హన్మకొండ, మే 12: ఏకశిలా నగరంగా ప్రసిద్ధిగాంచిన కాకతీయుల రాజధాని వరంగల్ నగరంలో పరమ పావనమైన పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న శ్రీ్భద్రకాళీ దేవస్థానంలో 10రోజులపాటు దేదీప్యమానంగా జరిగే శ్రీ్భద్రకాళీ భద్రేశ్వరుల కల్యాణ బ్రహోత్సవాలు ఆదివారం ఉదయం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ బ్రహ్మోత్సవాలను రాష్ట్ర బిసి సంక్షేమ శాఖ మంత్రి బస్వరాజు సారయ్య, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్ ముఖ్యఅతిథులుగా జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఆలయ మర్యాదల ప్రకారం మంత్రి సారయ్య, ఎమ్మెల్యే వినయ్‌భాస్కర్‌కు ఆలయ ప్రధాన అర్చకులు భద్రకాళీ శేషు, కార్యనిర్వహణాధికారి కట్ట అంజనీదేవి, వేదపండితులు, అర్చకులు పరివట్టం ఇచ్చి నాదస్వర, వేదస్వస్తి, పూర్ణకుంభంతో ఘనస్వాగతం పలికారు. అనంతరం వారు భద్రకాళి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన పిమ్మట ఆలయ అర్చకులు, వేదపండితులు అమ్మవారి శేషవస్త్రాలను బహూకరించి మహదాశ్వీరచనం చేసారు. ఈ సందర్బంగా మంత్రి సారయ్య, ఎమ్మెల్యే వినయ్‌భాస్కర్ విలేఖరులతో మాట్లాడుతూ భద్రకాళీ ఆలయంలో దేశంలో మరెక్కడ జరగని విధంగా శాస్త్రంలో చెప్పబడిన విధంగా వైశాఖశుక్ల పంచమినాడు లోకకళ్యాణార్థం శివకల్యాణం జరుగుతున్నదని అన్నారు. ఈ శివకళ్యాణం దేవాలయానికి, తెలంగాణ ప్రాంతంలో ప్రధానంగా జరగడం వరంగల్ నగరానికి ప్రాధాన్యత సంతరించుకుందని తెలిపారు. దేశంలో ఏ ప్రాంతానికి వెళ్లినా వరంగల్ భద్రకాళీ అమ్మవారి మహిమలను రాజకీయ నాయకులు, అధికారులు, వివిధవర్గాల ప్రజలు వారి అనుభవాలను చెబుతుండటం అమ్మవారిపట్ల వారికున్న భక్తికి నిదర్శనమని కొనియాడారు. శాస్తబ్రద్ధంగా, లోకకల్యాణం ఎప్పటివలనే ఈ ఏడాది కూడా ఇతోదికమైన భక్తి, శ్రద్ధలతో పెద్దఎత్తున బ్రహ్మోత్సవాలు జరపడానికి ఆలయ అధికారులు అన్నిరకాల ఏర్పాట్లు చేశారని చెప్పారు. ఈ ఉత్సవాలు భక్తులకు మధురానుభూతి కలిగించేలా అధికారులు కృషి చేయాలని కోరారు. భక్తులు అసౌకర్యానికి లోనుకాకుండా సకల సదుపాయాలు ఏర్పాటు చేయాలని అన్నారు. ఆలయ అభివృద్ధికి తమవంతు సహాయ, సహకారం తీసుకోవడానికి ఆలయ అధికారులు, అర్చకులు వెనుకాడకూడదని అన్నారు. ఈ అంకురార్పణలో తృణధాన్యాలైన కొర్రలు, చామలు, నువ్వులు, ఆవాలు, వడ్లు, పెసర్లు, కందులు, అనుములు, ఉలువలు, మినుములు ఇత్యాది ధాన్యాలను ఉపయోగించారు. రాత్రి తొమ్మిది గంటలకు శివపూజ, నిరాజన మంత్రపుష్పములతో బ్రహ్మోత్సవాలకు పూర్వాంగమైన అంకురార్పణ కార్యక్రమం పూర్తయింది. ఈ ఉత్సవాలలో కాంగ్రెస్ నాయకులు బస్వరాజు శ్రీమాన్, దేవాదాయ శాఖ ఉపకమిషనర్ టి.రమేష్‌బాబు, మెగా ఇన్‌ఫ్రాస్ట్రక్షర్ అధ్యక్షుడు గోవర్థన్‌రెడ్డి, వరంగల్ ఆర్టీఓ కొండల్‌రావు, హైదరాబాద్ ఆర్డీఓ మురళీకృష్ణ, హన్మకొండ తహశీల్దార్ విజయ్‌కుమార్ పాల్గొన్నారు.
ఆలయ ఇవోపై మంత్రి ఆగ్రహం
బ్రహ్మోత్సవాల ప్రారంభకార్యక్రమానికి హాజరైన బిసి సంక్షేమశాఖ మంత్రి బస్వరాజు సారయ్య ఆలయ ఇవో అంజనిదేవి వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేసారు. బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై పత్రికా సమావేశం నిర్వహించే సమయంలో తనకు, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే వినయభాస్కర్‌కు ఎందుకు సమాచారం ఇవ్వలేదని నిలదీసారు. ఇష్టానురీతిగా వ్యవహరించడం మంచి పద్ధతి కాదని మందలించారు.
మానవతా విలువలకు శుభప్రదం దోహదం
* సనాతన ధర్మంపై అవగాహన అవసరం
* ఎమ్మెల్యే వినయ్‌భాస్కర్
బాలసముద్రం, మే 12: సమాజంలో మానవతా విలువలు పెంపొందించడానికి శుభప్రదం దోహదం చేస్తుందని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్ అన్నారు. ఆదివారం హన్మకొండ హంటర్‌రోడ్డులోని ఎస్‌ఆర్ హైస్కూల్‌లో జరిగిన శుభప్రదం ప్రారంభోత్సవ సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ భారతీయ సనాతన ధర్మం, భారతీయ నైతికవిలువలపై విద్యార్థులకు అవగాహన అవసరమని చెప్పారు. హిందూ ధర్మాన్ని పరిరక్షిస్తే మానవతా విలువలు పెంపొందుతాయని అన్నారు. ప్రస్తుత సమాజంలో విద్యార్థులు తీవ్రమైన మానసిక ఒత్తిడికి లోనై అనేక సంఘవిద్రోహ చర్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. శుభప్రదం లాంటి కార్యక్రమాలలో పాల్గొనడం వలన విద్యార్థులు ఒత్తిడిని అధిగమించగలుగుతారని చెప్పారు. ఆధునిక సమాజంలో కుటుంబ విలువలు పతనమవుతున్నాయని, ఫలితంగా యువత చెడుమార్గాల వైపు మరలుతోందని తెలిపారు. అమెరికాలో ఒక యువకుడు చర్చిలో కాల్పులు జరపడం అందరికి తెలిసిందేనని, దీనిపై పరిశోధన చేసిన శాస్తవ్రేత్తలు కుటుంబ విలువలు పతనం కావడం వల్లే ఇలాంటి సంఘటనలు చోటుచేసుకుంటున్నాయని పేర్నొన్నారని చెప్పారు. విద్యార్థులు చిన్ననాటి నుండే భారతీయ సనాతన ధర్మం, కుటుంబ విలువలపై అవగాహన పెంపొందించుకోవాలని కోరారు. విద్యార్థులు శ్రద్ధగా పాఠాలను వింటే తమ లక్ష్యాలను సులువుగా అధిగమించగలుగుతారని అన్నారు. ఎస్ ఆర్ విద్యాసంస్థల అధిపతి వరదారెడ్డి మాట్లాడుతూ శుభప్రదం విద్యార్థుల విద్యావికాసానికి, వ్యక్తిత్వ వికాసానికి దోహదం చేస్తుందని అన్నారు. టిటిడి ధర్మప్రచార సహాయకుడు కృష్ణమూర్తి మాట్లాడుతూ సమాజంలో నైతిక విలువలను పెంపొందించడానికి విద్యార్థులు భారతీయ సనాతన ధర్మాన్ని తెలియజేయడానికి శుభప్రదం వేసవి శిక్షణా శిబిరం లక్ష్యమని పేర్కొన్నారు. జిల్లాలో వివిధ ప్రాంతాల నుండి 400మంది విద్యార్థులు ఈ శిక్షణకు హాజరవుతున్నారని, ఎస్‌ఆర్ హైస్కూల్‌లో, ఎస్‌ఆర్ జూనియర్ కళాశాలలో రెండు సెంటర్లను నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వందేమాతరం పౌండేషన్ డైరెక్టర్ రవీందర్, కోట శ్రీనివాసరావు, భాస్కర్‌రావు, భిక్షపతి, తిరుమల నరేందర్, వరిగొండ కాంతారావు, కృష్ణమీనన్, కోవెల శ్రీలత, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
పార్టీ మారే ఆలోచనే లేదు
* డోర్నకల్ ఎమ్మెల్యే సత్యవతి రాథోడ్
మంగపేట, మే 12: తెలుగుదేశం పార్టీని వీడుతున్నట్లుగా వస్తున్న వార్తల్లో నిజం లేదని, తనకు పార్టీ మారే ఆలోచనే లేదని డోర్నకల్ ఎమ్మెల్యే సత్యవతి రాథోడ్ స్పష్టం చేశారు. ఆదివారం మండలంలోని మల్లూరు శ్రీహేమాచల లక్ష్మినర్సింహాస్వామి దేవాలయాన్ని ఆమె కుమారుడు సుమన్‌తో కలసి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆమె విలేఖరులతో మాట్లాడుతూ పత్రికలలో తాను తెలుగుదేశం పార్టీని వీడుతున్నట్లుగా ప్రకటనలు వచ్చాయని, అందులో ఏ మాత్రం వాస్తవం లేదని విలేఖరులు అడిగిన ఒక ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. ఆలయ విశిష్టత, ప్రాముఖ్యత తెలుసుకుని దర్శించుకునేందుకు వచ్చానని, ఇక్కడి ప్రాంతం ఎంతో ఆహ్లాదకరంగా ఉందని పేర్కొన్నారు. ఆమెకు ఆలయ పూజారులు కైంకర్యం రాఘవాచార్యులు, ఆలయ కమిటీ చైర్మన్ ఇట్యాల పురుషోత్తం, టిడిపి మండల అధ్యక్షుడు మోహన్‌రావు స్వాగతం పలికి ఆలయ విశిష్టతను వివరించారు.
కడియం పార్టీని వీడినంత మాత్రాన నష్టమేమి లేదు
* టిడిపి జిల్లా అధ్యక్షుడు బస్వారెడ్డి
స్టేషన్ ఘన్‌పూర్, మే 12: తెలుగుదేశం పార్టీని కడియం శ్రీహరి వీడినంత మాత్రాన పార్టీకి ఎలాంటి నష్టం లేదని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎడబోయిన బస్వారెడ్డి అన్నారు. ఆదివారం మండలకేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మూడుదశాబ్దాలుగా పార్టీలో కుటుంబసభ్యునిగా జీవనం సాగించిన కడియం నేడు పార్టీ వీడడం ఆయన సభ్యతకే వదిలేస్తున్నామని అన్నారు. టిడిపి ప్రభుత్వ హయాంలో జిల్లా ఏకైకమంత్రిగా కొనసాగిన కడియం రాజకీయంగా ఎంతో లబ్ధిపొందిన విషయాన్ని మరచిపోయి కన్నతల్లిని మోసం చేసే విధంగా వ్యవహరించడం సిగ్గుచేటని తెలిపారు. తెలంగాణ ఉద్యమం పేరుతో, రాజకీయ స్వలాభంతో పార్టీకి రాజీనామా చేసినప్పటికీ పార్టీకి ఒరిగేది ఏమిలేదని అన్నారు. స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గంలోని టిడిపి నాయకులు, కార్యకర్తలు నిష్టతో ఉన్నారనే విషయాన్ని కడియం గమనించాలని గుర్తు చేశారు.
మండలాలవారిగా ఇన్‌చార్జిల నియామకం
నియోజకవర్గంలోని మండలాలవారిగా ఇన్‌చార్జ్‌లను నియమించినట్లు జిల్లా అధ్యక్షుడు బస్వారెడ్డి తెలిపారు. స్టేషన్ ఘన్‌పూర్‌కు నర్సంపేట ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి, బోడకుంట్ల వెంకటేశ్వర్లు, గండ్ర సత్యనారాయణ, లింగాల ఘన్‌పూర్‌కు బస్వారెడ్డి, రాజ్యసభ సభ్యురాలు గుండు సుధారాణి, ధర్మసాగర్ మండలానికి ములుగు ఎమ్యేల్యే సీతక్క, చల్లా ధర్మారెడ్డి, రఘునాధ్‌పల్లికి డోర్నకల్ ఎమ్మెల్యే సత్యవతి రాధోడ్, వేం నరేందర్‌రెడ్డి, అనిశెట్టి మురళి, జఫర్‌గడ్‌కు పాలకుర్తి ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఈగ మల్లేశంను నియమించినట్లు తెలిపారు. ఈ సమావేశంలో పార్టీ మండల అధ్యక్షుడు ఎల్లయ్య, నాయకులు లోడంగి రాజు తదితరులు పాల్గొన్నారు.
వైభవంగా బొడ్రాయి పునఃప్రతిష్ఠాపన మహోత్సవం
* హాజరైన మంత్రి పొన్నాల లక్ష్మయ్య
జనగామ, మే 12: జనగామలో 380 సంవత్సరాల క్రితం ప్రతిష్టించిన బొడ్రాయి పునఃప్రతిష్ఠ కోసం నిర్వహించు మహోత్సవ కార్యక్రమంలో భాగంగా ఆదివారం మూడవ రోజు అంగరంగ వైభవంగా వేలాది భక్తుల మధ్య బొడ్రాయిని పునఃప్రతిష్టించారు. రెండు రోజుల పాటు వేదపండితుల పర్యవేక్షణలో బొడ్రాయి శిలకు జల, పుష్ప, ధాన్యాభిషేకాలు నిర్వహించగా ఆదివారం భక్తిప్రపత్తులతో ప్రతిష్టాత్మకంగా హోమాలు నిర్వహించి బొడ్రాయి దేవతను ప్రతిష్టించారు. రాష్ట్ర ఐటి శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య ముఖ్య అతిధిగా హాజరై పునఃప్రతిష్టాపన పూజలు, హోమ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ జనగామ పట్టణ ప్రజలు సుఖశాంతులతో ఉండాలని వేడుకున్నట్లు తెలిపారు. పట్టణంలో బొడ్రాయి ప్రతిష్టాపన చేపట్టడం హర్షణీయమని అన్నారు. దేశగురువు విజయ్‌భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో బొడ్రాయి ప్రతిష్టాపన జరుగగా శ్రీమాన్ కృష్ణమాచార్య సిద్ధాంతి, అప్పయ్య శాస్ర్తీ, గంగు అంజనేయ శర్మ పర్యవేక్షణలో వేదబ్రహ్మణులు హోమం నిర్వహించారు. బొడ్రాయి ప్రతిష్టాపన అనంతరం వేలాది మంది భక్తులు తరలివచ్చి దేవతామూర్తికి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమాలను నిర్వహించారు. బొడ్రాయి చుట్టూ దీపాలు వెలిగించారు. ఆదివారం అర్థరాత్రి పట్టణ పొలిమేరల చుట్టూ పొలిచల్లారు. చివరి రోజైన నేడు(సోమవారం) దేవతామూర్తులకు బోనాల సమర్పించడంతో ఉత్సవ కార్యక్రమాలు ముగుస్తాయని నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు పొన్నాల వైశాలిమురళీ, టిఆర్‌ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యుడు ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, టిడిపి జిల్లా అధ్యక్షుడు ఎడబోయిన బస్వారెడ్డి, ఉత్సవ కమిటీ గౌరవ అధ్యక్షుడు కంచ రాములు, అధ్యక్షుడు చింతకింది బిక్షపతి, ఉపాధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి, కార్యదర్శి ఆకుల వేణు, పజ్జూరి జయహరి, గోపయ్య, బండ యాదగిరి రెడ్డి, నారోజు రామేశ్వర చారి పాల్గొన్నారు.
ఓవర్ బ్రిడ్జి నిర్వాసితులకు నష్ట పరిహారం అందించాలని ధర్నా
స్టేషన్ ఘన్‌పూర్, మే 12: స్ధానిక రైల్వే ఓవర్ బ్రిడ్జి కట్టడంలో నివేశన స్థలాలను కోల్పోయిన నిర్వాసితులకు వెంటనే నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేస్తూ టిఆర్‌ఎస్ ఆధ్వర్యంలో ఆదివారం రైల్వేగేట్ సమీపంలో ధర్నా నిర్వహించారు. ధర్నాలో పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య మాట్లాడుతూ రైల్వే ఓవర్‌బ్రిడ్జి కోసం చేపట్టిన కట్టడాల్లో అనేక మంది నివేశన స్థలాలు కోల్పోయారని అన్నారు. బ్రిడ్జి నిర్మాణం ప్రారంభమై ఏడాది గడుస్తున్నా నేటికి నష్టపరిహారం అందించకుండా ప్రభుత్వం కాలయాపన చేస్తోందని ఆరోపించారు. తద్వారా అనేక కుటుంబాలు రోడ్డున పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం, సంబంధిత అధికారులు వెంటనే స్పందించి నిర్వాసితులకు నష్టపరిహారం అందించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో బ్రిడ్జి నిర్మాణాన్ని అడ్డుకోవడమేకాకుండా, ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ ధర్నాలో సింగిల్‌విండో చైర్మన్ రమేశ్, టిఆర్‌ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు నరేందర్‌రెడ్డి, కార్యదర్శి యాదగిరి, అధికార ప్రతినిధి వెంకన్న, నాయకులు నర్సింహారెడ్డి, వెంకటస్వామి పాల్గొన్నారు.
పదవి వ్యామోహంతోనే
పార్టీ వీడిన కడియం
జఫర్‌గడ్, మే 12: తెలుగుదేశం పార్టీ హయాంలో ఎన్నో కీలక పదవులు పొంది ఇప్పుడు పదవిపై కాంక్షతోనే కడియం శ్రీహరి టిఆర్‌ఎస్ పార్టీలో చేరుతున్నారని టిడిపి జిల్లా ఉపాధ్యక్షుడు కట్టా మనోజ్‌రెడ్డి ఆరోపించారు. ఆదివారం మండలకేంద్రంలోని టిడిపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత 30 సంవత్సరాల నుంచి టిడిపిలో పనిచేస్తూ వరంగల్ జిల్లాలోనే ఏకైక మంత్రిగా ఉండి ఎన్నో పదవులు పొందిన కడియం శ్రీహరి ఇప్పుడు అధినాయకత్వాన్ని విమర్శించడం తగదని అన్నారు. దీనిని పూర్తిగా ఖండిస్తున్నామని చెప్పారు. నిన్న, మొన్నటి వరకు టిఆర్‌ఎస్ పార్టీని, ఆ నాయకులను దుమ్మెత్తిపోసిన కడియం శ్రీహరి ప్రస్తుతం టిఆర్‌ఎస్ వంతపాడటం విడ్డూరమని అన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం టిడిపి కట్టుబడి ఉందని చెప్పింది కడియం కాదా అని అన్నారు. ఇప్పుడు కేవలం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం టిఆర్‌ఎస్ పార్టీలో చేరుతానని చెప్పడం సిగ్గుచేటని తెలిపారు. కడియం టిడిపికి రాజీనామా చేసి టిఆర్‌ఎస్ పార్టీలో చేరుతున్నా ఆయన వెంట మండలంలోని నలుగురు వ్యక్తులు వెళుతారే తప్పా ఏ కార్యకర్త వెళ్లడం లేదని తెలిపారు. సమావేశంలో టిడిపి నాయకులు రాజిరెడ్డి, యాదగిరి, రాజయ్య, దస్తగిరి, తిరుపతిరెడ్డి, నాగరాజు, శ్రీనివాస్, కృష్ణ, రమేష్, సతీష్ తదితరులు పాల్గొన్నారు.
ఉజ్వల ప్రకృతి చికిత్సాలయంను
ప్రారంభించిన మంత్రి పొన్నాల
జనగామ, మే 12: జనగామ గ్రేయిన్ మార్కెట్ ఏరియా సమీపంలో ఇన్‌పేషెంట్ సౌకర్యంతో గల ఉజ్వల ప్రకృతి చికిత్సాలయాన్ని ఆదివారం ఐటి శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోగ నిరోధక శక్తి తగ్గడం వల్లే అనారోగ్యం వస్తుందని, రోగ నిరోధక శక్తిని పెంచేందుకు యోగా, వ్యాయమం చేయాలని అన్నారు. ప్రకృతి చికిత్స పద్ధతులు ప్రజలందరు పాటించి రోగనిరోధక శక్తిని పెంచుకొని ఆరోగ్యవంతులుగా ఉండాలని అన్నారు. ఆసుపత్రిలో గల ప్రకృతి చికిత్సలను చూసి ఆయన ప్రశంసించారు. అనంతరం మంత్రి పొన్నాలను డా. అంజయ్య, డా. మంజుల ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా అంజయ్య, మంజుల మాట్లాడుతూ ఈ నెల 18వరకు ఆసుపత్రిలో ఉచిత ప్రకృతి చికిత్సలు, అవగాహన సదస్సు, యోగా ఉంటుందని, ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు పొన్నాల వైశాలిమురళీ, మార్కెట్ చైర్మన్ వై. సుధాకర్, నాయకులు చెంచారపు బుచ్చిరెడ్డి, ఎండి. అన్వర్, మేకల రవి కుమార్, రామిని శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.