విశాఖపట్నం, మే 12: కొత్త రైళ్ళు వచ్చేస్తున్నాయి. ఒకేసారి అయిదు కొత్త రైళ్ళు పట్టాలెక్కడం విశాఖ రైల్వేస్టేషన్ చరిత్రలో ఇదే తొలిసారి కావడం విశేషం. గుడ్డిలో మెల్లగా ఏడాదికోసారి, లేదంటే రెండు మూడు దశల్లో ఒక్కో కొత్త రైలును మాత్రమే అందించే భారతీయ రైల్వే ఈసారి అయిదు రైళ్ళకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఇవన్నీ విశాఖ నుంచి బయలుదేరి వెళ్తున్నవే కావడం మరో ప్రత్యేకత. ఇందులో విశాఖ-రాయగడ మధ్య రైల్వే కొత్త రైలును ప్రవేశపెట్టింది. దీనివల్ల రాయగడ పాసింజర్ రద్దీని తగ్గించినట్టు అవుతుంది. ఉత్తరాంధ్ర జిల్లాల ప్రయాణికులకు ఇదొక వరం కానుంది. ఇటీవల విపరీతంగా పెరిగిన ఆర్టీసీ చార్జీలు పేద, మధ్యతరగతి వర్గాలకు పెనుభారంగా మారిన తరుణంలో రాయగడ నుంచి విశాఖకు కొత్త రైలును ప్రవేశపెట్టడంతో వలస కార్మికులు, చిల్లర వర్తకులు, చిరు ఉద్యోగులు, పేద కుటుంబాలకు ప్రయోజనకరంగా నిలువనుంది. ఇది జూలై మొదటి వారంలో పట్టాలెక్కే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అలాగే విశాఖవాసులు కొనే్నళ్ళుగా కంటున్న కలలు నిజం అయినట్టుగా విశాఖ-కొల్లాం ప్రత్యేక రైలు ఇక నుంచి రెగ్యులర్ కానుంది. ప్రస్తుతం ఇది ప్రతి గురువారం ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్తుంది. దీనివల్ల సీజన్‌లో అయ్యప్ప భక్తులకు కాస్త సౌలభ్యంగా ఉంటుంది. నిత్యం చెన్నై తదితర ప్రాంతాలకు తరలి వేళ్ళె వారికి సౌకర్యంగా ఉంటుంది. ఇంతవరకు బొకారో ఎక్స్‌ప్రెస్ మాత్రమే భక్తులకు, ప్రయాణికులకు ఆధారంగా ఉండేది. అటువంటిది ఇపుడు రెగ్యులర్‌గా నడిచే కొల్లాం ఎక్స్‌ప్రెస్‌తో కొంతవరకు ప్రయాణికుల కష్టాలు తగ్గనున్నాయి. దీని తరువాత ఇదే తరహాలో విశాఖ-నాందేడ్ ఎక్స్‌ప్రెస్, విశాఖ-టాటానగర్ (వయా కటక్), విశాఖ-జోధ్‌పూర్ (వయా టిట్లాగర్, విశాఖ-గాంధీగ్రామ్ (వయా విజయవాడ) మధ్య కొత్త రైళ్ళు వస్తున్నాయి. ఇవి జూలై మొదటి వారం నుంచి నడవనున్నాయి. ఇందుకు సంబంధించి రైల్వేబోర్డు నుంచి ఈస్ట్‌కోస్ట్ రైల్వే ఉన్నతాధికారులకు ఆదేశాలు రానున్నాయి. ఈ విధంగా కొత్త రైళ్ళు వస్తుండటం పట్ల ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నా, మరోపక్క అయిదేళ్ళుగా పెండింగ్‌లో ఉన్న మళ్ళింపు రైళ్ళకు మోక్షం లభించకపోవడంపట్ల నిరసన వ్యక్తమవుతోంది.
మళ్ళింపు రైళ్ళకు లేని మోక్షం
అయిదేళ్ల నుంచి పెండింగులో ఉన్న మళ్ళింపు రైళ్ళకు ఈ ఏడాది మోక్షం లభించినట్టు లేదు. దీనికి గ్రీన్‌సిగ్నల్ ఇవ్వకపోవడంతో ఇవి ఇంకా దువ్వాడ మీదుగానే నడవనున్నాయి. దువ్వాడ మీదుగా నడిచే 12 మళ్ళింపు రైళ్ళలో ఏడింటిని విశాఖపట్నం రైల్వేస్టేషన్‌కు తీసుకురాగలిగారు. అయితే మరో అయిదు రైళ్ళు మాత్రం రావలసి ఉంది. వీటి గురించి ఏడాది కాలంగా ప్రజా సంఘాలు ఉద్యమిస్తున్నాయి కూడా. కనీసం ఈ ఏడాది ఫిబ్రవరి రైల్వే బడ్జెట్‌లోనైనా మంజూరు చేయాల్సిందిగా అధికారులు, ప్రజాప్రతినిధులు డిమాండ్ చేశారు. అయినా ఫలితంలేకపోయింది.
కార్యకర్తల మనోభీష్టం మేరకే...
= రిపోర్టర్స్ డైరీ =
పార్టీల్లో వలసల పరంపర కొనసాగుతోంది. ఏ రాష్ట్రంలోని లేనంత వేగంగా మన నాయకులు పార్టీలు ఫిరాయించేస్తున్నారు. రాష్ట్ర నాయకుడి దగ్గర నుంచి, జిల్లా, నియోజకవర్గ స్థాయి నాయకుల వరకూ ఇప్పుడు ఈ పనిలోనే ఉన్నారు. ఏళ్ళ తరబడి కొనసాగుతున్న పార్టీపై వెగటుపుట్టో.. పక్క పార్టీపై ప్రేమజనించో రోజుకో పార్టీ మార్చేస్తున్నారు మన నేతలు. గతంలో ఫలానా దేశ నాయకుడు ఎవరు? అని పరీక్షల్లో ప్రశ్న ఇస్తే.. జవాబు పేపరు దిద్దే సమయానికి సదరు పదవిలో ఉన్నాయన మారిపోయే పరిస్థితి ఉండేది. ఇప్పుడు మీ నాయకుడు ఏపార్టీలో ఉన్నాడు? అని ప్రశ్నిస్తే... ఆ నియోజకవర్గంలోని జనావళి కాసేపు బుర్ర గోక్కోవలసిందే.
ఎన్నికలకు ఇంకా ఒక ఏడాది సమయం ఉంది. ఇప్పటికే ఈ వలసలు వేగాన్ని పుంజుకున్నాయి. ఇవి మరింత ఉద్ధృతమై, పార్టీలను కుదిపేసే పరిస్థితి ఉందని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఎవరేపార్టీకి వెళితే మనకేంటి?.. అని సరిపెట్టుకునే జనం కొంతమంది ఉంటే.. గోడ దూకేసిన వారిని యావగించుకుంటున్నారు ఎక్కువ మంది. ఇలాంటి వలస నేతలకు వచ్చే ఎన్నికల్లో జనం ఇచ్చే తీర్పు ఎలా ఉన్నా.. పార్టీలను వదిలి వెళ్ళే వారి స్టేట్‌మెంట్ వింటే చిత్రంగా ఉంటుంది.
మన జిల్లాలో గంటా శ్రీనివాసరావు.. గణబాబు, కొణతాల రామకృష్ణ.. దాడి వీరభద్రరావు.. చెంగల వెంకటరావు.. గండి బాబ్జి.. బలిరెడ్డి సత్యారావు.. కుంభా రవిబాబు.. ఇలా ఎంతమందినైనా చేర్చుకోవచ్చు వలస పక్షుల జాబితాలో. పార్టీ మారిన ప్రతి నాయకుడి ముందు మీడియా ప్రత్యక్షమై మీ భవిష్యత్ కార్యాచరణ ఏంటని రొటీన్ ప్రశ్న వేస్తారు. వెంటన ఆ వలస పక్షి కాలరు సవరించుకుని, ముసి ముసి నవ్వులు నవుతూ, అందులోనే రౌద్రాన్ని ప్రదర్శిస్తూ మా కార్యకర్తలతో మాట్లాడి.. వారి అభీష్టం మేరకు నిర్ణయం తీసుకుంటానని చెబుతారు. కానీ ఇది శుద్ధ అబద్ధం.. నేతి బీరకాయలో నెయ్యి ఉందన్న నిజంలో ఎంత నిజముందో... వీరి ప్రకటనలో కూడా అంతే నిజం ఉంటుంది. వీరంతా కార్యకర్తల మనోభీష్టం మేరకే పార్టీలను ఫిరాయిస్తున్నారట. వారికి సొంత నిర్ణయం అంటూ ఏమీ లేదంట. పార్టీ మారుతున్న నాయకులు నిజంగా కార్యకర్తల మనోభావాలను తెలుసుకుంటున్నారా? ఉన్న పార్టీల ఎగ్జిస్టింగ్ ప్రాబ్లం వచ్చినా.. ఆ పార్టీ అధినేతతో చెడినా.. పార్టీ నుంచి బయటకు వచ్చేస్తారు. కార్యకర్తలు బయటకు వచ్చేయమన్నా.. అదే పార్టీలో కొనసాగమన్నా సదరు నాయకులు చెవికెక్కించుకుంటారా? లేదే? లేటెస్ట్‌గా చూస్తే.. పక్క పార్టీలో పరిస్థితి బెటర్ అనిపిస్తే ఆ అధినేతతో ములాఖత్ అయి, అక్కడ బెర్త్ ఖరారు అయ్యాకే, ఉన్న పార్టీ సభ్యత్వ చీటీని చించేస్తారు. వెళుతూ వెళుతూ అప్పటి వరకూ ఉన్న పార్టీని నోటికొచ్చినట్టు తిట్టి.. ఆ పార్టీ నాయకుడు పరమ మూర్ఘుడని ముద్ర వేసి.. త్వరలోనే ఆ పార్టీ జెండా పీకేస్తుందని జోస్యం చెప్పి మరీ వెళ్ళిపోతున్నారు.
నిన్నటికి నిన్న దాడి వీరభద్రరావు జగన్ పిలుపునందుకుని టిడిపికి రాజీనామా చేసి వైఎస్‌ఆర్ కాంగ్రెస్ గొడుగు కిందకు చేరిపోయారు. 30 ఏళ్ళపాటు ఆయన టిడిపిలో తిరుగులేని నాయకునిగా కొనసాగి, అనేక పదవులను అలంకరించి.. చివరాఖరకు చంద్రబాబు నాయుడుపై ఓ బకెట్టెడు బురుద చల్లి మరీ వెళ్ళిపోయారు. పార్టీలో ఇమడలేని వారు బయటకు వచ్చేయడాన్ని ఎవ్వరం కాదనలేం. అయితే 24 గంటలు తిరక్కుండానే.. వేరే పార్టీలో చేరిపోయి వారి రాజకీయ చరిత్ర కంటిన్యుటీ దెబ్బతినకుండా జాగ్రత్త పడుతున్నారు. గడచిన కొంత కాలంగా జగన్‌ను నానా విధాలుగా విమర్శించిన దాడి ‘చంచల్‌గూటి’లో చేరిన వెనువెంటనే జగన్‌కు క్లీన్ చిట్ ఇచ్చేశారు. తను విన్న జగన్ వేరు.. చూసిన జగన్ వేరు అంటూ కొత్త భాష్యం చెప్పారు. గతంలో తాను జగన్‌పై చేసిన వ్యాఖ్యలన్నీ టిడిపి నా నోట పలికించినవేనని సర్దిచెప్పుకున్నారు.
టిడిపికి రాజీనామా చేసిన తరువాత దాడి అనకాపల్లిలో కార్యకర్తల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఆ సమావేశానికి హాజరైన కార్యకర్తలు దాడిని టిడిపి నుంచి వెళ్ళొద్దని వేడుకున్నారు. బయటకు వెళితే, నష్టపోతారని హెచ్చరించారు. మరి 30 ఏళ్ళపాటు ఈ కార్యకర్తలంతా ఆయన వెంటే నడిచారే.. కొణతాల వర్గంతో వ్యక్తిగత వైరం లేకపోయినా, పార్టీ పరంగా విరోధులయ్యారే.. వీరు వద్దంటున్నా, దాడి పార్టీని ఎందుకు విడిచి వెళ్ళిపోయారు? ఆయన కార్యకర్తల మనోభీష్టాన్ని గౌరవించినట్టేనా? దాడి ఒక్కరే కాదు.. పార్టీ మారే ప్రతి ఒక్కరూ కార్యకర్తలపై నెపం నెట్టేసి జెండాలు మార్చేస్తున్నారు. ఇలా ఒక పార్టీలోని కార్యకర్తల మనోభావాలను దెబ్బతీసి, మరో పార్టీలోకి వెళ్లి, అక్కడి కార్యకర్తల ఆకట్టుకోగలుగుతారా? ఒకవేళ కొత్తగా చేరిన పార్టీలో పరిస్థితులు తనకు అనుకూలంగా లేకపోతే, మాతృ పార్టీకే తిరిగి వచ్చేస్తే, ఇక్కడి కార్యకర్తలు మళ్లీ ఆ నేతను ఆదరిస్తారా? ఇవన్నీ నాయకులకు అక్కర్లేదు. వారి అంతిమ లక్ష్యం ఏ పార్టీనుంచైనా ఎన్నికల్లో నెగ్గడమే. ఏ పార్టీలోనైనా నాయకులు కార్యకర్తలతో మమేకం అవుతున్నారా? వారితో విస్తృత స్థాయి సమావేశాలు నిర్వహిస్తున్నారా? మనసు విప్పి మాట్లాడుతున్నారా? భుజాలు అరిగిపోయేట్టు జెండాలు మోసిన కార్యకర్తలను ఏనాడైనా ఓదార్చారా? వారికి ఏ సహాయమైనా చేశారా? ఎన్నికల ముందు జరిగే సభల్లో వేదికలెక్కి కార్యకర్తలే పార్టీకి మూల స్తంభాలు.. వారు సైనికుల్లా పనిచేయాలంటూ ఉపన్యాసాలు ఇస్తారు. అధికారంలోకి వస్తే కార్యకర్తలు వీరికి చీపురుపుల్లతో సమానం. అధికారం రాకపోతే..ఒక వేళ ప్రతిపక్షంలోనే ఉంటే, ఈ కార్యకర్తలే రోడ్డెక్కి ధర్నాలు చేయాలి.. ఆందోళనలు చేయాలి. కేసులు నమోదైతే, కోర్టులు చుట్టూ తిరగాలి. కార్యకర్తలు ఎప్పటికీ ఇలానే ఉంటారు..ఉండిపోతారు.. వీరి మనోభావాలకు గౌరవం ఇస్తున్నట్టు ఎందుకు కలరింగ్ ఇవ్వాలి?
- బ్యూరో, విశాఖ
జివిఎంసిలో గతి తప్పుతున్న
ఆహార తనిఖీలు
విశాఖపట్నం, మే 12: ఆహార పదార్థాల నాణ్యతలో డొల్లతనం. తినే ఆహారంలో కల్తీ. విక్రయించే ఆహార ఉత్పత్తుల్లో నాణ్యతాలోపం. ఉన్నతాధికారుల పరిశీలలో వెల్లడవుతున్న ఈ అంశాలు అటు అధికార యంత్రాంగాన్ని, ఇటు ప్రజానీకాన్ని ఆందోళనకు గురిచేస్తున్నాయి. నగర పరిధిలో జోరుగా సాగుతున్న ఆహార పదార్థాల కల్తీ సంఘటనలు ఒకటొకటిగా వెలుగుచూస్తున్నాయి. అతిపెద్ద యంత్రాంగం కలిగిన జివిఎంసిలో ఆహార పదార్థాల నాణ్యతను నిర్ధారించడంతో పాటు నిబంధనలను పాటించని వారిపై చర్యలు తీసుకునే పరిస్థితులు కానరావట్లేదు. జివిఎంసి పరిధిలో ఆహార పదార్ధాల నాణ్యతను పరిశీలించడతో పాటు కల్తీ నిరోధానికి సంబందించి వార్డు పరిధిలో శానిటరీ ఇనస్పెక్టర్లు బాధ్యత వహించాల్సి ఉంటుంది. అయితే ప్రభుత్వ ఆదేశాల మేరకు జివిఎంసి పరిధిలో ఫుడ్‌సేఫ్టీ అధికారులే ఆబాధ్యతలు నిర్వహిస్తున్నారు. జివిఎంసి సిబ్బందిలో ముగ్గురు అధికారులకు ఫుడ్ శాంపిళ్లను తీయడం వంటి అంశాల్లో శిక్షణనిచ్చి వారినే ఫుడ్‌సేఫ్టీ అధికారులుగా నియమించారు. రెండేసి జోన్ల బాధ్యతలను వీరికి అప్పగించారు. వీరు ప్రతి నెలా 12 శాంపిళ్లను తీసి ప్రధాన వైద్యాధికారికి నివేదించాలి. అయితే ఫుడ్‌సేఫ్టీ అధికారుల పనితీరును పర్యవేక్షించేందుకు డిజిగ్నేటేడ్ అధికారి పోస్టు ప్రస్తుతం జివిఎంసిలో ఖాళీగా ఉంది. దీంతో వీరు రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో డిజిగ్నేటెడ్ అధికారి ఆధీనంలో పనిచేస్తున్నారు. అయితే జివిఎంసి నుంచి ఫుడ్‌సేఫ్టీ అధికారులుగా నియమితులైన వీరు సర్వ స్వతంత్రులుగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు విన్పిస్తున్నాయి. దీనితో పాటు ముగ్గురు అధికారులు 72 వార్డులు పర్యవేక్షించే బాధ్యతలు అప్పగించడం కూడా వారికి కలిసివచ్చిన అంశం. ఇక జివిఎంసి పరంగా వార్డుల్లో శానిటరీ ఇనస్పెక్టర్లు ఫుడ్‌స్ట్ఫ్టీ అధికారుల బాధ్యతలను చూసే అవకాశం ఉన్నప్పటికీ వారు ఈ విషయంలో పెద్దగా ఆసక్తి కనబరచట్లేదు.
ఇదిలా ఉండగా జివిఎంసి ఉన్నతాధికారులు ఇటీవల నగరంలో ఆహార పదార్ధాల నాణ్యత, ప్రమాణాలు పాటించే అంశాలపై దృష్టి సారించారు. అందుతున్న ఫిర్యాదుల మేరకు ఇటీవల విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. పలు హోటళ్లు, ఇతర ఆహార పదార్ధాల విక్రయాలపై దాడులు నిర్వహించారు. ముఖ్యంగా హనుమంతవాక కబేళాలో జరుగుతున్న మాసం విక్రయాలపై కూడా దాడులు చేశారు. ఇతర ప్రాంతాల నుంచి కుళ్లిన మాసం తెచ్చి విక్రయించం వంటి అంశాలు వెలుగు చూశాయి. దీంతో విధినిర్వాహణలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ఫుడ్‌సేఫ్టీ అధికారిని జివిఎంసి సస్పెండ్ చేసింది. అయితే ఫుడ్ శాంపిల్స్ సేకరించడంతో పాటు నాణ్యత నిర్ధారణ పరీక్షలు సకాలంలో కల్తీకి పాల్పడుతున్న వారిపై చర్యలకు ఉపక్రమించాల్సి ఉంది.
18 గంటలపాటు నిజరూప దర్శనం
సింహాచలం, మే 12: సింహాచలేశుని నిజరూప దర్శన భాగ్యాన్ని భక్తులకు సుమారు 16 గంటల నుండి 18 గంటల సమయం కల్పించేందుకు అనువుగా అన్ని ఏర్పాట్లు చేసామని రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయశాఖ కమిషనర్ బలరామయ్య అన్నారు. ఆదివారం ఆయన సింహగిరికి వచ్చి చందనయాత్ర ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా విలేఖరులతో మాట్లాడారు. గత సంవత్సరం పోలీసులు, విఐపిల కారణంగా ఎదురైన సమస్యలు ఈసారి పునరావృతం కావని అన్నారు. జిల్లా కలెక్టర్ పర్యవేక్షణలో ఏర్పాట్లన్నీ కట్టుదిట్టంగా జరిగాయని ఆయన చెప్పారు. ఈ ఏడాది విశేషణంగా రాత్రి సహస్ర ఘటాభిషేక దర్శనం ఏర్పాటు చేసామని ఆయన అన్నారు. స్వామివారి అభిషేక దర్శనం కొంతమందికే పరిమితమయ్యేదని ఈసారి వేలసంఖ్యలో భక్తులకు ఆ అవకాశం కలుగుతోందని ఆయన అన్నారు. సుమారు 15 వందల మంది పోలీసులు షిఫ్ట్‌ల వారీగా బందోబస్తు విధులు నిర్వహిస్తారు. ఆదివారం ఎడిసిపి అచ్యుతరావు నేతృత్వంలో పోలీసు అధికారులు సిబ్బందికి విధులు కేటాయించారు.
స్టేషన్‌లో టెన్షన్... టెన్షన్
విశాఖపట్నం, మే 12: విశాఖపట్నం రైల్వేస్టేషన్ అంటే పరిశుభ్రతకు, ప్రశాంతతకు మారుపేరుగా ఉండేది. ఇది ఒకప్పటి మాట. ప్రస్తుతం మాత్రం దీనికి భిన్నమైన పరిస్థితులు నెలకొన్నాయి. ఎపుడూ లేని విధంగా విశాఖ రైల్వేస్టేషన్‌లో ఇటీవల టెర్రరిస్టుల రెక్కీ నిర్వహించిన సమాచారం రైల్వే పోలీసులు (జిఆర్‌పి), రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్పీఎఫ్) వర్గాలకు సవాల్‌గా మారిందని చెప్పాల్సి ఉంటుంది. రైల్వే ఆస్తులు, విశాఖ రైల్వేస్టేషన్‌ను లక్ష్యంగా పెట్టుకుంటున్నందునే ఈ విధమైన రెక్కీకి పాల్పడినట్టుగా తెలుస్తోంది. హైదరాబాద్ బాంబు పేలుళ్ళ సంఘటనతో అప్రమత్తమైన రైల్వే పోలీసులు రెండు మాసాలుగా గుంటూరు, రాజమండ్రి, విశాఖ రైల్వేస్టేషన్లలో పటిష్ట భద్రతా చర్యలు చేపడుతున్నారు. నిత్యం డాగ్ స్క్వాడ్, మెటల్ డిటెక్టర్లతో తనిఖీలు నిర్వహిస్తున్నారు. స్టేషన్‌లోను, ఖాళీ రైళ్ళల్లో పడేసి ఉన్న సూట్‌కేసులు, సంచులు, ఖాళీ బ్యాగులపై దృష్టి పెడుతున్నారు. ముఖ్యమైన గోదావరి, విశాఖ, గరీభ్థ్,్ర దురంతో, ఈస్ట్‌కోస్ట్, కోరమండల్, గౌహతి-త్రివేండ్రం, ప్రశాంతి, కోణార్క్ తదితర రైళ్ళల్లో ఎసి కోచులను నిశితంగా పరిశీలిస్తున్నారు. అయినా ఇటీవల జరిగిన పలు సంఘటనలు పోలీసులకు పరీక్ష పెడుతున్నట్టుగా మారాయి. ప్రభుత్వ రైల్వేపోలీసు ఎస్పీ కార్యాలయం పరిధిలో గుంటూరు స్టేషన్‌లో వరుసగా రెండుచోట్ల 125 డిటోనేటర్లు, బలమైన తీగలను గుర్తించిన రైల్వే పోలీసులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. దీంతోపాటు ఒకేసారి గుంటూరు, విశాఖ రైల్వేస్టేషన్లలో టెర్రరిస్టులు రెక్కీ నిర్వహించారనే సమాచారాన్ని పోలీసులు రాబట్టగలిగారు. ఫలితంగా మరింత అప్రమత్తం కావలసి వచ్చింది.
పార్శిళ్ళు, ఎసి కోచుల్లో తనిఖీలు
భద్రతను కట్టుదిట్టం చేయడంలో భాగంగా విశాఖ రైల్వేస్టేషన్‌లో పార్శిల్ విభాగంపై పోలీసులు నిఘా పెట్టారు. అలాగే ఆదివారం పలు రైళ్ళలోకి ఎక్కించే పార్శిళ్ళను నిశితంగా తనిఖీ చేశారు. డాగ్ స్క్వాడ్, మెటల్ డిటెక్టర్లకు మళ్ళీ పని చెబుతున్నారు. సిఐ, ఎస్‌లతో సహా పోలీసు బృందం ప్రత్యేకించి భద్రతకే ప్రాధాన్యమిస్తున్నారు.
దొంగల భీభత్సవం
విశాఖ రైల్వేస్టేషన్‌కు టెర్రరిస్టుల భయం పట్టుకుంటే, దీనికి దొంగల బీభత్సం తోడవుతోంది. ఎసిలు, స్లీపర్ కోచులు అనే తేడా లేకుండా అంతర్రాష్ట్ర ముఠాలు రైళ్ళల్లో దోపిడీలకు పాల్పడుతున్నారు. గడచిన వారం రోజుల్లో రెండు భారీ సంఘటనలు ఇందుకు ఉదాహరణగా చెప్పవచ్చు.
పారిశుద్ధ లోపం
వీటితో పాటు విశాఖ స్టేషన్ అపరిశుభ్రతకు నిలయంగా మారుతోంది. ఒకపుడు శుభ్రతలో అవార్డును పొందిన స్టేషన్‌లో నిత్యం పారిశుద్ధ్య సమస్యలు నెలకొంటున్నాయి. కాంట్రాక్ట్ పద్ధతిపై పనిచేసే 261 మందిని కొత్త కాంట్రాక్ట్ యాజమాన్యం తొలగించడంతో నెలకొన్న సమస్య కాస్త తీవ్రతరమైంది. మరోపక్క కోరాపుట్, సంబల్‌పూర్ తదితర ప్రాంతాల నుంచి రైల్వే పారిశుద్ధ్య సిబ్బందిని తీసుకు వస్తున్నారు. అయినా పట్టాలు, ప్లాట్‌ఫారాలపై పేరుకుపోయిన చెత్త, దుర్గంధపూరితమైన వాతావరణం అలాగే ఉంటోంది.
కాఫీ గొడౌన్‌ను పేల్చివేసిన మావోలు
* ఒక్కరోజు ముందే రెక్కీ
గూడెంకొత్తవీధి, మే 12: మండలం పెదవలస వద్ద ఉన్న ఎ.పి.ఎఫ్.డి.సి. కాఫీ గొడౌన్‌ను శనివారం రాత్రి సి.పి.ఐ. మావోయిస్టులు మందుపాతర్లతో పేల్చివేశారు. 1995లో నిర్మించిన ఈగొడౌన్ పాక్షికంగా దెబ్బతింది. లోపల ఉన్న వస్తువులు పూర్తిగా ధ్వంసమయ్యాయి. శనివారం సి.పి ఐ. మావోయిస్టులకు చెందిన మిలీషియా సభ్యులు పెదవలసలో రెక్కీ నిర్వహించినట్లు తెలిసింది. ఐదుగురు వ్యక్తులు ఉదయం నుంచి సాయంత్రం వరకు గ్రామంలో సంచరిస్తూ కాఫీ గొడౌన్ పరిసర ప్రాంతాలను పరిశీలించినట్లు గ్రామస్థులు తెలిపారు. అందరూ నిద్రపోతుండగా రాత్రి 10:30 ప్రాంతంలో పెద్ద శబ్దం వినిపించిందని గ్రామస్థులు తెలిపారు. ఉదయం చూసేసరికి కాఫీ గొడౌన్‌ను పేల్చివేసినట్లు గుర్తించామన్నారు. కాఫీ గొడౌన్ పేల్చివేతకు ముందు గొడౌన్‌కు అనుకుని ఉన్న మరో గది తలుపులను పగలగొట్టారు. లోపల ఉన్న పనికి వచ్చే వస్తువులను బయటకు తీసి మిగతా వాటికి నిప్పటించారు. వీటిలో కొన్నింటిని తీసుకువెళ్ళగా, కాఫీ ఇంజన్‌ను మోయలేక మార్గ మధ్యలో వదిలిపెట్టారు. అలాగే మందుపాతర పేల్చడానికి ఉపయోగించిన వైర్లు కూడా సమీప ప్రాంతంలో వదిలారు. ఈ సంఘటనలో గాలికొండ ఏరియా కమిటీకి చెందిన ఐదుగురు మిలీషియా సభ్యులు పాల్గొన్నట్లు పోలీసులు గుర్తించారు.
కానరాని ఎమ్మెల్యే జాడ
* టిడిపి నాయకుల విమర్శ
పాయకరావుపేట, మే 12: పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబూరావు జాడ ఎక్కడ కనిపించడం లేదని తెలుగుదేశం నాయకులు కంకిపాటి వెంకటేశ్వరరావు, గొర్రెల రాజబాబు, పెదిరెడ్డి చిట్టిబాబు, మజ్జూరి నారాయణరావు, పెదిరెడ్డి శ్రీను విమర్శించారు. ఆదివారం విలేఖర్లతో పార్టీ నాయకులు మాట్లాడు తూ రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన గొల్ల బాబూరావు నియోజకవర్గం లో చేసిన అభివృద్ది ఏమిటని ప్రశ్నించా రు. పార్టీలవల్ల లబ్ధిపొందిన వారే పా ర్టీని వీడి వేరే పార్టీలోకి వెళ్తున్నారన్నా రు. ప్రజలకు సేవ చేద్దామనే ఉద్దేశ్యంలో ఎవరు రాజకీయాల్లోకి రావడంలేదన్నా రు. కేవలం పదవీ కాంక్షతోనే పార్టీలో ఉండి అది కాస్త ఊడేసరికి, కుంటిసాకు లు చెప్పి పార్టీ వీడి వేరే పార్టీలోకి వెళ్తున్నారని తెలిపారు. పార్టీ మారిన నాయకులు అక్కడ నాయకులతో ఇమడలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. రాబోయే ఎన్నికల్లో కుంభకోణా ల పార్టీ కాంగ్రెస్, దొంగల పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలకు ప్రజల ఆదరణ లభించదన్నారు. రాష్ట్ర ప్రజలందరూ తెలుగుదేశం పార్టీ వైపు చూస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో రాజకీయాలు అస్తవ్యస్తంగా ఉన్నాయని, దీన్ని గాడిలో పెట్టగల సత్తా ఒక్క చంద్రబాబుకే ఉందన్నారు.
పదేళ్ల కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం అభివృద్ధిలో 20 ఏళ్ళు వెనక్కు వెళ్ళిందన్నారు. చేసిన తప్పులు కప్పిబుచ్చుకోవడానికి మంత్రులు అధికారాన్ని ఉపయోగించుకుంటున్నారని ఆరోపించారు. ప్రజలకు జవాబుదారీ త నం తెలుగుదేశం ప్రభుత్వం హయాంలోనే ఉందన్నారు. ఉపాధి హామీ పథకం అధికారులకే తప్ప కూలీలకు ఉపయోగపడటం లేదన్నారు. పెరిగిన ధరలు, విద్యుత్ కోతలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. చెం గల వెంకట్రావువల్ల పార్టీని వీడిన వా రంతా తిరిగి దేశం పార్టీలోకి రావడానికి ఇష్టపడుతున్నారని నాయకులు తెలిపారు. ఈ సమావేశంలో నాయకులు పిన్నింటి సూరిబాబు, చిట్టిమూరి రామారావు, తలారి రాజా, శంకర్, సురేష్ పాల్గొన్నారు.
‘ఆథ్యాత్మిక భావాలు ప్రజల్లో ఐక్యతను పెంచుతాయి‘
చోడవరం, మే 12: ఆధ్యాత్మిక భావాలు ప్రజల్లో ఐక్యతను పెంపొందింపజేస్తాయని వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులు బలిరెడ్డి సత్యారావు అన్నారు. ఆదివారం పిఎస్‌పేట గ్రామంలో లక్ష్మీగణపతి దేవస్థానం సభ్యులు నిర్మించ తలపెట్టిన నారాయణ సేవాభవనానికి శంకుస్థాపన పూజలను బలిరెడ్డి సత్యారావు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాం తాల్లో ప్రజల మధ్య నెలకొన్న ఆధ్యాత్మిక భావాలు ఐక్యతను పెంపొందింపజేస్తాయని, ఘర్షణలకు, వివాదాలకు తావులేకుండా అందరూ సమష్టిగా భగవత్ కార్యక్రమాలు నిర్వహించడం వల న గ్రామంలో శాంతిభద్రతలు నెలకొంటాయన్నారు. అంతకుముందు ఆయన లక్ష్మీగణపతి దేవాలయం వద్ద నిర్మించతలపెట్టిన నారాయణ సేవాభవనానికి శంకుస్థాపన పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా హైకోర్టు న్యాయమూర్తి ద్వాదశి గోపాలకృష్ణ, లక్ష్మీగణపతి దేవస్థానం వెబ్‌సైట్‌ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో న్యాయవాది సరిపల్లి నర్సింగరావు, రవి, అర్చకులు, వేదపండితులు పాల్గొన్నారు.
ఘనంగా మోదకొండమ్మ జాతర ప్రారంభం
పాడేరు, మే 12: గిరిజన , గిరిజనేతర ప్రజల ఆరాధ్యదైవమైన శ్రీ మోదకొండమ్మ అమ్మవారి జాతర పాడేరులో ఆదివారం ఘనంగా ప్రారంభమైంది. ఈనెల 15వతేదీ మంగళవారం వరకు జరిగే ఉత్సవాలను రాష్ట్ర గిరిజన సంక్షే మ శాఖామంత్రి పసుపులేటి బాలరాజు శాస్త్రోక్తంగా ప్రారంభించారు. స్థానిక అమ్మవారి ఆలయం నుంచి మోదకొండమ్మ ఉత్సవ విగ్రహం, పాదాలు, ఘటాలను భారీ ఏర్పాట్లు, సాంస్కృతిక కార్యక్రమాల మధ్య ఊరేగింపుగా తీసుకువెళ్ళి ప్రధాన రహదారి మార్గంలో సకతంపట్టులో ప్రతిష్ఠించారు. పట్టణ పురవీధుల గుండా భక్తులతో ఊరేగించి సతకంపట్టులో ప్రతిష్టించడం ద్వారా అమ్మవారి జాతరకు శ్రీకారం చుట్టారు. గిరిజన మంత్రి బాలరాజు దంపతులు అమ్మవారి ఉత్సవ విగ్రహం, పాదాలను ఉత్సవ కమిటీ అధ్యక్షుడు భూరెడ్డి నాగేశ్వరరావు, ఆలయ కమిటీ కార్యదర్శి బి. వి.సి.కుమార్ అమ్మవారి పాదాలు, ఘ టాలను తమ శిరస్సులపై ఉంచుకుని ఊరేగింపులో పాల్గొన్నారు. అంతకు ముందు అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి వీటిని బయటకు తీసుకువచ్చారు. అమ్మవారి ఘటాలను, పాదా లు, ఆలయం బయటకు తీసుకురాగానే అప్పటికే వేచిఉన్న వందలాది మంది మహిళలు వీటిని తమ శిరస్సులపై ఉంచుకునేందుకు పోటీపడ్డారు. అయి తే మంత్రి బాలరాజు ఉండడంతో భద్ర తా చర్యల్లో భాగంగా పోలీసులు రక్షణ వలయాన్ని ఏర్పాటుచేసి భక్తులను వారించారు.
ఈ విషయాన్ని గమనించిన మంత్రి భక్తులకు అవకాశం కల్పించేందుకు అక్కడి నుంచి బయటకు వ చ్చేయంతో మహిళలు అధిక సంఖ్యలో అమ్మవారి పాదాలు, ఘటాలను ఊరేగించి సతకంపట్టులో ప్రతిష్టించారు. అనంతరం పట్టణ వాసులు, పలు గ్రా మాల నుంచి వచ్చిన భక్తులు సతకంపట్టులోని అమ్మవారి పాదాలు, ఘటాలను దర్శించుకున్నారు. దీంతో మోదకొండమ్మ ఆలయం సతకంపట్టు భక్తులతో కిటకిటలాడాయి. అమ్మవారి ఉత్సవాల ప్రారంభమైన ఆదివారం సాయం త్రం ఘటాలను పట్టణ వీధుల్లో ఊరేగించి భక్తులు సందర్శించుకునేందుకు వీలు కల్పించారు. ఈ కార్యక్రమంలో పాడేరు ఐ.టి.డి.ఎ.పి.ఓ. వై.నర్సింహా రావు, ఆర్డీవో ఎం.గణపతిరావు, నర్సీపట్నం ఓ.ఎస్.డి. ఎ.ఆర్.దామోదర్, అధికారులు, ఉత్సవ కమిటీ ప్రతినిధులు, ప్రజలు పాల్గొన్నారు.
అకాల వర్షాలకు అరటి తోటలకు తీవ్రనష్టం
* రైతుల ఆందోళన
గొలుగొండ, మే 12: మండలంలోని పలు గ్రామాల్లో శని, ఆదివారాల్లో పడిన అకాల వర్షాలకు మండలంలోని పలు గ్రామాల్లో అరటి తోటలకు తీవ్రనష్టం వాటిల్లింది. మండలంలోని ఏటిగైరంపేట, రావణాపల్లి ,పాకలపాడు గ్రామాలతోపాటు మరికొన్ని గ్రామాల్లో ఈదురుగాలులకు వందలాది ఎకరాల్లో అరటి తోటలు నేలకొరిగాయి. శనివారం సాయంత్రం ఒక్కసారిగా ఆరిలోవ అటవీ ప్రాంతంలో ప్రారంభమైన వర్షం యర్రవరం,చీడిగుమ్మల, పాకలపాడు, ఏటిగైరంపేటలో కూడా వర్షం కురిసింది. ఆదివారం కూడా అకాల వర్షంతోపాటు ఈదురుగాలులు వీయడంతో అరటి తోటలకు నేలకొరిగాయి. దీంతో ఆయా గ్రామాల్లోని రైతులు తీవ్ర నష్టానికి, నిరాశకు గురయ్యారు. చేతికందే పంట ఈదురుగాలుల రూపంలో తమను నట్టేట ముంచాయని అరటి రైతులు ఆవేదన చెందారు. ప్రతి ఏడాది కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుందని గ్రామ తాజా మాజీ సర్పంచ్ నల్లబిల్లి నూకరాజు పేర్కొన్నారు. ఒక ఎకరానికి అరటి తోట పెట్టుబడికి 20 నుండి 25 వేల రూపాయల వరకు ఖర్చు అవుతుందని, చేతికి అందే పంట ఒక్కసారిగా నాశనమైందని ఆందోళన చెందారు. జరిగిన పంట నష్టంపై అధికారులు సర్వే నిర్వహించి పంట నష్టపోయిన రైతులను నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని పలువురు రైతులు కోరుతున్నారు.
నల్లరేగులపాలెంలో చిరుత దాడి
* మూడు గొర్రెలు, ఆవుపెయ్యి మృతి
సబ్బవరం, మే 12: వరుసగా మండలంలోని పలు గ్రామాల్లో రాత్రివేళల్లో చిరుత దాడిచేసి విలువైన పశు సంపద ను హరించటంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. సాయంత్రమై తే రైతులు పశువుల పాకలు,కళ్లాల వద్ద కు వెళ్లేందుకు భయపడిపోతున్నారు. ఇప్పటివరకు పెదయాతపాలెం, బంగారమ్మపాలెం,ఎ.సిరసపల్లి,తెలికలపాలెం, టెక్కలిపాలెం,నాయనమ్మపాలెం గ్రా మాల్లో సుమారు 26ఆవుపెయ్యిలను చం పిన చిరుత శనివారం రాత్రి నల్లరేగులపాలెం,దాని శివారు ద్వారకానగర్ గ్రా మాల్లో దాడిచేసి రాపేటి కోటేశ్వరరావు కు చెందిన జెర్సీఆవుపెయ్యిని చంపి సు మారు 100 గజాల దూరం ఈడ్చుకుపోయింది.పంజాతో కొట్టిమాంసం తినటంతోపాటు కంఠం కొరికి రక్తం తాగింది. ద్వారకానగర్‌లోని యాదవ కులానికి చెందిన గొలగాని కోటేశ్వరరావు గొర్రెల మందలో మూడుగొర్రెలను పీకలు కొరికింది. దీంతో మందంతా గోలపెట్టడం రైతులు పరుగెత్తి వెళ్లగా చిరుత పారిపోయిందని చెబుతున్నారు. దీంతో సుమా రు 30 వేల రూపాయల మేర నష్టం వా టిల్లిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో గ్రామంలోనే పలు పశులను వేటాడి చంపిన చిరుత అడవి పందిని జీడితోటలోని చెట్టుపైకి తీసుకెళ్లిన సం గతి తెలిసిందే. ఆదే చిరుత చుట్టుపక్కల 10 గ్రామాల్లో స్వైరవిహారం చేస్తూ రైతు ల కళ్లాల్లోని పశువులను చంపేస్తున్నప్పటికీ అటవీశాఖకు చీమయినా కుట్టినట్టులేదని, ఇకపై జిల్లాకలెక్టర్ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగుతామని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
శ్రీ దుర్గమాంబ అమ్మవారి జాతరకు ఏర్పాట్లు
సబ్బవరం, మే 12: సబ్బవరం శ్రీ దుర్గమాంబ అమ్మవారి జాతరను వైభవంగామంగళవారం నిర్వహించేందుకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఈనెల 14వ తేదీన అమ్మవారి జాతరకు ఉత్సవ కమిటీ చేపట్టే ఏర్పాట్లతోపాటు రానున్న స్ధానిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని వివిధ రాజకీయ పార్టీల నేతలు రంగప్రవేశం చేస్తున్నారు. దీంతో మరింత శోభాయమానంగా మారనున్న అమ్మవారి జాతరలో డ్యాన్స్‌ప్రోగ్రాంలకు ప్రముఖ సినీ హీరోయిన్, కొత్తబంగారులోకం ఫేమ్ శే్వతాబసుప్రసాద్, మాటీవి యాంకర్ పూర్ణిమ యాంకరింగ్ చేస్తుందని, కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీనేత పిబివిఎస్‌ఎన్ రాజు(బుచ్చిరాజు) ఏర్పాటు చేస్తున్నట్లు ప్రచారం చేస్తున్నారు. అమ్మవారి జాతరకు హైదరాబాద్ వారిచే డాన్స్ హంగామాను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీనేత కర్రి అప్పలనాయుడు(బాబు) ఏర్పాటు చేస్తుండగా తెలుగుదేశం పార్టీజిల్లాబిసిసెల్ అధ్యక్షుడు కొటాన అప్పారావు స్పాన్సరింగ్‌తో విజయనగరం కళాకారులచే బిందెల డ్యాన్స్, పొడుగు కాళ్లమనిషి, గోపాల్‌నగర్ యూత్ కమిటీ ఆధ్వర్యంలో డ్యాన్స్‌బేబీ డ్యాన్స్ ఏర్పాటు చేస్తున్నారు. జాతరలో సినీ,టీవి నటుల కార్యక్రమాలను వీక్షించేందుకు ప్రజలు ఉవ్విళ్లూరుతున్నారు.