Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

జిల్లాలో పుంజుకుంటున్న టిడిపి

$
0
0

ఒంగోలు, మే 12: జిల్లాలో తెలుగుదేశం పార్టీ బలం పుంజుకుంటోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఒకేఒక్క స్థానానికి పరిమితమైన తెలుగుదేశం పార్టీ నేడు నాలుగైదు నియోజకవర్గాల్లో బలంగా ఉంది. జిల్లాలో 12 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా వాటిలో ఒక్క మార్కాపురం నియోజకవర్గంలో కందుల నారాయణరెడ్డి తెలుగుదేశం పార్టీ తరపున ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వైఎస్‌ఆర్‌సిపి తరపున ఒంగోలు, దర్శి, అద్దంకి నియోజకవర్గాల శాసనసభ్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి, బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి, గొట్టిపాటి రవికుమార్ ఎమ్మెల్యేలుగా ఉన్నారు. ఈ నియోజకవర్గాల్లో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పరిస్థితి మెరుగ్గానే ఉంది. ప్రధానంగా సంతనూతలపాడు, కొండెపి నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీకి ప్రస్తుతం సానుకూల పవనాలు వీస్తున్నట్లు తెలుస్తోంది. ఆయా నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ నేతలు ఇప్పటినుంచే ప్రచారంలో మునిగి తేలుతున్నారు. దర్శి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు శిద్దా రాఘవరావు సుడిగాలి పర్యటన జరుపుతున్నారు. దర్శి పట్టణంలో శిద్దా ఇంటింటి ప్రచారం చేపట్టారు. ఇక సిట్టింగ్ శాసనసభ్యుడు బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి కూడా తన సొంత నిధులతో మంచినీటి ట్యాంకర్ల ద్వారా నీటిని నియోజకవర్గ ప్రజలకు అందిస్తూ ప్రజాసేవలో ముందున్నారు. అద్దంకి నియోజకవర్గంలో సిట్టింగ్ శాసనసభ్యుడు గొట్టిపాటి రవికుమర్, మాజీ శాసనసభ్యుడు బాచిన చెంచుగరటయ్యల మధ్య వార్ కొనసాగుతోంది. దీంతో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలోని నేతలు, కార్యకర్తలు రెండు గ్రూపులుగా విడిపోయారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన కొంతమంది ముఖ్యనేతలు వైఎస్‌ఆర్‌సిపి పంచన చేరారు. దీంతో తెలుగుదేశం, వైఎస్‌ఆర్‌సిపి మధ్యే ప్రధాన పోటీ నెలకొననుంది. కనిగిరి నియోజకవర్గంలో కూడా వైఎస్‌ఆర్‌సిపి నేతల్లో అంతర్గత కుమ్ములాటలు జరుగుతున్నాయి. సంతనూతలపాడు నియోజకవర్గంలో కూడా తెలుగుదేశం పార్టీకి సానుకూల పవనాలు వీస్తున్నాయనే చెప్పవచ్చు. గతంలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్న వారిని సమన్వయకర్తలుగా నియమించకపోవడం, మరొకపక్క పారిశ్రామికవేత్తల వైపు పార్టీ అధిష్ఠానవర్గం చూస్తుండటంతో వైఎస్‌ఆర్‌సిపి నేతల్లో నిరుత్సాహం నెలకొంది. ఈనేపథ్యంలో రానున్న రోజుల్లో వైఎస్‌ఆర్‌సిపి నేతల్లో అంతర్గత కుమ్ములాటలు తారాస్థాయికి చేరితే కాంగ్రెస్‌కంటే తెలుగుదేశం పార్టీకే లాభిస్తుందని రాజకీయ విశే్లషకులు భావిస్తున్నారు. తెలుగుదేశం పార్టీకి ఉన్న సంప్రదాయ ఓట్లు ఏమాత్రం చీలలేదు. కాని కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓట్లను మాత్రం వైఎస్‌ఆర్‌సిపి భారీగా చీల్చిందనే చెప్పవచ్చు. ప్రస్తుతం కాంగ్రెస్ పక్షాన ఉన్న కొంతమంది నేతలు అసెంబ్లీ ఎన్నికలు జరిగితే ఏ క్షణంలోనైనా జెండా మార్చేందుకు సిద్ధంగా ఉన్నారన్న వార్తలు వినవస్తున్నాయి. మొత్తంమీద జిల్లాలో తెలుగుదేశం పార్టీ పరిస్థితి మెరుగ్గా ఉందని తెలుస్తోంది.

పలుచోట్ల ఈదురుగాలులతో భారీ వర్షం
కూలిన చెట్లు, విద్యుత్ స్తంభాలు
అంధకారంలో గ్రామాలు
భయాందోళనలో ప్రజలు
ఒంగోలు, మే 12: జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఆదివారం బలమైన ఈదురు గాలులతో పాటు ఒక మోస్తరు నుండి భారీ వర్షాలు కురవడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. రాత్రివేళ కావడంతో బలమైన ఈదురు గాలులకు విద్యుత్ స్తంభాలు పలు ప్రాంతాల్లో కూలిపోవడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. జిల్లాలోని అద్దంకి, దర్శి, ముండ్లమూరు, కొత్తపట్నం, యర్రగొండపాలెం, వేటపాలెం తదితర ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ఈదురు గాలులకు పలుచోట్ల చెట్లు కూలిపోవడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అద్దంకి, ముండ్లమూరు మధ్య చెట్లు కూలిపోవడంతో కొంతసేపు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. జిల్లా కేంద్రమైన ఒంగోలులో కూడా బలమైన ఈదురుగాలులు వీయడంతో నగర ప్రజలు భయాందోళన చెందారు. నగరంలో కూడా కొంతసేపు విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగడంతో ప్రజలు చీకట్లో మగ్గారు. ఒంగోలు నగరంలో ఈదురుగాలులకు చెట్లు కూలిపోయి విద్యుత్‌కు తీవ్ర అంతరాయం కలిగింది. విద్యుత్ లేక నగర ప్రజలు దోమలతో అల్లాడిపోయారు. అదేవిధంగా మార్టూరు మండలం తాటివారిపాలెంలో కురిసిన భారీ వర్షాలకు పిడుగుపడి రెండు గడ్డివాములు, రెండు పూరిళ్లు దగ్ధమయ్యాయి. ఇదిలాఉండగా కొత్తపట్నం తదితర ప్రాంతాల్లో ఉన్న మామిడితోటలల్లోని కాయలు రాలిపోయాయి. దీంతో మామిడితోటల యజమానులు ఆర్థికంగా నష్టపోయారు. కొన్ని ప్రాంతాల్లో పిడుగులు పడినట్లు కూడా సమాచారం. మొత్తంమీద బలమైన ఈదురు గాలులకు ఒక మోస్తరు నుండి భారీ వర్షం తోడు కావడంతో జిల్లాలోని పలు ప్రాంతాల్లోని ప్రజలు ఆందోళన చెందారు. ఉదయం నుండి సాయంత్రం వరకు వడగాలులు వీచడంతో ప్రజలు భీతిల్లారు. రాత్రి సమయానికి ఈదరుగాలులతో వర్షం కురవడంతో ఏ క్షణంలో ఏం జరుగుతుందోనని ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు.

విలీనం దశలో ప్రాథమికోన్నత పాఠశాలలు
* విద్యార్థుల కొరతతో మూతపడనున్న 101 పాఠశాలలు
కందుకూరు, మే 12: బడిఈడు పిల్లలు ఉండాల్సింది పనిలోకాదు బడిలో. ఇది సర్కారు నినాదం. ప్రాథమిక విద్యను నిర్బంధంగా చిన్నారులకు అందించాలని సర్కారు యోచిస్తుంటే క్షేత్రస్థాయి పరిస్థితి మాత్రం అందుకు భిన్నంగా ఉంది. దీంతో ప్రభుత్వ లక్ష్యం కుంటుపడుతోంది. పిల్లల హాజరు కరువై పాఠశాలలు మూతపడే పరిస్థితి నెలకొంది. జిల్లాలో 101ప్రభుత్వ పాఠశాలలు రానున్న విద్యాసంవత్సరం నుంచి మూతపడే అవకాశాలు ఉన్నాయి. గడచిన సంవత్సరంలో ఈపాఠశాలల్లో ఒక్క విద్యార్థి కూడా చేరకపోవడంతో రాష్టవ్రిద్యాశాఖ ఆదేశాల మేరకు వాటిని మూసివేసి అక్కడ పనిచేసే ఉపాధ్యాయులను అవసరమైన పాఠశాలలకు బదిలీ చేయాలని నిర్ణయించినట్లు తెలిసింది. పదిలోపు పిల్లలు ఉన్న మరో 35పాఠశాలలను మూసివేసి అక్కడ చదువుకుంటున్న విద్యార్థులను సమీపంలోని ఇతర పాఠశాలలకు తరలించేందుకు ఆదేశాలు త్వరలో జారీ కానున్నాయి. జిల్లాలో అన్ని యాజమాన్యాల పరిధిలో మొత్తం 3,182ప్రాథమిక పాఠశాలలు, 555ప్రాథమికోన్నత పాఠశాలలు, 685 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. వీటిలో 800 వరకు ప్రైవేటు ఎయిడెడ్, ప్రైవేట్ అన్ ఎయిడెడ్ పాఠశాలలు ఉన్నాయి. వీటిలో 4,79,340మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. మూడేళ్లుగా ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల ప్రవేశాలు గణనీయంగా తగ్గుతున్నాయి. గ్రామీణ ప్రాంతాలలో సైతం ప్రైవేటు పాఠశాలలు పెరుగుతున్నాయి. ఆంగ్ల మాద్యమం మోజుతో తల్లిదండ్రులు ఆవైపు మొగ్గు చూపడంతో ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య తగ్గుతూ వస్తోంది. దీంతో 101 పాఠశాలల్లో ఒక్క విద్యార్థి కూడా చేరని పరిస్థితి నెలకొంది. గుర్తింపులేని పాఠశాలలపై అధికారులు చర్యలకు వెనకాడుతుండడంతో ప్రభుత్వ పాఠశాలల మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. గత సెప్టెంబర్‌లో సేకరించిన డైస్ లెక్కల ప్రకారం పిల్లలు లేని పాఠశాలల మూసివేత జాబితాలో చేర్చారు. వీటిలో 101 ప్రాథమిక, 2 ప్రాథమికోన్నత పాఠశాలలు ఉన్నాయి. ఆయా పాఠశాలల్లో జిల్లా వ్యాప్తంగా అత్యధికంగా కందుకూరు మండలంలో ఉండడం గమనార్హం. పదిమంది కన్నా తక్కువమంది పిల్లలు ఉన్న ప్రాథమికోన్నత పాఠశాలలను సమీపంలో ఉన్న వేరే పాఠశాలలో విలీనం చేయడానికి ఇప్పటికే విద్యాశాఖ జాబితా తయారుచేసినట్లు తెలిసింది. అక్కడ పనిచేసే ఉపాధ్యాయులను సర్దుబాటు పేరుతో అవసరమున్న పాఠశాలలకు బదిలీ చేయనున్నారు. హనుమంతునిపాడు మండలం తిమ్మారెడ్డిపల్లి, వెలిగండ్ల మండలం నర్సమాంబాపురం, పిసిపల్లి మండలం మర్రిగుంటపల్లి, జరుగుమల్లి మండలం ఎడ్లూరపాడు, వలేటివారిపాలెం మండలం కళవల్ల, పిసిపల్లి మండలం కమ్మవారిపాలెం, గుడ్లూరు మండలం పరకొండపాడు, వలేటివారిపాలెం మండలం బడేవారిపాలెం, గుడ్లూరు మండలం ఏలూరుపాడు, ఉలవపాడు మండలం మనే్నటికోట, పిసిపల్లి మండలం బుడేవారిపాలెం, జరుగుమల్లి మండలం నందనవనం, కందుకూరు మండలం జి మేకపాడు, చుట్టుగుంట, తర్లుపాడు మండలం మంగళగుంట, ముండ్లమూరు మండలం పోలవరం, కారంచేడు మండలం జరుగులవారిపాలెం, కొరశపాడు మండలం అడమనూరు, చీమకుర్తి మండలం రామచంద్రాపురం, మర్రిపూడి మండలం ధర్మవరం, అర్ధవీడుమండలం వెలగలపాయ, ఒంగోలు మండలం చితాయగారిపాలెం, నాగులుప్పలపాడు మండలం కెసిహెచ్ ఉప్పలపాడు యుపి పాఠశాలలను తాత్కాలికంగా సమీపంలో ఉన్న పాఠశాలల్లో విలీనం చేసేందుకు కసరత్తులు ప్రారంభించారు. అలాగే పదిమందిలోపు ఉన్న ప్రాథమిక పాఠశాలలో కూడా ఈవిద్యాసంవత్సరంలో మూతపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

నీరుపైకిరాదు.. మోటారు తిరగదు..
* లక్షలు వెచ్చించి సాగుచేసిన బత్తాయి ఎండుముఖం
మార్కాపురం, మే 12: వర్షాభావ పరిస్థితుల కారణంగా భూగర్భజలాలు అడుగంటి బోర్లద్వారా నీరు పైకివచ్చే పరిస్థితి లేకుండాపోయింది. ఇదే సమయంలో విద్యుత్ సమస్య అధికం కావడంతో మోటార్లు తిరిగే పరిస్థితి లేకుండాపోయింది. అటునీరురాక, ఇటు మోటార్లు తిరుగక లక్షల రూపాయలు వెచ్చించి సాగుచేసిన బత్తాయి చెట్లు ఎండుముఖం పడుతుండటంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికభారం భరించి ప్రత్యామ్నాయ మార్గాలు వెతికినప్పటికీ ఫలితం కనిపించడం లేదని రైతులు వాపోతున్నారు. వ్యవసాయ రంగానికి 7గంటలపాటు విద్యుత్ సరఫరా చేయాలని ప్రభుత్వం ఆదేశించగా, అధికారులు మాత్రం 5గంటలు ఇస్తున్నామని చెబుతున్నప్పటికీ 2గంటలకు మించి విద్యుత్ సరఫరా కావడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. పెద్దారవీడు మండలంలో కొందరు రైతులు భారమైనప్పటికీ దూపాడు నుంచి ట్యాంకర్ ద్వారా నీటిని తోలించి పంటలను బ్రతికించుకునేందుకు ప్రయత్నించినప్పటికీ వ్యయం తప్ప ఫలితం కనిపించడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొందరు రైతులు ఎండిపోతున్న బత్తాయి మొక్కలను చూడలేక ఏకంగా నరికివేసి చేతులు దులుపుకుంటున్నారు. వర్షాభావంతో కంది, పత్తి, మిర్చి లాంటి పంటలు పండకపోగా కనీసం బత్తాయి పంటనైనా బతికించుకుందామని రైతులు చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. ప్రకాశంజిల్లాలో సుమారు 28వేల హెక్టార్లలో బత్తాయి పంటను సాగుచేయగా ఇప్పటికే 30శాతంమంది రైతులు సుమారు 8వేల హెక్టార్లలో చెట్లను నరికివేశారు. మరో నెలరోజులపాటు వర్షాలు పడకపోతే 50శాతం మేర రైతులు బత్తాయి చెట్లను నరికివేసే ప్రమాదం ఉందని అధికారులే అంగీకరిస్తున్నారు. ఉన్నబోర్లలో నీరు రాకపోతే అదనపు బోర్లు వేయిస్తే నీరు ఏమైనా వస్తుందేమోననే అభిప్రాయంతో రైతులు వేల రూపాయలు వెచ్చించి బోర్లు వేయించినప్పటికీ ఫలితం లేకుండా పోయిందని రైతులు అంటున్నారు.

అయోమయంలో బెల్టుషాపుల నిర్వాహకులు
పామూరు, మే 12: మండలంలో అక్రమంగా బెల్టుషాపులు నిర్వహిస్తున్న నిర్వాహకులు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రకటనతో అయోమయ పరిస్థితిలో పడ్డారు. ఇటీవల రాష్ట్రంలో బెల్టుషాపులు దశల వారీగా ఎత్తివేయాలని, అందుకు గాను మండల పరిధిలో ఎన్ని బెల్టుషాపులు ఉన్నది ఆయాశాఖ అధికారులు నివేదిక తయారు చేయాలని ఆదేశించడంతో ముఖ్యమంత్రి ఇచ్చిన ఆదేశం సక్రమంగా అమలు అయితే తమ పరిస్థితి ఏమిటన్న బెంగతో కోట్లాది రూపాయలు వెచ్చించి మద్యం దుకాణాలకు లైసెన్సులు పొందిన వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. లంచాల ఊబిలో అధికారులు మండలంలో ఇబ్బడిముబ్బడిగా బెల్టుషాపులు, పామూరు పట్టణంలో దాబాల రూపంలో అనధికారికంగా బార్లు నిర్వహిస్తున్నప్పటికి ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. మద్యం షాపుల కౌంటర్ల వద్ద లూజు విక్రయాలు జరపరాదన్న నిబంధనలు పామూరులో యథేచ్ఛగా తుంగలో తొక్కుతున్నాయి. ఇదిలా ఉండగా పామూరు దుకాణాలలో కల్తీమద్యం విచ్చలవిడిగా లభ్యమవుతుందని మందుబాబులు గగ్గోలు పెడుతున్నారు. మందు బాటిల్ మూతలను చాకచక్యంగా తీసివేస్తూ అందులో చీఫ్ మందును కొన్ని బ్రాండ్‌లలో, కొన్ని మినరల్ వాటర్‌ను కొన్ని బ్రాండ్‌లలో కలుపుతూ మందు బాబులు ఇచ్చిన తగిన కిక్కు లేకుండా చేస్తున్నారని దుకాణం యజమానులపై ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా అధికారపార్టీ మండల స్థాయి నాయకుల నుండి నియోజకవర్గ స్థాయి నాయకుల వరకు నెలసరి మామూళ్లు ముట్టజెబుతూ, క్వాటర్ బాటిల్‌కు 20రూపాయలు, ఫుల్ బాటిల్‌కు 20నుండి 80రూపాయల వరకు అధిక ధరకు విక్రయిస్తున్నట్లు పలువురు పేర్కొంటున్నారు. కాగా వస్తున్నా మీకోసం పాదయాత్రలో చంద్రబాబు ప్రజలకు ఇస్తున్న హామీలలో బెల్టుషాపులు ఎత్తివేస్తామన్న ప్రచారాన్ని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఆచరణలో పెట్టేందుకు ముందుస్తుగానే మద్యం షాపుల బెల్టులు తీసేందుకు సమాయత్తం అవుతున్నారని, ఇది కాంగ్రెస్ ఏజెండాలో లేదని రాజకీయ విశే్లషకులు అంటున్నారు. మండలంలోని బెల్టుషాపుల ద్వారా ప్రతి నిత్యం వెయ్యికిపైగా బాటిల్స్ అదనంగా అమ్ముడుపోతూ ప్రభుత్వం నిర్ణయించిన ఎంఆర్‌పి ధర కన్నా అధిక ధరలకు విక్రయిస్తూ మద్యం ప్రియుల జేబులు చిల్లులు పడేలా చేస్తున్నారు. ఇప్పటికైనా ఎక్సైజ్, పోలీస్ అధికారులు మండలంలో నిర్వహిస్తున్న బెల్టుషాపులపై కఠిన చర్యలు తీసుకొని, పట్టణంలో గల అనధికారిక బార్‌లను నిషేధించాలని పలువురు కోరుతున్నారు.
10ఎకరాల జామాయిల్ తోట దగ్ధం
కందుకూరు రూరల్, మే 12: మండల పరిధిలోని వెంకటాద్రిపాలెం, అనంతసాగరం గ్రామాల నడుమ మాలపాడు రహదారి సమీపంలో 10 ఎకరాల జామాయిల్‌తోట అగ్ని ప్రమాదంలో దగ్ధమైంది. ఈప్రమాదం ఆదివారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. బాధిత రైతు తెలిపిన వివరాల ప్రకారం ఆదివారం మధ్యాహ్నం చిన్నమంటగా ప్రారంభమైన అగ్ని ప్రమాదం గాలి ప్రభావంతో సమీపంలోని జామాయిల్ తోటలకు వ్యాపించింది. ఈప్రమాదంలో కూనం రామారావుకు చెందిన 4ఎకరాలు, యనమల తిరుపతయ్య ఒకటిన్నర ఎకరా, యనమల వెంకటేశ్వర్లు ఒకటిన్నర, యనమల కొండయ్య ఒకటిన్నర ఎకరా, యనమల సామ్రాజ్యంకు చెందిన ఒకటిన్నర ఎకరా జామాయిల్ తోట దగ్ధమైనట్లు బాధిత రైతులు తెలిపారు. అగ్ని ప్రమాదం సమాచారం అందుకున్న స్థానిక అగ్నిమాపక అధికారి సుధీర్‌బాబు ఆధ్వర్యంలో అగ్నిమాపక సిబ్బంది ప్రమాద స్థలానికి చేరుకుని మంటలను అదుపుచేశారు.

వేంకటేశ్వర స్వామి ఆలయంలో విగ్రహాలకు విశేష పూజలు
మద్దిపాడు, మే 12: స్థానిక వేంకటేశ్వర స్వామి ఆలయంలో జయవిజయలు, స్వామి పాదాలు, బలిపీఠం, నాగశిలాశాసన విగ్రహాల ప్రతిష్ఠ సందర్భంగా ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆగమవేదశాస్త్ర పండితులు శ్రీమాన్ పరంకుశం సాయి కృష్ణమాచార్యులు (టిటిడి ) రుత్విక్‌ల వేదమంత్రాలతో మంగళ వాయిద్యాల మధ్య జలాదివాసం, క్షీరాదివాసం వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తుల సమక్షంలో శాంతి హోమాలు ఘనంగా నిర్వహించారు. సాయంత్రం ధాన్యాదివాసం, పుష్కాదివాసం, మహిళా భక్తులు, గ్రామపెద్దల సమక్షంలో ఘనంగా జరిపారు. అనంతరం మూలవిరాట్ స్వామివార్లకు, విగ్రహాలకు విశేష పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు మద్దిపాడు దీక్షితులు, గోపయ్య, ప్రసాద్, మారుతి, ఈవో పి అంజనాదేవి, గ్రామపెద్దలు, మహిళా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

ఘనంగా పుచ్చలపల్లి సుందరయ్య శత జయంతి
ఒంగోలు అర్బన్, మే 12 : దక్షిణ భారత కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత పుచ్చలపల్లి సుందరయ్య శత జయంతి ఆదివారం ఘనంగా జరిగింది. నగరంలోని 50వ డివిజన్ పరిధిలో చైతన్యనగర్, జెపి కాలనీలలో సుందరయ్య శతజయంతి సభ 50వ డివిజన్ సిపిఎం శాఖల ఆధ్వర్యంలో జరిగాయి. ఈసభకు శాఖా కార్యదర్శి దారా వెంకటేశ్వర్లు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా సిపిఎం నగర కార్యదర్శివర్గ సభ్యులు వీరాస్వామి మాట్లాడుతూ 1930వ సంవత్సరంలో దళితులు, వ్యవసాయ కార్మికుల కోసం సుందరయ్య సంఘం పెట్టి వారి హక్కుల కోసం ఉద్యమాలు నిర్వహించారన్నారు. పేదలకు భూములు పంచాలని, తన ఆస్తిని అమ్మి ఉద్యమం కోసం ఖర్చు పెట్టారన్నారు. సుందరయ్య ఆశయాలను సాధించాలని పిలుపునిచ్చారు. ప్రస్తుతం ప్రజలు ఎదుర్కొంటున్న భూమి, మంచినీరు, నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుదల, కనీస వౌలిక వసతుల కల్పన లాంటి సమస్యలతో ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. సిపిఎం నగర కార్యదర్శి వర్గ సభ్యులు జి రమేష్ మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా సుందరయ్య స్ఫూర్తితో పేదలందరికీ ఇండ్ల స్థలాలు కావాలని ఉద్యమాలు నిర్వహించారని చెప్పారు. అందులో భాగంగా ఒంగోలు నగరంలో ఇల్లులేని పేదలందరికీ ఇండ్ల స్థలాలు ఇవ్వాలని సిపిఎం పోరాటం నిర్వహించి అనేకమంది పేదలకు ఇండ్లస్థలాలు ఇప్పించిందన్నారు. కుల వివక్ష, అంటరానితనంపై దళితుల్లో చైతన్యం నింపి వాటికి వ్యతిరేకంగా పోరాడామన్నారు. రైతాంగ సమస్యలపై పోరాటాలు నిర్వహించి నాగార్జునసాగర్ డ్యామ్ కావాలని కోరామన్నారు. విశాలాంధ్రలో ప్రజారాజ్యం కావాలని, భాషాప్రయుక్త రాష్ట్రాల కోసం కృషి చేశామన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు ఆర్ నరసింగరావు, అంజయ్య, వెంకటేశ్వర్లు, ధర్నాసి భాస్కర్‌రావు, వీర నారాయణ, టి అంజయ్య, లక్ష్మణయ్య తదితరులు పాల్గొన్నారు.

150 బస్తాల రేషన్ బియ్యం పట్టివేత
జరుగుమల్లి, మే 12: రేషన్ బియ్యం పక్కదారి పడుతోందని స్పెషల్ బ్రాంచి పోలీస్ అధికారులకు అందిన సమాచారం మేరకు మండలంలోని చింతలపాలెం పడమరవైపుగ్రామ సమీపంలో దాడి చేసి లారీలో తరలిస్తున్న 150బస్తాల రేషన్ బియ్యం పట్టుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు నెల్లూరు జిల్లా కావలికి చెందిన బిజ్జం నాగేశ్వరరెడ్డికి చెందిన లారీలో ఆదివారం తెల్లవారు జామున అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పట్టుకున్నారు. పట్టుబడిన బియ్యంతోపాటు డ్రైవర్, క్లీనర్లను అదుపులోకి తీసుకున్నారు. డ్రైవర్ షేక్ షఫిని విచారించగా తన యజమాని నాగేశ్వరరెడ్డి సూచనల మేరకు తాను ఈ రూట్‌లో వచ్చానని డ్రైవర్ తెలిపారు. తనను 12గంటల సమయంలో నేతివారిపాలెం నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో పంట పొల్లాలోకి ఒక వ్యక్తి తీసుకు వెళ్లాడని, అక్కడ అప్పటికే రెండు ట్రాక్టర్లలో సిద్ధంగా ఉన్న 150 బస్తాల రేషన్ బియ్యాన్ని లారీలోకి ఎక్కించే సరికి 2గంటల సమయం పట్టిందని డ్రైవర్ తెలిపారు. అక్కడి నుంచి కామేపల్లి మీదుగా జరుగుమల్లి రూటు నుంచి వస్తున్న సమయంలో స్పెషల్ బ్రాంచి పోలీసులు అడ్డగించారు. లారీలో ఉన్న సరుకును చూపించాలని అని లారీని పరిశీలించగా అందులో 150బస్తాల ప్రజాపంపిణీ బియ్యం ఉన్నాయని గుర్తించి లారీని పోలీస్ స్టేషన్‌కు అప్పగించారు. ఈవిషయాన్ని తహశీల్దార్ కెవి కృష్ణారావుకు సమాచారం అందించారు. తహశీల్దార్ ఆదేశాల మేరకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డిటి సుబ్బారావు లారీలో ఉన్న 150బస్తాల బియ్యాన్ని జాయింట్ కలెక్టర్ ఉత్తర్వులు ఇచ్చేంత వరకు సరుకు భద్రత నిమిత్తం పట్టుబడిన రేషన్ బియ్యాన్ని చింతలపాలెం దుకాణం-4 డీలర్ ఎం వరలక్ష్మమ్మకు స్వాధీనం చేసి లారీని పోలీసుస్వాధీనంచేసి, 6ఏ కేసు నమోదు చేసినట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్ డిటి సుబ్బారావు తెలిపారు. పట్టుబడిన బియ్యం కొండపి మండలానికి సంబంధించినవా, జరుగుమల్లి మండలానికి సంబంధించినవా అనేది విజిలెన్స్ అధికారుల విచారణలో తేలుతుందని ఆయన చెప్పారు. ఈదాడులలో స్పెషల్ బ్రాంచి ఎఎస్సై కరీమ్, ఎస్‌బిఎస్‌హెచ్‌సి ఖలీల్, ఎస్‌బిపిసి మల్లికార్జున, జరుగుమల్లి ఎస్సై షేక్ షావలి, పిసి రావు, బాలకృష్ణ ఉన్నారు.

అపూర్వం పూర్వ విద్యార్థుల సమ్మేళనం
ఒంగోలు , మే 12: నగరంలోని పివిఆర్ హైస్కూల్‌లో 1983వ సంవత్సరానికి చెందిన పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఆదివారం అట్టహాసంగా జరిగింది. 1982వ సంవత్సరంలో పదో తరగతికి చెందిన దాదాపు వంద మంది పూర్వ విద్యార్థులు వారి కుటుంబ సభ్యులతో కలసి దాదాపు 300 మందికిపైగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు పివితో స్నేహ అనే సంస్థగా ఏర్పడి సామాజిక కార్యక్రమాలు నిర్వహించాలని తీర్మానించారు. ముందుగా తమ గురువులను ఘనంగా సన్మానించారు. రిటైర్డ్ ప్రధానోపాధ్యాయులు కొప్పోలు హనుమంతరావు మాట్లాడుతూ ఇలాంటి సమ్మేళనాలను పివిఆర్ హైస్కూల్ పూర్వ విద్యార్థులు మాత్రమే నిర్వహిస్తూ తమ గురువులను స్మరించుకుంటున్నారన్నారు. పాఠశాలకు చెందిన పూర్వ విద్యార్థులైన అయినాబత్తిన ఘనశ్యామ్ మాట్లాడుతూ 30 సంవత్సరాల తరువాత తమ పాత స్నేహితులను కలుసుకోవడం, గత స్మృతులను నెమరువేసుకుంటూ కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా గడపడం అభినందనీయమన్నారు. మరో విద్యార్థి రమేష్ మాట్లాడుతూ భవిష్యత్తులో పాఠశాలకు కావాల్సిన వౌలిక సదుపాయాలు కల్పించేందుకు తమవంతు కృషి చేస్తామన్నారు. కృష్ణాజిల్లా జోనల్ ఫైర్ ఆఫీసర్ బి నరసింహారావు, శ్రీనివాసులరెడ్డి, విజయ్ గ్యాస్ రామకృష్ణారెడ్డి, పి విజయ్‌మోహన్‌రెడ్డి, సైంటిస్టు మధు, డాక్టర్ వైవి రావు, ఉపాధ్యాయులు అరుణ , సత్యమూర్తి, అరుణ్‌కుమార్ గుప్తా తదితరులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో పోలీస్ శాఖకు చెందిన కె రత్నం తన కచ్చేరితో సభా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాలకు చెందిన రిటైర్డ్ ఉపాధ్యాయులు జి సులోచన, ఎం సీతామహాలక్ష్మీ, ఎన్ వెంకటేశ్వర్లు, ఈమని దయానంద, సుబ్బరావమ్మ, విజయలక్ష్మీ, రామోహన్‌రావు, జి సుబ్బారావు, ఎన్ రామారావు, బి వెంకటస్వామి, శ్రీరామచంద్రమూర్తి, కె కోటేశ్వరరావు, టి వెంకటస్వామి, ఎన్ నాగేశ్వరరావు తదితరులను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సన్మాన గ్రహీతలు మాట్లాడుతూ ఉపాధ్యాయులను గుర్తించుకొని గౌరవించడం అభినందనీయమన్నారు.

తానా మహాసభలకు నల్లూరి
ఒంగోలు, మే 12: అమెరికాలోని తెలుగువారు ప్రతి సంవత్సరం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించుకునే తానా మహాసభలకు ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్యమండలి రాష్ట్ర గౌరవాధ్యక్షులు నల్లూరి వెంకటేశ్వర్లు ( అన్న) ముఖ్యఅతిధిగా హాజరుకానున్నారు. ఈమేరకు శనివారం నల్లూరి వెంకటేశ్వర్లుకు ఆహ్వానం పంపారు. ఆంధ్రప్రదేశ్ నుండి ఆహ్వానించే ప్రముఖుల్లో జిల్లాకు చెందిన నల్లూరి వెంకటేశ్వర్లు ఎంపిక కావడంతో పలువురు ఆయన్ను అభినందించారు. ఈ మహాసభలు ఈనెల 24 నుండి 26వ తేది వరకు జరుగనున్నాయి. ఈ మహాసభల్లో నల్లూరి వెంకటేశ్వర్లు తెలుగుభాషా, సేవ, సాంప్రదాయాలు, అభ్యుదయ భావాలపై ఈ లిటరరీ సెమినార్‌లో తన సందేశం ఇవ్వనున్నట్లు ఆదివారం స్థానిక ప్రజానాట్య మండలి కార్యాలయం నుండి ప్రకటన జారీ చేశారు.

ఒంగోలు రైల్వేస్టేషన్‌లో తనిఖీలు
ఒంగోలు, మే 12 : ఒంగోలులో ఆదివారం రాత్రి కరెంట్ పోవడంతో రైల్వే పోలీస్‌స్టేషన్ ఎస్‌ఐ భావన్నారాయణ రైల్వేస్టేషన్‌లోని 3వ ప్లాట్‌ఫారం వద్ద తనిఖీలు నిర్వహించారు. చైన్ దొంగలు, ఇతరత్ర దొంగలు ఉంటారన్న ఉద్దేశ్యంతో ఎస్‌ఐ, వారి సిబ్బంది తనిఖీలను నిర్వహించారు.

ఆనందంలో పార్టీశ్రేణులు
english title: 
tdp

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles