‘‘అమ్మా! సరిత ఇక బడికి రాదట! వాళ్ల అమ్మానాన్నలు ఆమెను బడి మాన్పించేసి పనిలో పెడతారట!’’ ఇంట్లోకి వస్తూనే అంది శిరీష. వంటింట్లో పని చేసుకుంటున్న పార్వతి ఆ మాటలు విని ముందు గదిలోకి వచ్చింది.
‘‘సరిత నాకు మంచి ఫ్రెండమ్మా! ఇద్దరం ఒకే బెంచీలో కూర్చుంటాం. బాగా చదువుతుంది. పోటీల్లో బహుమతులెన్నో తెచ్చుకుంటుంది. ఇకనుంచి తను బడికి రాదంటే నాకెందుకో చాలా బాధగా ఉందమ్మా!’’ పుస్తకాల సంచిని బల్లమీద పెట్టి బెంచీమీద కూర్చుంటూ అంది శిరీష.
‘‘సరిత వాళ్ల అమ్మా నాన్నలిద్దరు పని చేస్తూనే ఉన్నారు కదా! మరి సరిత కూడా ఇప్పుడే పని చేయాల్సిన అవసరం ఏమొచ్చింది?’’ శిరీష పక్కన కూర్చుంటూ అంది పార్వతి.
అందుకు శిరీష ‘‘ఏమోనమ్మా! ఈ రోజు మధ్యాహ్నం అన్నం తింటున్నప్పుడు సరిత ఈ విషయం నాతో చెప్పింది. రేపటినుంచి బడికి రాదట!’’ అని చెప్పింది విచారంగా.
‘‘అలాగా!’’ అంటూ మెల్లగా తలూపింది పార్వతి. ఇద్దరూ కాసేపు వౌనంగా ఉండిపోయారు.
‘‘అమ్మా! సరిత వాళ్లు మనకు బాగా తెలిసిన వాళ్లే కదా! నువ్వు వెళ్లి వాళ్ల అమ్మానాన్నలతో ఒకసారి మాట్లాడకూడదూ!’’ తల్లికి దగ్గరగా జరుగుతూ అంది శిరీష.
‘‘దాందేముందమ్మా! రేపు పొద్దునే్న వాళ్లింటికి వెళ్లి మాట్లాడుదాం!’’ కూతురు తల నిమురుతూ చెప్పింది పార్వతి. శిరీష ముఖంలో సంతోషం తొణికిసలాడింది.
మరునాడు పొద్దునే్న శిరీషను వెంటపెట్టుకుని సరిత ఇంటికి బయలుదేరింది పార్వతి. వరండాలో దిగులుగా కూర్చున్న సరిత వాళ్లను చూడగానే చిరునవ్వుతో ఎదురుగా వచ్చింది.
‘‘ఏమ్మా! అమ్మా నాన్న ఇంట్లో లేరా?’’ అనడిగింది పార్వతి ఇంటిలోపలికి చూస్తూ.
‘‘ఉన్నారు ఆంటీ! పెరట్లో పనిచేస్తున్నారు’’ చెప్పింది సరిత.
పిల్లలిద్దరు వెంటరాగా పెరట్లోకి నడిచింది పార్వతి. సరిత తల్లి మంగమ్మ గినె్నలు కడుగుతోంది. తండ్రి రాజయ్య గొడ్డలికి పదును పెడుతున్నాడు.
పార్వతిని చూడగానే ఇద్దరు తాము చేస్తున్న పనులు ఆపి ఆమెకెదురుగా వచ్చారు.
‘‘బాగున్నారా పార్వతమ్మగారూ! చాలా రోజుల తర్వాత మా ఇంటికొచ్చారే!’’ ఆశ్చర్యంగా అడిగాడు రాజయ్య.
‘‘మీరు రప్పించుకున్నారు మరి!’’ నవ్వుతూ అంది పార్వతి. మంగమ్మ రాజయ్యలు ఒకరి ముఖాలొకరు చూసుకున్నారు.
‘‘సరేగానీ! సరితను బడి మాన్పించేసి పనిలో పెట్టాలని నిర్ణయం తీసుకున్నారట నిజమేనా?’’ సూటిగా చూస్తూ అడిగింది పార్వతి. కాసేపు ఇద్దరు ఏం మాట్లాడలేదు.
‘‘అవునమ్మా! పొలం పనులు చేయడం మా ఇద్దరి వల్ల కావడంలేదు. అందుకే..’’ అంటూ నసిగాడు రాజయ్య.
‘‘అందుకని! అమ్మాయి చదువును పాడుచేసి పని చేయిస్తారా? ఇది మీకు తప్పుగా అనిపించడం లేదా?’’ చిరుకోపంతో అడిగింది పార్వతి.
అందుకు మంగమ్మ ‘‘ఇందులో తప్పేముందమ్మా! ఎప్పుడో ఒకప్పుడు చదువు మాన్పించేసి పెళ్లి చేసి పంపాల్సిందే కదా!’’ అంది కిందికి చూస్తూ.
దానికి పార్వతి ‘‘ఎప్పుడు జరగాల్సినవి అప్పుడే జరగనివ్వాలి. శారీరకంగా ఎదగని అమ్మాయిని, చదువుకోవాల్సిన అమ్మాయిని పనిలో పెట్టడం మంచిది కాదు. పైగా అది నేరం కూడా!’’ అంది మంగమ్మకు దగ్గరగా వస్తూ.
మంగమ్మ, రాజయ్యలు ఏం మాట్లాడకుండా చెరోవైపు చూడసాగారు. ‘‘మీరు మళ్లీ ఒకసారి బాగా ఆలోచించి చూడండి. సరిత బాగా చదువుకుని విద్యావంతురాలైతే ఆమె భవిష్యత్తు బంగారంలా మారుతుంది. మంచి జీవితం గడపగలుగుతుంది’’ నెమ్మదిగా చెప్పింది పార్వతి.
పార్వతి మాటలు వినిపించుకోనట్టుగా రాజయ్య గొడ్డలి భుజాన వేసుకుని బయటకు నడవబోయాడు.
అది చూసి పార్వతి కల్పించుకుని ‘‘రాజయ్య! ఎక్కడికీ బయలుదేరుతున్నావు?’’ అనడిగింది. అందుకతను ‘‘పొయ్యిలోకి కట్టెలు అయిపోయాయి. ఊరి చివరికెళ్లి ఓ నాలుగు చెట్లు నరుక్కుని వస్తాను’’ అని జవాబిచ్చాడు.
సరిగ్గా అప్పుడే పార్వతి దృష్టి అక్కడే వున్న జామచెట్టు మీద పడింది. వెంటనే ‘‘కట్టెల కోసం ఎక్కడికో వెళ్లాల్సిన అవసరమేముంది రాజయ్యా! ఈ జామచెట్టును నరికితే కొన్ని కట్టెలు వస్తాయిగా!’’ అంది చెట్టువైపు చూస్తూ.
ఆమె మాటలు వినగానే రాజయ్య చిరాగ్గా మొహంపెట్టి ‘‘ఏంటమ్మా మీరనేది? పచ్చని చెట్టును నరికేయమంటారా! అది పెరిగి పెద్దదైతే ఎంత కాపు కాస్తుందో తెలుసా! ఐనా మీరు ఆ మాట ఎలా అంటున్నారో నాకు అర్థం కావడంలేదు’’ అన్నాడు. మంగమ్మ కూడా పార్వతి వైపు అదోలా చూసింది.
అప్పుడు పార్వతి చిరునవ్వు నవ్వి ‘‘మీకు ఒక చెట్టుపట్ల వున్న అవగాహన, ఆలోచన మీ అమ్మాయిపట్ల లేకపోవడం నాకు విచారాన్ని కలిగిస్తుంది. ఇప్పుడు చిన్నగా వున్న ఈ చెట్టును సంరక్షిస్తే అది పెద్దదై ఎన్నో సంవత్సరాలపాటు కాపుకాసి మనకు లాభాన్నిస్తుందని మీరు గుర్తించారు. అలాగే మీ అమ్మాయిని కూడా ఇప్పుడు బాగా చదివించి ప్రోత్సహిస్తే ఆమె భావి జీవితం సుఖమయం అవుతుందని తెలుసుకోలేకపోతున్నారు. ఇప్పటి అవసరం కోసం సరిత జీవితానే్న ఫణంగా పెట్టాలనుకున్న మీ అజ్ఞానానికి ఏమనాలో తెలియడంలేదు’’ అంది.
పార్వతి మాటలు విన్న మంగమ్మ రాజయ్యలు వౌనంగా తలవంచుకున్నారు. ఆలోచనలో పడ్డారు. కాసేపటి తర్వాత వాళ్లకు పార్వతి మాటల్లోని వాస్తవం బోధపడింది. తమ కళ్లు తెరిపించడానికే చెట్టును నరకమందని అర్థమైంది.
‘‘అమ్మా! మమ్మల్ని మన్నించండి. మా ఆలోచన తప్పని అర్థం చేసుకున్నాం. మా సరితను బడికి పంపడమే కాదు. ఇకనుంచి మునుపటి కంటే మిన్నగా ఆమె బాగోగుల్ని చూసుకుంటాం. ఎన్ని ఇబ్బందులొచ్చినా మేమే భరిస్తాం!’’ అన్నారు మంగమ్మ, రాజయ్య సరిత తల నిమురుతూ. ఆ మాటలు వినగానే సరిత ముఖం ఆనందంతో వికసించింది. పార్వతి తృప్తిగా నిట్టూర్చింది.
‘‘సరితా! ఇక బడికి వెళ్దాం పద!’’ అంటూ సరిత భుజమీద చెయ్యేసి బయటకు నడిచింది శిరీష. వాళ్లిద్దరినీ సంతోషంతో చూస్తుండిపోయారు అందరూ.
*
-పెండెం జగదీశ్వర్
గుండె శుద్ధి -- స్పూర్తి
తను రాసేది పూర్తి చేసిన దామిని తన తల్లితో చెప్పింది.
‘అమ్మా! మన శరీరం గురించి నాకు ఇంత దాకా తెలీదు. ఎన్ని అద్భుతాలో కదా?’
దామిని తల్లి ఏమిటన్నట్లుగా చూసింది. ‘స్కూల్లో సైన్స్ టీచర్ ఇచ్చిన ప్రాజెక్ట్‌ని ఇప్పుడే పూర్తి చేశాను. మన గుండె గురించి పాతిక లైన్లు రాసుకు రమ్మన్నారు. నాన్న ఇచ్చిన ఓ మెడికల్ కంపెనీ ప్రచురించిన ఇన్‌ఫర్మేషన్ షీట్‌లో గుండె గురించిన ఎన్నో వివరాలు ఉన్నాయి. మన శరీరంలోని రక్తనాళాలన్నీ ఒకదానికి మరొకటి ముడివేస్తే అరవై వేల మైళ్ల పొడవు ఉంటాయిట! అదీ పిల్లల్లో పెద్దవాళ్ల రక్తనాళాల నిడివి లక్ష మైళ్ల దాకా ఉంటుందిట!’
‘ఇంకా?’
దామిని తల్లి ఉత్సాహంగా అడిగింది.
‘ఇంకా గుండె రోజుకి లక్షసార్లు కొట్టుకుంటుంది! అంటే ఏడాదికి దాదాపు మూడున్నర కోట్లసార్లు! గుండెకి అటాచ్ అయిన రక్తనాళాల్లో కొన్ని మన వెంట్రుక వాసంత ఉంటే కొన్ని తోటలోని నీటి గొట్టం వైశాల్యం అంత తెరచుకుంటాయిట! మన శరీరంలో సగటున ఐదున్నర లీటర్ల రక్తం ఉంటుందిట. ఇది నిమిషానికి మూడుసార్లు శరీరం మొత్తం ప్రవహిస్తుందిట. అంటే ఓ రోజులో మన రక్తం పందొమ్మిది వేల కిలోమీటర్ల దూరం ప్రవహిస్తుందన్నమాట’
కూతురు ఉత్సాహంగా చెప్పేది ఆమె వినసాగింది.
‘గుండె మన జీవిత కాలంలో సగటున మూడు సూపర్ ట్యాంకర్లలో పట్టేంత రక్తాన్ని శుద్ధి చేస్తుందిట. అసలు గుండె ఓ శుద్ధిచేసే యంత్రం’
‘కాని మనం మాత్రం గుండెని శుభ్రంగా ఉంచుకోం’
తల్లి మాటలకి దామిని ఆశ్చర్యంగా చూసింది.
‘కోపం, అసూయ, ద్వేషం, పగ, స్వార్థం లాంటి వాటితో మన గుండె సదా నిండి ఉంటుంది. మనం వివేకంతో ఆ మలినాలని వదిలించుకోవాలి అని మనం మఠం స్వామి చెప్పగా ఎన్ని వందల సార్లు విన్నామో కదా? కాని మనం దాన్ని ఆ మలినాల నించి శుద్ధిచేసే ప్రయత్నం చేయం’
‘నిజమే అమ్మా! నేనైతే అలాంటి ప్రయత్నం చేయలేదు. చేయాలని నా ప్రాజెక్టులో రాయనా?’
‘రాయి. టీచర్‌కి అది నచ్చక నీతో చెప్తే నీ క్లాసులోని వారంతా దాన్ని వింటారు. ఎవరైనా ఈ సమాచారాన్ని ఎన్నిసార్లు వింటే అంత మంచిది. గుండె రక్తాన్ని శుద్ధి చేస్తే మనం ఆరోగ్యంగా ఉంటాం. మనం గుండెని శుద్ధిచేస్తే ఇంకాస్త ఆరోగ్యంగా ఉంటాం’ దామిని తల్లి చెప్పింది.
-మల్లాది
తెలుసుకోండి
అలలకు ఎదురీది...
మిజోరంకు చెందిన రామ్‌దింథారా (15) తన స్నేహితుడి ప్రాణాల్ని కాపాడటానికి తన జీవితాన్ని త్యాగం చేశాడు. ఇతనికి మరణానంతర అవార్డును ప్రకటించారు. తోటి స్నేహితుడు ప్రవాహంలో కొట్టుకుపోతుండడంతో నదిలోకి దూకి అతడిని కాపాడాడు. కానీ తాను ఒడ్డుకు చేరలేకపోయాడు. గుజరాత్‌కు చెందిన తరంగ్ అతుల్‌భాయ్ మిస్ర్తి (17) నర్మద నదిలోంచి నలుగురిని కాపాడాడు. ప్రమాదవశాత్తూ నదిలో కొట్టుకుపోతున్న వారి అరుపులు విని ఇతడు నీటిలోకి దూకి ఒకరి తర్వాత ఒకరిగా ఒడ్డుకి చేర్చాడు. ఇతడిని భరత్ అవార్డుకి ఎంపిక చేశారు.
- బొమ్మాన శ్రీనివాసరావు
చేసి చూద్దాం
గాలి సంకోచ, వ్యాకోచాలు
ఒకే సైజుగల మూడు రబ్బరు బెలూన్‌లు తీసుకోవాలి. వీటిని గాలితో సమాన పరిమాణంలో ఉబ్బునట్లు ఊదాలి. మూడు సమాన పరిమాణంలో వున్నదీ లేనిదీ తెలుసుకునేందుకు దారంతో ఉబ్బిన భాగాల చుట్టుకొలతలు సమానంగా ఉన్నదీ లేనిదీ కనుగొనాలి.
ఈ బెలూన్‌లకు 1,2 మరియు 3 అని నెంబర్లు వేయాలి. మొదటి బెలూన్‌ను ఎండ వెచ్చదనం తగిలే ప్రాంతంలో ఉంచాలి. ఎండలో ఉంచకూడదు. అంటే గ్రీన్‌హౌస్‌లో గాని, వెచ్చగా ఉండే పెట్టెలోగాని ఉంచాలి. వేడి వస్తువులు ఈ బెలూన్‌కు తగిలితే అది పేలిపోయే ప్రమాదం ఉంటుంది. జాగ్రత్త తీసుకోవాలి.
రెండవ బెలూన్‌ను ఫ్రిజ్‌లో ఉంచాలి. మూడవ బెలూన్‌ను గది ఉష్ణోగ్రత వద్ద ఉంచాలి. గంట గడచిన తరువాత మూడు బెలూన్‌లను సరిపోల్చండి. మొదటి బెలూన్ మరింత ఉబ్బుతుంది. కారణం వెచ్చదనానికి బెలూన్‌లోని గాలి వ్యాకోచించడం.
ఫ్రిజ్‌లోని చల్లదనానికి అందుంచిన బెలూన్‌లోని గాలి సంకోచిస్తుంది. ఫలితంగా బెలూన్ ఉబ్బు తగ్గుతుంది. గది ఉష్ణోగ్రత వద్ద ఉంచిన బెలూన్ మొదట్లో ఎంత ఉబ్బి ఉన్నదో అదే పరిమాణంలో ఉంటుంది.
ఈ ప్రయోగం వలన వేడికి గాలి వ్యాకోచిస్తుందని, చల్లదనానికి గాలి సంకోచిస్తుందని స్పష్టం అవుతుంది. ఇలా బాలలు ప్రయోగాలు చేయడం వలన వారిలో సాంకేతిక నైపుణ్యం అభివృద్ధి చెందుతుంది.
-సి.వి.సర్వేశ్వరశర్మ