Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

నేడు సిఎం జిల్లా పర్యటన

$
0
0

నిజామాబాద్, మే 12: పలు దఫాలుగా వాయిదాపడుతూ ఎట్టకేలకు సిఎం జిల్లా పర్యటన ఖరారైన నేపథ్యంలో విస్తృత ఏర్పాట్లు చేశారు. ఓ వైపు అధికార యంత్రాంగం, మరోవైపు కాంగ్రెస్ పార్టీ నేతలు తుదిదశ ఏర్పాట్లను చక్కబెట్టడంలో నిమగ్నమయ్యారు. బోధన్ పట్టణంలో సోమవారం జిల్లా స్థాయిలో నిర్వహిస్తున్న రైతు సదస్సులో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి హాజరవుతున్నారు. ఈ సందర్భంగా సిఎం చేతుల మీదుగా సుమారు 160 కోట్ల రూపాయల విలువ చేసే పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయించేందుకు వీలుగా ఏర్పాట్లు చేపట్టారు. ఉదయం పది గంటలకు హైదరాబాద్ నుండి హెలికాఫ్టర్‌లో బయలుదేరనున్న ముఖ్యమంత్రి 11 గంటలకు బోధన్‌కు చేరుకోనున్నారు. ఇందుకోసం ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో హెలిప్యాడ్‌ను ఏర్పాటు చేశారు. అక్కడి నుండి రోడ్డు మార్గంలో విజయ్ మేరీ హైస్కూల్ మైదానానికి చేరుకుని రైతు సదస్సులో పాల్గొంటారని అధికార వర్గాలు తెలిపారు. మధ్యాహ్నం 1.45 గంటలకు సదస్సు ముగిసిన అనంతరం కొద్దిసేపు స్థానికంగా గల ఐబి గెస్ట్‌హౌస్‌లో విశ్రాంతి తీసుకుని 2.30 గంటలకు హైదరాబాద్‌కు తిరుగుపయనం కానున్నారు. ఈ సదస్సులో సిఎంతో పాటు మంత్రులు కన్నా లక్ష్మినారాయణ, డి.శ్రీ్ధర్‌బాబు, సునీతా లక్ష్మారెడ్డి హాజరవుతున్నారని జిల్లాకు చెందిన మంత్రి సుదర్శన్‌రెడ్డి తెలిపారు. సిఎం పర్యటనను ప్రతిష్టాత్మకంగా తీసుకుని భారీ సంఖ్యలో రైతులు, ప్రజలను సమీకరించేందుకు కాంగ్రెస్ నేతలు కసరత్తులు చేశారు. జిల్లా స్థాయి సదస్సు కావడంతో అన్ని నియోజకవర్గాల నుండి రైతులను తరలించేందుకు వీలుగా వాహనాలను సమకూర్చారు. ప్రధానంగా జుక్కల్, బాన్సువాడ, బోధన్, నిజామాబాద్ నియోజకవర్గాలపై జన సమీకరణకు దృష్టిని కేంద్రీకరించారు. కనీసం 10 వేల మంది రైతులకు తగ్గకుండా చూడాలని ఆదర్శ రైతులకు బాధ్యతలు కట్టబెట్టగా, మరో ఐదు వేల మంది పైచిలుకు డ్వాక్రా మహిళలను సిఎం పాల్గొనే సదస్సుకు తరలించేలా ఏర్పాట్లు చేపట్టారు. మంత్రి సుదర్శన్‌రెడ్డితో పాటు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు గడుగు గంగాధర్, జడ్పీ మాజీ వైస్‌చైర్మన్ తాహెర్‌బిన్ హందాన్ ఇతర ముఖ్య నేతలంతా జన సమీకరణ ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షించారు. మరోవైపు జిల్లా యంత్రాంగం సైతం ఎలాంటి లోటుపాట్లకు తావులేకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. సిఎం పాల్గొంటున్న సదస్సు కావడం వల్ల సాధ్యమైనన్ని ఎక్కువ సంఖ్యలో ఆధునిక వ్యవసాయ పరికరాల స్టాళ్లను నెలకొల్పుతున్నారు. సిఎం పర్యటన అధికారికంగా ఖరారైన వెంటనే కలెక్టర్ క్రిస్టీనా జడ్.చోంగ్తూ పలుమార్లు స్వయంగా బోధన్‌లోని సభాస్థలిని సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు.
భారీగా పోలీసుల మోహరింపు
కాగా, ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా భారీ పోలీసు బందోబస్తును ఏర్పాటు చేస్తున్నారు. పలు సమస్యలపై ప్రతిపక్షాలు, రైతు సంఘాల ప్రతినిధులు ఆందోళనలకు దిగి నిరసనలు చాటే అవకాశాలు ఉన్నాయనే సమాచారం మేరకు భారీ ఎత్తున పోలీసు బలగాలను మోహరిస్తున్నారు. స్థానిక సిబ్బందితో పాటు మెదక్, మహబూబ్‌నగర్ జిల్లాల నుండి అదనంగా మరికొంత మంది సిబ్బందిని బందోబస్తు నిమిత్తం రప్పించారు. ఇద్దరు ఎఎస్పీలు, ఏడుగురు డిఎస్పీలు, 33 మంది సిఐలు, 79 మంది ఎస్‌ఐలు, 190 మంది ఎఎస్‌ఐలు, సుమారు 700 మంది కానిస్టేబుళ్లతో అడుగడుగునా పోలీసు పహారాను ఏర్పాటు చేస్తున్నారు. ప్రధానంగా పంట నష్టపరిహారం విషయమై రైతు సంఘాల నుండి నిరసనలు వ్యక్తమవడంతో పాటు, శాసనసభా సంఘం సిఫార్సుల మేరకు నిజాం సుగర్ ఫ్యాక్టరీని ప్రభుత్వం తిరిగి స్వాధీనం చేసుకోవాలనే డిమాండ్‌తో పలువురు నిరసనలకు దిగే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు. అంతేకాకుండా తెలంగాణవాదుల నుండి సైతం నిరసనలు ఎదురవుతాయని అంచనా వేస్తున్న పోలీసు అధికారులు సిఎం పాల్గొనే సదస్సుకు విస్తృత స్థాయిలో భద్రతా చర్యలు చేపడుతున్నారు.

ముస్తాబైన బోధన్
బోధన్, మే 13: ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి రాక కోసం బోధన్ పట్టణం సర్వం సిద్దమయ్యింది. పట్టణంలోని రోడ్లన్నీ కళకళ లాడుతున్నాయి. ప్రధాన కూడళ్లు కాంగ్రెస్ జెండాలతో కళకళ లాడుతున్నాయి. ముఖ్యమంత్రి పాల్గొనే రైతు చైతన్య సదస్సుకు సంబంధించిన సభావేదిక ముస్తాబైంది. ముఖ్యమంత్రితో పాటు జిల్లా ఇన్‌చార్జి మంత్రి ముఖేష్‌గౌడ్, సునీత లక్ష్మారెడ్డి, కన్నాలక్ష్మినారాయణ, సుదర్శన్‌రెడ్డి ఇతరప్రజాప్రతినిధులు పాల్గొనే సభా ప్రాంగణం విశాలంగా ఉండేలా ఏర్పాట్లు పూర్తి చేశారు. అంబేద్కర్ చౌరస్తా చుట్టూ కాంగ్రెస్ జెండాలు రెపరెపలాడుతున్నాయి. సభావేదిక వద్ద, కొత్తబస్టాండ్ సమీపంలో రెండు భారీ బెలూన్‌లను గాలిలోకి వదిలారు. ముఖ్యమంత్రి హెలిప్యాడ్ నుండి సభావేదిక వద్దకు వెళ్లే రహదారిలో పార్టీ అధినేత్రి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, జిల్లా మంత్రి సుదర్శన్‌రెడ్డిల భారీ కటౌట్‌లు వెలిశాయి. గ్రామాల నుండి భారీ సంఖ్యలో జన సమీకరణ చేసేందుకు కాంగ్రెస్ నాయకులు సర్వశక్తులొడ్డుతున్నారు. ముఖ్యమంత్రి సభకు వంద ప్రైవేటు బస్సులు, 30 ఆర్టీసి సర్వీసులు ద్వారా వివిధ మండలాల నుండి రైతులు, డ్వాక్రా మహిళలు హాజరు కానున్నారు. ఈ రైతు సదస్సుకు జిల్లాకు సంబంధించిన అధికార యంత్రాంగమంతా ఇక్కడే మకాం వేసింది. అలాగే బోధన్ డివిజన్‌కు సంబంధించిన తహశీల్దార్‌లు, ఎంపిడివోలు, వీఆర్వోలు, రెవెన్యూ సిబ్బంది అంతా ఇక్కడే విధులు నిర్వహిస్తున్నారు.
రైతు చైతన్య సదస్సు ఏర్పాట్లు పరిశీలించిన మంత్రి
బోధన్ రూరల్: బోధన్ పట్టణంలోని బైపాస్ రోడ్డు సమీపంలో విశాలమైన స్థలంలో సోమవారం జరుగనున్న రైతు చైతన్య సదస్సుకు సంబంధించిన ఏర్పాట్లు ఆదివారం సాయంత్రం వరకు పూర్తయ్యాయి. వేదికను అందంగా తీర్చిదిద్ది వేదిక చుట్టూ రైతులు కూర్చునేలా గ్యాలరీని ఏర్పాటు చేశారు. ఉదయం నుండి జిల్లా కలెక్టర్ క్రిస్టీనా జడ్ చోంగ్తూ సభా ప్రాంగణం వద్ద ఉండి పనులు పర్యవేక్షించారు. జిల్లా సంయుక్త కలెక్టర్ హర్షవర్ధన్, బోధన్ ఆర్డీవో మోహన్‌రెడ్డి, డ్వామా పిడి శివలింగయ్యతో మాట్లాడుతూ ఇక్కడి ఏర్పాట్లు, చైతన్య సదస్సు నిర్వహించే తీరుతెన్నుల గురించి అడిగి తెలుసుకున్నారు. కాగా మధ్యాహ్నం మూడు గంటలకు భారీ నీటిపారుదల శాఖా మంత్రి సుదర్శన్‌రెడ్డి ఇక్కడికి చేరుకుని సభావేదికను పరిశీలించారు. ముఖ్యమంత్రి కోసం చేసిన ఏర్పాట్లు చూసి ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు.
పోలీసుల వలయంలో బోధన్
బోధన్ పట్టణంలో సోమవారం జరుగనున్న రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్‌రెడ్డి పర్యటనకు పోలీసులు ఊహించని రీతిలో బందోబస్తు చర్యలు చేపట్టారు. అడుగడుగునా పోలీసు సిబ్బంది బందోబస్తు విధులు నిర్వహించేలా స్థానిక అధికారులు ముందుగానే ప్రణాళికలు రూపొందించారు. మొత్తం వేయి మంది పోలీసులు పట్టణాన్ని తమ ఆధీనంలోనికి తీసుకున్నారు. ఇక్కడి బందోబస్తును మొత్తం పనె్నండు సెక్టార్‌లుగా విభజించిన అధికారులు వివిధ రకాల బృందాలను రంగంలోకి దించారు. రైతు చైతన్య యాత్రలో పాల్గొనేందుకు ఇక్కడికి రానున్న ముఖ్యమంత్రి ఉదయం పదిన్నర గంటల నుండి మధ్యాహ్నం మూడు గంటల వరకు ఇక్కడ గడపనున్నారు. ఇందుకోసం జిల్లా ఎస్పీ గత నాలుగు రోజులుగా బందోబస్తుపై కసరత్తులు చేసిన దరిమిలా ఆయా అధికారులు, సిబ్బంది ఆదివారమే ఇక్కడికి చేరుకుని వారికి కేటాయించిన సెక్టార్‌లలో బందోబస్తు విధులలో చేరారు. జిల్లా ఎస్పీ దుగ్గల్ బందోబస్తు విధుల్లో చేరిన వారికి సలహాలు, సూచనలు ఇచ్చారు.

కొనసాగుతున్న ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియ
రెండవ రోజు 978 మందికి కౌనె్సలింగ్
నిజామాబాద్ టౌన్, మే 12: జిల్లాలో ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియ రెండవ రోజూ కొనసాగింది. జిల్లా విద్యాశాఖాధికారి శ్రీనివాసాచారి, జడ్పీ సిఐఓ రాజారాం ఈ బదిలీల కౌనె్సలింగ్‌ను ఆదివారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో నిర్వహించారు. బదిలీల కోసం ఉపాధ్యాయులు సమావేశ మందిరానికి తరలిరావడంతో జిల్లా పరిషత్ కార్యాలయం సందడిగా మారింది. జిల్లా వ్యాప్తంగా రెండవ రోజు బదిలీలలో మొత్తం 978 మంది ఉపాధ్యాయులు పాల్గొని కౌనె్సలింగ్ ద్వారా స్థాన చలనం పొందారు. తెలుగు పండిత్ విభాగంలో స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్‌లో 17 మంది ఉపాధ్యాయులు, ఫిజిక్స్‌లో 23 మంది, బయోసైన్స్‌లో 14 మందిని బదిలీ చేశారు. అదేవిధంగా ఉర్దూ మీడియం పాఠశాలలకు చెందిన స్కూల్ అసిస్టెంట్ విభాగంలోని మ్యాథ్స్‌లో 6, ఫిజిక్స్‌లో 3, బయోసైన్స్‌లో 9 మంది చొప్పున బదిలీ అయ్యారు. జిల్లా పరిషత్ స్థానిక పాఠశాలలోని తెలుగు మీడియంకు సంబంధించిన స్కూల్ అసిస్టెంట్‌ల(మ్యాథ్స్)లో 295 మంది, ఫిజిక్స్‌లో 332, బయోసైన్స్‌లో 239 మందికి బదిలీలు జరుగగా, ఇంగ్లీష్ మీడియంలో మ్యాథ్స్ స్కూల్ అసిస్టెంట్‌లో 2, బయోసైన్స్‌లో ఒక్కరికి బదిలీ చేశారు. ఉర్దూ మీడియంలో మ్యాథ్స్ విభాగంలో 14, ఫిజిక్స్‌లో 12 మంది, బయోసైన్స్‌లో 11 మందికి బదిలీలు జరిగాయి. బదిలీల ప్రక్రియ ఉదయం 10 గంటల నుండి సాయంత్రం వరకు నిర్వహించారు. ఇందులో డిసిఇబి చంద్రశేఖర్, డిప్యూటీ డిఇఓలు సత్యనారాయణ, సాంబశివరావు, ఉపాధ్యాయులు హాజరయ్యారు.

వైభవంగా ముత్యాలమ్మ విగ్రహ ప్రతిష్ఠ
కామారెడ్డి రూరల్, మే 12: మండలంలోని గర్గుల్ గ్రామంలో శ్రీశ్రీశ్రీ ముత్యాలమ్మ విగ్రహాన్ని శైభవంగా ప్రతిష్ఠించారు. ఈ సందర్భంగా అమ్మవారి విగ్రహాన్ని గ్రామంలోని ప్రధాన వీధుల గుండా ఊరేగింపు నిర్వహించి, నూతనంగా నిర్మించిన ఆలయంలో ప్రతిష్ఠించారు. ఉదయం నుండి అమ్మవారికి ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం ఆలయ ఆవరణలో యజ్ఞం, హోమం కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గర్గుల్ గ్రామం నుండే కాకుండా చుట్టూ పక్కల గ్రామాల నుండి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో ఆలయ నిర్మాణ దాత అన్నారపు మోహన్‌రెడ్డి, ప్రతినిధులు కుమార్‌గౌడ్, సాయిరెడ్డి, స్వామిగౌడ్ పాల్గొన్నారు.

ఘనంగా విశ్వశాంతి మహాయాగం ప్రారంభం
నిజామాబాద్ టౌన్, మే 12: జిల్లా కేంద్రంలోని ఐటిఐ గ్రౌండ్‌లో ఆదివారం 50వ విశ్వశాంతి మహాయాగం ఘనంగా ప్రారంభమైంది. పెద్ద ఎత్తున భక్తుల హాజరై మహాయాగంలో పాల్గొని తమ భక్తి పారవశ్యాన్ని చాటుకున్నారు. మహాయాగాన్ని పురస్కరించుకుని శనివారం జిల్లా కేంద్రంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ శోభాయాత్ర పాతగంజ్‌లోని గోశాల నుండి ప్రారంభమై గంజ్, గాంధీచౌక్, నెహ్రూపార్కు, బడాబజార్, శివాజీనగర్ మీదుగా ఐటిఐకి చేరుకుంది. ఆదివారం మహాయాగానికి కమిటీ నిర్వాహకులు భారీ ఏర్పాట్లు చేపట్టారు. ఈ యాగాన్ని హైదరాబాద్‌కు చెందిన శ్రీకృష్ణపీఠం అధిపతి శ్రీకృష్ణజ్యోతి స్వరూపనంద స్వామీజీ ఆధ్వర్యంలో నిర్వహించారు. జిల్లాతో పాటు వివిధ జిల్లాలు, పొరుగు రాష్ట్రాల నుండి పెద్ద ఎత్తున భక్తుల హాజరై మహాయాగంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కృష్ణజ్యోతి స్వరూపనంద స్వామీజీ మాట్లాడుతూ, పది రోజుల పాటు జరిగే మహాయాగంలో భక్తులు పాల్గొని తమ భక్తిని చాటుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరు ఆయురారోగ్యాలతో ఉండాలని, సకాలంలో వర్షాలు సంమృద్ధిగా కురిసి పంటలు సస్యశ్యామలం కావాలని ఆయన భగవంతున్ని ప్రార్థించారు. తొలిరోజు మహాయాగంలో వివిధ ప్రాంతాల నుండి వచ్చిన వేద పండితులు చండీయాగం చేపట్టారు. ఈ సందర్భంగా ఐటిఐ మైదానంలో వేదపండితుల కోసం ప్రత్యేకంగా 16 హోమగుండాలను ఏర్పాటు చేశారు. అదే విధంగా భక్తులు మహాయాగంలో పాల్గొనేందుకు వీలుగా 108 హోమగుండాలను కమిటీ నిర్వాహకులు ఏర్పాటు చేశారు. దీంతో తొలిరోజు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై మహాయాగంలో పాల్గొన్నారు. మహాయాగం ప్రారంభంగా బ్రాహ్మణులు గణపతి హోమం నిర్వహించారు. అనంతరం చండీయాగం ద్వారా మహాయాగాన్ని వేదమంత్రోచ్ఛరణల మధ్య ప్రారంభించారు. ఆదివారం సైతం ఏర్పాట్లను చేపట్టారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా ప్రత్యేకంగా షామియానాలు ఏర్పాటుచేసి అన్నదానం చేశారు. వేసవికాలం కావడంతో కొంతవరకు భక్తుల ఇబ్బందులను ఎదుర్కొన్నారు. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన వేదపండితులకు ప్రత్యేక సదుపాయాలు కల్పించారు. ప్రతిరోజు ఉదయం నుండి సాయంత్రం వరకు మహాయాగం ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. ఈ మహాయాగం కార్యక్రమంలో నిర్వహణ సమితి సభ్యులు గుండయ్య గురుస్వామి, కరివెళ్లి శంకరయ్య, శెనిశెట్టి శ్రీనివాస్, రాజ్‌కుమార్ సుబేదార్, నరాల సుధాకర్‌లతో పాటు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

గోజ్మేగావ్‌లో విగ్రహ శిఖర ప్రతిష్ఠాపన
హమాజీపూర్ మహారాజ్‌కు ఘన స్వాగతం
మద్నూర్, మే 12: మండలంలోని గోజ్మేగావ్ గ్రామంలో ఆదివారం శివలింగం, ఆలయ శిఖర ప్రతిష్ఠాపన కార్యక్రమాన్ని హమాజీపూర్ మహారాజ్ చేతుల మీదుగా నిర్వహించారు. ఇందులో భాగంగా గత నాలుగైదు రోజులుగా శివనామ సప్తాహ కొనసాగుతోంది. గోజ్మేగావ్‌లో నూతనంగా నిర్మించిన ఆలయంలో శివలింగం, శిఖర ప్రతిష్ఠాపన కార్యక్రమానికి మహిళలు, భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా శివలింగశివాచార్య మహారాజ్‌కు మహిళలు నెత్తిన బొనమెత్తుకుని ముందుకు సాగగా, బాజాభజంత్రీలు, భజన కార్యక్రమాలతో పాటు యువత నృత్యాలు చేస్తూ సాగిన కార్యక్రమంలో గోజ్మేగావ్ గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. అనంతరం భక్తులు ఉద్దేశించి హమాజీపూర్ మహారాజ్ శివలింగశివాచార్య మాట్లాడుతూ, ప్రతిఒక్కరు దైవభక్తిలో నిమగ్నం కావాలని పిలుపునిచ్చారు. ఓంకార నామస్మరణం జపిస్తే మనిషి ఆరోగ్యంగా ఉండడమే కాకుండా దైవభక్తిలో సైతం భాగస్వాములు అవుతారని అన్నారు. ప్రజలంతా భక్తిమార్గంలో నడిచినప్పుడే సమస్యల నుండి విముక్తి లభిస్తుందని పేర్కొన్నారు. ఇందుకోసం ప్రతి సంవత్సరం గ్రామంలో అఖండ శివనామా సప్తాహ కార్యక్రమాన్ని నిర్వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు శివాజీ, దేశాయి, సంతోష్‌పాటిల్, బసాయప్పతో పాటు పెద్ద సంఖ్యలో భక్తులు, మహిళలు పాల్గొన్నారు. అనంతరం శిఖర ప్రతిష్ఠాపన కార్యక్రమానికి హాజరైన భక్తులకు పెద్దఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.

కళంకిత మంత్రులను చంచల్‌గూడ జైలుకు తరలించాలి
అసెంబ్లీ ముట్టడిని ప్రతిష్టాత్మకంగా చేపడతాం * కేంద్ర మాజీ మంత్రి విద్యాసాగర్‌రావు
నిజామాబాద్, మే 12: అవినీతి, ఆరోపణలు ఎదుర్కొంటున్న కళంకిత మంత్రులను ప్రభుత్వం తక్షణమే అరెస్టు చేయించి చెంచల్‌గూడ జైలుకు తరలించాలని కేంద్ర మాజీ మంత్రి సిహెచ్.విద్యాసాగర్‌రావు డిమాండ్ చేశారు. అవినీతి కేసులకు సంబంధించి చార్జిషీట్లలో పేర్లుండి, సిబిఐ ఎదుట విచారణకు హాజరైనప్పటికీ పలువురు మంత్రులు దర్జాగా తమ విధుల్లో కొనసాగుతుండడం సిగ్గుచేటని, ఈ పరిణామం చరిత్ర పుటల్లో నిలిచిపోతుందని ఆయన ఎద్దేవా చేశారు. ఆదివారం స్థానిక ఆర్ అండ్ బి అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, అవినీతి కేసుల్లో విచారణను ఎదుర్కొంటున్న మంత్రులను పదవుల్లో కొనసాగించడం కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరికి అద్దం పడుతోందన్నారు. అటు కేంద్రంలోనూ యుపిఎ అవినీతి నావ మునిగిపోయే దశకు చేరువైందన్నారు. ఇద్దరు కేంద్ర మంత్రులు రాజీనామా చేసినప్పటికీ, ప్రధాని మన్మోహన్‌సింగ్ మాత్రం పదవి నుండి వైదొలిగేందుకు మొండికేస్తున్నారని, ఆయన స్వతహాగా రాజకీయ నాయకుడు కాకుండా ఆర్థిక శాస్తవ్రేత్త అయినందువల్లే రాజీనామాపై ఆలోచన చేయడం లేదని ఎద్దేవా చేశారు. కర్నాటక ఎన్నికల్లో గెలుపు సాధించడంతో తమకు పట్టు దొరికిందని కాంగ్రెస్ పార్టీ భావిస్తున్నప్పటికీ, వచ్చే ఎన్నికల్లో అటు కేంద్రంలోనూ, ఇటు రాష్ట్రంలోనూ కాంగ్రెస్‌ను మట్టి కరిపించే ప్రత్యామ్నాయ శక్తిగా బిజెపి అధికారంలోకి రావడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కాగా, ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం వచ్చే జూన్‌లో జెఎసి ఆధ్వర్యంలో చేపట్టనున్న చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని తమ పార్టీ ప్రతిష్టాత్మకంగా భావిస్తోందన్నారు. అన్ని ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో ప్రజలు తరలిరావాలని, అసెంబ్లీ గేట్లను దాటి మరీ తెలంగాణ వాంఛను చాటాలని విద్యాసాగర్‌రావు పిలుపునిచ్చారు. 2014 ఎన్నికల్లోపే తెలంగాణ ఏర్పడాలని, ప్రత్యేక రాష్ట్రంలోనే ఎన్నికలు జరగాలని ప్రజలు బలంగా కోరుకుంటున్నారని అన్నారు. వారి ఆకాంక్ష మేరకు తెలంగాణ సాధనకు తమ పార్టీ ఆధ్వర్యంలో పోరుబాటను మరింత ముమ్మరం చేస్తామన్నారు. యుపిఎ ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా, వెంటనే పార్లమెంటులో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టాలని, బిజెపి సంపూర్ణ మద్దతుగా నిలుస్తుందన్నారు.
గవర్నర్ వ్యవహారం బెల్లం కొట్టిన రాయి చందం
రాష్ట్రంలో గిరిజనుల హక్కులను పరిరక్షించేందుకు కృషి చేయాల్సిన గవర్నర్, బెల్లం కొట్టిన రాయి తరహాలో వ్యవహరిస్తున్నారని కేంద్ర మాజీ మంత్రి విద్యాసాగర్‌రావు ఆక్షేపించారు. బయ్యారం గనుల తరలింపు విషయంలో ప్రభుత్వం ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ గిరిజనుల ప్రయోజనాలను కాలరాస్తున్నప్పటికీ గవర్నర్ స్పందించడం లేదన్నారు. వాస్తవానికి తన విశేష అధికారాలను వినియోగిస్తూ గిరిజనులకు వ్యతిరేకంగా వచ్చే ఉత్తర్వులను నిలుపుదల చేసే అధికారం గవర్నర్‌కు ఉందని, గిరిజన ప్రాంతాల స్థితిగతులను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ నివేదికను రాష్టప్రతికి పంపించే బాధ్యతలను సైతం విస్మరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బయ్యారం గనుల విషయంలో ఆయా పార్టీలు ఎవరికివారు లబ్ధి పొందేందుకు ప్రయత్నిస్తుండడంతో అసలు చరిత్ర అడుగునే ఉండిపోతోందని అన్నారు. బయ్యారం ఖనిజ సంపదపై గిరిజనులకు భాగస్వామ్యం కల్పిస్తూ, వారి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్న తరువాతే ఎస్టీ కోఆపరేటివ్ సొసైటీల ద్వారా ఖనిజాన్ని తరలించాలన్నారు. ఈ విషయమై ఇప్పటికే రాష్ట్ర హైకోర్టు, సుప్రీంకోర్టులు వెలువరించిన సమత, వేదాంత తీర్పుల స్ఫూర్తిని పరిగణలోకి తీసుకుని లీజు ఉత్తర్వులను రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విలేఖరుల సమావేశంలో బిజెపి శాసన సభాపక్ష నేత యెండల లక్ష్మినారాయణ, డాక్టర్ బాపురెడ్డి, గజం ఎల్లప్ప, జాలిగం గోపాల్, తోట గోపాల్ పాల్గొన్నారు.

తెలంగాణ ఉద్యమంపై ప్రజల్లో చైతన్యం కలిగించాలి
మోర్తాడ్, మే 12: ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో భాగంగా జరుగుతున్న ఉద్యమానికి ప్రజల్లో చైతన్యం నింపాల్సిన బాధ్యత జాగృతి కార్యకర్తలపై ఉందని, తెలంగాణ జాగృతి జిల్లా అధ్యక్షుడు ముత్యాల సునీల్‌రెడ్డి కోరారు. మండలంలోని ఒడ్యాట్ గ్రామంలో ఆదివారం ఆయన జాగృతి కార్యకర్తలతో సమావేశమయ్యారు. జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాల్లోనూ జాగృతిని బలోపేతం చేసేందుకు సమావేశాన్ని నిర్వహిస్తున్నామని అన్నారు. బాల్కొండ నియోజకవర్గంలోని అన్ని మండలాల్లోనూ కమిటీలను ఏర్పాటు చేశామని, వాటి ఆధ్వర్యంలో కార్యకర్తలు ఇంటింటికి తిరుగుతూ ప్రచార బాధ్యతలు చేపట్టాలని అన్నారు. తెలంగాణ ఉద్యమ పోరు చివరి దశకు చేరుతోందని, ఇందులో భాగంగానే అన్ని పార్టీల్లోని నేతలు తెలంగాణ ఉద్యమం వైపు అడుగులేస్తున్నారని అన్నారు. జాగృతి ప్రధాన ఆశయం ప్రజా చైతన్యమేనని, దీనికోసమే ప్రత్యేక కళాబృందాలను ఏర్పాటు చేసి చైతన్య యాత్ర కార్యక్రమాలు నిర్వహ్తిమని అన్నారు. స్థానిక సంస్థలతో పాటు సాధారణ ఎన్నికల్లోనూ ఓటు అనే ఆయుధంతో తెలంగాణ వాంఛనను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు తెలిపేలా ప్రజలు సమయాత్తం కావాలని, దీనికి గాను ప్రతి కార్యకర్త కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జెఎసి కన్వీనర్ మారుతి, నాయకులు పెండెం శ్రీనివాస్, మురళి, ఎలాల శ్రీనివాస్‌తో పాటు జాగృతి కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

రైతు సదస్సులో పాల్గొననున్న ముఖ్యమంత్రి విస్తృత స్థాయిలో ఏర్పాట్లు - భారీ బందోబస్తు
english title: 
cm paryatana

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>