Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

అనధికార బార్లు గలగల

$
0
0

నెల్లూరు, మే 12: జిల్లా కేంద్రమైన నెల్లూరులో ఎక్సైజ్ అధికారుల అవినీతి పెచ్చుమీరిపోతోంది. అనధికార బార్లను తొలగించాలని సాక్షాత్తూ ముఖ్యమంత్రి ఆదేశాలను జిల్లాలో ఎక్సైజ్‌శాఖ అధికారులు బేఖాతరు చేస్తున్నారు. మద్యం దుకాణాల పేరిట అనధికార బార్లు నడుపుతూ శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్న వారిపై కఠినంగా వ్యవహరించాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేసినప్పటికీ అటువైపు కనె్నతైనా చూడకపోవడాన్ని బట్టి చూస్తే అవినీతి ఏ స్థాయిలో ఉందో అర్థం అవుతోంది.
నగరంలోని స్టోన్‌హౌస్‌పేట, శెట్టిగుంటరోడ్డు, సంతపేట, నవాబుపేట, మూలాపేట, రంగనాయకులపేట, హరనాధపురం, కొండాయపాళెంగేట్, బివినగర్, పడారుపల్లి, అయ్యప్పగుడి, జ్యోతినగర్, లేక్ వ్యూ కాలనీ తదితర ప్రాంతాలలో మద్యం దుకాణాలను మినీబార్లులా నడుపుతూ మద్యం విక్రయాలు అర్థరాత్రి వరకు కొనసాగిస్తున్నారు. విజయ మహాల్‌గేట్ సమీపంలోని బార్ల పక్కనే ఉన్న బిరియాని సెంటర్‌ల్లో మద్యం విక్రయాలు జరుగుతున్నాయి. కొండాయపాళెం సమీపంలోని వనంతోపుసెంటర్‌లో డివైడర్లు , రోడ్డు మీదే మద్యం సేవిస్తూ ప్రజలను అనేక ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ఈ విషయం ఈ ప్రాంత వాసులకు, అటుగా వెళ్లే వారికి కనిపిస్తున్నా ఎక్సైజ్ అధికారుల కళ్లకు కనిపించకపోవడం దారుణం. ఈ విషయమై బ్రాందిషాపు యజమానులను నిలదీస్తే తాము ఎక్సైజ్ అధికారులు, పోలీసులకు మామూళ్లు ఇస్తున్నామని పేర్కొంటున్నారు. నగరంలోని అనేక ప్రాంతాలలోని బ్రాందీషాపుల్లో దాదాపు ఇదే పరిస్థితి నెలకొన్నా పట్టించుకునే నాథుడే లేడు. కొన్ని ప్రాంతాలలో బ్రాందీషాపుల్లో వూటుగా మద్యం సేవించిన మందుబాబులు అటుగా వచ్చే మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడంతో స్థానికులు వారికి దేహశుద్ది చేశారు. నగరంలోనే ఇలా ఉంటే నగర శివారు ప్రాంతాల్లోని బ్రాందీషాపుల పరిస్థితి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఈ ప్రాంతాల్లోని బ్రాందీషాపుల పక్కనే రెండు, మూడు వసారాలు వేసి బహిరంగంగా మద్యం విక్రయిస్తున్నా అధికారులు పట్టించుకోవడంలేదు. బ్రాందీషాపులోనే వెనుక భాగాన ప్రత్యేక గదులు ఏర్పాటు చేసుకొని వాటిని బార్లుగా మార్చి విక్రయాలు విచ్చలవిడిగా చేస్తున్నా ఎక్సైజ్ అధికారులు కానీ, పోలీసులు కానీ పట్టించుకోవడం లేదు. అధికారుల ఉదాసీనత కొన్ని సందర్భాల్లో శాంతిభద్రతలకు విఘాతం కల్గిస్తోంది. నగరంలో ఆర్భాటంగా జీపులు వేసుకొని పర్యటించే ఎక్సైజ్, పోలీసులు తమ పర్యటనలను కేవలం మామూళ్ల వసూళ్లకే పరిమితం చేస్తుండటంతో ఫలితం కన్పించడం లేదు. శివారు ప్రాంతాలలోని డాబాల్లో 24 గంటలు మద్యం విక్రయాలు జరుగుతున్నాయి. ఈ విషయమై ఎక్సైజ్ అధికారులకు స్థానిక ప్రజలు పలుసార్లు విన్నవించినా స్పందించడం లేదు. డిజిపి దినేష్‌రెడ్డి పర్యటించే సమయంలో వరుసగా ఒకటి, రెండురోజులు డాబాల్లో దాడులు నిర్వహిస్తూ ఆపై మిన్నకుండడంతో వారి వ్యాపారాలు యధావిధిగా సాగుతున్నాయి. ఇకనైనా ఉన్నతాధికారులు స్పందించి అనధికార బార్లు, డాబాలపై తగు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

దుగరాజపట్నంపై ల్యాండ్‌మాఫియా పంజా
నెల్లూరు, మే 12: జిల్లాలో దుగరాజపట్నంపై ల్యాండ్‌మాఫియా విరుచుకుపడుతోంది. బంగాళాఖాతం తీరంలో వాకాడు మండలం దుగరాజపట్నం వద్ద ఓడరేవుఏర్పాటుకు కేంద్ర మంత్రి మండలి ఆమోద ముద్రవేసిందని మీడియాలో వార్తలొచ్చిన కొద్దిగంటల వ్యవధిలోనే భూముల ధరలకు రెక్కలొస్తున్నాయి. ఇప్పటికే రియల్ ఎస్టేట్ వ్యాపారులు పెద్దసంఖ్యలో దుగరాజపట్నం వద్దకు తరలివెళ్లారు. నెల్లూరు నగరం నుంచేగాక ఇతర ప్రాంతాల నుంచి కూడా పెద్దసంఖ్యలో రియల్ వ్యాపారులు వస్తుండటం విశేషం. స్థిరాస్తులు అమ్మేందుకు సిద్ధంగా ఉన్న వారెవరైనా కనిపిస్తే వెంటనే తమ బుట్టలో వేసుకునేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. వాకాడు ప్రాంతంలో తమకు తెలిసిన పరిచయస్తులు, స్నేహితులు, బంధువులెవరైనా ఉంటే వారి ద్వారా స్థిరాస్థుల వ్యాపారానికి సంబంధించే ఆరా తీసే క్రమం ఒక్కసారిగా అధికమైంది. వ్యక్తిగత అవసరాలు కొలిక్కి వస్తాయనే మాయమాటలతో తమ వైపునకు తిప్పుకుంటున్నారు. గతంలో కృష్ణపట్నం పోర్టు ఏర్పాటుకు ముందు భారీగా భూములు కొనుగోలు చేసి రెండుచేతులా ఆదాయం గడించిన రియల్ వ్యాపారులు తాజా పరిస్థితుల్లో ఉత్సాహంగా వ్యవహరిస్తున్నారు. ఇదిలాఉంటే ప్రకాశం జిల్లా రామాయపట్నం వద్ద ఓడరేవుఏర్పాటు కానుందని ముందుగా వచ్చిన వార్తలతో స్థిరాస్తి వర్తకులంతా అటుగా పెట్టుబడులు మళ్లించారు. రామాయపట్నంలో ఓడరేవుకాస్తా దుగరాజుపట్నంకు మళ్లింది. మారిన పరిస్థితులతో అక్కడ పెట్టుబడిదారులంతా ఇప్పుడు లబోదిబోమంటున్నారు. ఇదిలాఉంటే దుగరాజపట్నం వద్ద ఓడరేవుఏర్పాటు కానున్న నేపథ్యంతో చిరకాల ఆశ నెరవేరినట్లవుతోంది. ఈ క్రమంలో వాకాడు మండలం ఉన్న గూడూరు నియోజకవర్గంతో సహా జిల్లాకే మరో ఓడరేవుకిరీటం కానుండటం విశేషం. దుగరాజుపట్నం ఓడరేవును సాధించడంలో తిరుపతి ఎంపి చింతా మోహన్ ప్రత్యేక కృషి చేయడాన్ని సర్వత్రా ప్రశంసిస్తున్నారు. ప్రకాశం జిల్లాకు వెళ్లిపోయిందనుకున్న ఓడరేవుకాస్తా తన పార్లమెంటరీస్థానం పరిధిలో ఉన్న గూడూరుకు వచ్చేలా కృషి చేశారు. దీంతో నెల్లూరుజిల్లాలో ఇప్పటికే దేదీప్యమానంగా వెలుగొందుతున్న కృష్ణపట్నం సరసన దుగరాజపట్నం మరో కలికి తురాయిగా మారనుంది. వాస్తవంగా 1983లోనే అప్పటి మంత్రి, దివంగత నల్లపరెడ్డి శ్రీనివాసులురెడ్డి మినీ హార్బర్‌ను ఏర్పాటు చేసేందుకు తనవంతుగా ప్రయత్నించారు. ఎంతో ప్రాశస్త్యం కల దుగరాజపట్నం ఆలస్యమైనా ఏకంగా ప్రభుత్వరంగం తరఫునే ఓడరేవుఏర్పాటుకు పరిస్థితులు అనుకూలించడం ఎంతైనా విశేషమే.

దాతల సాయం కోసం నిరీక్షణ
ఆత్మకూరు, మే 12: పెళ్లై పిల్లాపాపలతో అత్తింట మెలగాల్సిన ఓ యువతి ప్రాణాంతక వ్యాధితో భర్త నిరాదరణకు గురైంది. తన బిడ్డ కోసం బతకాలని పరితపిస్తోంది. ఆర్థిక సహాయం కోసం అందరినీ చేతులెత్తి వేడుకుంటోంది. ఆత్మకూరు మండలం వాశిలి గ్రామానికి చెందిన కర్నం విమల అనే వివాహిత గతంలో ఎంఎస్‌సి ఎంఇడిలో జిల్లా ఫస్ట్‌గా నిలవడం విశేషం. అయితే ఆమె ప్రస్తుతం నాలుగు నెలల బిడ్డకు తల్లికాగా, మరో వైపున కాలేయ వ్యాధితో సతమతమవుతోంది. ఈ వ్యాధికి చికిత్స కావాలంటే అక్షరాల పాతిక లక్షల వరకు ఖర్చవుతుందని చైన్నై విజయా ఆసుపత్రి వైద్యబృందం తేల్చి చెప్పారు. ఇప్పటికే ఏడు లక్షల రూపాయల వరకు ఖర్చు చేయడంతో ఆ రైతు కుటుంబపుఆర్థిక పరిస్థితి అస్తవ్యస్తంగా మారింది. మరోవైపున అత్తింటి నిరాదరణతో ఆమె మానసికంగా కృంగిపోయింది. అనారోగ్యం, మానసికంగా క్రుంగిపోతుండగా నాలుగు నెలలబిడ్డను చూసి ఆమెకు బతుకుపై ఆరాటం పెరుగుతోంది. ఈక్రమంలో చికిత్సకోసం తమవంతు సాయం అందించండి అంటూ అందరినీ వేడుకుంటున్నారు. ఈ వ్యాధి నయమయ్యేలా తోడబుట్టిన సోదరుడు తన కాలేయ భాగాన్ని అందజేసేందుకు ముందుకొచ్చాడు. దాతలు స్పందించి తన ప్రాణాలు కాపాడేందుకు విరాళం అందించాలని విమల కోరారు.

16 నుండి రాష్టస్థ్రాయి సాంఘిక నాటిక పోటీలు
గూడూరు, మే 12: గూడూరులో ఈనెల 16వ తేదీ నుండి 19 వరకు నాలుగు రోజుల పాటు సంస్కృతీ సమ్మేళనం ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి సాంఘిక నాటికల పోటీలు నిర్వహించనున్నట్లు సంస్థ అధ్యక్ష, కార్యదర్శులు సిద్దారెడ్డి జనార్ధన్‌రెడ్డి, కె మునిగిరీష్ తెలిపారు. ఆదివారం సంస్థ అధ్యక్షుని నివాసంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో వారు మాట్లాడుతూ ఈ సంవత్సరం కూడా భారీ ఎత్తున వ్యయ ప్రయాసల కోర్చి ఈ నాటికలను రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి ఎంపిక చేసినట్లు తెలిపారు. స్థానిక గంగపట్నం లక్ష్మీనారాయణమ్మ ఓపన్ ఆడిటోరియం (డిఎన్నార్ కమ్యూనిటీ హాలు)లో ఈ పోటీలు ప్రతిరోజు సాయంత్రం 6.30 గంటల నుండి ప్రారంభమవుతాయన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో వారు మాట్లాడుతూ 59 వసంతాలు పూర్తి చేసుకొని 60వ వసంతంలోకి అడుగు పెడుతున్న స్థానిక సంస్కృతీ సమ్మేళనం కళాసంస్థకు సుదీర్ఘ చరిత్ర ఉందని, అర్ధ శతాబ్దంకు పైగా రాష్ట్ర స్థాయిలో నాటిక పోటీలు నిర్వహిస్తున్న కళాసంస్థ దేశంలో ఇది ఒక్కటే అనడంలో అతిశయోక్తి లేదన్నారు. 1954లో ప్రారంభించిన ఈ సంస్థ ప్రతి ఏటా రాష్ట్ర స్థాయిలో ఉత్తమ సందేశమున్న నాటికలను ఎంపికచేసి ప్రోత్సాహకాలను అందిస్తున్నదన్నారు. ఈ సంస్థకు నిధుల కొరత ఉన్నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాంస్కృతిక శాఖ ఆర్థిక సహాయంతో ఈ పరిషత్‌ను నిరాటంకంగా కొనసాగిస్తున్నట్టు వారు తెలిపారు. తొలిరోజు 16వ తేదీన ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర ఆర్ధిక మంత్రి ఆనం రామనారాయణరెడ్డి చేతుల మీదుగా ప్రారంభిస్తున్నట్లు, ముఖ్య అతిధులుగా ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డి, ముంగమూరు శ్రీ్ధరకృష్ణారెడ్డి, పనబాక కృష్ణయ్య, రాళ్లబండి కవితా ప్రసాద్, గీతాసింగ్, సబ్ కలెక్టర్ జె నివాస్, డిఎస్పీ కె చౌడేశ్వరీ, సంస్థ అధ్యక్షులు సిద్ధారెడ్డి జనార్ధన్‌రెడ్డి హాజరవుతారన్నారు.

నాటికల వివరాలు
16న మహాసాద్వి శకుంతల, పొడుస్తున్న పొద్దు, 17న మా అమ్మకు బొట్టు పెట్టండి, శ్రేయోజీవనం, మా వూళ్లోగోదారుంది, 18న దిక్సూచి, నల్లకోడి తెల్లగుడ్డు, పుష్కరిణి, 19న ఒక్కమాటే చాలు, జయ జయ జయహే అనే నాటికలు ప్రదర్శించబడతాయన్నారు. ముగింపు కార్యక్రమంలో కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి, తనికెళ్ల భరణి పాల్గొంటారన్నారు. ఈ సమావేశంలో సోమిశెట్టి చెంచురామయ్య, యరగుడిపాటి చలపతిరావు, జిజి నాయుడు, కట్టా మురళీకృష్ణ, శ్రీనివాసులు, జానా శివయ్య, సి అనిల్‌కుమార్ పాల్గొన్నారు.

సెల్‌ఫోను దుకాణంలో చోరీ
నెల్లూరు, మే 12: ఒక సెల్‌ఫోను దుకాణానికి సంబంధించి పైరేకులను తొలగించి లోనికి ప్రవేశించిన గుర్తు తెలియని దొంగలు 40 వేల విలువ చేసే వస్తువులను అపహరించుకువెళ్ళిన సంఘటన ఆదివారం తెల్లవారుజామున స్థానిక బిఎస్‌ఎన్‌ఎల్ కార్యాలయం సమీపంలో చోటుచేసుకుంది. నగరంలోని జెండా వీథికి చెందిన పఠాన్ అప్రోజ్‌ఖాన్ అనే వ్యక్తి బిఎస్‌ఎన్‌ఎల్ కార్యాలయం సమీపంలో సెల్‌ఫోన్ దుకాణం నిర్వహిస్తున్నాడు. రోజులాగానే శనివారం రాత్రి దుకాణాన్ని మూసివేసి ఇంటికి వెళ్ళాడు. ఆదివారం తెల్లవారుజామున గుర్తు తెలియని దొంగలు దుకాణం పైభాగంలోని సిమెంట్‌రేకులను తొలగించి లోపల ఉన్న 40 వేల రూపాయల విలువ చేసే ఆరు సెల్‌ఫోన్లు, నాలుగు బ్లూటూత్‌లు, 20 మెమరీకార్డులు దోచుకుపోయారు. ఉదయం దుకాణం తెరచిన యజమాని పైరేకులు తొలగించి ఉండటాన్ని గమనించి, సెల్‌ఫోన్లు, ఇతర వస్తువులను చూసుకోగా, అవి కనిపించకపోవటంతో దొంగతనం జరిగిందని నిర్ధారించుకొని 4వ నగర పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసాడు. సిఐ రామారావు, ఎస్‌ఐ మాలకొండయ్య సంఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ మాలకొండయ్య తెలిపారు.

74కార్యకర్తలకు అండగా ఉంటా: కొమ్మి
సైదాపురం, మే 12: ప్రతి కార్యకర్తకూ అండగా ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని వెంకటగిరి నియోజకవర్గ వైఎస్‌ఆర్‌పిసి సమన్వయ కర్త కొమ్మి లక్ష్మయ్యనాయుడు అన్నారు. నియోజకవర్గ సమన్వయ కర్తగా ఎంపికైన తర్వాత తొలిసారి మండల కేంద్రమైన సైదాపురంలో ఆదివారం రాత్రి ప్రజాదీవెన పేరిట కార్యకర్తలతో ముఖాముఖి సమావేశం ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీలో తన అనుభవాలు పార్టీని వీడిన పరిస్థితులను ఆయన కార్యకర్తలుకు వివరించారు. జగన్‌ను ముఖ్యమంత్రి చేయడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు.జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ కాకాణి గోవర్దన్‌రెడ్డి మాట్లాడుతూ పార్టీలో ఎలాంటి విభేదాలు లేవన్నారు. తామంతా కలిసికట్టుగా ఉన్నామన్నారు. ప్రజాసమస్యలు పరిష్కారంలో కొమ్మిలక్ష్మయ్యనాయుడు తనకన్నా సమర్ధుడని కాకాణి అన్నారు. ఈ సమావేశంలో ఎల్లసిరి గోపాలరెడ్డి, నెల్లూరు రూరల్ సమన్వయకర్త కోటంరెడ్డిశ్రీధర్డ్డ్రి, అనిల్‌కుమార్ యాదవ్, వరప్రసాద్, స్థానిక నాయకులు కృష్ణారెడ్డి, ప్రభాకర్ రెడ్డి, కరణం శ్రీనివాసులు నాయుడు, జి రాఘవరెడ్డి పాల్గొన్నారు.

గండ్లవీడులో వడదెబ్బకు ఇద్దరు మృతి
ఆత్మకూరు రూరల్/బుచ్చి, మే 12: మండలంలోని గండ్లవీడు గ్రామంలో ఆదివారం మధ్యాహ్నం వడదెబ్బకు సంకె మాలకొండయ్య (80) మృతిచెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన సంకె మాలకొండయ్య ఎండ తీవ్రతకు అనారోగ్యంపాలై చికిత్స పొందుతూ మృతిచెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ విషయమై పంచాయతీ సెక్రటరీ రెవెన్యూ అధికారులకు సమాచారం ఇచ్చారు. కాగా వడదెబ్బకు మరో వృద్ధుడు మృతి చెందిన సంఘటన బుచ్చిరెడ్డిపాళెం మండలంలో చోటుచేసుకుంది. పంచేడు గ్రామానికి చెందిన బత్తల పోలయ్య (65) పొలం పనులకు వెళ్లి వడదెబ్బకు గురై మృతిచెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

పెన్షన్ కోసం వెళ్ళిన భర్త తిరిగిరాలేదని ఫిర్యాదు
ఇందుకూరుపేట, మే 12: తన భర్త పెన్షన్ కోసం వెళ్లి తిరిగి రాలేదని ఒక మహిళ స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఆదివారం ఫిర్యాదు చేసింది. ఎస్‌ఐ కృష్ణానందం తెలిపిన వివరాల మేరకు మండల పరిధిలోని జగదేవిపేట గ్రామానికి చెందిన జానా రమణయ్య నెల్లూరు సెంట్రల్ జైలులో హెడ్‌వార్డర్‌గా పనిచేస్తుండేవాడు. ఆయనకు పక్షవాతం రావటంతో 1993 జనవరిలో వాలంటరీ రిటైర్‌మెంట్ తీసుకున్నాడు. అదే ఏడాది నవంబర్‌లో జగదేవిపేట నుండి నెల్లూరుకు పెన్షన్ కోసం వెళ్లి ఇంటికి తిరిగి రాలేదని చెప్పింది. కాగా ఆయన భార్య నాగమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ పేర్కొన్నారు.

బాట ఆక్రమణ
ఎద్దుల బండ్లుపోయేందుకు దారేది ?
కాలువల్లో ముందుకు సాగని నీటి ప్రవాహం
అనంతసాగరం, మే 12: మండల కేంద్రమైన అనంతసాగరం రెవెన్యూ పరిధిలో బండ్లబాటలు, సాగునీటి కాలువలు ఆక్రమణల చెరలోకి చేరుకుంటున్నాయి. అనంతసాగరం పంచాయతీలో మొత్తం 909 ఎకరాల వరకు నల్లరేగడి బీడు భూములున్నట్లు రెవెన్యూ రికార్డుల ద్వారా అందుతున్న అధికారిక సమాచారం. అందులో 606 ఎకరాలు రైతుల పట్ట్భాములు, 303 ఎకరాల వరకు ఎస్సీ, ఎస్టీలకు చెందిన డిఫారమ్ పట్టా భూములు ఉన్నట్లు వివరాలు అందుబాటులోకి వస్తున్నాయి. అయితే ఈ పంట భూముల్లోకి వెళ్లేందుకు అనంతసాగరం-కేతిగుంట బండ్లబాట, సంజీవనగర్- ఇనగలూరు బండ్లబాట, చుట్టుగుంటపల్లి- లింగంగుంట బండ్లబాట, వెంగంపల్లి- అనంతసాగరం బండ్లబాటలు కూడా కాలక్రమంలో రైతులకు అనాదిగా అక్కరకొస్తున్నాయి. అయితే ఈ బండ్లబాటలు తాజాగా ఆక్రమణలకు గురి అవుతుండటంతో రైతులు పొలాల్లోకి వెళ్లాలంటేనే కష్టపడాల్సి వస్తోంది. ఎస్సీ, ఎస్టీలకు ఇచ్చిన డిఫారమ్ భూములు అనంతసాగరం- గౌరవరం వరకు గంగుంటరోడ్డు వెంబడి, గంగుంట రోడ్డుకు ఇరువైపులా ఉన్నాయి. అయితే 99 సంవత్సరాల లీజుకు సంబంధించిన ఎస్సీ, ఎస్టీల డి ఫారమ్ పట్టాలు కాస్తా ప్రస్తుతం అనర్హులైన ధనవంతుల చేతుల్లో ఉంటున్నాయి. విఆర్‌ఓలు, రెవెన్యూ అధికార్ల చేతివాటం కారణంగా గుంతలు, వంకపోరంబోకు భూములతోపాటు కడకు బండ్లబాటలు కూడా ఆక్రమణలకు గురవుతుండటం బాధాకరమైన పరిణామం. దీంతో పొలాల్లోకి వెళ్లేందుకు వీలులేని పరిస్థితులు ఏర్పడుతూ సాగుభూములు కాస్తా బీళ్లుగా మారుతున్నాయి. ఈపొలాల పరిధిలో ఆయకట్టు నీటిని అందజేసేందుకు సోమశిల ఉత్తర కాలువ 1ఆర్‌ఏ, 1ఆర్ చీలికాలువలు కూడా కాలక్రమంలో ఏర్పడుతుండటం విశేషం. అయితే కొన్ని చోట్ల 1ఆర్‌ఏ కాలువ కూడా ఆక్రమణకు గురైంది. జిల్లా ఉన్నతాధికార్ల దృష్టికి ఈ అంశాల్ని తీసుకెళ్లినా సమస్యలు పరిష్కారానికి నోచుకోకపోవడంతో దిక్కుతోచని స్థితిలో సాగరం రైతులు కనిపిస్తున్నారు.

అమ్మకు మించిన దైవం లేదు
నెల్లూరు అర్బన్, మే 12: అమ్మకు మించిన దైవం లేదని నెల్లూరు ఎసి సుబ్బారెడ్డి స్టేడియం మహిళా వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షురాలు వి రాధమ్మ అన్నారు. మదర్స్ డే సందర్భంగా సుబ్బారెడ్డి స్టేడియంలోని స్విమింగ్‌పూల్ కాంపౌండ్‌లో ఆదివారం ఉదయం జరిగిన సభలో ఆమె మాట్లాడుతూ పిల్లలకు చిన్న బాధ కలిగినా తల్లడిల్లిపోయే మనస్సు అమ్మదన్నారు. ఈసందర్భంగా రచయిత గుండాల రమణయ్య అమ్మపై రాసిన కవితను చదివి వినిపించారు. ఈసభలో సంస్థ కోశాధికారి వసుంధర, కె సుశీల , ఉపాధ్యక్షురాలు వి ప్రమీల,ఎన్ సుశీలదేవి తదితరులు పాల్గొన్నారు.

కోడి కత్తి గుచ్చుకొని ఒకరికి తీవ్రగాయాలు
వెంకటాచలం, మే 12: కోడి పందేన్ని తిలకిస్తున్న వ్యక్తికి కోడిపుంజుకు కట్టిన కత్తి తగిలి తీవ్రంగా గాయపడిన సంఘటన మండలంలోని కాకుటూరు గ్రామంలో ఆదివారం జరిగింది. కాకుటూరు గ్రామ శివారు ప్రాంతంలో అనధికారికంగా జరుగుతున్న కోడి పందేలను తిలకించేందుకు వెంకటాచలం గ్రామానికి చెందిన చెల్లయ్య వెళ్లాడు. ఆ సమయంలో పందేలు ఆడుతున్న కోడి ఒక్కసారిగా పైకి ఎగరటంతో కోడికి కట్టిన కత్తి చెల్లయ్య పొట్టపై గుచ్చుకుంది. దీంతో చెల్లయ్యకు తీవ్రరక్తస్రావం జరిగి అపస్మారకస్థితిలోకి వెళ్లాడు. స్థానికులు వెంటనే 108కు సహకారంతో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ సంఘటనపై స్థానిక పోలీసులకు సమాచారం అందలేదు. మజ్జిగ చలివేంద్రం ప్రారంభం
నెల్లూరుసిటీ, మే 12: నగరంలోని పాత ప్రభుత్వ పెద్ద ఆసుపత్రి ప్రాంత పరిధిలో గల శ్రీ ప్రసన్న ఆంజనేయ దేవస్థానం వద్ద యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మజ్జిగ చలివేంద్రాన్ని యూత్ కాంగ్రెస్ నాయకుడు ఆనం రంగమయూర్‌రెడ్డి ఆదివారం ప్రారంభించారు. ఈసందర్భంగా జిల్లా యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు యశ్వంత్ సింగ్ మాట్లాడుతూ వేసవి తాపానికి ప్రజలకు చలివేంద్రం ఎంతో ఉపయోగపడుతుందన్నారు. గతంలో ఎన్నడు లేని విధంగా నెల్లూరు జిల్లాలో ఉష్ణోగ్రత ప్రభావం రోజురోజుకు పెరుతోందన్నారు.
ఇటువంటి సమయంలో యూత్‌కాంగ్రెస్ కార్యకర్తలు చల్లటి మజ్జిగ చలివేంద్రం ఏర్పాటు చేయడం ముదావహమన్నారు.ఈ కార్యక్రమంలో నగర ఎమ్మెల్యే ముంగమూరు శ్రీ్ధర్‌కృష్ణారెడ్డి కుమారుడు ముంగమూరు చైతన్యరెడ్డి, దిలీప్, యూత్ కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

ముగిసిన వైద్య విధాన పరిషత్ ఉద్యోగుల బదిలీలు
నెల్లూరుసిటీ, మే 12: జిల్లా వైద్య విధాన పరిషత్ ఉద్యోగుల బదిలీలు ఆదివారం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్వహించారు. ఈ కౌనె్సలింగ్‌కు ల్యాబ్ టెక్నిషియన్స్, ఫార్మసిస్టులు, అటెండర్స్, ఎల్‌డిసి, యుడిసి, డాక్టర్లకు కౌనె్సలింగ్ నిర్వహించారు. ఐదేళ్ల పాటు ఒకే ప్రదేశంలో పనిచేస్తున్న వారిని మాత్రమే బదిలీలు చేశారు. ప్రభుత్వం జిఓ ప్రకారం 100మందిలో 20శాతం మంది మాత్రమే బదిలీలకు అర్హులు అయ్యారు. దీంతో బదిలీలుకు ఎక్కువ మంది దరఖాస్తులు చేసుకోలేదు. ఈ కార్యక్రమంలో డిసిహెచ్ డాక్టర్ నిర్మలమ్మ, ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.

కన్యకా ఆలయ కమిటీ ఏర్పాటుపై వివాదం
ఆంధ్రభూమి బ్యూరో
నెల్లూరు, మే 12: నగరంలోని స్టోన్‌హౌస్‌పేటలో కొలువుదీరిన కన్యకాపరమేశ్వరి ఆలయ నూతన పాలకవర్గ ఏర్పాటుపై వివాదం నెలకొంది. ఆలయం వద్ద ఆదివారం పాత పాలకవర్గం విలేఖర్ల సమావేశం ఏర్పాటు చేయబోయారు. అయితే విషయం తెలుసుకున్న నూతన కమిటీ ప్రతినిధులు ఆలయం వద్దకు వచ్చి గొడవకు దిగారు. ఆలయానికి సంబంధించి కోట్లాది రూపాయల స్థిర, చరాస్తులు ఉండటం వలనే సేవానిరతి లోపించి స్వార్ధపూరిత లక్షణాలతో వివాదాలకు పాల్పడుతున్నారు. అర్బన్ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో నూతన పాలకవర్గం ఏర్పడటం విదితమే.

కండలేరు జలాలు తరలిస్తే సహించేది లేదు
రైతులకు మలిరెడ్డి సేవలు మరువలేనివి
* వైఎస్‌ఆర్ కాంగ్రెస్ సేవాదళ్ రాష్ట్ర కన్వీనర్ వినయకుమార్‌రెడ్డి
నెల్లూరు, మే 12: కండలేరు (తెలుగుగంగ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్)జలాశయం నుంచి చెన్నైకు నీటిని తరలిస్తే సహించేది లేదని వైఎస్‌ఆర్‌సిపి రాష్ట్ర సేవాదళ్ అధ్యక్షుడు కోటంరెడ్డి వినయ్‌రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం ఆయన నెల్లూరు నగరంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కావలి డివిజన్‌లోని సమస్యలపై అవిరళంగా పోరాడుతున్న రైతు సంఘం అధ్యక్షులు మలిరెడ్డి రవీంద్రనాథరెడ్డి, కార్యదర్శి డాక్టర్ వంటేరు నాగేంద్రకుమార్‌తో సుధీర్గంగా చర్చించారు. తమ పార్టీకి అనుబంధంగా వ్యవహరించే రైతు సంఘం చేసిన కృషి వలనే నెల్లూరు జిల్లాలో ఈదఫా ఇరవై వేల ఎకరాల వరకు సాగుబడి అధికంగా వచ్చిందన్నారు. అందువల్ల వంద కోట్ల రూపాయల వరకు అదనపు ఆదాయం లభించిందన్నారు. ఇదిలాఉంటే నెల్లూరు జిల్లాలోని దగదర్తి మండలంలో ఆరవ విడత భూ పంపిణీలో మూడు వేల ఎకరాల వరకు అర్హులకు పంచాలంటూ న్యాయపోరాటం చేసిన వైనం కూడా ఎంతో ముదాహమన్నారు. మలిరెడ్డి రవీంద్రనాధరెడ్డి మాట్లాడుతూ కావలి కాలువను ఐదువందల క్యూసెక్కుల సామర్ధ్యం నుంచి 13వందల క్యూసెక్కులకు పెంచే దిశగా పోరాటం ప్రారంభించామన్నారు. జిల్లాలోని 1152 చిన్నా, పెద్దా చెరువులను కబ్జాకోరలకు గురై ఉన్నందున జువ్వలదినె్న, కనిగిరి రిజర్వాయర్‌ల్ని వాటి నుంచి విముక్తికలిగేలా ప్రయత్నిస్తున్నామన్నారు. కార్యక్రమంలో ఇంకా చంద్రశేఖరరెడ్డి, లీలాకృష్ణ, శంకరరెడ్డి, పెంచలరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

* చోద్యం చూస్తున్న ఎక్సైజ్‌శాఖ * సిఎం, ఉన్నతాధికారుల ఆదేశాలు బేఖాతర్
english title: 
bars

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>