విశాఖపట్నం, మే 11: బంగాళాఖాతంలో ఆగ్నేయంగా ఏర్పడిన వాయుగుండం తుపానుగా మారింది. ఇది రానున్న కాలంలో మరింత బలపడి పెనుతుపానుగా మారనుందని విశాఖపట్నం తుపాను హెచ్చరికల కేంద్రం శనివారం రాత్రి తెలిపింది. పెనుతుపానుకు వాతావరణ శాఖ మహాసేన్‌గా నామకరణం చేసింది. ప్రస్తుతం మహాసేన్ ఆగ్నేయ బంగాళాఖాతంలో చెన్నైకి 1150 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. ఇది మరింత బలపడి క్రమంగా కదులుతూ రానున్న 36 గంటల్లో బంగ్లాదేశ్, మయన్మార్ ప్రాంతాలను తాకనుంది. పెనుతుపాను సందర్భంగా ఆకాశం మేఘావృతమై ఉంటుందని తెలిపారు.
కొత్తగా రైళ్లు ఆగే స్టేషన్లు ఖరారు
హైదరాబాద్, మే 11: కైకలూరు, వీరవాసరం, తాడేపల్లిగూడెం రైల్వే స్టేషన్లలో మూడు ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఆగే విధంగా నిర్ణయం తీసుకున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటనలో తెలిపింది. నర్సాపూర్-నాగర్‌సోల్-నర్సాపూర్ (17213- 17214) రైళ్లు ఈ నెల 14వ తేదీ నుంచి వీరవాసరం, కైకలూరు రైల్వే స్టేషన్లను ఆగుతాయి. సికింద్రాబాద్-విశాఖపట్నం-సికింద్రాబాద్ గరీబ్థ్ ఎక్స్‌ప్రెస్ ఈ నెల 15వ తేదీ నుంచి తాడేపల్లి గూడెం రైల్వే స్టేషన్లలో ఆగుతుంది. విశాఖపట్నం-లోకమాన్య తిలక్ టర్మినస్- విశాఖపట్నం (22819-22820) రైళ్లు ఈ నెల 15వ తేదీ నుంచి కైకలూరు రైల్వే స్టేషన్లో ఆగుతాయి.
లోయలో పడిన బస్సు : తప్పిన ముప్పు
తిరుపతి, మే 11: తిరుమల నుండి తిరుపతికి వస్తున్న పుత్తూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు శనివారం 21వ మలుపు వద్ద పిట్టగొడను ఢీకొని 15 అడుగుల లోతులో పడింది. అయితే ఈ సంఘటనలో చిన్నచిన్న గాయాలు మినహాయించి ఎటువంటి ప్రాణాపాయం లేకపోవడంతో టిటిడి అధికారులు, ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. పుత్తూరు డిపోకు చెందిన బస్సు 25 మంది ప్రయాణికులతో తిరుమల నుండి తిరుపతికి బయలుదేరింది.
వడదెబ్బకు ఐదుగురి మృతి
చేజర్ల, మే 11: నెల్లూరు జిల్లా చేజర్లలో శనివారం ఇద్దరు వృద్ధ మహిళలు వడదెబ్బకు గురై మరణించారు. రెండురోజులుగా ఎండ తీవ్రంగా ఉండటం వల్ల వడదెబ్బకు గురైన శేషమ్మ (70), సీతారత్నమ్మ (80) మృతి చెందారు. ఇదిలా ఉండగా ప్రకాశం జిల్లా మండ్లమూరు మండలానికి చెందిన ఇద్దరు వడ దెబ్బకు మృతి చెందారు. ఉమామహేశ్వరపురం గ్రామానికి చెందిన సూది సుబ్బారాయుడు, వేంపాడు గ్రామానికి చెందిన మేనగ వెంకటేశ్వర్లు వడదెబ్బకు మృతి చెందారు. వేటపాలెం మండలం దేశాయిపేట పంచాయతీ పరిధిలోని ఆనుమల్లిపేటకు చెందిన మద్దిన శ్రీనివాసరావు (36) అనే వ్యక్తి కూలి పనులకు వెళ్ళి వడదెబ్బ తగిలి తీవ్ర అస్వస్ధతకు గురయ్యాడు. ఇంటికి వచ్చి కళ్ళు తిరుగుతున్నాయని చెప్పి మంచినీరు తాగి స్పృహ కోల్పోయాడు. కాసేపటికి అపస్మారకస్థితిలోకి వెళ్ళిపోయి మృత్యువాతపడ్డాడు.