తార్నాక, ఫిబ్రవరి 16: రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా మద్యం కంపు కొడుతోందని, మంత్రులకు లిక్కర్ సిండికేట్‌లతో సంబంధం ఉందని తేలినా చర్యలు తీసుకోవడంలో ముఖ్యమంత్రి ఎందుకు జంకుతున్నారని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆరోపించారు. గురువారం సికింద్రాబాద్ నియోజకవర్గంలోని చిలకలగూడ చౌరస్తాలో మద్యం సిండికేట్‌లకు వ్యతిరేకంగా నిర్వహించిన ధర్నాలో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా తలసాని మాట్లాడుతూ ఎక్సైజ్ మంత్రి 10 లక్షల లంచం తీసుకున్నారని స్వయంప్రతిపత్తి కలిగిన ఎంక్వైరీ సంస్థ ఏసిబి బయటపెడినప్పటికీ ముఖ్యమంత్రి ఇంకా ఆ మంత్రిని వెనుకేసుకు రావడం సిగ్గుచేటని అన్నారు. లిక్కర్ సిండికేట్‌లలో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని అరెస్టు చేసినప్పుడు మంత్రిని కనీసం పదవి నుంచి ఎందుకు తొలగించరని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రంలో మద్యం వ్యాపారాన్ని ప్రధాన ఆదాయవనరుగా అధిక ధరలకు షాపులను కేటాయించడంతో బెల్టుషాపులు విచ్చలవిడి మద్యం అమ్మకాలు, సిండికేట్లు అందుకు లంచాలు ఇవన్నీ ప్రభుత్వ తప్పిదాలేనని ఆయన ఆరోపించారు. ఏసిబి రిపోర్టును ఈ ప్రభుత్వం ఎందుకు బహిర్గతం చేయడం లేదని ప్రశ్నించారు. అందులో ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేల పేర్లు బయటపడకుండా చేస్తున్నారని అన్నారు. నివేదికలోని ఆరవపేజీ ఎందుకు గల్లంతు చేశారని తలసాని ప్రశ్నించారు. ఈ ముఖ్యమంత్రికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే మద్యం సిండికేట్‌లలో భాగస్వాములైన వారిపై చర్యలు తీసుకోవాలని, ముందుగా దోషులుగా తేలిన మంత్రుల నుంచే చర్యలు ప్రారంభించాలని డిమాండ్ చేశారు. లేకపోతే ఇందులో ముఖ్యమంత్రి ప్రమేయంపై కూడా ప్రజలకు అనుమానం కలిగకమానదని అన్నారు. గడచిన మూడురోజులుగా అసెంబ్లీలో ఈ సమస్యను చర్చకు రాకుండా అధికార పార్టీ చేస్తున్న యాగీని సభ్య సమాజం గమనిస్తోందని అన్నారు. ఏసిబి నివేదికను వెంటనే బహిర్గతం చేసి దోషులుగా తేలిన వారిపై చర్యలు తీసుకోవాలని, లేకపోతే ప్రభుత్వంపై తమ ఆందోళన తప్పదని తలసాని హెచ్చరించారు. అనంతరం ఆయన సికింద్రాబాద్ ప్యారడైజ్ చౌరస్తాలో నిర్వహించిన ధర్నాకు హాజరయ్యారు. కాగా చిలకలగూడలో జరిగిన ధర్నా కార్యక్రమానికి సి.బద్రీనాధ్‌యాదవ్, పవన్‌కుమార్‌గౌడ్, అడవయ్య, రవియాదవ్, అశోక్, జితేందర్‌రెడ్డి, భాస్కర్‌ముదిరాజ్, భగ్గుహనుమంతు, కొమురయ్య, సునీల్‌ముదిరాజ్, గిరి, బాబూరావు, శైలేందర్, కిరణ్‌కుమార్ గౌడ్, పసుమాల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
అసాంఘిక శక్తుల పట్ల అప్రమత్తత అవసరం
అసాంఘికఐ, అనైతిక కార్యక్రమాలకు పాల్పడేవారిని అన్ని పార్టీలు దూరం పెట్టాల్సిన అవసరం ఉందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకుడు పి.ఎల్.శ్రీనివాస్ పేర్కొన్నారు. అవినీతి నిర్మూలనకు అన్ని పార్టీలు నడుం బిగించాల్సిన అవసరం ఉందని అన్నారు. అవినీతి కార్యక్రమాలకు పాల్పడి అక్రమ సంపాదనతో రాజకీయాలను సైతం కలుషితం చేసే వారిపై ప్రత్యేక దృష్టి సారించాలని అన్నారు. వేల కోట్ల రూపాయలను ప్రజలను మోసం చేసి సంపాదించి వాటిని చందాల రూపంలో ఇస్తే తప్పు ఒప్పుకాదని అన్నారు. రాజకీయ ప్రక్షాళనకు ప్రతి ఒక్కరూ నడుం బిగించాలని శ్రీనివాస్ కోరారు.
మద్యం సిండికేట్‌లపై ఏసిబి దాడుల నివేదికను బహిర్గతం చేయాలి
english title:
s
Date:
Friday, February 17, 2012