శ్రీకాకుళం, మే 11: శతాబ్దాలుగా గిరిపుత్రులు ఆరాధిస్తున్న రామగిరి క్షేత్రాన్ని రక్షించుకుని, ముక్కుడిపోలమ్మ అమ్మవారి ఆలయాన్ని కాపాడుకునే దిశగా రాష్ట్ర వ్యాప్త ఉద్యమానికి ఆదివారం జరగనున్న ‘గిరిపుత్రుల సింహగర్జన’ శ్రీకారమంటూ భారత్ స్వాభిమాన్ ట్రస్టు శ్రీకాకుళం జిల్లా అధ్యక్షులు స్వామి శ్రీనివాసానంద సరస్వతి చెప్పారు. నాలుగు రోజుల పాటు జిల్లాలోని కనె్నధార కొండ చుట్టూ గల 34 గిరిజన గూడేల్లో తిరిగి రామగిరి క్షేత్రాన్ని రక్షించుకుందామంటూ అక్కడ గిరిజనంలో చైతన్యం తీసుకువచ్చామని, ఈ పాదయాత్ర ముగింపు సభనే ‘సింహగర్జన’గా నామకరణం చేసి దెయ్యాల్లా మారిన పాలకులను హెచ్చరిస్తూ రాష్టవ్య్రాప్తంగా పీఠాధీపతులు, స్వామీజీలంతా కలిసి కనె్నధార కొండపై దేవుళ్లను కాపాడుకునేందుకు నడుం బిగించనున్నారని వివరించారు. కనె్నధార కొండపై మంత్రి ధర్మాన ప్రసాదరావు తనయుడు రామ్మోహన్‌నాయుడికి అక్రమంగా కట్టబెట్టిన గ్రానైట్ లీజులు రద్దు చేయాలంటూ జిల్లాలో ఉద్యమం జరుగుతున్న నేపథ్యంలో శనివారం శ్రీనివాసానందసరస్వతి ‘ఆంధ్రభూమి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. కనె్నధార కొండపై ఉన్న రామగిరి క్షేత్రాన్ని పరిరక్షించుకోవాలన్న చినజీయర్ స్వామి పిలుపును అందుకున్న ఎంతోమంది స్వామీజీల్లో ఒకడిగా తాను కూడా ఈ బాధ్యతలు స్వీకరించినట్లు చెప్పారు. కనె్నధారపై రామగిరిక్షేత్రం, ముక్కుడిపోలమ్మ అమ్మవారి ఆలయాలతో పాటు, 150 రకాల ఔషధ మొక్కలు ఉన్నాయన్నారు. గిరిజనులకు అమ్మవార్లపై అపారమైన నమ్మకం ఉందన్నారు. ఔషధ మొక్కలే ఆయుష్షు పోసే మందులుగా భావించి బతుకుతున్న గిరిజనుల గుండెల్లో గునపాలు దించేలా మంత్రి ధర్మాన తనయుడు రామ్మోహన్‌నాయడు పేరిట కనె్నధార కొండను ప్రభుత్వం అమ్మేస్తే చూస్తూ ఊరుకోబోమంటూ శ్రీనివాసానందసరస్వతి హెచ్చరించారు. శ్రీరాముని కోసం అభంశుభం తెలియని ఒక కనె్న తపస్సు చేసి ఆయనలో లీనమైపోతే - కొండ ఎగువభాగంలో గల గిరిజనం అంతా కన్నీటి ధారలు కారుస్తూ విలపించినందునే ఈ కొండకు ‘కనె్నధార’ అని నామకరణం చేసి అక్కడ రాముడు క్షేత్రాన్ని నెలకొల్పారన్న పురాణ చరిత్రను సైతం విస్మరించిన ప్రభుత్వంపై పోరాటం చేస్తామని శ్రీనివాసస్వామి చెప్పారు. జీవవైవిధ్య సదస్సులు, పర్యావవరణ పరిరక్షణ పేరిట విదేశాల్లో ప్రత్యేక సెమినార్లు నిర్వహించే ప్రభుత్వాలకు గిరులు కాపాడమంటూ గిరిజనం చేసే డిమాండ్లు ఎందుకు పట్టవని ఆయన నిలదీసారు. కనె్నధార కొండ అక్రమ లీజులను రద్దు చేసి కొండపై గల రామగిరి క్షేత్రాన్ని అభివృద్ధి చేయకపోతే నాలుగు రోజుల పాదయాత్ర ముగింపు సభే రాష్ట్ర వ్యాప్తంగా పీఠాధిపతులు, స్వామీజీల ఉద్యమంగా మారుతుందని శ్రీనివాసానంద సరస్వతి హెచ్చరించారు.
‘కన్నెధార’పై నేడు సింహగర్జన
శ్రీకాకుళం జిల్లా సీతంపేట ఏజెన్సీలోని వివాదాస్పద కన్నెధార కొండ పై ఆదివారం గిరిపుత్రులు సింహగర్జన నిర్వహించనున్నారు. పులిపుట్టి పంచాయతీ పరిధిలోని ఈ కొండపై రోడ్లు, భవనాలశాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు తనయుడు ధర్మాన రామ్మోహాన్‌నాయుడు పేరిట ఇచ్చిన అక్రమ గ్రానైట్ లీజులు నిలిపివేయాలంటూ కొన్నాళ్లుగా సాగుతున్న ఈ పోరాటంలో భాగంగా సింహగర్జన పేరిట భారీ బహిరంగ సభ నిర్వహణకు కన్నెధార పోరాట కమిటీ నాయకులు ఏర్పాట్లు చేస్తున్నారు. కన్నెధార అక్రమ లీజులపై ఉత్తరాంధ్ర సాధువ పరిషత్ అధ్యక్షులు స్వామీ శ్రీనివాసానంద సరస్వతి ఆధ్వర్యంలో జరుగుతున్న పాదయాత్ర ముగింపు నేపథ్యంలో ఈ సభ నిర్వహించనున్నారు. కన్నెధార కొండ అక్రమ లీజుల వ్యవహారంపై గిరిజనుల వ్యతిరేకతను చాటి చెప్పేందుకే ఈ భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు కన్నెధార పోరాట కమిటీ నాయకులు సవరతోట ముఖలింగం చెప్పారు. విశాఖ జిల్లా నుంచి పూర్ణానంద స్వామి, విజయనగరం జిల్లా నుంచి సమితానంద స్వామి, రామానంద స్వామి, టిటిడి ధర్మ ప్రచారకులు కీర్తనానంద దాస్ స్వామి, శివానంద స్వామి, సత్యానంద స్వామి, విజయానంద భారతి, రామానంద స్వామి ఈ సభకు హాజరుకానున్నట్లు వివరించారు.