విజయనగరం, మే 12: ఉపాధ్యాయ కౌనెసలింగ్ తొలిరోజు ప్రశాంతంగా జరిగింది. ఆదివారం ఉదయం 10 గంటలకు కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించారు. అడిషనల్ జాయింట్ కలెక్టర్ యుసిజి నాగేశ్వరరావు, డిఇఒ కృష్ణారావు, జెడ్పీ సిఇఒ మోహనరావుల ఆధ్వర్యంలో కౌనె్సలింగ్ నిర్వహించారు. సీనియార్టీ జాబితా, ఎన్‌టైటిల్ పాయింట్లు ఆధారంగా కౌనె్సలింగ్ విధానంలో ఉపాధ్యాయులను ఒక పాఠశాల నుంచి మరొక పాఠశాలకు బదిలీ చేశారు. బదిలీలకు దరఖాస్తు చేసుకున్న వారి వివరాలను పవర్ పాయింట్ ప్రెజంటేషన్ ద్వారా ప్రదర్శించారు. అయితే తొలిరోజు కౌనె్సలింగ్ ప్రక్రియుకు సంబంధించి శనివారం రాత్రి వరకు జాబితాలను తయారు చేయడంలో సిబ్బంది తలమునకలు కావడంతో యూనియన్లు ఆందోళన వెలిబుచ్చాయి. బదిలీలకు దరఖాస్తు చేసుకున్న వారిలో స్కూల్ అసిస్టెంట్లు మేద్స్ 182, ప్రధానోపాధ్యాయులు 95, భాషాపండితులు తెలుగు 67, హిందీ 69, పిఇటి 38 మంది ఉపాధ్యాయులు ఉన్నారు. వీరికి ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నాం వరకు కౌనె్సలింగ్ నిర్వహించారు. సాయంత్రం ఎస్‌జిటి 400 మందికి కౌనె్సలింగ్ జరిపారు. ఈ కౌనె్సలింగ్ ప్రక్రియ రాత్రి వరకు కొనసాగింది.
కౌనె్సలింగ్ ప్రక్రియ నిర్వహించినపుడు గతంలో యూనియన్ల ప్రతినిధులను అనుమతించేవారు. ఇపుడు కౌనె్సలింగ్‌కు యూనియన్ ప్రతినిధులను అనుమతించకపోవడంతో అభ్యంతరాలను వెలిబుచ్చే అవకాశం లేకుండా పోయిందని యూనియన్ ప్రతినిధులు డి.రాము, బి.వెంకటరావు, జోగినాయుడు తదితరులు వాపోయారు. కాగా, స్పౌజ్ కోటా కింద ఎనిమిదేళ్లకు ఒకసారి మాత్రమే ఉపయోగించుకోవాలన్న నిబంధన ఉన్నప్పటికీ కొంత మంది తప్పుడు ధ్రువీకరణలు పొందారన్న ఆరోపణలు విన్పించాయి. అలాగే ఉపాధ్యాయులకు రవాణా సౌకర్యం ఆధారంగా చేసుకొని జిల్లా కేంద్రం, పట్టణం, మండలం, గ్రామాల ఆధారంగా కేటగిరి -1, 2, 3, 4గా విభజించారు. అయితే ఆర్టీసీ బస్సు సౌకర్యం లేనప్పటికీ నెల్లిమర్ల మండలం పారశాం గ్రామాన్ని కేటగిరీ-4లో చూపడం పట్ల ఎం.రూపవతి అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇవిగాకుండా యూనియన్ ప్రతినిధులు పలు అభ్యంతరాలను వ్యక్తం చేశారు. ఏది ఏమైనప్పటికీ ఉపాధ్యాయ కౌనె్సలింగ్ గందరగోళం మధ్య సాగింది. ఇదిలా ఉండగా మరికొందరు కోర్టుకు వెళ్లి స్టే తెచ్చే ప్రయత్నం సాగిస్తున్నారు. దీంతో కౌనె్సలింగ్ ప్రక్రియ ప్రహాసనంగానే మారింది.
ఉపాధ్యాయ కౌనె్సలింగ్ షెడ్యూల్ ఇదే!
విజయనగరం, మే 12: ఉపాధ్యాయ కౌనె్సలింగ్ ప్రక్రియ ఆదివారం ప్రారంభమైంది. ఈనెల 15 వరకు కౌనె్సలింగ్ నిర్వహించనున్నారు. సోమవారం ఉదయం ఎస్‌జిటిలకు 401-900 నంబర్ల వరకు, మధ్యాహ్నాం ఎస్‌జిటిలకు 901-1300 నంబర్ల వరకు కౌనె్సలింగ్ ఉంటుందని డిఇఒ కృష్ణారావు చెప్పారు. అలాగే 15న ఉదయం ఎస్‌జిటిలకు 1301 నుంచి 1700 వరకు, మధ్యాహ్నాం 1701-2063 నంబర్ల వరకు కౌనె్సలింగ్ ఉంటుందని ఆయన తెలియజేశారు.
‘చెంచుల ఆరోగ్య పరిరక్షణకు చర్యలు’
విజయనగరం , మే 12: జిల్లా ఎస్పీ కార్తికేయ ఆదేశాల మేరకు స్పెషల్ బ్రాంచ్ ఆధ్వర్యంలో ఆదివారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. స్పెషల్ బ్రాంచ్ సిఐ ఎం.వి.వి.రమణమూర్తి పర్యవేక్షణలో పట్టణ శివారు ప్రాంతం సుందరయ్య కాలనీలో జరిగిన ఈ శిబిరాన్ని జిల్లా ఎస్పీ కార్తికేయ లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఈ ప్రాంతంలో నివిసిస్తున్న చెంచుల ఆరోగ్య పరిరక్షణ కోసం ఈ శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. సిఐ రమణమూర్తి చెంచులు జీవిత విధానాన్ని ఎస్పీకి వివరించారు. ఈ కాలనీలోవ సుమారు 70 కుటుంబాలు నివశిస్తున్నాయని, వీరిలో 80 మంది పిల్లలు బడి ఈడు పిల్లలు ఉన్నప్పటకి పేదరికం కారణంగా పిల్లలను తల్లిదండ్రులు బడికి పంపించకుండా యాచకవృత్తికి పంపిస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా ఈ ప్రాంతంలో మంచినీటి సమస్య తీవ్రంగా ఉందని వివరించారు. దీనికి స్పందించిన ఎస్పీ వచ్చే విద్యాసంవత్సరం నుంచి ఇక్కడ పిల్లలంతా చదువుకునేలా చర్యలు తీసుకుంటామని, మంచినీటి సమస్య పరిష్కరించేందుకు అవసరమైన చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. గౌరీశంకర్ అనే 10 ఏళ్ళ బాలుడు కాలికి ఏర్పడిన గాయానికి అవసరమైన వైద్య పరీక్షలను అందజేసేందుకు స్థానిక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించాలని సిఐ రమణమూర్తి ఆదేశించారు. విజయనగరం ఆర్డీవో జి. రాజకుమారి, డిఎస్పీ కె.కృష్ణప్రసన్న, ఒకటవ పట్టణ సిఐ డి.లక్ష్మణరావు, చైల్డ్‌లైన్ కో-ఆర్డినేటర్ జి.హైమావతి, వైద్యులు డాక్టర్ అచ్చింనాయుడు, డాక్టర్ రామకృష్ణ, డాక్టర్ ఎం.కృష్ణంరాజు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
నేడు లక్ష్మీ నరసింహస్వామి కల్యాణ మహోత్సవం
వేపాడ, మే 12 : మండలంలోని నీలకంఠరాజపురం శివారు పెదగుడిపాల గ్రామంలోని శ్రీలక్ష్మినరసిహస్వామి దేవాలయంలో సోమవారం స్వామివారి కళ్యాణమహోత్సవం నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని నిర్వాహకులు గండి అప్పారావు తెలిపారు.
నిరుపయోగంగా మార్కెట్ యార్డు
డెంకాడ, మే 12 : డెంకాడ, పూసపాటిరేగ, భోగాపురం మండలాల్లోని రైతులకు ఉపయోగ పడాలని సదుద్దేశ్యంతో 1980లో నిర్మించిన మార్కెట్ యార్డు నిర్మించిన నుంచి మూడేళ్లు మినహా తరువాత సుమారు 30 ఏళ్లుగా ఆదరణకు నోచుకోక నిరూపయోగంగా ఉంది. రైతులు పండించే పంటలను నిల్వ చేసుకునేందుకు ప్రభుత్వం వీటిని నిర్మించింది. అయితే లక్షలాది రూపాయలు వెచ్చించినా రైతులకు మేలు చేయాలన్న ప్రభుత్వ సంకల్పానికి తూట్లు పడ్డాయి. వివరాల్లోకి వెళితే విజయనగరం ముఖద్వారమైన డెంకాడ మండలం మోదవలస గ్రామంలో మూడు దశాబ్దాల క్రింతం. మార్కెట్ యార్డును నిర్మించారు. భోగాపురం, పూసపాటిరేగ, డెంకాడ మండలాల్లోని రైతులు పండించిన పంట నిల్వ చేసేందుకు ఈ యార్డు, గొడౌను నిర్మించారు. అయితే నిర్మాణ జరిగాక మూడేళ్లుపాటు భోగాపురం మండలంలోని కొంత మంది రైతులు కొబ్బరి కాయలను ఇక్కడ విడదీసేవారు. కొబ్బరిని ఎండ బెట్టి ఎగుమతి చేసేవారు. వర్షాకాలంలో తడిచిన దినుసులను ఇక్కడే ఎండ బెట్టేవారు తరువాత కాలక్రమంలో ఇది నిరూపయోగంగా మారింది. దీంతో జాతీయ రహదారి పక్కన ఉన్న ఈ యార్డు మందు బాబులకు అడ్డాగా మారింది. అంతేకాకుండా అసాంఘిక కార్యకలపాలకు నిలయంగా మారింది. దీంతో రైతులు ఈ వైపు రావడం పూర్తిగా మానుకున్నారు. ఈ మార్కెట్ యార్డు కోసం అక్కడ ప్రభుత్వ స్థలం సుమారు 30 ఎకరాలు కేటాయించారు. జాతీయ రహదారి ప్రక్కన ఇంత విలువైన స్థలం ఖాళీగా ఉంచకుండా వాడుకలోకి తేవాలని పలువురు రైతులు కోరుతున్నారు.
నత్తనడకన తారకరామ తీర్థసాగర్ పనులు
గుర్ల, మే 12 : తారకరామ తీర్థసాగర్ పనులు నత్తనడకన జరుగుతున్నాయి. 25 వేల ఎకరాల భూమికి సాగునీరు అందించేందుకు అందించిన పధకం పనులు ప్రారంభమై ఆరేళ్ళు గడిచి పోయినా పనులు పూర్తి కాలేదు. 181 కోట్ల రూపాయలతో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్. రాజశేఖర్‌రెడ్డి 2006లో ఈప్రాజెక్టు పనులకు శ్రీకారం చుట్టారు. బి.ఎస్.సి.పి.ఎల్ కంపెనీ ప్రాజెక్ట్ నిర్మాణానికి కాంట్రాక్ట్ తీసుకుంది. నిర్దేసిత 3 సంవత్సరాల్లో పనులు పూర్తి చేయావలసి ఉండగా అప్పటి నుండి వాయిదా పడుతూ వస్తుండడంతో రైతులకు శాపంలా మారింది. ఈ ప్రాజెక్ట్ గుర్ల మండలం ఆనందపురం వద్ద చంపావతి నదిపై బ్యారేజీ నిర్మించి అక్కడ నుండి పూసపాటిరేగ మండలం కుమిలి వరకు కాలువ నిర్మాణం చేపట్టి అక్కడ నుండి జలాశయం ఏర్పాటు చేయాలి. గుర్ల, నెల్లిమర్ల,పూసపాటిరేగ, మండలాల పరిధిలో జలాశయం నిర్మాణానికి కాలువలు, బ్యారేజీ నిర్మాణానికి అవసరమైన భూసేకరణ చేశారు. ప్రాజెక్ట్ పనులు 85 శాతం జరిగాయి. అక్కడి నుండి ఎస్.ఎస్.ఆర్‌పేట సమీపంలో ట్రాక్ అడ్డంగా ఉంది. రామతీర్థం సమీపంలో కిలో మీటర్ పొడవున సొరంగం తవ్వాల్సిఉంది. రైల్వే శాఖ, పురావస్థుశాఖ, అధికారుల అనుమతుల కోసం ఎదురు చూస్తున్నారు. ఆయా శాఖల ప్రతినిధులు అనుమతులు చన్ని చిన్న అడ్డంకులు ఉన్నాయి. 25 వేల ఎకరాలు భూమికి సాగునీరు అందించేందుకు ఈ ప్రాజెక్ట్ ఉద్దేశ్యం ఇప్పటివరకు 49 కోట్ల రూపాయలు నిధులు ఖర్చు అయ్యాయని అధికారులు తెలుపుతున్నారు. ఈ పరిస్థితిలో జలాశయం పనులు పూర్తయి సాగునీరందించేందుకు ఇంకెన్నాళ్లు పడుతుందోనని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆరేళ్ళుగా ఎదురు చూస్తున్న రైతులకు మరెన్నాళ్లలో పనులు పూర్తయి సాగునీరు అందిస్తారోనని ఆశతో ఎదురు చూస్తున్నారు. దీనిపై తారకరామ ప్రాజెక్టు ఇఇ సుగునాకరరావును వివరణ కొరగా ఇప్పటికే రైల్వే అనుమతులు, రామతీర్ధం కొండ టన్నల్ పనుల అనుమతులు, ఆర్ అండ్ బి రోడ్లు అనుమతులు వచ్చాయని, ఫారెస్ట్ అనుమతులు రావలసి ఉందని, ప్రాజెక్టు పూర్తి చేయాలి లేని పక్షంలో కాంట్రాక్టు రద్దు చేసి వేరోకరికి అప్పగించేందుకు ప్రభుత్వం ఉందన్నారు.
వేర్వేరు సంఘటనల్లో ఇద్దరి మృతి
బొబ్బిలి, మే 12: వేర్వేరు సంఘటనలలో ఇద్దరు వ్యక్తులు మృతిచెందిన వైనం వెలుగుచూసింది. పోలీసులు అందించిన వివరాల మేరకు బాడంగి మండలం బొత్సవానివలస గ్రామానికి చెందిన కె.జగన్నాథం(40) ఇక్కడ ఒక ప్రైవేట్ సంస్థలో ఉద్యోగం చేస్తున్నాడు. ఆదివారం విధులు ముగించుకుని ఇంటికి తిరిగి వెళుతుండగా గున్నతోటవలస వద్ద గేటు పడింది. పట్టాల వద్ద మోటారుసైకిల్‌ను ఆపాడు. ఒక ట్రైన్ వెళ్లిన వెంటనే పట్టాలు దాటే ప్రయత్నం చేస్తుండగా వేరొక పక్క నుంచి మరొక రైలు అదే సమయానికి రావడంతో ఢీకొంది. దీంతో జగన్నాథం మృతిచెందాడు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. స్థానిక గ్రోత్ సెంటర్‌లో ఉన్న ఒక పరిశ్రమలో సెక్యూరీటీ గార్డుగా పనిచేస్తున్న ఒడిషా రాష్ట్రం పొట్టంగికి చెందిన మార్కో(30) విధులు ముగించుకుని ఆదివారం వస్తుండగా విద్యుదాఘాతానికి గురై మృతిచెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఏజెన్సీలో తగ్గిన పనస దిగుబడి
పాచిపెంట, మే 12: మండలంలోని ఏజెన్సీ ప్రాంతాల్లో పనస కాయల దిగుబడులు తగ్గాయి. దీంతో గిరిజనులకు వచ్చే ఆదాయం ఈ ఏడాది కొంత తగ్గినట్లే. గత ఏడాది కన్నా ఈ ఏడాది పనస దిగుబడులు పూర్తిగా తగ్గాయి. దీంతో గిరజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండలంలోని తంగ్లాం, గరిసిగుడ్డి, మూటకూడు, సతాబి, కంచూరు, జీలుగువలస, చిట్టెలభ, తదితర గ్రామాల్లో పనసచెట్లు విస్తారంగా ఉన్నాయి. ఫలసాయం ఇప్పుడిప్పుడే గిరిజనుల చేతికొస్తుంది. అయితే మార్కెట్‌లో పనసపళ్లుకు మంచి గిట్టుబాటు ధర ఉంటుందని గిరిజనులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. గత ఏడాది పనసపళ్ల దిగుబడితోపాటు మార్కెట్‌లో ఒక పండు ధర వంద రూపాయల నుంచి 120 రూపాయల వరకు పలికిందని వారంటున్నారు.
విఆర్‌ఒ సస్పెన్షన్
జియ్యమ్మవలస, మే 12: పట్టాదారు పాసుపుస్తకాల వ్యవహరంలో అవినీతికి పాల్పడిన వి.ఆర్. ఓ.ను విధుల నుంచి సస్పెండ్ చేశారు. ఈ మేరకు జిల్లా అధికారుల నుంచి ఆదేశాలు అందాయి. మండలంలో గెడ్డతిరువాడ గ్రామంలో వి. ఆర్. ఓ.గా పనిచేస్తున్న ఎన్.విజయానందం పట్టాదారు పాసుపుస్తకాలు రైతులకు ఇచ్చేందుకు ఆరుగురు రైతుల నుంచి నగదు తీసుకున్నట్లు గతంలో ఆరోపణలు వచ్చాయి. అంతేకాక ఇచ్చిన పాసుపుస్తకాల్లో అప్పటి తహశీల్దారు పి.ఆర్.కె. రాజు సంతకం ఫోర్జరీ చేసినట్లు అధికారులు గుర్తించారు. ఈ మేరకు పత్రికల్లో వచ్చిన కధనాలకు స్పందించి తహశీల్దారు ప్రసాద్‌పాత్రో దర్యాప్తు నిర్వహించి జిల్లా సంయుక్త కలెక్టర్‌కు నివేదించారు. దీంతో జె.సి. విజయానంద్‌ను సస్పెండ్ చేస్తున్నట్లు ఉత్తర్వులు జారీచేశారని తహశీల్దారు ప్రసాద్‌పాత్రో తెలిపారు.
ఈదురుగాలులు.. వర్షం
నిలిచిన విద్యుత్ సరఫరా
బొబ్బిలి, మే 12: గత రెండు రోజులుగా పట్టణంలో ఈదురుగాలులు బీభత్సవం సృష్టిస్తుండటంతో ప్రజలు పలు ఇక్కట్లుకు గురవుతున్నారు. ఈ మేరకు శని, ఆదివారాలలో ఈదురుగాలులతో కూడిన వర్షం కురవడంతో పట్టణమంతా అంధకారంగా మారింది. పలు ప్రాంతాల్లో చెట్టుకొమ్మలు విరిగి విద్యుత్ వైర్లుపై పడటంతో విద్యుత్ అంతరాయం ఏర్పడింది. ఇందులో భాగంగా వెలమవారివీధి, దావాలవీధి, మెయిన్ రోడ్డు, తదితర ప్రాంతాల్లో విద్యుత్ సర్వీసు వైర్లు నేలకు తెగిపడ్డాయి. దీంతో చీకటి అలుముకుంది. కొన్ని ప్రాంతాల్లో వడగల్లు పడటం విశేషం. దిగువ ప్రాంతాల్లో ఉన్న కాలువలు, రోడ్లుపై నుంచి నీరు ప్రవహించింది. అలాగే మరికొన్ని ప్రాంతాల్లో టెలీఫోన్ వైర్లు తెగిపడటంతో అస్తవ్యస్థంగా మారింది. అధికారులు వీటిని సరిచేయడంలో నిమగ్నమై ఉన్నారు. పెనుగాలుల వల్ల ఉన్న కాస్తా మామిడి పంట నేలరాలిందని రైతులు లబోదిబోమంటున్నారు. అరటి, ఇతర వాణిజ్య పంటలకు నష్టం వాటిల్లిందని ఆయా రైతులు వాపోతున్నారు. ఈ మేరకు రోడ్డుపైన పడిన చెట్లును ఎప్పటికప్పుడు తొలగించేందుకు మున్సిపాల్టీ, ఆర్.అండ్.బి.శాఖాధికారులు చర్యలు చేపడుతున్నారు. ఏదీ ఏమైన రెండు రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా వాతావరణం చల్లబడటంతో ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు.