోటీ తీవ్రంగా ఉంది.
మొత్తం మీద పలువురు ఆటగాళ్ల ఎంపిక ఖాయంగా కనిపిస్తుండగా, కొంతమంది ఆటగాళ్లకు అవకాశం దక్కుతుందా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. గంభీర్, ఉన్ముక్త్ చాంద్, యువరాజ్ సింగ్, సురేష్ రైనా, రోహిత్ శర్మ, ఆజింక్య రహానే, అంబటి రాయుడు, దినేష్ కార్తీక్, అమిత్ మిశ్రా, పర్వేజ్ రసూల్, ఉమేష్ యాదవ్, వినయ్ కుమార్, ప్రవీణ్ కుమార్ తదితరుల ఎంపికపై ఉత్కంఠ నెలకొంది. సెలక్టర్లు ఎవరిపై కరుణ చూపుతారో, ఎవరిని నిర్దాక్షిణ్యంగా ఏరేస్తారో శనివారం నాటి సెలక్షన్‌తో తెలిసిపోతుంది.
‘చాంపియన్స్’ టోర్నీకి నేడు భారత జట్టు ఎంపిక
english title:
y
Date:
Saturday, May 4, 2013