చేవెళ్ళ, ఫిబ్రవరి 16: అవినీతి అక్రమార్కుల చిట్టా రోజురోజుకీ పెరిగిపోతోంది. తాజాగా, చేవెళ్ళ డిఎస్పీ లంచం తీసుకుంటుండగా ఏసిబి అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. వివరాలిలా ఉన్నాయి. చేవెళ్ళ మండలం జాలెగూడెం గ్రామంలో రజనీష్ అనే వ్యక్తి నలుగురు రైతుల వద్ద నుంచి నాలుగెకరాల పొలం కొనుగోలు చేయడానికి కొన్ని రోజుల క్రితం వారికి రూ.10 లక్షలు అడ్వాన్స్‌గా చెల్లించాడు. అయితే, తాను అనుకున్న విధంగా రోడ్డు లేకపోవడంతో తన నిర్ణయాన్ని మార్చుకుని తన డబ్బు తనకు వాపసు చేయమని రజనీష్ రైతులను కోరాడు. వారు దీనికి నిరాకరించడంతో జిల్లా ఎస్పీని ఈ నెల 4న అతను ఆశ్రయించాడు. చేవెళ్ళ డీఎస్పీ గుణశేఖర్‌ను ఈ కేసు విచారించి బాధితుడికి న్యాయం చేయాల్సిందిగా ఎస్పీ ఆదేశించాడు. దీంతో రజనీష్ గుణశేఖర్‌ను కలిసి విషయం వివరించాడు. తాను ఈ విషయాన్ని సెటిల్ చేస్తానని కానీ, అందుకు ముడుపుగా తనకు రూ.1 లక్ష ఇవ్వాలని గుణశేఖర్ డిమాండ్ చేశారు. ఇందులో తొలివిడతగా రూ.25వేలను గురువారం ఇవ్వాల్సిందిగా కోరడంతో రజనీష్ ఏసిబి అధికారులకు ఫిర్యాదు చేశాడు. అనుకున్న ప్రకారం జాలెగూడెం గ్రామానికి రజనీష్‌తో పాటు వెళ్ళి పొలాన్ని చూసి పాతిక వేలు లంచం తీసుకుని తిరిగివస్తుండగా ఏసిబి అధికారులు గుణశేఖర్‌పై దాడి చేసి పట్టుకున్నారు. ఈ దాడిలో ఏసిబి జెడి శ్రీనివాస్, డీఎస్పీ చంద్రశేఖర్, ఇన్‌స్పెక్టర్ రాజు, వెంకట్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. గుణశేఖర్ డీఎస్పీగా బాధ్యతలు తీసుకున్న రెండు నెలల్లోనే ఇలా కటకటాల పాలయ్యాడు.
ఏసిబి అదుపులో చేవెళ్ళ డిఎస్పీ
english title:
s
Date:
Friday, February 17, 2012