నిత్యం వినియోగదారుడి నుంచి ముక్కు పిండి బల్లులు వసూలు చేయాలనుకునే సిడిడిసిఎల్ ఎట్టకేలకు వినియోగదారుడి లాభాన్ని చేకూర్చే అంశంపై కూడా దృష్టి సారించింది. ఆర్థికంగా వినియోగదారుడికి ఆదా కాగా, విద్యుత్‌ను పొదుపుగా
వినియోగించుకోవటం వల్ల సిపిసిడిసిఎల్‌కు కూడా లాభాన్ని చేకూర్చే ‘బచత్ ల్యాంప్ యోజన’ అనే వినూత్న పథకాన్ని ప్రవేశపెట్టనుంది. సిపిడిసిఎల్ విక్రయించే బల్బులను కొనుగోలు చేసి విక్రయిస్తే తక్కువ విద్యుత్ వినియోగంతో ఎక్కువ వెలుగు పొందవచ్చునని కంపెనీ భావిస్తోంది.
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, చాంద్రాయణగుట్ట, ఫిబ్రవరి 16: ఒకవైపు రోజురోజుకీ పెరిగిపోతున్న నిత్యావసర వస్తువుల ధరలతో అల్లాడిపోతున్న నగరవాసులు కనీసం కరెంటు బిల్లుల భారాన్ని కొంతమేరకు తగ్గించుకునే వెసులుబాటు నుంచి సిపిడిసిఎల్ కల్పిస్తోంది. గృహోపయోగాలకోసం వినియోగిస్తున్న విద్యుత్‌ను పొదుపు చేసుకునేందుకుగాను సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ (సిపిడిసిఎల్), సి-క్వెస్ట్ క్యాపిటల్ మలేషియా లిమిటెడ్ సంస్థ సహకారంతో గృహ విద్యుత్ వినియోగదారులకు ‘బచత్ ల్యాంప్ యోజన’ పథకంను ప్రారంభించింది. కంపాక్ట్ ప్లోరోసెంట్ ల్యాంప్ (సిఎఫ్‌ఎల్) బల్బులను ఈ పథకం క్రింద పంపిణీ చేయనున్నారు. గృహ వినియోగదారులు తమ వద్దనున్న సాధారణ బల్బులను ఇచ్చి అధిక మన్నిక కలిగిన సిఎఫ్‌ఎల్ బల్బులను 15 రూ.లకు పొందవచ్చని సిపిడిసిఎల్ పేర్కొంది.
ఆర్థికంగా వినియోగదారుడి ఆదా కావటంతో పాటు విద్యుత్ పొదుపులో కంపెనీకి కూడా లాభాన్ని చేకూర్చే ఈ పథకాన్ని తొలుత కూకట్‌పల్లి, గచ్చిబౌలి, చంపాపేటతోపాటు వికారాబాద్ డివిజన్ల పరిధిలోని గృహ విద్యుత్ వినియోగదారులకు అమలు చేసేందుకు కంపెనీ సన్నాహాలు చేస్తోంది. ఎపిసిపిడిసిఎల్ ఆధ్వర్యంలో అమలవుతున్న బచాత్ క్యాంప్ యోజన కార్యక్రమం క్రింద ఒక్కో వినియోగదారుడు గరిష్టంగా నాలుగు సిఎఫ్‌ఎల్ బల్బులు పొందే అవకాశాన్ని కల్పించారు. ప్రస్తుతం వాడుతున్న 60, 100 వాట్ల సాధారణ బల్బులను కంపెనీకి అప్పగించి 11, 18 వాట్ల సిఎఫ్‌ఎల్ బల్బులు పొందేందుకు వీలుగా ఏర్పాట్లు చేశారు. కానీ బల్బులు మార్చుకునే సమయంలో వినియోగదారులు తాను ‘బచత్ ల్యాంప్ యోజన’ కార్యక్రమంలో పాల్గొంటున్నట్లు ప్రకటించాల్సి వుంటుంది. ఈ బల్బులకు ఒక సంవత్సరం వ్యారంటీని కూడా సంస్థ ప్రకటించనుంది.
లాభాలివి..!
గృహ వినియోగంలో వాడుతున్న విద్యుత్ బల్బుల స్థానంలో సిఎఫ్‌ఎల్ బల్బులను ఏర్పాటు చేయడంతో వినియోగదారులు అనేక లాభాలు పొందవచ్చు. సాధారణ బల్బుకంటే సిఎఫ్‌ఎల్ జీవితకాలం పది రెట్లు ఎక్కువ. సిఎఫ్ బల్బులకు కేవలం 20 శాతం కరెంటు మాత్రమే అవసరం. దీనితో దాదాపు వినియోగదారులు వాడుతున్న విద్యుత్‌లో 80 శాతం మేర విద్యుత్ బిల్లు ఆదా అయ్యే అవకాశాలున్నట్లు అధికార్లు పేర్కొంటున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఏర్పడుతున్న గ్లోబల్ వార్మింగ్‌కు కారణమయ్యే క్లోరో ఫోరో కార్బన్ల విడుదలకు ఈ బల్బులు అడ్డుకట్ట వేయనున్నాయి. వీటి వినియోగంతో రాత్రిపూట విద్యుత్ వినియోగం(పీక్ అవర్ డిమాండ్) గణనీయంగా తగ్గనున్నట్లు అధికారులు భావిస్తున్నారు. తొలి దశగా ఈ పథకాన్ని అమలు చేయనున్న ప్రాంతాలకు చెందిన వినియోగదారులు సి-క్వెస్ట్ క్యాప్టిల్ సిబ్బంది ద్వారా సాధారణ బల్బులను సిబ్బందికి అప్పగించి, వారి నుంచి సిఎఫ్‌ఎల్ బల్బులను పొందవచ్చునని ఎపిసిపిడిసిఎల్ కోరుతోంది.