శ్రీకాకుళం, మే 12: ఆరోగ్యప్రదాత అరసవల్లి సూర్యనారాయణస్వామి సన్నిధిలో భక్తులు పోటెత్తారు. స్వామివారికి ప్రీతికరమైన మాసాల్లో ఒకటైన వైశాఖ మాసం ఇష్టమైన ఆదివారం పర్వదినం నాడు దర్శించుకోవడం ద్వారా సకలపాపాలు పోవడమేకాక ఆయుఃరారోగ్యాలు సిద్ధిస్తాయని భక్తుల విశ్వాసం. ఉదయం నుంచి భక్తులు తలనీలాలు అర్పించడం, సూర్యనమస్కారాలు చేయించడంతోపాటు ఫలరాజు మామిడిపండ్లను ఇష్టనైవేధ్యంగా ఇంద్రపుష్కరిణి వద్ద సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఆలయ ప్రధానార్చకులు ఇప్పిలి శంకరశర్మ ఆధ్వర్యంలో సుప్రభాతసేవ, ఉషఃకాలార్చన, మంత్రపుష్పం , నిత్యపూజలు నిర్వహించారు. భక్తుల తాకిడిని దృష్టిలో ఉంచుకుని ఆలయ నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఆలయం వద్ద దారి పొడువునా ఎండతాకిడిని నివారించడానికి షామియానాలు, మంచినీటి ప్యాకెట్లు ఏర్పాటు చేశారు. వృద్ధులు, అంగవైకల్యం గల వారికి ప్రత్యేక దర్శనం ఏర్పరిచారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావీయకుండా సి.ఐ మహేశ్వరరావు నేతృత్వంలో భారీపోలీసు బందోబస్తు ఏర్పాటుచేశారు. ప్రసాదాల కౌంటర్ల వద్ద భక్తులు బారులుతీరారు. సకాలంలో నిత్యన్నదాన ప్రసాదం గేట్లు తెరవకపోవడంతో భక్తులు తీవ్రనిరసన వ్యక్తంచేశారు.
చిరుజల్లులతో స్వాంతన
శ్రీకాకుళం , మే 12: ఉదయం ఉక్కపోత...మధ్యాహ్నం ఎండ వేడి...సాయంత్రం చిరుజల్లులు, ఇదీ పట్టణంలో ఆదివారం నాటి పరిస్థితి. ఆదివారం సాయంత్రం పట్టణంలో చిన్నపాటి చిరుజల్లులు కురవడంతో అంతవరకూ ఉక్కపోత, ఎండ వేడిమితో ఇబ్బందులు పడ్డ పట్టణ ప్రజానీకం కొద్దిపాటి సేదతీరారు. గత కొద్దిరోజులుగా భానుడు తీవ్ర ప్రతాపం చూపిస్తుండగా, దీనికి తోడు కరెంటు కోతలు మరింత పుండు మీద కారం చల్లిన చందంగా తయారయ్యాయి. అత్యధికంగా 42.9 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో గత కొద్దిరోజులుగా పట్టణ ప్రజలు ఉక్కపోతతో బయటకు వచ్చే పరిస్థితి లేదు. పట్టణంపై వాయువ్య దిశ నుండి వేడి గాలులు వీస్తుండటమే ఈ పరిస్థితికి కారణమని, తేమతో కూడిన గాలులు తోడవ్వడంతో మరింత ఉక్కపోతకు దారితీస్తుందని అధికారులు చెబుతూ వస్తున్నారు. ఈ పరిస్థితుల కారణంగా క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడి వర్షాలు పడతాయని పేర్కొంటున్నారు. ఇదిలా ఉండగా ఆదివారం సాయంత్రం ఒక్కసారిగా ఆకాశం మేఘావృతమై చిన్నపాటి చిరుజల్లులు మాత్రమే కురవడంతో జనాలు నిరాశచెందినప్పటికీ, కొద్ది రోజులుగా అనుభవిస్తున్న ఉక్కపోత నుండి చిరుజల్లులు స్వాంతన చేకూర్చడంతో కొంత హర్షం వ్యక్తం చేశారు.
నేటితరానికి ‘శుభప్రదం’
శ్రీకాకుళం, మే 12: ప్రపంచంలో ఎన్ని మార్పులు వచ్చినా సనాతన హైందవ ధర్మమునకు మించినది లేదని రాష్ట్ర రహదారులు, భవనాల శాఖామంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. భారతీయ సనాతన ధర్మం-మానవీయ నైతిక జీవన విధానం, వ్యక్తిత్వ వికాసంపై ధర్మప్రచార పరిషత్ తిరుపతి తిరుమల దేవస్థానం గురజాడ కాలేజీ వద్ద ఆదివారం ఏర్పాటు చేసిన వేసవి శిక్షణా కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అత్యంత మానవీయమైన హైందవ ధర్మాన్ని భావితరాలవారికి అందించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. అందులో భాగంగా టిటిడి ధర్మప్రచార పరిషత్ ఈ వేసవి శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిందన్నారు. శిక్షణ కార్యక్రమాన్ని ఉపయోగించుకుని తరువాతి తరాలవారికి అందించాలని సూచించారు. ముందుగా జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని నిర్వహించారు. సభాకార్యక్రమానికి అధ్యక్షత వహించిన గురజాడ విద్యాసంస్థల వ్యవస్థాపకులు స్వామినాయుడు మాట్లాడుతూ టిటిడి ధర్మప్రచార పరిషత్ ఈ శిక్షణ శిబిరాన్ని నిర్వహించడం ఆనందదాయకమన్నారు. ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం వల్ల భారతీయ సనాతనధర్మం, మానవీయ విలువలకు జీవం పోసినట్టు అవుతుందన్నారు. టిటిడి ధర్మప్రచార పరిషత్ ఆర్గనైజర్ కె.వి.సత్యనారాయణ మాట్లాడుతూ ఈ వేసవి శిక్షణ శిబిరానికి సుమారు 500 మంది విద్యార్థినీ, విద్యార్థులు హాజరుకానున్నట్టు తెలిపారు. శిక్షణ కార్యక్రమం మే 12 నుండి 18వ తేదీవరకు జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఉర్లాం సింహాద్రి సేవాసమితి అధినేత పెంట హటకేశం, కళింగపట్నం మత్స్యనారాయణస్వామి దేవాలయం ట్రస్టు కెప్టెన్ ఎర్రన్న, లోక్ అదాలత్ సభ్యులు అట్ల మోహన్‌గాంధీ తదితరులు పాల్గొన్నారు.
గిరిపుత్రుల జీవనాధారం కనె్నధార క్షేత్రం
శ్రీకాకుళం/సీతంపేట/కొత్తూరు, మే 12:ఉత్తరాంధ్ర జిల్లాలోనే మహక్షేత్రంగా శ్రీరామగిరి క్షేత్రం రానున్న రోజుల్లో నిలుస్తుందని ఉత్తరాంధ్ర సాధు పరిషత్ గౌరవాధ్యక్షుడు సత్యానంద స్వామిజీ(దుర్గాపీఠం) అన్నారు. ఆదివారం జిల్లాలో సీతంపేట మండలం పులిపుట్టి పంచాయతీ పరిధిలో గల కనె్నధార కొండ ప్రాంతంలో ఉత్తరాంధ్ర సాధు పరిషత్ అధ్యక్షుడు స్వామి శ్రీనివాసానంద సరస్వతి అధ్యక్షతన గిరిపుత్రుల సింహగర్జన బహిరంగ సభను కనె్నధార పోరాట కమిటీ నాయకులు ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా సత్యానంద స్వామిజీ మాట్లాడుతూ గిరిపుత్రులను అణచివేయాలనుకోవడం సరికాదని హెచ్చరించారు. కనె్నధార కొండ గిరిజనుల జీవనాధారమని, ఈ కొండపై ఆధారపడి అనేక గిరిజన కుటుంబాలు జీవిస్తున్నాయని వివరించారు. నేటి రాజకీయ పార్టీలు మానవ శరీరంలోని భాగాలు మాదిరిగా ఉన్నాయని అన్నారు. అనంతరం ఉత్తరాంధ్ర సాధు పరిషత్ అధ్యక్షులు స్వామి శ్రీనివాసానంద సరస్వతి మాట్లాడుతూ ఒకప్రక్క ప్రభుత్వం చెట్లు నాటి పర్యావరణాన్ని కాపాడాలని చెబుతూనే మరో ప్రక్క గిరిజన ప్రాంతాల్లో కనె్నధార వంటి కొండపై అక్రమలీజులను మంజూరు చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. గిరిజనులకు అనేక సంక్షేమ పథకాలు వర్తింపజేస్తున్నామని చెబుతున్న ప్రభుత్వం వారి మనోభావాలను గౌరవించడం లేదని విమర్శించారు. గిరిపుత్రులను అమాయకులను చేసి లీజులు పొందారన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రధాన రహదారిలో రామాలయాన్ని కూల్చివేసారని, అలాగే శ్రీకూర్మంలో కూడా మహాపచారానికి పాల్పడ్డారని పేర్కొన్నారు. ఇలా అనేక అక్రమాలకు పాల్పడుతున్న వారు దైవాగ్రహానికి గురికాక తప్పదని ఆవేదన వ్యక్తంచేశారు. మంత్రి ధర్మాన ఇకనైనా కనె్నధార లీజులను రద్దుచేసుకోవాలని కోరారు.
కనె్నధార పోరాటానికి అండగా ఉంటాం
గిరిజనుల జీవనాధారమైన కనె్నధార కొండను కాపాడుకోవడంలో కనె్నధార పోరాట కమిటీ నాయకులకు తమ పార్టీ ఎప్పుడు అండగా ఉంటుందని అఖిలపక్ష సమన్వయకర్త కలిశెట్టి అప్పలనాయుడు అన్నారు. కనె్నధార పోరాటం పేరుతో మతప్రచారం చేస్తున్నారనే విమర్శలను ఖండించారు. కనె్నధార కొండపై ప్రసిద్ధి చెందిన శ్రీరామగిరి, ముక్కుడమ్మ దేవతామూర్తులు ఉన్నారని తెలిపారు. కుల, మతాలకు అతీతంగా కనె్నధార పోరాటం జరుగుతుందని గతంలో దివంగత మాజీ కేంద్ర మంత్రి కింజరాపు ఎర్రన్నాయుడు చెప్పారని గుర్తుచేశారు. కనె్నధార లీజులు రద్దు అయ్యేంత వరకు గిరిజనులుఐక్యతతో పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ సభలో ఉత్తరాంధ్ర సాధు పరిషత్ సభ్యులు జ్ఞానానంద స్వామి, సేవకానంద స్వామి, రామానంద భారతి, విజ్ఞానంద భారతి, స్వామి సత్యానంద భారతి, బాలానందస్వామి, రామానందస్వామి, లక్ష్మణస్వామి, శివానందస్వామి, హిందూధర్మ రక్షాసమితి రాష్ట్ర అధ్యక్షులు చేదులూరి గవరయ్య, తూ.గో జిల్లా అధ్యక్షులు కర్రి ధర్మరాజు, విశాఖ జిల్లా ధర్మరక్షావేదిక అధ్యక్షులు ఎన్ వేణుగోపాలరావు, అఖిలపక్ష నాయకులు చాపరసుందరలాల్, పంచాది పాపారావు, బిజెపి జిల్లా అధ్యక్షులు నారాయణరావు, దుర్గారావు, నిమ్మక జయక్రిష్ణ, బిడ్డిక దమయంతినాయుడు, వాబయోగి, కనె్నధార పోరాట కమిటీ నాయకులు సవరతోట మొఖలింగం, పొగిరి రవి, కూర్మారావు, మిత్యారావు, రామారావు, ముత్యాలరావు, గిరిజనులు పాల్గొన్నారు.
కళింగపట్నంలో ఎగరని రెండో నెంబరు ప్రమాద సూచిక
గార, మే 12: మండలం కళింగపట్నం సముద్రతీరంలో గల వాతావరణ హెచ్చరికల కేంద్రంలో ఎగరాల్సిన రెండవ నెంబరు ప్రమాద సూచిక ఎగరలేదు. విశాఖపట్నం వాతావరణ కేంద్రం తీరంలో వెంబడి అన్ని వాతావరణ హెచ్చరికలు కేంద్రాల్లో రెండవ నెంబరు ప్రమాద సూచికలను ఎగురవేసామని పేర్కొన్నప్పటికీ కళింపట్నం వాతావరణ హెచ్చరిక కేంద్రంలో అటువంటి ప్రమాద హెచ్చరికలు ఏవి లేవు. వాతావరణంలో నెలకొన్న మార్పులు పరిణామం అల్పపీడనం, వాయుగుండం, తుఫానుగా రూపాంతరం చెందడంతో ముందస్తు చర్యగా ప్రభుత్వం వాతావరణ హెచ్చరికలను జారీచేసింది. ఈ తుఫాను కారణంగా రాష్ట్రంపై ఏ విధమైన ప్రభావం ఉండబోదని, ముందు జాగ్రత్తగా రెండవ నెంబరు ప్రమాద సూచికను ఏగురవేసామని పేర్కోంది. కళింగపట్నం కేంద్రంలో గల ఉద్యోగి అదనపు బాధ్యతలు నిర్వహిస్తుండడంతో ఇక్కడ ప్రమాద సూచికలు ఎగురవేతపై సరైన పర్యవేక్షణ లేదని స్థానికులు అంటున్నారు.
కాంగ్రెస్ ప్రతిష్ఠ పెంచేలా పాలన
* డిసిసిబి చైర్మన్ జగన్మోహన్‌రావు
సారవకోట, మే 12: కాంగ్రెస్ పార్టీ ప్రతిష్ఠను జిల్లాలో పెంచేవిధంగా డిసిసిబి పరిపాలన కొనసాగిస్తామని డిసిసిబి చైర్మన్ డోల జగన్మోహన్‌రావు స్పష్టంచేశారు. మండలంలో మాలువ గ్రామంలో స్థానిక పిఎసిఎస్ అధ్యక్షుడు నక్కరామరాజు స్వగృహంలో ఆదివారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ పారదర్శకతతో జవాబుదారీతనంగా డిసిసిబి సొసైటీలకు సేవలందిస్తుందన్నారు. జిల్లాలో 49 పిఎసిఎస్‌ల పరిధిలో రైతాంగానికి ఆయా సొసైటీల్లో జరిగే లావాదేవీల వివరాలను ఎప్పటికప్పుడు తెలియజేసే విధంగా అవసరమైన చర్యలు తీసుకున్నామన్నారు. రైతులకు మేలు చేసే విధంగా వాస్తవాలను అటు ప్రభుత్వానికి, ఇటు ప్రజలకు అనుసంధానం చేస్తూ 70 కోట్ల మేరకు రుణ సదుపాయం కల్పించేందుకు ప్రణాళిక సిద్ధం చేశామన్నారు. జిల్లాలో అవసరమైన విత్తనాలకు మూడోవంతుకు మాత్రమే ప్రభుత్వం సబ్సిడీ వస్తుందన్నారు. వ్యాపారులు ఎమ్మార్పీ రేట్ల కంటే అధిక ధరలకు ఎరువులు, విత్తనాలు విక్రయించి కృత్రిమ కొరతను సృష్టిస్తే సహించేది లేదని హెచ్చరించారు. డి-పట్టా భూములకు రుణాలు ఇవ్వలేమని ఒక ప్రశ్నకు బదులుగా చెప్పారు. సొసైటీల సిబ్బందికి శిక్షణాతరగతులు నిర్వహిస్తామన్నారు. జిల్లాలో 20 సొసైటీల్లో గిడ్డంగులు నిర్మిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మండల అధ్యక్షుడు చిన్నాల కూర్మినాయుడు, సహకార సంఘ అధ్యక్షుడు నక్క రామరాజు, కార్యదర్శి వెంకునాయుడు, పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు.
మంచినీటి సమస్యపై దృష్టిసారించండి
* అధికారులకు మంత్రి శత్రుచర్ల ఆదేశం
పాతపట్నం, మే 12: గ్రామాల్లోని ప్రజలకు తాగునీటికి ఇబ్బందులు కలిగించకుండా అధికారులు దృష్టిసారించాలని రాష్ట్ర అటవీశాఖామంత్రి శతృచర్ల విజయరామరాజు ఆదేశించారు. ఆదివారం ఇక్కడి మంత్రి కార్యాలయంలో ప్రజాదర్బార్‌ను నిర్వహించారు. ఎండలు తీవ్రస్థాయికి చేరుకున్న తరుణంలో ప్రజల తాగునీటికి అసౌకర్యం కలిగించకుండా అధికారులు చూడాల్సిన అవసరం ఉందన్నారు. అదేవిధంగా నూతనంగా రోడ్లు, పాఠశాలల అదనపుభవనాలు, రక్షిత మంచినీటి పథకాల నిర్మాణానికై పలు ప్రతిపాదనలు జరిగాయి. వివిధ సమస్యలపై ప్రజలు మంత్రివద్ద విన్నవించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు చీకటిపద్మరాజు, సన్యాసి తదితరులు పాల్గొన్నారు.
రావివలసలో హత్య
టెక్కలి, మే 12: టెక్కలి మండలంలో రావివలస గ్రామంలో జరిగిన హత్య స్థానికంగా భయాందోళన నెలకొంది. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. రావివలస గ్రామానికి చెందిన నర్తు శివ సత్యనారాయణ (25) అనే వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు తలపై తీవ్రంగా కొట్టి హత్య చేశారు. ఆదివారం వేకువ జామున ఇంటి నుండి వెళ్లిన సత్యనారాయణ గ్రామ దరిలో ఉన్న మామిడి తోట వద్ద గడ్డి పొదల్లో పడి ఉన్న విషయాన్ని స్థానికులు గుర్తించి టెక్కలి పోలీసులకు సమాచారం అందజేసారు. పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేయగా, రక్తపు మరకలు ఉన్న కర్రను గుర్తించారు. ఒక వైపు డాగ్ స్వాడ్ ఆధారాల కోసం గాలించినా ఎటువంటి ఫలితం లేకపోయింది. అయితే శివ హత్యకు మరెవ్వరితోనైనా వివాదాలు ఉన్నాయా లేక ఇతర కారణాలా అనే విషయాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. మృతుడికి భార్య జ్యోతి, కుమార్తె తనూశ్రీ ఉన్నారు. టెక్కలి సి ఐ రాంబాబు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
వైద్య ఆరోగ్య శాఖలో ప్రహసనంగా బదిలీల కౌనె్సలింగ్
శ్రీకాకుళం , మే 12: జిల్లా వైద్య ఆరోగ్య శాఖలో బదిలీల ప్రక్రియ ఓ పెద్ద ప్రహసనంలా మారింది. శనివారం ప్రారంభమైన కౌన్సిలింగ్ ఆదివారం కూడా కొనసాగింది. కౌన్సిలింగ్‌లో కొన్ని యూనియన్లు బదిలీల ప్రక్రియను ప్రశ్నించడంతో కథ మళ్లీ మొదటికొచ్చింది. దీంతో అధికారులు తలలు పట్టుకుంటున్నారు. శనివారం మొదలైన కౌనె్సలింగ్‌లో నాలగవ తరగతి ఉద్యోగుల బదిలీల్లో సుమారు 15 మందిని ఐదు సంవత్సరాలు ఒకే స్థలంలో సీనియార్టీ పూర్తి అయినా మార్చనందుకు సభ్యులు కలుగజేసుకొని అధికారుల తీరుపై మండిపడ్డారు. దీంతో మరల వారికి ఆదివారం కౌనె్సలింగ్ చేసి వేరే ప్రాంతాన్ని కేటాయించాల్సి వచ్చింది. ఇదిలా ఉంటే ఆదివారం నర్సింగ్ కౌనె్సలింగ్ మొదలుకాకమునుపే వైద్య ఆరోగ్య శాఖలోని రెండు యూనియన్లు వారివారి అనుచరులతో కౌనె్సలింగ్ కమిటీ ముందు హాజరై అధికారులతో ఘర్షణకు దిగారు. జిల్లా వైద్య ఆరోగ్య ఉద్యోగుల సంక్షేమ సంఘం నాయకులు జి.సోమేశ్వరరావు, శ్రీనివాసాచార్యులు తదితరులు గుర్తింపు లేని యూనియన్లును పట్టించుకోవలసిన అవసరం లేదని, వారిని ముందుగానే నియంత్రించాల్సి ఉన్నప్పటికీ వారినెందుకు కౌనె్సలింగ్‌లో పాల్గొనేలా చేశారంటూ మండిపడ్డారు. అందుకు అధికారులు తాము ఎవరినీ ప్రోత్సహించడం లేదని, బదిలీల ప్రక్రియ పారదర్శకంగానే నిర్వహిస్తున్నామని, యూనియన్ సభ్యులు కౌనె్సలింగ్ సమావేశానికి రాకూడదంటూ హుకుంజారీచేశారు. అనంతరం యునైటెడ్ మెడికల్, ఎంప్లారుూస్ యూనియన్ నాయకులు సోమేశ్వరరావు, అప్పారావులు కౌనె్సలింగ్ హాల్‌లోనికి వచ్చి మరల అధికారులతో ఘర్షణ పడ్డారు. నర్సింగ్‌ను ఏ ప్రాతిపదికన బదిలీ నిర్వహిస్తున్నారని, తాము యూనియన్ నాయకులుగా తమ సభ్యులకు తెలియజేయాల్సి ఉంటుందన్నారు. దీంతో పాలుపోని అధికారులు కొద్దిసేపు కౌనె్సలింగ్ ప్రక్రియను ఆపుచేసి సీనియార్టీ ప్రకారం 20 శాతం దాటకుండానే బదిలీలు చేపడుతున్నామని, దీనికి మీ నియమనిబంధనలేంటని, ఆరోగ్యశాఖ జాయింట్ డైరెక్టర్ పద్మావతి ప్రశ్నించడంతో తమకు జాబితా కావాలని పట్టుబట్టారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారిణి ఆర్. గీతాంజలి కల్పించుకొని కౌన్సిలింగ్‌ను మీరే చేసుకోండని, తాము వెళ్లిపోతామని బదులివ్వడంతో యూనియన్ సభ్యులు బదిలీ అయిన వారికి వెంటనే ఆర్డర్లు ఇవ్వాలని కోరారు. వెంటనే జెడి పద్మావతి కలుగజేసుకొని మీరు వెంటనే ఇక్కడనుండి వెళ్లాలని, తాము బదిలీ అయిన వారికి ఆర్డర్లు ఇవ్వకుండా వారు బదిలీకాబడిన స్థలానికి ఎలా వెళ్తారంటూ పేర్కొనడంతో వారు వెనుదిరిగారు. వెంటనే ఆమె పోలీసులను పిలిపించి కౌనె్సలింగ్‌కు హాజరైనవారిని మాత్రమే ఉంచి మిగిలిన వారిని బయటకు పంపించి కార్యాలయ మెయిన్‌గేటును మూయించివేశారు. కౌనె్సలింగ్‌లో రిమ్స్ ఆసుపత్రి సూపరింటెండెంటు డాక్టర్ ఆర్.అరవింద్ పాల్గొన్నారు.
అన్నదాతపై ఎరువు భారం
ఎచ్చెర్ల, మే 12: కేంద్ర ప్రభుత్వం ఎరువుల సబ్సిడీలో కోతవిధించి రైతులను నిరాశకు గురిచేసింది. అధిక ధరలు కలిగిన డిఏపి, ఎం.ఒ.పి వంటి ఎరువులపై సబ్సిడీ రాయితీని తగ్గించడంతో భారం మోయాల్సిన దుస్థితి నెలకొంది. ధరల తగ్గుదలఫలితం రైతుల దరిచేరకుండాపోయింది. అంతర్జాతీయ మార్కెట్‌లో ఎరువుల ధరలు తగ్గుముఖం పట్టాయి. స్థానికంగా ఎరువుల ధరలు దిగివస్తాయని అన్నదాతలు ఆనందపడేలోగా అది కాస్తఆవిరైపోయింది. జిల్లా రైతాంగంపై 239 కోట్లరూపాయల ఎరువుల అదనపు భారం పడనుంది. ఖరీఫ్‌లో 4,97,500 ఎకరాల విస్తీర్ణంలో వరిసాగవుతోంది. ఇతర పంటల సాగువిస్తీర్ణం గణనీయంగానే ఉంటుంది. ఒక్క ఖరీఫ్‌లోనే 78,813 టన్నుల యూరియా, 37,187 టన్నుల డిఏపి, 27,035 టన్నుల ఎం.ఒ.పి, 27,204 టన్నుల కాంప్లెక్సు ఎరువులు వినియోగిస్తున్నట్లు గణాంకాలు స్పష్టంచేస్తున్నాయి. తాజాగా సబ్సిడీ కుదింపుతో 239.34 కోట్ల మేర అన్నదాతలపై భారం పడనుంది. కిలో ఎరువుపై కనిష్టంగా నాలుగు నుంచి గరిష్టంగా ఆరు వరకు సబ్సిడీ తగ్గించారు. కిలో నైట్రోజన్‌పై ప్రస్తుతం 24 రూపాయల సబ్సిడీ వస్తుండగా దీనిని రూ.20.87కు కుదించారు. పాస్ఫేడ్‌పై రూ.21.80 నుంచి రూ.18.67 రూపాయలకు తగ్గించగా పొటాష్‌పై రూ.24 నుంచి రూ.18.33 పైసలకు రాయితీని కుదించి రైతులపై భారంవేసింది. ప్రస్తుతం 50 కిలోల డిఏపి బస్తా 1260 రూపాయలు కాగా ఎంఒపి ధర 880 రూపాయలు ఉంది. ఇలా పరిశీలిస్తే జిల్లాలో ఖరీఫ్‌లో ఈ రెండు రకాల ఎరువులపై రైతులు 230 కోట్ల మేర రాయితీని కోల్పోతున్నారు. అంతర్జాతీయ మార్కెట్‌లో ఎరువుల ధర తగ్గుదల ప్రభావంతో టన్ను డిఏపిపై 1500, ఎంఒపిపై వెయ్యిరూపాయలు తగ్గుతుందని అంచనా వేస్తున్నారు. అంటే డిఏపి బస్తాపై 75 రూపాయలు , ఎం.ఒ.పి. బస్తాపై 50 రూపాయల మేరకే తగ్గే అవకాశం ఉంది. కాని సబ్సిడీ కుదింపుతో ఈ ప్రయోజనం రైతులకు అందకుండాపోయింది. రెండేళ్లుగా డిఏపి, ఎం.ఒ.పి ధరలు హద్దు అదుపు లేకుండా పెంచుకుంటూపోయారు. 600 ఉన్న బస్తా నేడు 1200 రూపాయలకు చేరిందని అన్నదాతలు నిట్టూరుస్తున్నారు. కొత్త్ధరలకోసం ఇటు రైతులు, అటు వ్యాపారులు ఆశక్తిగా ఎదురుచూస్తున్నారు. వివిధ కంపెనీల ఆంక్షలతో వ్యాపారులు సతమతమవుతున్నారు. ముఖ్యంగా రైతులు ఎక్కువగా వినియోగించే యూరియా కావాలంటే ఇచ్చినంత డిఏపి తీసుకెళ్లాలంటూ నిబంధనలు పెట్టడంతో అన్నదాతలు మరింత భారాన్ని మోయకతప్పడం లేదు. ఎరువు పరిస్థితి ఇలా ఉంటే విత్తనాల కొరత ఎలా వెంటాడుతుందోనన్న భయం కూడా లేకపోలేదు. పంట రుణాల విషయానికొస్తే..బ్యాంకులు వ్యవసాయ మదుపులకు తగ్గ మొత్తాన్ని పెంచకపోవడం, అంతేకాకుండా ఏళ్ల తరబడి పంట రుణం పొందుతున్న ఖాతాదారులు కూడా మీసేవ కేంద్రాల నుంచి అడంగల్ తీసుకురావాలని నిబంధనలు పెట్టడంతో వారంతా దిక్కులు చూస్తున్నారు. ఇటువంటి కష్టాల నుంచి అన్నదాతలను గట్టెక్కించేలా ప్రభుత్వం నిబంధనలు సడలించాలని రైతులు కోరుతున్నారు.