మహబూబ్‌నగర్/ శ్రీశైలం, మే 11: శ్రీశైలం ప్రాజెక్టు ఎడమ గట్టున ఉత్పత్తి చేస్తున్న విద్యుత్ ఉత్పత్తి కేంద్రం, భూగర్భ పవర్ హౌస్‌ను ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సందర్శించారు. కర్నూల్ జిల్లాలో నిర్వహించే పలు కార్యక్రమాలలో పాల్గొనేందుకు వచ్చిన సందర్భంలో శనివారం మహబూబ్‌నగర్ జిల్లా పరిధిలోకి వచ్చే విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలను, శ్రీశైలం ప్రాజెక్టు ఎడమ వైపును ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సందర్శించారు. అదేవిధంగా శ్రీశైలం ప్రాజెక్టు సమీపంలోని భూగర్భ పవర్ హౌస్‌ను కూడా సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన ముందుగా శ్రీశైలంకు చేరుకుని అక్కడి నుండి ప్రాజెక్టు దగ్గరకు వచ్చి ప్రాజెక్టులోని నీటిమట్టం పరిశీలించారు. అధికారులతో వివరాలను సేకరించారు. అంతేకాకుండా మహబూబ్‌నగర్ జిల్లా పరిధిలోని ప్రాజెక్టుకు సమీపంలో గల భూగర్భ పవర్ హౌస్‌ను ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి చేరుకుని భూగర్భంలోని ఆరు యూనిట్ల కేంద్రాలను పరిశీలించారు. ఒకటవ యూనిట్ దగ్గర అధికారులతో మాట్లాడుతూ ప్రస్తుతం విద్యుత్ ఉత్పత్తి ఎలా ఉందని ఆరా తీశారు. పవర్ జనరేటర్ ఒకటవ యూనిట్‌లో విద్యుత్ ఉత్పత్తిపై ఆరా తీయగా జెన్‌కో అధికారులు ఉత్పత్తి నిలిచిపోయిందని తెలిపారు. అక్కడే ఉన్న జనరేటింగ్ యూనిట్ నమూనాను కూడా ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డితో పాటు మంత్రి డికె అరుణ పరిశీలించారు. యూనిట్-1 జనరేటర్ గ్రౌండ్ జనరేటింగ్‌ను, రొటియేటర్‌ను కూడా పరిశీలించి అక్కడ పనులపై ఆరా తీశారు. మెకానికల్ కంట్రోలింగ్ సిస్టం (ఎంసిఆర్)ను కూడా సందర్శించారు. సంబంధించిన యంత్రాలను కూడా సిఎం పరిశీలించి జెన్‌కో అధికారులతో వాటి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆరవ యూనిట్‌లో కూడా బిగించిన యంత్రాలను పరిశీలించి అక్కడ ఏర్పాటు చేసిన కంప్యూటర్లను కూడా పరిశీలించారు. ఏ గ్రేడ్ లైన్ సరఫరాపై కూడా ముఖ్యమంత్రి జెన్‌కో అధికారులతో ఆరా తీశారు. నాగార్జునసాగర్, హైదరాబాద్, గుంతకల్ బ్రీడ్లు కలిసే సిస్టంను కూడా ముఖ్యమంత్రి పరిశీలించి భూగర్భ జల పవర్ హౌస్ నిర్మాణం బ్రహ్మండంగా ఉందని జెన్‌కో అధికారులకు కితాబిచ్చారు.
ముఖ్యమంత్రి జెన్‌కో ఎండి విజయానంద్‌తో వివరాలు తెలుసుకుంటూ ఉత్పత్తి ఎలా ఉందని ప్రశ్నించారు. ఇందుకు అధికారులు ప్రస్తుతం రెండు, మూడు నెలల నుండి విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయిందని, ప్రాజెక్టులో నీటిమట్టం తగ్గడంతో ఇబ్బందులు ఏర్పడ్డాయని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ పవర్ జనరేషన్ కార్పొరేషన్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని కూడా సిఎం సందర్శించారు. అనంతరం జెన్‌కో అధికారులతో ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఇలాంటి విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు రాష్ట్రానికి ఎంతో అవసరమని అన్నారు. భూగర్భ పవర్ హౌస్ అద్బుతంగా ఉందని అధికారులకు కితాబిచ్చారు. ముఖ్యమంత్రి వెంట మంత్రులు డికె అరుణ, ఏరాసు ప్రతాప్‌రెడ్డి, కొండ్రు మురళి, నంద్యాల ఎంపి ఎస్‌పివై రెడ్డి, అచ్చంపేట ఎమ్మెల్యే రాములు, హైడ్రో ఎలక్ట్రికల్ డైరెక్టర్ ఆదిశేషు, మహబూబ్‌నగర్, కర్నూల్ జిల్లాల కలెక్టర్లు గిరిజాశంకర్, సుదర్శన్‌రెడ్డి, ఎస్పీలు నాగేంద్రకుమార్, కోటేశ్వర్‌రావు, ఎపి జెన్‌కో సిఎండి విజయానంద్ తదితరులు పాల్గొన్నారు. కాగా ఉదయం 11 గంటలకు సున్నిపెంట చేరుకున్న సిఎం ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆలయ రాజగోపుం ఎదురుగా మాస్టార్‌ఫ్లాన్ మొదటి దశ పనుల్లో భాగంగా రూ.137కోట్లతో చేస్తున్న భూగర్భ మురుగుకాల్వ పనులకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. రూ. 8 కోట్లతో నిర్మించిన నూతన మల్లికార్జున సదన్ అతిథి గృహాన్ని సిఎం ప్రారంభించారు. కిరణ్‌కుమార్‌రెడ్డి శనివారం శ్రీశైలంలో కొలువైన భ్రమరాంబిక మల్లికార్జునస్వామి వార్లను దర్శించుకున్నారు. ఒక్కరోజు జిల్లా పర్యటనలో భాగంగా ఆయన శనివారం ఉదయం 11 గంటలకు హెలికాప్టర్‌లో సున్నిపెంటలోని హెలిప్యాడ్‌లో దిగారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో శ్రీశైలం చేరుకున్నారు. ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి శ్రీశైలం వచ్చిన ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డికి దేవస్థానం ఇఓ చంద్రశేఖర్ ఆజాద్, ఆలయ అర్చకులు మేళతాళాలతో పూర్ణకుంభ స్వాగతం పలికారు. (చిత్రం) భూగర్భ పవర్ హౌస్‌లో విద్యుత్ ఉత్పత్తిని పరిశీలిస్తున్న ముఖ్యమంత్రి కిరణ్
శ్రీశైలం భూగర్భ పవర్ హౌస్‌ను సందర్శించిన సిఎం * జెన్‌కో అధికారుల పనితీరుకు మెచ్చుకోలు
english title:
cm
Date:
Sunday, May 12, 2013