నల్లగొండ, మే 12: ఫ్లోరైడ్ పీడిత జిల్లాగా పేరుమోసిన నల్లగొండ జిల్లాలో మంచినీటి పథకాల పనులకు అధిక ప్రాధాన్యత లభించాల్సిందిపోయి ఏళ్ల తరబడిగా సాగుతున్న మంచినీటి పథకాల నిర్మాణాలు నత్తనడకను సైతం మరిపిస్తుండగా రక్షిత మంచినీటి జలాల కోసం గ్రామీణ జనానికి దశాబ్ధాలుగా ఎదురుచూపులే మిగులుతున్నాయి. జిల్లాలో 2009-10లో చేపట్టిన తాగునీటి పథకాలు సైతం నేటికి పురోగతిలో ఉన్న తీరు తాగునీటి పథకాల పనుల జప్యానికి నిదర్శనంగా కనిపిస్తుంది. జిల్లాలో 43సిపిడబ్ల్యుఎస్ స్కీమ్ పనులలో 17పురోగతిలో ఉండగా 26పథకాలు టెండర్ దశలో, అంచనాల ఆమోదంలో ఉండటం గమనార్హం. జిల్లాలో 667కోట్లతో చేపట్టిన వివిధ తాగునీటి పథకాల నిధుల్లో నేటికి 191కోట్లు మాత్రమే ఖర్చు జరుగగా, ఐదు మంచినీటి పథకాల పనులే పూర్తయినట్లుగా అధికారిక లెక్కలే వెల్లడిస్తుండటం విచారకరమే. అధిక శాతం పథకాలు పైప్‌లైన్లు, పంప్‌హౌస్‌లు, ట్యాంకుల నిర్మాణాల పనుల దశలలోనే ఉన్నాయి. మరికొన్ని మంచినీటి పథకాల పనులు ఆర్‌డబ్ల్యుఎస్, విద్యుత్ శాఖల మధ్య సమన్వయం లోపం పనుల పూర్తిలో ఆలస్యం చేస్తుంది. 35తాగునీటి పథకాల్లో 19పథకాలకు కనెక్షన్ల కోసం విద్యుత్ శాఖకు డబ్బులు చెల్లించినా పనులు జరుగకపోవడంతో ఈ ఏడాది చివరికల్లా కూడ వాటికి విద్యుత్ సరఫరా అందే పరిస్థితి లేదు. మరో 17మంచినీటి పథకాలకు డబ్బులు చెల్లించాల్సివుంది. ఆర్‌డబ్ల్యుఎస్ శాఖ మంత్రిగా జిల్లాకు చెందిన సీనియర్ మంత్రి కె.జానారెడ్డి బాధ్యతలు నిర్వహిస్తున్నా జిల్లా తాగునీటి పథకాలు నత్తనడకన సాగుతుండటం విమర్శల పాలవుతుంది.
పనుల్లోనే పథకాలు.. గ్రామీణ జనానికి అందని రక్షిత జలాలు
జిల్లా మంచినీటి పథకాల పనుల పురోగతిని పరిశీలిస్తే గ్రామీణ ప్రజలకు సుజలం రాక సుదూరంగానే కనిపిస్తు ఎదురుచూపులే మిగిలిస్తుంది. 6కోట్లతో 41ఆవాసాలకు కృష్ణా రక్షిత మంచినీటి జలాలు అందించాల్సిన భువనగిరి, యాదగిరిగుట్ట మంచినీటి పథకం 5.25కోట్లు ఖర్చు చేయగా 31అవాసాలకు నీరు అందుతుండగా మిగతా పని పెండింగ్‌లో ఉంది. గుండాల, ఆలేరు, రాజాపేట మండలాల్లోని 86 అవాసాలకు కృష్ణా మంచినీరు అందించేందుకు ఎన్‌ఆర్‌డిడబ్ల్యుపి నిధులు 50కోట్లతో చేపట్టిన పనులు సగం నిధులు ఖర్చు చేసిన సగం పనులు జరుగలేదు. ఆలేరు, రాజాపేట, పోచంపల్లి, చౌటుప్పల్ మండలాల్లోని 73 అవాసాలకు నీరందించేందుకు 35కోట్లతో చేపట్టిన పనులు 17కోట్లు ఖర్చు జరుగగా చౌటుప్పల్ వరకు నీటి విడుదల సాగుతుంది. 3కోట్లతో చేపట్టిన బీబీనగర్ మంచినీటి పథకం పనులు సగం కూడా సాగలేదు. 5కోట్లతో చేపట్టిన నల్లగొండ మంచినీటి పథకంలో 300.00లక్షలు ఖర్చు జరుగగా పనులు పురోగతిలో ఉన్నాయి. కోటి రూపాయలతో చేపట్టిన తుంగతుర్తి స్కీమ్ ఎస్టిమేషన్‌లో నానుతుంది. 2కోట్లతో చేపట్టిన అయిటిపాముల పథకం 50లక్షలు ఖర్చు జరిగి పనులు పురోగతిలోనే ఉన్నాయి. 5కోట్లతో చేపట్టిన హూజుర్‌నగర్ ఫేజ్ -1పూర్తవ్వగా, 7కోట్లతో చేపట్టిన ఫేజ్-2 తుది దశలో ఉండగా, 27కోట్లతో చేపట్టిన ఫేజ్-3పనులతో 53అవాసాలకు మంచినీరు అందించాల్సిన పనులు చేపట్టగా 22కోట్ల ఖర్చు జరిగిన 10అవాసాల వరకు మంచినీరు సరఫరా చేయగలిగారు. 5కోట్లతో చేపట్టిన ఫేజ్-1పనులు పూర్తవ్వగా ఫేజ్-2లో 5కోట్లకు 3కోట్లు ఖర్చు చేశారు. ఫేజీ-3లో 5కోట్లకు 3.41కోట్లు ఖర్చు చేయగా వాటి పనులు పురోగతిలోనే ఉండిపోయాయి. 12కోట్లతో చేపట్టిన మోతే పథకం పనులు పూర్తవ్వగా, 5కోట్లతో ఫేజ్-1, 5.35కోట్లతో ఫేజ్-2పనులు దాదాపుగా పూర్తి జరిగి ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి. 30కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన ఫేజ్-3పనులతో 49అవాసాలకు నీరు ఇవ్వాల్సివుండగా పనులు పురోగతిలో ఉన్నాయి. మోతే పథకాల పనులు నాసిరకంగా జరుగడంతో ట్రయల్ రన్‌లో పైపులైన్లు పగిలిపోయాయని మొత్తం పనులు పునర్‌నిర్మాణం చేయాలని స్థానిక ఎమ్మెల్యే వేనెపల్లి చందర్‌రావు డిమాండ్ చేయడం గమనార్హం. 9కోట్లతో 11అవాసాలకు నీరందించే కోదాడ సిపిడబ్ల్యుఎస్ పథకం పనులు 6కోట్లు ఖర్చు చేయగా పనులు తుది దశలో ఉన్నాయి. నాగార్జున సాగర్ నియోజకవర్గంలో 8.20కోట్లతో చేపట్టిన అనుముల మంచినీటి పథకం పనులలో 2.40కోట్లు ఖర్చు చేయగా, 37కోట్లతో చేపట్టిన గుర్రంపోడు, పెద్దవూరా, త్రిపురారం, నిడమనూర్, అనుముల మండలాల్లోని 54అవాసాలకు నీరందించే పకం పనులు 20కోట్లు ఖర్చు జరుగగా పనులు సగం కూడా పూర్తవ్వలేదు. 5కోట్లతో నిడమనూర్ ఫేజ్-3పనుల్లో 2కోట్లు ఖర్చు చేయ పనులు పురోగతిలోనే ఉన్నాయి. దామరచర్ల-వేములపల్లి మండలాల్లోని 51అవాసాలకు నీరందించే బాలంపల్లి పథకం 24కోట్లతో చేపట్టగా 14కోట్ల ఖర్చు జరుగగా పనులు సగందాకా సాగాయి. 24కోట్లతో చందంపేట, దేవరకొండ, డిండి మండలాల్లోని 40అవాసాలకు నీరందించే చందంపేట మంచినీటి పథకం పనుల్లో 17కోట్ల ఖర్చు జరుగగా పనులు సగం కూడా సాగలేదు.
టెండర్లలోనే కొత్త పథకాలు !
సిపిడబ్ల్యుఎస్ మంచినీటి పథకాల్లో ఎన్‌ఆర్‌డిడబ్ల్యుపి గ్రాంటుతో చేపట్టిన 27మంచినీటి పథకాల్లో దాదాపు అన్ని కూడా టెండర్ల దశలో, అంచనాల ఆమోదంలోనే మ్రగ్గుతున్న తీరు మంచినీటి పథకాల నిర్మాణ పనుల్లో నిర్లక్ష్యాన్ని వెల్లడిస్తుంది. ఇందులో 4.50కోట్లతో వలిగొండ మండలంలోని మిగిలిన 17అవాసాలకు నీరందించే పథకం పనులు, 2కోట్లతో చేపట్టిన నసర్లపల్లి మంచినీటి పథకం పనులు, 15కోట్లతో చేపట్టిన హుజూర్‌నగర్ ఫేజ్-4, 2కోట్లతో చేపట్టిన మోతే పొడగింపు పథకం, 11కోట్లతో చేపట్టిన వేములపల్లి, 1కోటితో చేపట్టిన పెద్ధవూరా, 71కోట్ల సూర్యాపేట పథకం, 98కోట్ల తుంగతుర్తి, 5కోట్లతో దొండపాడు ఫేజ్-2పనులు టెండర్ల ప్రక్రియలో ఉన్నాయి. 22కోట్లతో చేపట్టిన నేరడుచర్ల, కోటి అంచనాలతో చేపట్టిన అయిటిపాముల క్రిటికల్ గ్యాప్ వర్క్, 3కోట్లతో చేపట్టిన దేవరకొండ, మునుగోడు, నకిరేకల్, భువనగిరి, ఆలేరు మంచినీటి ట్యాంకుల ఏర్పాటు పనులు, 15కోట్లతో చేపట్టిన నకిరేకల్ పథకాల పనులు అంచనాల్లో ఉన్నాయి. 25కోట్లతో చేపట్టిన చందంపేట, 24కోట్లతో చేపట్టిన ఆలేరు-మోత్కూర్ పథకం, 4కోట్లతో చేపట్టిన ఆలేరు పథకం పనులు భూకేటాయింపుల్లో ఉన్నాయి. 16కోట్లతో చేపట్టిన అనుముల, 60లక్షలతో చేపట్టిన దేవరకొండ, 25కోట్లతో చేపట్టిన శాలిగౌరారం, మోత్కూర్, గుండాల, ఆలేరు, రాజాపేట, గుట్ట మంచినీటి పథకం, 4.65కోట్లతో మంజూరైన ఆలేరు-ఆత్మకూర్(ఎం), 36లక్షలతో మంజూరైన చర్లగౌరారం, 32లక్షల తిప్పర్తి క్రిటికల్ గ్యాప్ వర్క్, 47లక్షలతో మంజూరైన నకిరేకల్ మిగిలిన ఫ్లోరైడ్ ఆవాసాల పథకం, 16లక్షలు మంజూరు చేసిన వాయిలాసింగారం, 46లక్షలతో మంజూరైన చేపూరు, గుర్రంపోడు, 46లక్షలతో మంజూరైన నిడమనూర్ మంచినీటి పథకాలు టెండర్‌ల దశలోనే జోగుతున్నాయి.
వెంకన్న ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠ
- హాజరైన ఎమ్మెల్యే కోమటిరెడ్డి -
నల్లగొండ , మే 12: పట్టణంలోని వీటి కాలనీ శ్రీదేవిభూదేవి సహిత శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయంలో ఉప ఆలయాలుగా కొత్తగా నిర్మించిన దేవాలయాలలో ఆదివారం వివిధ దేవతల విగ్రహాల ప్రతిష్టాకార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఆలయంలో సరస్వతి, శివపంచాక్షరిలింగం, గోపాలకృష్ణ విగ్రహం, సుబ్రమణ్యేశ్వరస్వామి, షిర్డిసాయిబాబా, గాయత్రిమాతా విగ్రహాలను ప్రతిష్టించారు. అనంతరం వెంకటేశ్వరస్వామి కల్యాణాన్ని జరిపారు. విగ్రహప్రతిష్టా కార్యక్రమాలలో ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో కాలనీవాసులు జైపాల్‌రెడ్డి, వీరబ్రహ్మనందరెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ పుల్లెంల వెంకటనారాయణగౌడ్, నిమ్మల శేఖర్‌రెడ్డి తదితరులు ఉన్నారు.
రైతు సదస్సు ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే
భువనగిరి, మే 12: పట్టణంలోని జయలక్ష్మీ గార్డెన్ ఫంక్షన్‌హాల్‌లో సోమవారం జరుగనున్న డివిజన్ స్థాయి రైతు సదస్సుకు సంబంధించిన ఏర్పాట్లను ఆదివారం ఆలేరు ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్య సందర్శించి పరిశీలించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన ఏర్పాట్లు చేయాలని ఆయన అధికారులకు ఆదేశించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వ్యవసాయసాగులో రైతులకు అవసరమైన సలహాలు, సూచనలు వ్యవసాయ శాస్తవ్రేత్తల ద్వారా అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా రైతు సదస్సులు నిర్వహిస్తుందని ఆయన పేర్కొన్నారు. రైతులు అధిక సంఖ్యలో సదస్సుకు హాజరై సాగులో నూతన విధానాలు, ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాలపై అవగాహన పెంపొందించుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ పోత్నాక్‌ప్రమోద్‌కుమార్, వ్యవసాయశాఖా ఎడిఎ శ్రీరాములు, మండల వ్యవసాయాధికారి యాదగిరిరావుతో పాటూ నాయకులు దర్గాయి హరిప్రసాద్, కూతాడి సురేష్ పాల్గొన్నారు.
యాదగిరికొండపై భాగవత సప్తాహం
యాదగిరిగుట్ట, మే 12 శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానములో నిర్వహిస్తున్న శ్రీమద్భాగవత సప్తాహ జ్ఞానమహాయజ్ఞంలో భాగంగా ఆదివారం స్వామివారి సన్నిధిలో విశ్వక్సేన ఆరాధన శుద్ధి పుణ్యాహవాచన కార్యక్రమాన్ని అర్చకులు నిర్వహించారు. తిరువీధులలో పుణ్యాహవాచన జలములతో అర్చక బృందం ప్రోక్షణ గావించారు. అనంతరం యజ్ఞశాలలో రక్షాబంధనము, శంఖుస్థాపన, ఋత్విక్‌వరణము, అంకురారోపణము, ధ్వజాధివాసము, మంగళాశాసనము, తీర్ధప్రసాద గోష్టి నిర్వహించారు. భగవానుడి పరిపూర్ణమైన అవతారము శ్రీకృష్ణ అవతారముని, ఆ అవతార పరిసమాప్తిలో వైభవాన్ని అంతా శ్రీమద్భాగవతములో ఉంచి కృష్ణ పరమాత్మ ఈ భాగవత వైభవమును ఎంతో విశేషంగా తెలియజేయడమే భాగవత సప్తాహము ప్రత్యేకతని ఈనెల 19 వరకు నిర్వహించనున్నట్టలు ప్రధానార్చకులు నల్లంతీగల్ లక్ష్మీనరసింహచార్యులు తెలిపారు. కార్యక్రమంలో దేవస్థాన అనువంశిక ధర్మకర్త బి.నరసింహమూర్తి, ఇఓ కృష్ణవేణి, ఆలయ పేష్కార్ డి.్భస్కర్, ఎఇఓలు చంద్రశేఖర్, కె.అంజనేయులు, ఆలయ పర్యవేక్షకులు జె.కృష్ణ, జి.రఘు, సంస్కృత పాఠశాల ప్రిన్సిపాల్ రామానుజాచార్యులు తదితరులు పాల్గొన్నారు.
ఆయకట్టులో తాగునీటికి కటకట
* అడుగంటిన భూగర్భజలాలు
* ఎడమకాల్వ నుంచి చెర్వులకులేని తూములు
* ఎడమకాల్వకు నీరిచ్చినా నిండని చెర్వులు
మిర్యాలగూడ, మే 12: నాగార్జునసాగర్ ఆయకట్టులోని ప్రజల గొంతుతడారిపోతుంది. గడిచిన రెండేళ్లుగా సాగర్ ఆయకట్టుగా సాగునీటి విడుదల లేకపోవడంతో భూగర్భజలాలు అడుగంటాయి. బోర్లు, బావులలో అరకొరగా నీరులభిస్తుంది. బోర్లలో కొద్దోగొప్పోవచ్చే నీరు సైతం భానుడి ప్రతాపానికి ఆవిరైపోతుంది. ఫలితంగా తాగునీరులేక ఆయకట్టు ప్రజానీకం తల్లడిల్లిపోతున్నారు. తాగునీటి అవసరాలకోసం సాగర్ ఎడమకాల్వకు ఐదు రోజుల కిందట నీటిని విడుదల చేసినప్పటికీ మిర్యాలగూడ పట్టణానికి తాగునీటినందించే పెద్దదేవులపల్లి రిజర్వాయర్‌తోపాటు పొనుగోడు రిజర్వాయర్ మాత్రమే కృష్ణాజలాలతో నిండా యి. కాగా, వందలాది చెర్వులకు కృష్ణా జలాలుచేరే అవకాశం లేకపోవడంతో చెర్వులన్నీ నీరులేక నెర్రలుబారి దీనంగా కనిపిస్తున్నాయి. సాగర్ ఎడమకాల్వలో 7వేల క్యూసెక్కుల నీరు ప్రవహిస్తున్నప్పటికీ నాగార్జునసాగర్, మిర్యాలగూడ, హుజూర్‌నగర్ నియోజకవర్గాల్లోని చెర్వులు నిండే పరిస్థితి కనిపించడంలేదు. దీంతో కృష్ణాజలాలకోసం ఆశగాచూసిన ప్రజలకు నిరాశే మిగులుతుంది. సాగర్ ఎడమకాల్వకు విడుదల చేసిన నీరు వృధాగా పొలాల్లో పారుతున్నాయి. అయితే నీటి విడుదల చేసినప్పటికి చెర్వులకు నీరు వెళ్లకపోవడంతో నీటి విడుదల చేసినా ప్రయోజనం లేకుండాపోతుంది. సాగర్ ఆధునికీకరణ పనులతోపాటు ఎడమకాల్వకు వేసవిలో తాగునీటి ఎద్దడి నుండి అధిగమించేందుకు చెర్వులను నింపడానికి ప్రత్యేకంగా తూములు, ఫీడర్‌ఛానెళ్లు ఏర్పాటు చేయడంపట్ల దృష్టి సారించడంలో అధికారులు విఫలమయ్యా రన్న ఆరోపణలు వినవస్తున్నాయి. మిర్యాలగూడ డివిజన్‌పరిధిలో సాగర్ ఎడమకాల్వ ఆయకట్టుకింద సుమారు 50 చెర్వుల వరకు ఉన్నాయి. అయితే వీటిలో వేములపల్లి మండలంలోని నియామత్‌ఖాన్ చెర్వు, చిన్నచెర్వులోకి, గరిడేపల్లిలోని పొనుగోడు, గరిడేపల్లి, తాళ్లచెర్వు, రాయినిగూడెం చెర్వులకు, నిడమనూరులోని చిన్నచెర్వు, త్రిపురారంలోని చెర్వులకు మాత్రమే కొద్దిపాటి నీరు వచ్చి చేరుతుంది. మిగిలిన ఏఒక్క చెర్వుకు కూడా చుక్కనీరు రాలేదు. కాగా, కళ్లముందే సాగర్ ఎడమకాల్వలో కృష్ణాజలాలు నిండుగా వెళ్తున్న చెర్వుల్లోకి నీరురాకపోవడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
ప్రతిఒక్కరూ భక్తిని అలవర్చుకోవాలి: పాల్వాయి
చౌటుప్పల్, మే 12: మానసిక ప్రశాంతతకోసం ప్రతి ఒక్కరూ భక్తిని అలవర్చుకోవాలని రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి సూచించారు. మండలంలోని లక్కారంలో నూతనంగా నిర్మించిన ఆలయంలో ఆదివారం వీరబ్రహ్మేంద్రస్వామి, హనుమాన్, శివుని విగ్రహాల ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమం వైభవంగా జరిగింది కార్యక్రమంలో పాల్వాయ ప్రత్యేక పూజలు చేశారు. ఈసందర్భం గా ఆయన మాట్లాడుతూ మానసిక ప్రశాంతత కోసం దైవభక్తిని పెంచుకోవాలన్నారు. ఆలయం అభివృద్ధికి తనవంతు సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రావుల మాధవరెడ్డి, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు గుండు మల్లయ్యగౌడ్, పాశం సంజయ్‌బాబు, ముప్పిడి సైదులుగౌడ్, బిపి రాములు, యాదగిరి, కాసర్ల శ్రీనివాస్‌రెడ్డి, నర్సిరెడ్డి, వెంకటేష్, రమేష్, శ్యామ్‌సుందర్‌రెడ్డి, రమేష్, గణేష్, నరసింహా, గుండెబోయిన నరసింహా, బాలగోని రాము, ఆలయ కమిటీ కార్యవర్గం, భక్తులు పాల్గొన్నారు.
వేదవిజ్ఞానం గాయత్రీ మంత్రంతో నిక్షిప్తం
* నేటితరంలో ఆధ్యాత్మిక చింతన పెంచాలి
* త్రిదండి అష్టక్షరీ జీయర్ స్వామి
* సాముహిక ఉపనయనాలు
నల్లగొండ , మే 12: వేద విజ్ఞానమంతా గాయత్రీమంత్రంతో నిక్షిప్తమైన కారణంగా గాయత్రీ మంత్రాన్ని నిత్యంజపిస్తే సకల సమస్యలకు పరిష్కారం లభిస్తుందని త్రిదండి అష్టాక్షరీ జీయర్ స్వామి పేర్కొన్నారు. ఆదివారం పట్టణంలోని అష్టాక్షరీ భక్తమండలి కార్యాలయ ఆవరణలో సామూహిక ఉపనయనాలు, సమాశ్రయణాల కార్యక్రమాలను నిర్వహించారు. ఈసందర్భంగా 18 మంది వటువులకు (బ్రాహ్మణ కుమారులకు) ఉపనయన కార్యక్రమాన్ని నిర్వహించగా సమాశ్రయణాల కార్యక్రమంలో 30మంది పాల్గొన్నారు. హాజరైన భక్తుల నుద్దేశించి జీయర్‌స్వామి ఉపనయన విశిష్టతను వివరించారు. వేదం అధ్యయనం చేసేందుకు, వైదిక ప్రక్రియలు నిర్వహించేందుకు ఉపనయన సంస్కారం అత్యంత అవసరమన్నారు. ఉపనయనం తండ్రి కుమారునికి చేయడం అద్భుతమైన సంస్కారమన్నారు. ఈ ప్రక్రియ ద్వారానే ఆత్మ ఉజ్జీవనం చేయుటకు అవకాశం ఉంటుందన్నారు. గాయత్రీమంత్రం బ్రహ్మతత్వాన్ని స్పష్టంగా విశదీకరించేదన్నారు. బ్రహ్మజ్ఞానం పొంది పుత్రుడు తనకు జీవనం కల్గిస్తాడనే ఉద్దేశంతో తండ్రి మాత్రమే ఉపదేశించేది గాయత్రి మంత్రంగా జీయర్‌స్వామి పేర్కొన్నారు. ఉపనయనం చేయడం ద్వారా సకల ఫలాలు సిద్ధిస్తాయని, సంద్యావందనం ఆచరించని వారికి ఎలాంటి ఫలం సిద్ధించదని శాస్త్రాలు చెబుతున్నాయన్నారు. భక్తమండలి కార్యదర్శి అక్కెనపల్లి శ్రీదేవి, పండితులు భగవాన్, కారంపూడి సంపత్‌కుమారాచార్యులు, విష్ణువర్థనాచార్యులు, సుదర్శనా చార్యులు, వేణుగోపాల్‌రావు, లక్ష్మణ్‌రావు, కసిరెడ్డి మనోహర్‌రెడ్డి, నవీన్‌కుమార్, నెహ్రు పాల్గొన్నారు.
ఆధునిక సాగు పద్ధతులను అలవర్చుకోవాలి
కలెక్టర్ ముక్తేశ్వరరావు
కట్టంగూర్, మే 12: రైతులు ఆధునిక సాగు పద్ధతులను అలవర్చుకొని అధిక దిగుబడులు సాధించాలని కలెక్టర్ ఎన్ ముక్తేశ్వరరావు సూచించారు. మండల పరిధిలోని ఎర్సానీగూడెం గ్రామంలో మదర్ థెరిస్సా రూరల్ డెవలప్‌మెంట్ సోసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన జీవనజ్యోతి విత్తనశుద్ధి కార్మాగారాన్ని ఆదివారం ఆయన ప్రారంభించారు. ఈసందర్భంగా ఏర్పాటుచేసిన సభలో కలెక్టర్ మాట్లాడుతూ వ్యవసారంగంలో విప్లవత్మకమైన ఆధునికపద్ధతులు అందుబాటులోకి వచ్చాయన్నారు. వాటన్నింటినీ రైతులకు తెలియపర్చి నూతన సాగువిధానాలను అలవర్చుకునేలా వ్యవసాయాధికారులు, స్వచ్ఛందసంస్థలు కృషి చేయాలన్నారు. శాస్తవ్రేత్త సుభాష్ పాలేకర్ సూచించిన ప్రకృతి వ్యవసాయం లాభదాయకమైనదన్నారు. తక్కువ పెట్టుబడులతో అధిక దిగుబడులు సాధించేందుకు ఈవిధానం దోహదపడుతుందన్నారు. రైతులు రసాయనిక ఎరువుల వాడకాన్ని తగ్గించి సేంద్రియ ఎరువుల వినియోగాన్ని అలవాటు చేసుకోవాలన్నారు. సేంద్రియ ఎరువుల వినియోగం వల్ల భూసారం పెరిగి అధిక దిగుడులు రావడంతోపాటు ఆహార పదార్ధాల ద్వారా రోగాలు వచ్చే అవకాశముండదన్నారు. గ్రామీణప్రాంతంలో విత్తనశుద్ధి కార్మాగారాన్ని ఏర్పాటుచేసిన నిర్వాహకులను ఈ సందర్భంగా కలెక్టర్ అభినందించారు. కార్యక్రమంలో మదర్ థెరిస్సా సంస్థ నిర్వాహకుడు సాగర్ జూలియన్, తహశీల్దార్ టి.రవి, వ్యవసాయశాఖ ఎడి సిద్ధిక్, ఎవో సన్నీరాజు, ఎఇవో పరుశరాములు, వీఆర్వో కృష్ణయ్య, మైనార్టీ నాయకుడు పసల శౌరయ్య తదితరులు పాల్గొన్నారు.
విద్యాశాఖ నిర్లక్ష్యం ... ఉపాధ్యాయులకు అవస్థలు
* డిఇవోతో ఉపాధ్యాయ సంఘాల నేతల వాగ్వివాదం
* కౌనె్సలింగ్ కేంద్రాన్ని సందర్శించిన ఎమ్మెల్సీ పూల రవీందర్
* రాత్రంతా కొనసాగిన కౌనె్సలింగ్
నల్లగొండ టౌన్, మే 12: విద్యాశాఖ నిర్లక్ష్యంతో ఉపాధ్యాయ బదిలీల కౌనె్సలింగ్ జాబితా, ఖాళీల వివరాలలో తప్పులు దొర్లడంతో ఉపాధ్యాయులు ఆదివారం మళ్లీ రెండవరోజు కౌనె్సలింగ్‌లో అవస్తలు పడాల్సివచ్చింది. ఉదయం 9గంటలకు ప్రారంభమైన కౌనె్సలింగ్‌లో స్కూల్ అసిస్టెంట్ భౌతిక శాస్త్రం విభాగంలో ఆర్‌ఎంఎస్‌ఎకు సంబంధించిన ఖాళీలను చేర్చలేదని వాటిని చేర్చిన అనంతరమే కౌనె్సలింగ్ నిర్వహించాలని ఉపాధ్యాయులు ఆందోళన చేశారు. పలుమార్లు ఉపాధ్యాయ సంఘాల నేతలు, ఉపాధ్యాయులు డిఇవోతో వాగ్వివాదానికి దిగారు. ఉపాధ్యాయ కౌనె్సలింగ్ కేంద్రం సందర్శించిన ఎమ్మెల్సీ పూల రవీందర్‌కు ఉపాధ్యాయులు విషయాన్ని తెలియజేయడంతో డిఇవోతో సంప్రదించి విషయాన్ని విద్యాశాఖ జెడికి తెలపాలని సూచించారు. దీంతో డిఇవో జగదీష్ విద్యాశాఖ జాయింట్ డైరెక్టర్‌కు సమాచారం అందించడంతో స్పందించిన జెడి నిబంధనల ప్రకారం 187మంది విద్యార్థులకంటే అధికంగా ఉన్న పాఠశాలల్లో ప్రస్తుత ఖాళీలకు చేర్చాలని సూచించారు. వివాదంగా సాగిన కౌనె్సలింగ్ తిరిగి మధ్యాహ్నం 2:30గంటలకు ప్రారంభమైంది. స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ జిల్లా పరిషత్ విభాగంలో అవివాహితగా పేరునమోదు చేసుకున్న తుంగతుర్తి మండలంలోని గుమ్మడవల్లి జెడ్పీ పాఠశాలలో పనిచేస్తున్న సాజిదాబీ బదిలీలకు దరఖాస్తుచేసే సమయంలో ఆమెకు వివాహం జరుగలేదు. కౌన్సిలింగ్ సమయానికి వివాహం జరగడంతో ఆమెను ప్రత్యేక కేటగిరి నుంచి తొలగిస్తూ కౌనె్సలింగ్‌కు అనుమతించలేదు. ఇలా జరిగిన కౌనె్సలింగ్ రాత్రి 7:30గంటలకు భౌతిక శాస్త్రం కౌనె్సలింగ్ ముగిసింది. 8గంటల ప్రాంతంలో స్కూల్ అసిస్టెంట్ జీవశాస్త్రం విభాగంలోని 349మంది ఉపాధ్యాయులకుగాను రాత్రి 8:30 గంటల వరకు క్రమ సంఖ్య 100వరకు వచ్చింది. జీవశాస్త్రంతోపాటు స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ 403 మంది ఉపాధ్యాయులు, పిఇటి 101మందికి షెడ్యూల్స్ ప్రకారం పూర్తి చేస్తామని డిఇవో వెల్లడించడంతో అర్థరాత్రి దాటే వరకు కౌనె్సలింగ్ కొనసాగింది. విద్యాశాఖ అధికారుల తీరు పట్ల పిఆర్‌టియు, టిపిఆర్‌టియు, తెలంగాణ ఉపాధ్యాయ సంఘం, ఎస్టీయు, డిటిఎఫ్, యుటిఎఫ్, ఎస్సీ, ఎస్టీ పలు ఉపాధ్యాయ సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశాయి. కౌనె్సలింగ్‌ను ఉదయం 10గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకే కొనసాగించాలని సూచించినప్పటికీ రాత్రి కొనసాగించడంతో చీకట్లో ఉపాధ్యాయులు అవస్తలు పడాల్సి వస్తుందని సోమవారం జరిగే కౌనె్సలింగ్ అయిన సవ్యంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు.
నేటి కౌనె్సలింగ్ యథాతథం: డిఇవో
నేడు జరగాల్సిన స్కూల్ అసిస్టెంట్ సాంఘికశాస్త్రం, తెలుగు, హిందీ, ఉర్దు, లాంగ్వేజి పండిట్ హిందీ, తెలుగు, ఉర్దు, ఎల్‌ఎఫ్‌ఎల్ ప్రధానోపాధ్యాయులు, డిఎం, సిఎన్ ఉపాధ్యాయుల కౌనె్సలింగ్‌ను షెడ్యూల్ ప్రకారం నిర్వహిస్తామని డిఇవో జగదీష్ వెల్లడించారు. ఆయా విభాగాలలోని ఉపాధ్యాయులంతా సోమవారం ఉదయం 9గంటలకు డైట్ కేంద్రంలో కౌనె్సలింగ్‌కు హాజరుకావాలని సూచించారు.