హైదరాబాద్, ఫిబ్రవరి 16: నగరం ఐఎస్‌ఐ ఏజెంట్లకు అడ్డాగా మారిందనేది పాతవార్తే... ఇప్పుడు ఉగ్రవాదం, ఉన్మాదం తన రూపు మార్చుకుంటోంది. కంప్యూటర్ వాడకంలో నిష్ణాతులైన యువతను ఉగ్రవాద సంస్థలు పావులుగా వాడుకుంటున్నాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ‘హ్యాకింగ్’ అనేది మాత్రం ఇప్పుడు హాట్‌టాపిక్ . గతంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించిన వెబ్‌సైట్లపై హ్యాకర్లు దాడికి పాల్పడి సంచలనం సృష్టించారు. ఇదే తరహాలో శుక్రవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టాల్సిన బడ్జెట్ లీకవడం, మరిన్ని అదనపు పేజీలు గుర్తుతెలియని వ్యక్తులు దానికి జోడించడం రాష్టవ్య్రాప్తంగా సంచలనం సృష్టించింది. ఐటి శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య స్వయంగా వివరణ ఇచ్చుకున్నారంటే దీని ప్రాధాన్యత అర్థం చేసుకోవచ్చు.
పాతబస్తీ కేంద్రంగా?
ఉగ్రవాదుల్లో చాలా మంది కంప్యూటర్ పరిజ్ఞానంలో కూడా నైపుణ్యం పొంది ఉన్నారంటే అతిశయోక్తి కాదు. చాలామంది ఇంటర్నెట్, ల్యాప్‌ట్యాప్, మొబైల్ ఫోన్‌లను వాడుతూ సంఘవిద్రోహ కార్యకలాపాలకు పాల్పడుతున్నారనేది పలు నివేదికల ద్వారా వెల్లడైంది. ఈ నేపథ్యంలో కేవలం హింసాయుత మార్గాలే కాకుండా తెలివిగా బ్లాక్‌హ్యాట్ హ్యాకర్లను రంగంలోకి దింపుతున్నాయి పలు సంస్థలు. వీరు ప్రభుత్వానికి సంబంధించిన ముఖ్య వెబ్‌సైట్లలోని విలువైన సమాచారాన్ని దొంగిలించి వాటి పాస్‌వర్డ్‌ను మార్చివేసి సర్వర్లకు నేరుగా సాఫ్ట్‌వేర్ ప్రోగ్రాం రూపంలో ఉన్న వైరస్‌ను పంపి ప్రభుత్వానికి తీరని నష్టం కలగజేస్తున్నారు. పాతబస్తీతో పాటు పలు ప్రాంతాల్లో సైబర్ నేరగాళ్లు ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. సైబర్ నేరం జరిగినపుడు అది ఎక్కడ నుంచి జరిగిందో తెలుసుకునే పక్కా సాంకేతిక పరిజ్ఞానం లేకపోవడం కూడా హ్యాకర్లకు వరంగా మారింది.
పాతపద్ధతే మంచిదా..! :గతంలో ప్రతి విభాగంలో సేకరించిన సమాచారాన్ని ఫైళ్ళ రూపంలో జాగ్రత్తగా భద్రపరిచే వ్యవస్థ ఉండేది. అగ్నిప్రమాదాలు చోటు చేసుకున్నా చెక్కు చెదరకుండా ఉండడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేసేవారు. అయితే, ప్రపంచీకరణ నేపథ్యంలో అంతా కంప్యూటరీకరణ జరుగుతున్న నేపథ్యంలో అన్ని వివరాలను ఆయా విభాగాలు తమ వెబ్‌సైట్లలో భద్రపరుస్తున్నాయి. అయితే, ఇంత కష్టపడుతున్నా యాంటీ వైరస్ వ్యవస్థను సమగ్రంగా ఏర్పాటు చేసుకోవడంలో అధికారులు విఫలమవుతుండడం వల్లే హ్యాకర్లు చెలరేగిపోతున్నారు.
మంత్రి వివరణ
బడ్జెట్ వివరాలపై హ్యాకర్ల దాడిపై ఐటి శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య స్పందించారు. గురువారం ఉదయం 11.30 సమయంలో మైక్రోసాఫ్ట్ ఐఐఎస్ ప్లాట్‌ఫాంలోని ఒక ప్రభుత్వ సర్వర్ ద్వారా ఉపయోగిస్తున్న వెబ్‌పేజీలకు అనధికారికంగా మరో అదనపు పేజీ జోడించబడిందని గుర్తించామన్నారు. డిజెడ్.హెటిఎం, ఎక్స్.హెచ్‌టిఎం పేర్లతో వచ్చిన వైరస్/హ్యాకింగ్/ మ్యానువల్ యాక్సెస్ ద్వారా ఈ పేజీ జోడించారన్నారు. అయితే, ఇదివరకు ఉన్న డేటా ఏదీ పాడవలేదని, ఇందులో అంతగా చెప్పుకోదగిన విశ్వసనీయ సమాచారం ఏదీ లేదని అందరూ చూడవచ్చని అన్నారు. అయినప్పటికీ తాత్కాలికంగా ఈ సైట్లను మూసివేస్తున్నామన్నారు. ఏపి స్టేట్ డేటా సెంటర్ ఆడిటర్ కెపిఎంజి థర్డ్ పార్టీగా వ్యవహరిస్తోందన్నారు.
ఈ వ్యవస్థ అంతా పటిష్ట రీతిలో భద్రపరచి ఉందన్నారు. ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్‌కు హ్యాకింగ్ అయిన విషయాన్ని వివరించామని, సమస్య పరిష్కరించడానికి వారికి కావలసిన వివరాలను అందజేశామన్నారు.
మరోవైపు సిఐడి విభాగానికి చెందిన సైబర్ క్రైమ్ సెల్‌కు కూడా ఫిర్యాదు చేశామన్నారు. ప్రతీ విభాగం సెక్యూరిటీ ప్రోటోకాల్స్‌ను విధిగా పాటించాలని ఆదేశాలు జారీ చేశామన్నారు.
సైబర్ కిలాఢీలు
english title:
d
Date:
Friday, February 17, 2012