ఏలూరు, మే 12 : క్రికెట్ అంటేనే అభిమానుల్లో ఎనలేని క్రేజ్... అందులో ట్వంటీ20 క్రికెట్ అంటే మరింత ఆసక్తి. ప్రతిమ్యాచ్‌లోనూ ఆటతీరు తెన్నులపై అంచనాలు, ఊహాలు, గెలుపోటములపై చర్చ రసవత్తరంగా సాగింది. ఈ ఆసక్తినే బుకీలు సొమ్ము చేసుకుంటున్నారు. బెట్టింగ్‌లను ప్రోత్సహిస్తూ సామాన్య ప్రజలను దోపిడీ చేస్తున్నారు. గతంలో కన్నా ప్రస్తుతం జిల్లావ్యాప్తంగా ఈ వ్యవహారం నడిపేందుకు కొత్తముఖాలు వెలుగులోకి వచ్చాయి. పోలీసుల దృష్టి అంతా పాత బుకీలు, రికార్డుల్లో ఉన్నవారి పైనే ఉండటంతో కొత్త బుకీల ఆటలు మూడుఫోర్లు, ఆరుసిక్సర్లుగా సాగుతోంది. ప్రస్తుతం లీగ్ మ్యాచ్‌లు పూర్తయి సూపర్-4తో మహాసంగ్రామానికి తెర లేస్తుండటంతో క్రికెట్ బెట్టింగ్ తారాస్ధాయికి చేరుకుంటోంది. జిల్లాలో ఏ మూలచూసిన క్రికెట్ సందడే కన్పిస్తోంది. పట్టణాలు, పల్లెలు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఆసక్తిగా తిలకిస్తున్నారు.
చెన్నై సూపర్‌కింగ్స్ ఈ మ్యాచ్‌లో గెలుస్తుంది... కాదు ముంబై ఇండియన్స్ గెలుస్తుంది... గేల్ సెంచరీ సాధిస్తాడు... లేదు సెహ్వాగ్ మెరుపులు మెరిపిస్తాడు... ఈ ఓవర్‌లో వికెట్ పడుతుంది... కాదు ఆ బాల్‌ను సిక్సర్ కొడతాడు... మొదటి ఆరు ఓవర్లలో ఫలానా జట్టు ఇన్ని పరుగులు చేస్తుంది... కాదు అంతకంటే తక్కువ పరుగులు సాధిస్తుంది... ఫలానా జట్లు సూపర్-4కి చేరుకుంటాయి... లేదు ఈ జట్లకు ఖచ్చితంగా సెమీస్‌లో బెర్త్ ఖాయం... ఇలా క్రికెట్ పందాలు జోరుగా సాగుతూ అంచనాలు తలకిందులై మధ్యతరగతివారు దారుణంగా బలైపోతున్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఇటీవలకాలంలో విద్యార్ధులకు బెట్టింగ్ జాఢ్యం అంటుకుని అటు చదువును నాశనం చేసుకోవటంతోపాటు ఇటు సొమ్ము పొగొట్టుకుని నైరాశ్యంలోకి వెళ్లిపోతున్నారు. జిల్లాలోని పలు కళాశాలల్లో హాస్టల్ విద్యార్ధులు బెట్టింగ్‌ను నిర్వహిస్తున్నట్లు సమాచారం ఉంది. 500 నుంచి 10వేల రూపాయల వరకు పందాలు కాస్తూ తెలియనితనంతో వారు తమ జీవితాలను సర్వనాశనం చేసుకుంటున్నారు. ఈ బెట్టింగ్ కారణంగా కొంతమంది విద్యార్ధుల మధ్య ఘర్షణలు కూడా చోటుచేసుకుంటున్నట్లు తెలుస్తోంది. కేవలం గంటల వ్యవధిలో వేల రూపాయల సొమ్ము దక్కించుకునే అవకాశం ఉండటంతో భారీఎత్తున పందాలు సాగుతున్నాయి. జాక్‌పాట్‌లా ఐపిఎల్ మ్యాచ్‌లు మారిపోవటంతో ఎక్కడ చూసినా బెట్టింగ్‌లు గురించే ప్రస్తావన ప్రారంభం కావటం విశేషం. పటిష్టమైన నెట్‌వర్కుతో ఆధునిక పరికరాల సహాయంతో జిల్లాలో జరుగుతున్న క్రికెట్ బెట్టింగ్‌లో కోట్ల రూపాయలు చేతులు మారుతున్నాయి. విరామం లేకుండా ఆస్ట్రేలియా జట్టు పర్యటన ముగిసిన వెంటనే ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపిఎల్) మ్యాచ్‌లు ప్రారంభం కావటంతో పందాలరాయుళ్లకు విశ్రాంతి లేకుండా పోయింది. జిల్లా కేంద్రమైన ఏలూరుతోపాటు పలు ప్రాంతాల్లో బెట్టింగులు ఊపందుకున్నాయి. దీనికి ప్రధానంగా యువకులు, రోజువారీ వ్యాపారం చేసుకునేవారు, కొంతమంది పెద్దమనుషులు ఇలా అన్నీవర్గాలవారు బలవుతున్నారు. హోటళ్లతోపాటు కిళ్లీషాపులు, లారీ సప్లయి ఆఫీసులు, చిన్నచిన్న బడ్డీ దుకాణాలు కూడా బెట్టింగ్ కేంద్రాలుగా వెలిశాయి. ఈ బెట్టింగులలో కొంతమంది స్ధిరాస్తులు కూడా అమ్ముకుని వీధినపడుతుండగా మరికొందరు రోజుల్లోనే లక్షాధికారులుగా మారిపోతున్నారు. మరోవైపు బెట్టింగ్ నిర్వహించే కేంద్రాలవారూ లక్షాధికారులవుతున్నారు. ఈ కేంద్రాల నిర్వాహకులు కొత్తగా పందాలు కాసేవారి నుండి ముందుగానే నగదు తీసుకుంటున్నారు. ఏలూరుతోపాటు భీమవరం, ఆకివీడు, పాలకొల్లు, నర్సాపురం, తాడేపల్లిగూడెం, తణుకు, కొవ్వూరు, జంగారెడ్డిగూడెం, చింతలపూడి ఇలా అన్నిచోట్ల పెద్దఎత్తున బెట్టింగ్ సెంటర్లు నిర్వహిస్తున్నారు. పోలీసులకు కొన్నిచోట్ల సమాచారమందినా దానిని వసూళ్లు ఖాతాకు జమచేసుకుంటున్నారు. 50 ఓవర్ల మ్యాచ్‌లు అయితే గంటలపాటు వేచి ఉండాల్సి రావటంతో పొట్టి క్రికెట్(ట్వంటీ20) పోటీలు అయితే కళ్లు మూసి తెరిచేలోగా డబ్బులు వచ్చి పడతాయన్న ఆశతో ఎంతోమంది బరితెగించి మరీ పందాలు కాస్తున్నారు. ఐపిఎల్ మ్యాచ్‌లలో కూడా ఫ్యాన్సీ పందాలు జోరుగా సాగుతున్నాయి. మొదటి ఆరుఓవర్లలో బ్యాటింగ్ చేసే జట్టు ఎంత స్కోరు చేస్తుందన్న ప్రాతిపాదికగా ఈ పందాలు సాగుతున్నాయి. ఇక ఆతర్వాత 12 ఓవర్లకు, చివరిగా 20 ఓవర్లకు ఫ్యాన్సీ పందాలు కొనసాగుతున్నాయి. అయితే రెండవజట్టు బ్యాటింగ్ చేసేటప్పుడు మాత్రం మొదటి ఆరుఓవర్ల వరకే ఫ్యాన్సీ పందాలను కొనసాగిస్తున్నారు. జిల్లా కేంద్రమైన ఏలూరు నగరంలో ప్రతి సందులోనూ ఒక క్రికెట్ బుకీ ఉన్నాడంటే ఆతిశయోక్తి కాదు. అంతేకాకుండా బెట్టింగ్ వ్యవహారం ప్రమాదకరస్దాయికి చేరిపోయింది. బెట్టింగ్ నెట్‌వర్కులో భాగంగా పందాలు కాసేవారు అధికంగా ఉంటే వారితో సంబంధం లేకుండా హోటళ్లలో పనిచేసేవారు, మిల్లుల్లో వర్కర్లు ఇలా అత్యల్ప ఆదాయం వచ్చే వర్గాలు కూడా వారిలోవారుగాని, వారిలోనే ఒకర్ని మధ్యవర్తిగా నియమించుకుని మరీ బెట్టింగ్‌లు కాస్తున్నారంటే ఇవి దాదాపు క్రికెట్ ఆచారంగా మారిపోయినట్లు కన్పిస్తోంది. కళాశాల విద్యార్ధులు కూడా ఈ బెట్టింగులకు దిగుతున్నారంటే ఇది పూర్తిస్ధాయి జూదంగా మారిపోయిందని తేటతెల్లమవుతుంది. బెట్టింగ్ వ్యవహారమంతా బుకీలు సెల్‌ఫోన్ల ద్వారా, హైటెక్ పద్దతుల్లో నడుపుతున్నారు. ప్రధానబుకీలు సుదూరప్రాంతాల్లో సురక్షితమైనచోట బస చేసి స్ధానికంగా అనుచరులను ఏర్పాటుచేసుకుని ఈతంతును యధేచ్ఛగా కొనసాగిస్తున్నారు. పోలీసుల చర్యలకు సవాళ్లు విసురుతూ పట్టుబడకుండా ఆర్దిక లావాదేవీలను హవాలా పద్దతిలో సాగిస్తున్నారు. క్రికెట్ బెట్టింగ్ నివారణలో గట్టిచర్యలు చేపట్టే పోలీసులు కొత్తవారి కదలికలపై ఎందుకు దృష్టి సారించలేదు?, కొత్తగా బెట్టింగ్ కొనసాగిస్తున్న వారి సమాచారం పోలీసుల వద్ద లేకనా?, ఏదీ ఏమైనప్పటికీ రికార్డుల్లో ఉన్న బుకీల ఇళ్లలో సోదాలు చేస్తూ వారి కదలికలపై దృష్టి సారించే పోలీసులు కొత్తవారి ఆగడాలు ఏవిధంగా ఆరికడతారో వేచిచూడాల్సిందే.
త్వరలోనే వైఎస్సార్ పాలన
*కాంగ్రెస్, టిడిపి కుట్ర జనం గుర్తించారు
*వైఎస్సార్ కాంగ్రెస్ నేత షర్మిల
*గురుభట్లగూడెంలో మరో ప్రజాప్రస్థానం ప్రారంభం
చింతలపూడి, మే 12: జగన్ ఏ తప్పూ చేయలేదని, నిర్దోషిగా బయటకు వచ్చిన త్వరలోనే వైఎస్సార్ పాలన అందిస్తారని ఆయన సోదరి, వైఎస్సార్ కాంగ్రెస్ నేత షర్మిల ప్రకటించారు. కాంగ్రెస్, టిడిపిలు కలిసి కుట్రపన్ని జగన్‌ను జైలుకు పంపిన విషయాన్ని ప్రజలు గుర్తించారని, సరైన సమయంలో తీర్పు చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. మరో ప్రజాప్రస్థానం యాత్రలో భాగంగా ఆదివారం రాత్రి ఖమ్మం జిల్లా నుండి పశ్చిమగోదావరి జిల్లాలోకి ప్రవేశించారు. చింతలపూడి మండలం గురుభట్లగూడెం గ్రామంలో ఆదివారం రాత్రి జరిగిన బహిరంగ సభలో ఆమె మాట్లాడారు. రాష్ట్రంలో చంద్రబాబు దుష్టపాలన నుండి బయటపడటం కోసం ప్రజలు వైఎస్సార్‌కు అధికారమిచ్చారని షర్మిల పేర్కొన్నారు. ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచి, టిడిపి నుండి వెలివేసిన చంద్రబాబు కుట్రల నుండే వెలుగులోకి వచ్చారన్నారు. కరెంటు చార్జీలు తగ్గించమని కోరితే గుర్రాలతో తొక్కించి, కాల్చి చంపించారన్నారు. ఎనిమిది సంవత్సరాల్లో ఎనిమిదిసార్లు కరెంటు చార్జీలు పెంచిన ఘనత చంద్రబాబుదేనన్నారు. వైఎస్సార్ పాలనలో ప్రజలు ముఖ్యంగా రైతులు ఎంతో అభివృద్ధి చెందారన్నారు. ఆరోగ్యశ్రీ వంటి పథకాలు ప్రవేశపెట్టి, దేశంలోనే వైఎస్సార్ ఆదర్శ ముఖ్యమంత్రిగా నిలిచారన్నారు. వైఎస్సార్ పాలనలో ఒక్కసారి కూడా కరెంటు, ఆర్టీసీ చార్జీలు పెరగలేదన్నారు. ప్రస్తుత కిరణ్ ప్రభుత్వం చంద్రబాబు అండ చూసుకుని రాక్షస పాలన చేస్తోందని దుయ్యబట్టారు. వైఎస్ బతికివుంటే రైతులకు తొమ్మిది గంటలు ఉచిత కరెంటు వచ్చివుండేదని, కాంగ్రెస్ పాలనలో మూడు గంటలు కూడా రావడంలేదన్నారు. దీనితో రైతుల పరిస్థితి దయనీయంగా మారిందన్నారు. చంద్రబాబు అండతోనే కిరణ్ సర్కార్ ప్రజలపై వేల కోట్ల రూపాయల భారం వేస్తోందన్నారు. జిల్లాలో ప్రవేశించిన షర్మిలకు పలువురు నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. వైఎస్సార్ కాంగ్రెస్ జిల్లా కన్వీనర్ తెల్లం బాలరాజు, ఎమ్మెల్యేలు మద్దాల రాజేష్‌కుమార్, ఆళ్ల నాని, తానేటి వనిత, ఎమ్మెల్సీలు మేకా శేషుబాబు, ఆదిరెడ్డి అప్పారావు, పార్టీ నాయకులు మొవ్వా ఆనంద శ్రీనివాస్, కొయ్యే మోసేన్‌రాజు, ఇందుకూరి రామకృష్ణంరాజు, కృష్ణబాబు, కొఠారు రామచంద్రరావు, అశోక్‌గౌడ్ , చింతలపూడి నియోజకవర్గ కన్వీనర్ కర్రా రాజారావు తదితరులతోపాటు జిల్లా, రాష్ట్ర సమన్వయకమిటీ సభ్యులు షర్మిలకు స్వాగతం పలికినవారిలో ఉన్నారు.
అదే రోజు... అదే ప్రాంతం
గతంలో విపక్ష నేతగా వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రజాప్రస్థానం పేరుతో జరిపిన పాదయాత్రలో భాగంగా పశ్చిమగోదావరి జిల్లాలో ఎక్కడైతే పాదం మోపారో అక్కడే షర్మిల పాదం మోపారు. నాడు 2003 మే 12న వైఎస్సార్ చింతలపూడి మండలం గురుభట్లగూడెం గ్రామంలో పాదయాత్రను ప్రారంభించారు. ఇప్పుడు కూడా మే 12న ఆయన కుమార్తె షర్మిల మరో ప్రజాప్రస్థానం పేరుతో గురుభట్లగూడెంలోనే పాదంమోపారు. తన తండ్రి వైఎస్సార్ పాదయాత్రలో ఇదే గ్రామంలో ఇదే చోట పాదం మోపారని, తాను కూడా జిల్లాలో ఇక్కడి నుండే పాదయాత్ర ప్రారంభించడం ఆనందంగా ఉందని ఈ సందర్భంగా షర్మిల పేర్కొన్నారు. తొలుత ఆమె వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
గురుభట్లగూడెం నుండి కొవ్వూరు వరకు...
కాగా జిల్లాలో షర్మిల యాత్ర 294 కిలోమీటర్ల మేర సాగుతుందని ఆ వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులు తెలిపారు. గురుభట్లగూడెం నుండి కొవ్వూరు వరకు వివిధ నియోజకవర్గాల మీదుగా షర్మిల యాత్ర సాగుతుంది. ఆదివారం రాత్రి చింతలపూడి మండలం లింగగూడెం గ్రామంలో ఆమెకు బస ఏర్పాటుచేశారు. సోమవారం ఉదయం లింగగూడెం నుండి పాదయాత్ర ప్రారంభిస్తారు. 12 కిలోమీటర్ల యాత్ర అనంతరం రాత్రికి పాత చింతలపూడి గ్రామం చేరుకుని అక్కడ బసచేస్తారు. మంగళవారం ఉదయం పాత చింతలపూడి నుండి బయలుదేరి 12 కిలోమీటర్ల యాత్ర అనంతరం కృష్ణానగర్‌లో బసచేస్తారు. బుధవారం ఉదయం టి.నర్సాపురం మండలంలోకి ప్రవేశిస్తారు.
సేదదీరిన జిల్లా
ఈదురుగాలులు -వర్షం *మారిన వాతావరణం
ఏలూరు, మే 12 : వాతావరణంలో మార్పు వచ్చింది. అల్పపీడన ప్రభావం కారణంగా ఆదివారం సాయంత్రం నుంచి వాతావరణం మారిపోయింది. ఒక్కసారిగా పెద్ద ఎత్తున గాలులు వీస్తూ చల్లటి గాలి పలకరించడంతో జనమంతా ఉబ్బితబ్బిబ్బయ్యారు. గత వారం రోజుల నుంచి అధిక ఉష్ణోగ్రతలతో విలవిల్లాడిపోయిన జిల్లా ప్రజలకు ఆదివారం సాయంత్రం నాటి వాతావరణం ఉపశమనాన్ని అందించింది. అయితే ఈదురుగాలులు మాత్రం చాలాచోట్ల రైతాంగాన్ని నష్టాల దారిలో నడిపించినట్లు కనిపిస్తోంది. ఏది ఏమైనా మండే ఎండల నుంచి అల్పపీడనం కొంత వరకు జనం సేదతీరేందుకు ఉపకరించిందనే చెప్పుకోవాలి. జిల్లా వ్యాప్తంగా చేస్తూ చాలా చోట్ల ఈదురుగాలులతో కూడిన వర్షం కురవడంతో సామాన్య జనం హర్షం వ్యక్తం చేస్తుండగా రైతాంగం మాత్రం మరింత ఆందోళనలో చిక్కుకుపోయారు. ప్రధానంగా మెట్ట ప్రాంతం పరిధిలో ఈదురుగాలులు ప్రమాదకరంగా మారిపోయాయి. ఉద్యానపంటల విషయంలో ఈదురుగాలులు తీవ్ర నష్టానే్న మిగులుస్తున్నట్లు తెలుస్తోంది. కొద్ది రోజుల క్రితం జిల్లాను ఒక్కసారిగా వడగళ్ల వాన, ఈదురుగాలులు పలకరించిన విషయం గుర్తుండే వుంటుంది. ఆ సమయంలోనే మెట్ట ప్రాంతం పరిధిలో ప్రధానమైన పంటగా వున్న మామిడి, మొక్కజొన్న వంటి పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. అయితే ఆ తరువాత మళ్లీ వాతావరణం వేడెక్కిపోవడంతో కొంతవరకు ఈ పంటలకు అనుకూలమైన పరిస్థితి ఏర్పడిందనే భావించారు. అయితే తాజాగా అల్పపీడనం చుట్టుముట్టడంతో ఆదివారం సాయంత్రం నుంచి వీచిన ఈదురుగాలులకు జంగారెడ్డిగూడెం, చింతలపూడి, లింగపాలెం తదితర ప్రాంతాల్లో మామిడి పంటకు పెద్ద ఎత్తున నష్టం వాటిల్లినట్లు జిల్లా కేంద్రానికి సమాచారం అందుతోంది. ఈదురుగాలులకు తోడు వర్షం కూడా కురవడంతో మామిడికాయ చాలా చోట్ల దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. ఈ పరిణామం ఉద్యానపంట రైతులను తీవ్ర ఆందోళనలోకి నెట్టివేసింది. ఇదిలా ఉంటే తాడేపల్లిగూడెంతోపాటు చాలా చోట్ల గాలులు తీవ్రంగా వీచడంతో చెట్లు, హోర్డింగులు నేలకొరిగినట్లు సమాచారం. అయితే పెద్ద ప్రమాదాలేమీ చోటు చేసుకోలేదని చెబుతున్నా మరికొన్ని చోట్ల చెట్లు పడిపోవడం కారణంగా రాకపోకలకు అంతరాయం ఏర్పడటంతోపాటు స్వల్ప నష్టాలుకూడా సంభవించినట్లు తెలుస్తోంది. జిల్లా కేంద్రమైన ఏలూరులో ఆదివారం సాయంత్రం నుంచి వాతావరణం చల్లబడిపోయింది. అయితే ఈదురుగాలులు కొంత భారీగానే వీచడంతో ఇంతకుముందు జరిగిన నష్టాలను గుర్తుతెచ్చుకుని జనం భయభ్రాంతులకు లోనయ్యారు. ఆదివారం ఉదయం నుంచి ఎండ వేడిమి తీవ్రంగానే ఉండటంతోపాటు ఉక్కపోతలు అధికం కావడంతో జనం నానా తంటాలు పడ్డారు. అయితే రెండురోజుల నుంచి కరెంటు కోతలు కూడా అధికంగా వుండటం, ఓవర్‌లోడ్ కారణంగా ట్రాన్స్‌ఫార్మర్లు దెబ్బతినడంతో నగర ప్రజలు దాదాపు నరకానే్న చవిచూశారు. అలాంటిది ఆదివారం సాయంత్రం మాత్రం చల్లటి గాలి జోరుగా వీచడంతో ప్రజలంతా హర్షం వ్యక్తం చేశారు. చాలా మంది రోడ్లపైకి వచ్చి సేదతీరారనే చెప్పుకోవాలి. అయితే కొద్దిపాటి వర్షం కురిసి మానుకుంటే తరువాత రోజు భానుడి ప్రతాపాన్ని తట్టుకోలేమన్న ఆందోళన కూడా వారిలో వ్యక్తమైంది. అయితే రాత్రికి మాత్రం యధాప్రకారం కరెంటు కోతలు మొదలైపోయాయి. కొద్దిసేపు ఉన్న విద్యుత్ సరఫరా మరికొద్ది సేపటికి మాయమవుతూ వచ్చింది. గాలులు మొదలవ్వగానే విద్యుత్ సరఫరా నిలచిపోగా కొద్ది విరామం అనంతరం మళ్లీ సరఫరా మొదలైంది. అయితే ఆ తరువాత మాత్రం కరెంటు కోత భారీగానే అమలవుతూ వచ్చింది. ఏది ఏమైనా ఆదివారం నాటి పరిణామానికి జనం కొంత సేదతీరినా రైతాంగం మాత్రం మరింత ఆందోళనలో కూరుకుపోయారు.
విద్యార్థుల్లో మనో వికాసానికి శుభప్రదం:కలెక్టర్
ఏలూరు, మే 12 : యువత, ముఖ్యంగా విద్యార్ధులలో మానవీయ విలువలు పెంచేందుకు, మనోవికాసం కలగడానికి శుభప్రదం కార్యక్రమం ఎంతగానో దోహదపడుతుందని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి వాణిమోహన్ అన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం - హిందూ ధర్మ ప్రచార పరిషత్‌ల సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం ఇక్కడకు సమీపంలోని వట్లూరు సిద్దార్ధ విద్యాలయ మిలీనియం క్యాంపస్‌లో శుభప్రదం కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. విద్యార్ధులలో మానవీయ విలువలు, నైతిక జీవన విధానం, వ్యక్తిత్వ వికాసం పెంపొందించేందుకు వేసవి శిక్షణా శిబిరం ఆదివారం నుండి ఈ నెల 18వ తేదీ వరకు జరగనున్నది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న కలెక్టరు మాట్లాడుతూ ఎంచుకున్న రంగంలో అభివృద్ధిని సాధించేందుకు నిరంతరం కఠోర దీక్షతో పనిచేయడం గొప్ప తపస్సు అవుతుందన్నారు. విద్యార్ధులు చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలన్నారు. మంచి చెడులు తెలుసుకునే విచక్షణను అభివృద్ధి చేసుకోవాలన్నారు. జీవితంలో అనుకున్న లక్ష్యాల సాధ్యాసాధ్యాలు విద్యార్ధులు, యువత చేతిలోనే ఉన్నాయన్నారు. దుర్వ్యసనాలకు లోనుకాకుండా సన్మార్గంలో పయనించాలన్నారు. చెడు మార్గాలకు లోనైతే భవిష్యత్తులో తలెత్తే పరిణామాలను ముందుగానే అంచనా వేసుకునే స్థితిలో ఉండాలన్నారు. తల్లిదండ్రుల, పెద్దల మాటలను గౌరవించాలన్నారు. భగవద్గీత, పురాణాలు, ఇతిహాసాలు వంటి గ్రంధాలలో యోగ, ధ్యానం, వ్యక్తిత్వ వికాసం, నైతిక విలువలు, క్రమశిక్షణ తదితర అంశాలు పొందుపర్చబడి వున్నాయన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం, హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో చేపట్టిన శుభప్రదం కార్యక్రమం విద్యార్ధులకు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. శుభప్రదం కార్యక్రమంలో శిక్షణ అనంతరం విద్యార్ధులు ఉజ్వలమైన భవిష్యత్తును నిర్ధేశించుకోవడానికి అవకాశం కలుగుతుందని చెప్పారు. విద్యార్ధులు అబద్ధాలు ఆడటం, దొంగతనాలు చేయకుండా ఉండడంతో పాటు అహింసా మార్గంలో జీవనాన్ని సాగిస్తే జీవితం ఆనందభరితంగా ఉంటుందన్నారు. పెద్దలు చెప్పే నిజాలు తెలుసుకుని సత్యాన్ని స్వాగతించాలన్నారు. సన్మార్గంలో జీవించాలనుకోవడం మొదట్లో కష్టసాధ్యమైనప్పటికీ ఆచరణలో సత్ఫలితాలు పొందవచ్చునని, ఇటువంటి విషయాలు భగవద్గీత, మహాభారతం, పురాణాల్లో పెద్దలు చెప్పారన్నారు. సమాచార, సాంకేతిక రంగాలలో విప్లవాత్మకమైన మార్పులు వస్తున్నాయన్నారు. గతంలో టివి కంప్యూటర్లు, సెల్‌ఫోన్లు వంటి సౌకర్యాలు అందుబాటులో ఉండేవి కావన్నారు. గత పది సంవత్సరాలుగా వీటి వినియోగం విపరీతంగా పెరిగిపోయిందన్నారు. వీటి వల్ల ప్రయోజనాలు ఎక్కువగానే ఉన్నప్పటికీ యువత వీటిని సక్రమంగా ఉపయోగించుకోకపోవడం వల్ల వీటి ప్రభావం సమాజంపై పడుతోందన్నారు. కేవలం డాక్టరు, ఇంజనీరు మాత్రమే జీవితం కాదనే సత్యాన్ని విద్యార్ధులు గ్రహించాలన్నారు. తాము ఎంపిక చేసుకుని ఇష్టపడిన కోర్సులలో ప్రవేశించి ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలన్నారు. అదే విధంగా జీవితంలో వినోదం ఉండాల్సిందేనని అయితే అదే జీవితంగా భావించకూడదని విద్యార్ధులకు హితవు పలికారు. సభకు అధ్యక్షత వహించిన ఆర్‌ఎస్‌ఎస్ జిల్లా నేత సీతంరాజు చక్రధర్ మాట్లాడుతూ ఆదివారం నుంచి ఈ నెల 18వ తేదీ వరకు వట్లూరులోని సిద్దార్ధ విద్యాలయ మిలీనియం క్యాంపస్‌లో శుభప్రదం కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. శిక్షణా తరగతులకు హాజరవుతున్న విద్యార్ధులు నైతిక విలువలు పెంపొందించుకోవడానికి, దేశానికి సేవలు అందించే దిశగా బోధనాంశాలను నేర్చుకోవాలన్నారు. బి ఇడి కళాశాల తెలుగు అధ్యాపకులు డాక్టర్ మద్దూరి సత్యనారాయణ మాట్లాడుతూ సనాతన ధర్మ పరిరక్షణ, మానవీయ విలువలను విద్యార్ధులలో పెంపొందించేందుకు శిక్షణా తరగతులు ఎంతో దోహదపడతాయన్నారు. సిద్దార్ధ విద్యా సంస్థల డైరెక్టర్ కోనేరు సురేష్‌బాబు మాట్లాడుతూ టిటిడి, హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శుభప్రదం కార్యక్రమానికి హాజరయ్యే విద్యార్ధులకు అన్నీ సౌకర్యాలు కల్పించి కార్యక్రమం విజయవంతం చేసేందుకు సహకారం అందించడం జరుగుతుందన్నారు. అనంతరం శిక్షణా శిబిరంలో పాల్గొన్న విద్యార్ధులకు ఆధ్యాత్మిక, నైతిక గ్రంధాలను జిల్లా కలెక్టర్ డాక్టర్ జి వాణిమోహన్ చేతుల మీదుగా అందించారు. హిందూ ధర్మ ప్రచార పరిషత్ జిల్లా ఆర్గనైజరు బి పుల్లారావు, హిందూ ధర్మ పరిషత్ సహాయ కార్యదర్శి కెవి నరసింహాచార్యులు, సిద్దార్ధ విద్యాసంస్థల డైరెక్టరు కోనేరు విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
గజల్స్ శ్రీనివాస్ కాంగ్రెస్‌లో చేరిక
పాలకొల్లు, మే 12: ప్రముఖ గజల్స్ గాయకుడు, మూడుసార్లు గిన్నీస్ రికార్డు సాధించిన గజల్స్ శ్రీనివాస్ ఆదివారం హైదరాబాద్‌లో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈయన పాకిస్తాన్ శాంతి యాత్ర చేయడంలోను, గాంధీమార్గంపై గజల్స్ అనేక భాషల్లో తయారుచేసి ప్రపంచ దేశాలలో పర్యటించి శాంతి మార్గంకోసం ఎంతో కృషి చేశారు. ఇటీవల ఆప్ఘనిస్థాన్‌లో పర్యటించి శాంతి కోసం తాను రచించిన గజల్స్‌ను మాజీ ఉగ్రవాదికి అంకితం ఇచ్చి మారిన ఉగ్రవాదులను గౌరవించే గొప్ప సంస్కారంతో అంతర్జాతీయ ఉగ్రవాద నిర్మూలనకు నాంది పలికారు. మోగల్లులో సీతారామారాజు స్వగ్రామంలో జాతి గర్వించే స్మారక స్థూపం, ప్రదర్శనశాల ఏర్పాటుకు కృషి చేశారు. పశ్చిమ గోదావరి జిల్లాలో పలు సంస్థలకు తనకు తెలిసిన ఎంపిల నుండి ఎంపి లాడ్స్ తెచ్చి అభివృద్ధి చేశారు. వీరి తల్లిదండ్రులు కేశినేని నరసింహారావు దంపతులు పాలకొల్లులోనే ఉంటున్నారు. బాల్యం నుండి పాలకొల్లులోనే విద్యాభ్యాసం చేసిన ఈయన కాంగ్రెస్ పార్టీలో చేరడం పట్ల కాంగ్రెస్‌వాదులు హర్షం ప్రకటించారు. గాంధీ భవనంలో డి శ్రీనివాస్ సమక్షంలో ఈయన కాంగ్రెస్ సభ్యత్వం స్వీకరించారు. పశ్చిమ గోదావరి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు కొత్తపల్లి సుబ్బారాయుడు, విజయవాడ ఎంపి లగడపాటి రాజగోపాల్, ఎమ్మెల్సీలు షబ్బీర్ అలీ, గిడుగు రుద్రరాజు, కొమ్మిరెడ్డి సుధాకర్, డొక్కా మాణిక్య ప్రసాద్ తదితరులు గాంధీ భవనంలో పాల్గొన్నారు. అనంతరం ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ను కలిసి ఆయన ఆశీస్సులు పొందారు. గజల్స్ శ్రీనివాస్ కాంగ్రెస్‌లో చేరడం వల్ల కాంగ్రెస్ ప్రతిష్ట బాగా పెరుగుతుందని, పాలకొల్లు నుండి బలమైన వ్యక్తి కాంగ్రెస్‌లో చేరి పదవులు కోసం కాకుండా పార్టీకోసం చేరుతున్నానని చెప్పడం హర్షణీయమని డిటిడిసి బాబు, మేడికొండ శ్రీనివాస్, డాక్టర్ సి రాఘవులు, బోనం వెంకట్రావు, ఇనుకొండ నాగదుర్గ, యినుకొండ నాగేశ్వరరావు తదితరులు అన్నారు.
డైట్ సెట్‌ను అన్ని పట్టణాల్లో నిర్వహించాలి
ఏలూరు, మే 12 : ప్రభుత్వం నిర్వహించే డైట్ సెట్ పరీక్షను జిల్లాలోని అన్ని పట్టణాల్లో నిర్వహించాలని డివై ఎఫ్ ఐ డిమాండ్ చేసింది. డివైఎఫ్‌ఐ ఆధ్వర్యంలో ఆదివారం మోడల్ డైట్‌సెట్ పరీక్షను స్థానిక ఎన్ ఆర్ ఐ విద్యాసంస్థల ఆవరణలో నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం నగర కార్యదర్శి ఎ ఫణికుమార్, ఎస్ ఎఫ్ ఐ నగర కార్యదర్శి పివి రామకృష్ణలు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత విద్యార్ధులకు డైట్ సెట్ పరీక్షపై అవగాహన కల్పించేందుకు ప్రముఖ విద్యావేత్త, ఎమ్మెల్సీ కె ఎస్ లక్ష్మణరావు సారధ్యంలో మోడల్ డైట్ సెట్ పరీక్షను నిర్వహించామన్నారు. జిల్లా వ్యాప్తంగా 20 కేంద్రాల్లో నిర్వహించిన పరీక్షకు 1640 మంది విద్యార్ధులు హాజరయ్యారన్నారు. ఈ నెల 31న ప్రభుత్వం డైట్‌సెట్ పరీక్షను జిల్లా కేంద్రమైన ఏలూరులో మాత్రమే నిర్వహించనున్నదన్నారు. గ్రామీణ ప్రాంత విద్యార్ధుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని డైట్ సెట్ పరీక్షా కేంద్రాలను అన్ని పట్టణాల్లో ఏర్పాటు చేయాలన్నారు. కార్యక్రమంలో నాయకులు ఎం శివ, గిరి, డి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
వడగాడ్పునకు మహిళ మృతి
భీమడోలు, మే 12 : భీమడోలు పంచాయితీ పరిధిలోని అరుంధతీ కాలనీకి చెందిన భీమడోలు నాగమ్మ (55) ఎండ తీవ్రతకు వడదెబ్బ తగిలి ఆదివారం మృతిచెందింది. ఎండలు మండుతుండటంతో ఎండ తీవ్రత, వేడిగాలులకు ఉక్కిరిబిక్కిరి అవుతున్న నాగమ్మ తీవ్ర అస్వస్థతకు లోనై ఆదివారం మృతిచెందింది. ఇదే విధంగా కోడూరుపాడు గ్రామంలో కూడా పలువురు గ్రామస్తులు అస్వస్థతకు లోనవడంతో పూళ్ల ప్రాధమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది గ్రామంలో ఆదివారం వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. 101 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి వీరిలో ఆరుగురికి అస్వస్థతకు లోనైనట్లు గుర్తించి వారికి వైద్య చికిత్సలు నిర్వహించారు. ఇదిలా ఉండగా ఆదివారం సాయంత్రం ఆకస్మికంగా మబ్బులు వేసి 15 నిమిషాల పాటు మండల పరిధిలో వర్షం కురిసింది. అప్పటి వరకు తీవ్ర ఎండకు ఇబ్బందులకు గురైన ప్రజలు చల్లని గాలులు వీచి వర్షం కురవడంతో ఆహ్లాదానికి లోనయ్యారు.
ఈదురుగాలుల బీభత్సం
ద్వారకాతిరుమల, మే 12: అకస్మాత్తుగా వీచిన సుడిగాలి మండలంలో ఆదివారం సాయంత్రం బీభత్సాన్ని సృష్టించింది. పలుచోట్ల అరటి తోటలు, భారీ వృక్షాలు, విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్లు కుప్పకూలాయి. ఇళ్ల పైకప్పులు లేచిపడ్డాయి. మండలంలోని తిమ్మాపురం గ్రామ రైతు వాసిరెడ్డి బాపిరాజుకు చెందిన ఆరు ఎకరాల అరటి తోట నేల నంటింది. సుమారు రూ.4 లక్షల మేర పంట నష్టం జరిగినట్టు రైతు వాపోయారు. అలాగే తిరుమలంపాలెం అడ్డ రోడ్డు వద్ద భారీ వృక్షాలు విరిగి ప్రధాన రహదారిపై పడ్డాయి. దీంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలగ్గా స్థానికులు స్పందించి స్వచ్ఛందంగా వాటిని తొలగించారు. కొన్ని తాడిచెట్లు విరిగి విద్యుత్ వైర్లపై పడటంతో అవి తెగిపడి క్షేత్ర పరిసరాల్లో విద్యుత్తుకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అలాగే మండలంలోని దేవినేనివారిగూడెం రామాలయం వద్ద విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్లు నేల కూలాయి. రామన్నగూడెంకు చెందిన గుత్తుల ముసలయ్య సిమెంటు రేకు ఇల్లు పైకప్పు ఎగిరి కింద పడింది. సుమారు లక్ష రూపాయల మేర నష్టం వాటిల్లినట్టు యజమాని ఆవేదన వ్యక్తం చేశారు.
ఆక్వా రైతుకు గుండె ‘కోత’
తోకలపూడిలో విద్యుత్ సరఫరా లేక తేలిపోయిన రొయ్యలు - కోటి నష్టం
రొయ్యలు
వీరవాసరం, మే 12: విద్యుత్ కోతలు ఆక్వా రైతుల పాలిట శాపంగా మారుతున్నాయి. నిరంతర విద్యుత్ కోత కారణంగా ఏరియేటర్లు పనిచేయక, ఆక్సిజన్ అందక వీరవాసరం మండలం తోకలపూడి గ్రామంలో రూ.కోటి విలువైన రొయ్యలు చనిపోయాయి. విద్యుత్ సరఫరా లేకపోవడంతో 20 ఎకరాల్లో రొయ్యలు చనిపోయి రూ. కోటి నష్టం వాటిల్లిందని తోకలపూడి గ్రామానికి చెందిన గంధం వెంకటస్వామినాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం ఆయన స్థానిక విలేఖర్లతో మాట్లాడుతూ శనివారం మధ్యాహ్నం నుండి రాత్రి 9 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిచిపోయిందన్నారు. విద్యుత్ సరఫరా కోసం అధికారులకు ఎన్నిసార్లు ఫోన్ చేసినా సమాధానం లేదన్నారు. ఆదివారం ఉదయానికి ఆక్సిజన్ అందజ 20 ఎకరాల రొయ్యల చెరువులో రొయ్యలు తేలిపోయాయని తెలిపారు. దీనివల్ల రూ. కోటి నష్టం వాటిల్లిందని పేర్కొన్నారు. చనిపోయిన రొయ్యలను గోతులు తీసి పాతిపెట్టినట్టు ఆయన తెలిపారు. విద్యుత్ సరఫరా ఎప్పుడు వస్తుందో తెలిపే సిబ్బంది లేరని ఆగ్రహం వ్యక్తంచేశారు. వీరవాసరం విద్యుత్ స్టేషన్‌కు సంబంధించి ఎఇ సురేష్‌రెడ్డి సెలవులో ఉన్నారని, ఆయన స్థానంలో పాలకొల్లు రూరల్ ఎఇ నాయక్‌ను ఇన్‌ఛార్జిగా వేశారని సిబ్బంది తెలిపారన్నారు. అయితే ఎఇ నాయక్‌కు ఫోన్ చేయగా ఆయన కూడా స్పందించలేదని వాపోయారు. ఒకవైపు విద్యుత్ కోతలు అధికంగా ఉన్నప్పటికీ అధికారుల నిర్లక్ష్యంతో స్థానికంగా విద్యుత్ సరఫరాను సరైన రీతిలో ఇవ్వడం లేదని వాపోయారు. ఈ సమస్యపై ఉన్నతాధికారులు తగిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. దీనిపై ఇన్‌చార్జి ఎఇ నాయక్‌ను సంప్రదించగా తాను శెలవులో ఉన్నానని తెలిపారు. తనను వీరవాసరం సబ్‌స్టేషన్‌కు ఇన్‌చార్జిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేయలేదని ఆయన పేర్కొన్నారు. దీనిపై ఎడిఇ రాంబాబును సంప్రదించగా శనివారం మధ్యాహ్నం 4 గంటల నుండి సాయంత్రం 8 గంటల వరకు విద్యుత్ సరఫరా లేకపోవడం నిజమేనని తెలిపారు. అయితే ఇన్‌చార్జిగా ఎఇ నాయక్ ఉన్నారని, ఆయన ఆ విధంగా మాట్లాడి ఉండకూడదని ఎడిఇ పేర్కొన్నారు. విద్యుత్ సరఫరాలో వచ్చిన వైఫల్యంపై విచారిస్తానని తెలిపారు.