నాచారం, ఫిబ్రవరి 16: నిబంధనలకు విరుద్ధంగా అక్రమంగా నిర్వహిస్తున్న సుగంధద్రవ్యాల గోదాములో మంటలు చెలరేగి భారీ ఆస్తినష్టంతో పాటు పలువురు తీవ్రంగా గాయపడ్డ సంఘటన నాచారంలో జరిగింది. గురువారం మధ్యాహ్నం నాచారం బాబానగర్‌లో జరిగిన ఈ సంఘటనతో పరిసర ప్రాంతాల ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.
ఈ సంఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. శేఖర్ అనే వ్యక్తికి చెందిన ఇంటిని సర్దార్‌జీ అనే వ్యక్తికి 2008 నుంచి అద్దెకు ఇచ్చాడు. కాగా సర్దార్‌జీ ఎలాంటి అనుమతులు ముందు జాగ్రత్తలు లేకుండానే అద్దెకు తీసుకున్న ఇంటిలో సుగంధద్రవ్యాల డీలర్‌షిప్ వ్యాపారం చేస్తున్నాడు. అందులో సుగంధద్రవ్యాలను, పెస్ట్‌కంట్రోల్, ఇన్‌సెంట్స్ (పురుగులమందు)లను నిల్వ ఉంచి, రాత్రి సమయాల్లో వాటిని ప్యాక్ చేయడం లాంటి కార్యక్రమాలు సిబ్బందితో చేయిస్తున్నాడు. రాత్రి సమయాల్లోనే గుట్టుచప్పుడు కాకుండా సరుకును రవాణా చేస్తూ చుట్టుపక్కల వారికి ఎలాంటి అనుమానం కలుగకుండా సంవత్సరాలుగా వ్యాపారం చేస్తున్నాడు.ప్రతిరోజు రాత్రి సమయాల్లో వాహనాలు రావడం ఏదో జరుగుతున్నట్టు గమనించిన స్థానికులు పలుమార్లు యజమానిని నిలదీయడంతో ఇక్కడ తమ సామాన్లను నిలువచేసుకున్నామని, వాటిని తీసుకుపోవడానికి మాత్రమే వాహనాలు వస్తాయని సర్దిచెప్పేవాడు. ఇదిలా ఉండగా గురువారం మధ్యాహ్నం గోదాములో గడువుముగిసిన స్ప్రే బాటిళ్లను సిబ్బంది మూతలు తీసి వాటిపై ఉండే అల్యూమినియం బాటిళ్లను అమ్మడం కోసం మూతలు తొలగిస్తున్న ప్రయత్నంలో సీసాలో ఉన్న రసాయనాలు కిందపడి మంటలు చెలరేగాయి. గోదాములో రసాయనాలు ఉండడంతో మంటలు వేగంగా వ్యాపించి అందులో పనిచేస్తున్న ముగ్గురు యువకులకు చేతులు కాలడంతో వారు భయంతో పరుగులు తీశారు. మంటలు క్షణాల్లో పెద్దగా మారి సీసాలు పేలిపోతే పెద్దయెత్తున శబ్దాలు రావడంతో చుట్టుపక్కల ప్రజలు ఏమి జరుగుతుందోనని పరుగున వచ్చారు. ఇంతలో పైర్ సిబ్బందికి, పోలీసులకు సమాచారం అందించారు. పైర్ సిబ్బంది వచ్చేలోపు మంటలు పక్కనే ఉన్న ఇరుపక్కల ఉన్న ఇళ్లకు సైతం పాకాయి. దీంతో ఒక పక్కన ఉన్న సాయితేజ అపార్టుమెంట్ మొదటి అంతస్తు ఈ అంటికి సమాంతరంగా ఉండడంతో అందులోని గృహోపకరణాలు పార్కింగ్‌లో ఉన్న స్విఫ్ట్‌కారు పూర్తిగా దగ్ధం అయ్యాయి. అదే అపార్టుమెంట్ రెండు, మూడు అంతస్తుల్లోని ఫ్లాట్స్ సైతం మంటల ధాటికి దెబ్బతిన్నాయి. మరోపక్కన ఉన్న ఇండిపెండెంట్ ఇంటికి కూడా మంటలు అంటుకున్నాయి. ఆ ఇంటి ముందు ఉన్న ద్విచక్రవాహనాలు, ఆటో మంటలకు ఆహుతయ్యాయి. పెద్దయెత్తున పేలుళ్లతో కూడిన మంటలు నలుదిక్కులా వ్యాపించడం ప్రారంభించాయి. ఇంతలో సంఘటనా స్థలానికి చేరుకున్న దాదాపు ఐదు ఫైర్ ఇంజన్‌లు మంటలను ఆర్పే ప్రయత్నం చేశాయి. నాలుగు గంటల సేపు తీవ్రంగా శ్రమించి ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. పోలీసు ఉన్నతాధికారులు, స్థానిక ఎమ్మార్వో, ఎమ్మెల్యే, స్థానిక కార్పొరేటర్‌తోపాటు ఇతర ఉన్నతాధికారులు సంఘటనా స్థలాన్ని సందర్శించారు. నివాస స్థలాల్లో గుట్టుచప్పుడు కాకుండా గోదాములు నిర్వహిస్తూ ఎలాంటి జాగ్రత్తలు పాటించకుండా ప్రజల ప్రాణాలకు ఆస్తులకు నష్టం కలిగించే ఇలాంటి చర్యలను అధికారులు అడ్డుకోవాలని స్థానికులు కోరుతున్నారు. కాగా ఒక్కసారిగా పేలుడు శబ్దాలతో బాబానగర్, నాచారం పరిసర ప్రాంతాల ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఈ ప్రమాదంలో గోదాము నిర్వహిస్తున్న ఇల్లు పూర్తిగా కాలిపోగా, పక్కన ఉన్నపాపానికి మూడు వైపులా ఇళ్లు, అందులో ఉన్నవారి ఆస్తులు కూడా కాలిబూడిదయ్యాయి. ఈ సంఘటనలో ప్రమాద సమయంలో అందులో పనిచేస్తున్న ముగ్గురు యువకులకు తీవ్ర గాయాలు వారిని గాంధీ ఆసుపత్రికి తరలించారు. కేసును నమోదు చేసుకుని నాచారం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
నాచారంలో అగ్ని ప్రమాదం
english title:
d
Date:
Friday, February 17, 2012